ఒక్క ‘ఆవిడి’యా రాజకీయాన్నే మార్చేస్తుంది!

ఉజ్వల శర్మ, రోహిత్, ఎన్.డి .తివారిలు ఏళ్ళ క్రితం నాటి చిత్రంలో

‘కుటుంబ నియంత్రణ పాటించాలయ్యా?’

‘నాకున్నది ఇద్దరే కదా సర్‌!’

‘నేనడిగేది పిల్లల గురించి కాదు, కుటుంబాల గురించి.’

‘అయతే… మూడండి.’

ఈ సంభాషణ ఓ అధికారికీ, ఆయన కింద పనిచేసే ఉద్యోగికీ మధ్య జరిగింది.

నిజమే ఒక్కొక్కరూ పెద్దిల్లు కాకుండా చిన్నిల్లూ, బుల్లిల్లూ, చిట్టిల్లూ- ఇలా పెట్టుకుంటూ పోతుంటే, ‘కుటుంబాలు’ పెరిగిపోవూ? అవును కుటుంబాలంటే, పిల్లలు కాదు, భార్యలే.

సగటున ఒక్కొక్క పురుషుడూ, ఒక్కొక్క స్త్రీని చేసుకుంటేనే సరిపడే స్త్రీలు మనకి లేరు. ప్రతీ వెయ్యిమంది మగవాళ్ళకీ, 917 మందే ఆడవాళ్ళుంటున్నారు. ఇలా ఒక్కడే ముగ్గురేసి భార్యలను (అందులే ఒక్కరికే భార్య స్టేటస్‌ వస్తుందనుకోండి. అది వేరే విషయం.) చేసుకుంటూ పోతే ఎలా?

సరసన ముగ్గురేసి సతుల్ని పెట్టుకుని, ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి కూతురు పుట్టినా పిండదశలోనే పీక పిసికే మగమహారాజులున్న చోట, పురుష-స్త్రీ నిష్పత్తి ఇంకా పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.

ఇలా స్త్రీజాతి తగ్గుతూ పోతే, కడకు సర్కారే విధిలేక ‘గే'(పురుషులతో పురుషులే సంబంధం పెట్టుకునే) వివాహాలను ‘ఆదర్శ వివాహాలు’గా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కానీ మన నేతలే, ఈ ‘కుటుంబ నియంత్రణ’ను పాటించ లేక పోతున్నారు. ‘ఏవండీ! ఆవిడొచ్చింది’ అనే పలు ప్రజాప్రతినిథుల ఇళ్ళల్లో దర్జాగా నడిచిపోతోంది. దొరికిన వారే తివారీలు. ఆయన మాత్రం- 87 ఏళ్లొచ్చే వరకూ చట్టానికి చిక్కారా? ‘నాన్నా! నాన్నా!’ అంటూ రోహిత్‌ వెంటబడ్డా- ‘ఎవర్రా నీకు నాన్నా!’ అన్నాడు. పాపం ఆ కుర్రాడు ‘కేస్ట్‌ సర్టిఫికెట్‌’ తెచ్చుకోవటం కోసం, నానా తంటాళ్ళూ పడ్డాడు. కడకు కోర్టే నెత్తిమీద ఒక్కటిచ్చుకుని ‘ఇతనే నీ కొడుకు’ అని చెప్పాల్సి వచ్చింది. ఆ కుర్రాడూ, అతని తల్లి ఉజ్వలా ఆ మాత్రం దానికి, ఏళ్ల తరపడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

ఇక, దొరక్కుండా ఇలా కుటుంబాల్ని, కుటుంబాల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్న నేతలింకెంతమంది వున్నారో. ఇలాంటి ‘కుటుంబ’ నియంత్రణ లేకుండా పోవటానికి కారణం- ప్రతీ అదనపు ‘కుటుంబమూ’ ఒక స్టేటస్‌ సింబల్‌ కావటం. పూర్వం రాష్ట్ర స్థాయి నేతలు కొందరుండేవారు. వారి కుటుంబాల విస్తరణ గురించి కథలు, కథలుగా చెప్పుకుంటూ వుండేవారు. పార్టీకి జిల్లా యూనిట్లు వున్నట్లే, ఒక్కో జిల్లాకు ఒక్కొక్క కుటుంబం పెట్టుకునే వారట. ఎక్కడిక్కకడ కార్యకర్తల్ని తయారు చేసుకోవటానికి, ఇది కూడా మంచి మార్గం కావచ్చు. కారణం ఏమయితేనేం? అలాంటి నేతల్ని ‘రసిక శిఖామణులు’గా, ‘శృంగార పురుషులు’ గా కొనియాడుతూ వుండేవారు. అదొక హోదా! అదొర గౌరవం!

