కట్జూ స్టెప్పెస్తే న్యూస్‌!!- –కట్జూ స్లిప్పయితే న్యూస్‌!!

టాపు(లేని) స్టోరీ:

Justice-Markandeyకుక్కల్ని మనుషులు ఎప్పుడో కానీ కరవవు. పురుషుల మీద అత్యాచారాలు ఎప్పుడో కానీ జరగవు. బాబాలు ఎప్పుడో కానీ భక్తుల కాళ్ళ మీద పడరు.

కానీ, ఆసక్తికరమైన వార్తలు. వార్తలు రాసేవాళ్ళకు ఈ రహస్యం తెలియకపోయినా ఫర్వాలేదు కానీ, వార్తల్లోకి ఎక్కాలనుకునే వాళ్ళకు మాత్రం ఈ విషయం అర్థం కావాలి.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ మర్కండేయ్‌ కట్జూ వార్తల్లోకి ఎక్కాలనే నిర్ణయించుకున్నారు. ఆయన మాట్లాడితే వార్తయి పోతోంది. ఆశ్చర్యమే. ఈయన్ని చూస్తే కొందరికి కోపం, ఎందరికో ఈర్ష్యా కలుగుతోంది. ఒక రాజకీయ నేతకు రాని ప్రచారం ఈయనకు వచ్చేస్తోంది. ఆయనకే కాదు, ఆయనతో పాటు, ఆయన సారథ్యం వహిస్తున్న సంస్థకు కు కూడా ఉచిత ప్రాచుర్యం వచ్చేస్తుంది.

కొందరి వ్యక్తుల వల్ల సంస్థలకు పేరు ( మంచిదా? చెడ్డదా? అన్నది తర్వాత విషయం.) వస్తుందంటారు. ఈయన ఆ కోవకే చెందిన వాడు. ఈయనకు ముందు ఈ పదవిని ఎవరు నిర్వహించినా అది మీడియా వారికీ, మీడియా రాతల వల్ల మనసు చెడిన వారికీ మాత్రమే తెలిసేది. కానీ ఎవరు, ఎవర్ని తిట్టుకున్నా కుర్చీలో కూర్చుని కప్పు కాఫీ తాగుతూ అమితానందం పొందే నిష్మకల్మషమైన పాఠకులకు మాత్రం తెలిసేది కాదు. కానీ నేడు తెలిసిపోయింది.

ఒకప్పుడు కేంద్రంలో ఎన్నికల కమిషన్‌ ఒకటుంటందని, రాజకీయ నేతలకీ, అధికారులకీ మాత్రమే తెలిసేది. కానీ అమాయకపు వోటర్లకు తెలిసేది కాదు. కానీ టి.ఎన్‌.శేషన్‌ అనే అధికారి వచ్చాక, కమిషన్‌ పేరు మార్మోగి పోయింది. ఆయన ప్రజాస్వామ్యం మీద ఈగ వాలినా, రాతి గదతో కొట్టే వాడు. చచ్చేది ఈగా? ప్రజాస్వామ్యమా? అన్నది తర్వాత విషయం. ఆయన పనితీరును చూసి మీడియా ‘అల్‌శేషన్‌’ అని అప్పట్లో ముద్దుగా పిలుచుకునేది. ( అదో జాతి కుక్క పేరు లెండి.). ఆయన కూడా ఆ మాటకు పెద్దగా నొచ్చుకునే వారు కారు. ‘మీడియా వారిని’ ‘వాచ్‌ డాగ్స్‌ ఆఫ్‌ సొసైటీ'( సమాజానికి కావలి కుక్కలు) అని అభివర్ణిస్తే నొచ్చుకుంటారా? నొచ్చుకోరు కదా! అలాగన్న మాట.

ఇప్పుడు కట్జూ కూడా అంతే. చాలామందికి ఆయన ఏం చెబుతారో వినాలని అనిపిస్తోంది. చట్టం అనుమతిస్తే తిట్టాలని అని కూడా అనుమతిస్తుంది. ఎందుకంటే, అన్ని వర్గాల మీదా ఆయన వేసే విసుర్లు అలా వుంటాయి.

ఈ వర్గాల మీద ఆయన చేస్తున్న విమర్శల్లో గతంలో ఎవరో ఒకరు చేసినవే. కానీ అవి అంత సంచలనాత్మకం కాలేదు. ట్జూ శైలి వేరు.

‘మన సమాజంలో ఎలా చూసుకున్నా పది శాతం జ్ఞాన వంతులు వుంటారు.’

ఈ ప్రకటన మామూలుగా అయితే ఎలాంటి ప్రకంపనా సృష్టించదు. కానీ ఇదే ప్రకటన కట్జూ చెయ్యాల్సి వచ్చిందనుకోండి.

‘మన సమాజంలో తొంభయి శాతం శుంఠలే’ అంటారు.

రెంటి అర్థం ఒక్కటే. కానీ కట్జూ శైలి కటువుగా వుంటుంది. సంచలనాత్మకంగా వుంటుంది. గిచ్చినట్టుంటుంది.

‘దేశంలో హిందువుల్లోనూ, ముస్లింలలోనూ, 20 శాతం మంది సెక్యులరిస్టులు లేక పోలేదు.’

ఈ మాటకు కోపం రాదు కదా! ఇప్పుడు ఈ వాక్యాన్నే కట్జూ వ్యాకరణంలోకి మార్చి చూడండి.

‘దేశంలో 80 శాతం మంది హిందువులూ, 80 శాతం మంది ముస్లింలూ మతోన్మాదులే.’

