కంటి కింది బతుకు

దిగులు. ఎక్కడినుంచో రాదు. నానుంచే. నాకు నచ్చని నానుంచే. జీవించాల్సిన నేను నటించానన్న చికాకు. నాదయిన జీవితంలో నాది కాని భావన. అసహ్యం.ఈ చికాకులే చిక్కబడితే దిగులు. నన్ను నేను కుదుపు కుంటాను. అయినా దిగులు వీడిపోదే..!? యుధ్ధం.. నా మీద నేను చేసుకునే మహోద్రిక్త సంగ్రామం. నటించే నా మీద, జీవించే నేను చేసే సమరం. గెలుస్తాను. నటన ఓడిపోతుంది. అప్పుడు నిద్దురొచ్చి ముద్దు పెడుతుంది.

photo by Tobyotter

శోకం అంటేనే వెంటాడే పాతబాకీ

దానిని రద్దు చేసేది

నిద్దుర ఒక్కటే

నేటి దిగులు

రేపటికి పాకకుండా కత్తిరించేది

కునుకు ఒక్కటే

అలా పవళించి

ఇలా లేచామనుకుంటాం.

కాని రాత్రికి విత్తనంలా పగిలి

ఉదయానికి మొలకెత్తుతాం.

కొత్త జీవితం పుట్టేది-

కనురెప్పల కిందే!

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

4 comments for “కంటి కింది బతుకు

Leave a Reply