ఈ కుటుంబ విస్తరణకు ఇంకో కారణం- ‘మూఢనమ్మకం’ కూడా. ఆ మధ్య ఒక జిల్లా స్థాయి రాజకీయ నేత తన మూఢనమ్మకం గురించి చెప్పాడు. తనకి ‘రెండు’ అంటే సెంటిమెంటు. ‘ఒకటి’ తనకి అచ్చి రాదనుకుంటాడు. అతడికి గీత కింద గీత గీసినట్టుగా ‘డబుల్‌ రూల్డ్‌’ మీసాలుండేవి. షాపింగ్‌కు వెళ్ళితే, ఏదీ ఒక్కటి కొనే వాడు కాదు. చొక్కా నచ్చితే, రెండు తీసుకోవాల్సిందే. చెప్పులు నచ్చితే రెండు జతలు తీసుకోవాల్సిందే. కానీ పాపం తన పార్టీలో ఆయనకు ఏ పదవీ దక్కేది కాదు. ఎందు కంటే, అతడు అడగటం, అడగటమే- ‘జోడు పదవులు’ అడిగేవాడు. ఒక్కసారిగా రెండేసి పదవులు ఇవ్వటం పార్టీకి ఎలా కుదురుతుంది చెప్పండి? అలాంటి వ్యక్తి పెళ్ళి విషయంలో రాజీ పడతాడా? దూరపు బంధువుల్లో కవలలుగా పుట్టిన ఇద్దరు అక్క చెల్లెళ్ళను చేసేసుకున్నాడు. తర్వాత నాలుక్కరచుకున్నాడు. తాను చేసుకున్నది ఒక జత కవలల్నే. మరి రెండో జత? వెతికి, వెతికి ఇంకో జత కవలల్ని(అక్కా, చెల్లెళ్ళనీ) చేసేసుకున్నాడు. వెరసి -ఆయనకి నలుగురు భార్యలయ్యారు.

అయితే బ్రహ్మచారులుగా వుండిపోయిన వారికే రాజకీయాల్లో అవకాశాలివ్వాలంటారా? అని చటుక్కున ఎవరయినా అడిగేయ వచ్చు. చాలా మంది బ్రహ్మచారులు సంసారులు కన్నా ఘోరం. సంసారులకు ‘ఉంచుకున్న’ వారు ఎంత మంది వున్నా, కట్టుకున్న ఆవిడ ఒకరు వుంటారు. ఆవిడే అతని పాలిట నిఘా సంస్థలా పని చేస్తారు. ఫలితంగా అయిదారు ‘చిన్నిళ్ళు’ పెట్టాలన్న కోరిక భర్తకున్నా, ఏ ‘రెండింటి’తో సర్దుకునేలా చేసి ‘కుటుంబాల’ నియంత్రణకు దోహద పడతారు. కానీ బ్రహ్మచారి నెత్తి మీద ఇలాంటి నిఘా వుండదు. అనుకోవాలే కానీ, ఎన్ని కావాలంటే అన్ని చిన్నిళ్లు పెట్టేస్తారు. ఇలాంటి బ్రహ్మచారులకీ మన రాజకీయాల్లో లోటు లేదు.

ఇలా ఎలా బడితే అలా కుటుంబాలు విస్తరించుకుంటూ వెళ్ళి పోవటానికి కేవలం, రాజకీయ పురుషుల కున్న ‘నరాల’ బలహీనతే అనుకుంటే పొరపాటే. ‘వరాల’ బలహీనత కూడా. తన ఇలాకా లో కొన్ని సీట్లను స్త్రీలకు రిజర్వు చేసారని తెలిస్తే చాలు. వెంటనే స్ల్రీలను ప్రోత్సహించటం మొదలు పెడతారు. పెద్ద సీటు అయితే ‘పెద్లిల్లు’ను నిలబెదతారు. చిన్న సీట్లనుకోండి. ‘చిన్నిళ్ళ’ గురించి యోచిస్తారు. కొంత మంది ముందు చూపుతో ‘చిన్న సీట్ల’ కోసమే ఆఘమేఘాల మీద అనువయిన స్త్రీలను ‘చిన్నిళ్ళు’గా మార్చేసుకుంటారు. ఆ సీటు ద్వారా వచ్చే కాంట్రాక్టులూ, నిధులూ హాయిగా కైంకర్యం చేస్తారు. ఇన్ని సదుపాయాలున్న రాజకీయ రంగంలో, ‘కుటుంబ’ నియంత్రణ సాధ్యమా చెప్పండి!?

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 29-7-12 సంచికలో ప్రచురితం)

 

 

Leave a Reply