విన్నవాళ్ళకు తప్పకుండా బాధ కలుగుతుంది.

బహుశా ఆయన ప్రకటనల్లో సంచలనాత్మకతకు ఇదే కీలకం కావచ్చు.

కానీ ఈ శైలి అన్ని వేళలా పనికి రాక పోవచ్చు. చిన్న గుళికతో పోగొట్టే రోగానికి కూడా ‘షాక్‌ ట్రీట్‌ మెంట్‌’ ఇవ్వాల్సిన పనిలేదు.

‘ఒంట్లో ఎలాగుంది?’ అనగడానికి ‘ఒళ్ళెలా వుంది?’ అని ప్రశ్నించనవసరంలేదు.

పాత్రికేయులకు జర్నలిజంలో శిక్షణా, అవగాహనా వుండాలి అని ఆయన సలహా ఇస్తే సరిపోతుంది. లాయర్లూ, డాక్టర్లూ తమప్రాక్టీసుకు పొందినట్టు సర్కారీ లైసెన్సు వుండాలని చెప్పనవసరం లేదు.

కానీ, సమాజంలోని కొన్ని మొండి రోగాలకు మాత్రం- కట్జూ మొరటు వైద్యం అవసరమేమో అనిపిస్తుంటుంది.

 న్యూస్‌ బ్రేకులు:

‘కోటా’ పోటీలు!

బీజేపే అధికారంలోకి వస్తే, మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తుంది.

-ఎం. వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ నేత

ఈలోపుగా వోటరే దేశంలో మతపరమైన రాజకీయాలను రద్దు చేస్తే…?!

తెలంగాణ పై తాడో, పేడో తేల్చుకునే సమయం ఆసన్నమయింది.

-కె.చంద్రశేఖరరావు, టీఆర్‌ఎస్‌ అధినేత

ఓహో! ఉగాది కదా! పంచాంగ పఠనం మొదలు పెట్టినట్టున్నారు చంద్రశేఖర సిధ్ధాంతి గారు. అందుకే తెలంగాణకు మరో కొత్త తేదీని సిధ్ధం చేస్తున్నారు.

ట్విట్టోరియల్‌

‘బొమ్మ’లాట!

Jr-NTR-in-YSRCP-flexiగుర్తింపు కార్డులు వోటర్లకే కాదు, లీడర్లకే కాదు, పార్టీలకు కూడా వుండాల్సిన అగత్యం వచ్చేసింది. పొరపాటున వేళకు కానీ, లేక వేళకు ముందు కానీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోతే, ఎవరిదే పార్టీయో గుర్తించటం వోటర్లకు కష్టమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇటు తెలుగుదేశం పార్టీ వారూ, అటు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వారూ ఎన్టీఆర్‌ను బొమ్మను పెట్టేసారనుకోండి. ( ఇప్పుడు ఆ పని చేస్తున్నారనే కదా బాలయ్యకు కోపం వచ్చింది?) ప్రచార సభలకొచ్చిన వోటరు ఏమయి పోవాలి? గతంలోనూ ఇలాగే జరిగింది. ఇటు కాంగ్రెస్‌ పార్టీ , అటు వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ రెండూ కూడా వైయస్‌.రాజశేఖరరెడ్డి ఫోటోలు పెట్టేశారు. ఇలా పెట్టొచ్చని కొందరూ, పెట్టకూడదని కొందరూ మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ ‘అందరి వాడే కానీ, కొందరి వాడు కాదు కాబట్టి, ఎవరయినా ఎన్టీఆర్‌ ఫోటో పెట్టుకోవచ్చు’ అని ఇంకొందరంటున్నారు. సమస్య అది కాదు. ఎవరు ఎవరికి శత్రువో చెప్పకుండా వుంటే, వోటరు ఏమయి పోవాలి? ఒకవేళ వోటుకు ‘ఇంత’ అని పుచ్చుకుని వెళ్ళిన వోటరు అయితే మరి కంగారు పడిపోతాడు. ‘ఒకరి దగ్గర పుచ్చుకుని ఒకరికి వేస్తే ద్రోహం చేసినట్టు కాదూ?’ అని మెలికలు తిరిగిపోతాడు. పాపం వోటరు!!

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

మచ్చలేని మతవాది

నరేంద్ర మోడీ ట్వీట్‌: నాలోనూ లోపాలున్నాయి, మీరు గుర్తిస్తే నాకు ట్వీట్‌ చేయండి.

కౌంటర్‌ ట్వీట్‌:అప్పుడప్పుడూ మిమ్మల్ని మీరు సెక్యులరిస్టుగా భావిస్తుంటారు. దీని వల్ల మతవాదుల మనసు క్షోభిస్తుంటుంది. వారికోసం దీనిని లోపంగా ఒప్పుకుంటారా?

ఈ- తవిక

చిటికెన వేలు చూపిస్తాడా..?

తన రాష్ట్రం నుంచి

విడుదల చేసే

నీరు గురించి మాట్లాడ వయ్యా అంటే,

తాను విడుదల చేసే

నీటి గురించి మాట్లాడాడో

పొరుగు రాష్ట్రమంత్రి.

ఇంతకీ తాను

తాగేదేనీరో..!?

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘బంద్‌ ఎలాగో జరుతుందో చూడాలి టీవీ పెట్టు.’

‘కరెంటులేదు. టీవీ కూడా బందే.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

‘తలకాయ లేదని చెబుతున్నాడు కదా, కళ్ళ జోడు పెట్టుకోమంటావేమిటి? ఎక్కడ పెట్టుకోవాలి?’

– సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 9ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం.)

Leave a Reply