కలసి రాకే, ‘కుల’కలం!

అడుగులు తడబడినప్పుడెల్లా బడుగులు గుర్తుకొస్తారు.

తెలుగు దేశం , కాంగ్రెస్‌ పార్టీలకు నడక సాగటం లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అడుగు తీసి, అడుగు వేయలేక పోతోంది.

టార్చిలైట్‌ వేసి వెతికినా, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వం- అన్నది కానరావటం లేదు.అక్కడ ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ ‘ఉన్నారో, లేదో తెలియదు.’ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి -‘ఉంటారో, ఊడతారో’ తెలియదు.

ప్రధాని తన ముఖానికే బొగ్గు ‘మసి’ రాసుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి తన ‘కేబినెట్‌’ ముఖానికి ‘వాన్‌పిక్‌’ తారు పులిమేశారు.

మన ప్రధాని ‘చేతకానితనాన్ని’ ప్రపంచ మాధ్యమాలు వేనోళ్ళ ‘కడిగేస్తున్నాయి’. మొన్న ‘దుస్సాధకుడు'(అండర్‌ అచీవర్‌) అని ‘టైమ్‌’ పత్రిక గేలి చేస్తే, ఇప్పుడు ‘ఏడుపు ముఖం వాడ’నీ, ‘సిగ్గరి’ అనీ, ‘నిష్క్రియాపరుడ’నీ, ‘దుర్బలుడ’నీ, ‘అవినీతి బృంద సారథి’ అనీ అనేక విశేషణాలతో ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక వెటకారమాడింది.

ఇక మన ముఖ్యమంత్రి ‘కిరణ్‌ కుమార్‌ రెడ్డి’ ని ‘శూన్యపాలన’ కు చిహ్నంగా చూస్తున్నారు. ‘మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు?’ అని ఇటీవల ఒక జాతీయ చానెల్‌ సర్వే నిర్వహిస్తే, జగన్మోహన రెడ్డి, కేసీఆర్‌నీ, చంద్రబాబునీ… కడకు చిరంజీవినీ తలచుకున్నారు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి ని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు.

ఇలాంటి సారథుల్ని పెట్టుకుని, కాంగ్రెస్‌ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ 2014లో ఎన్నికలకు వెళ్ళితే ఎలా వుంటుంది? అప్పటి వరకూ ఎందుకు?

ఏడాదిలోపే జరుగుతున్న పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో మీద కొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలల్లోనూ- ఈ ‘ముఖాల’తో నే వెళ్ళితే, వోట్లు రాలతాయా?

అందుకే అక్కడా, ఇక్కడా అర్జెంటుగా ‘సామాజిక న్యాయం’ కార్డు అవసరమయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది.

కేంద్రంలో ఈ పాచిక కాంగ్రెస్‌కు తక్షణ ఉపశమాన్ని ఇచ్చింది. బీజేపీ అవినీతి ఆరోపణలతో ‘పార్లమెంటు ఉభయ సభల్లో’ భీతిల్లి పోయిన కాంగ్రెస్‌ ‘బొగ్గు మంటల్నార్పటానికి’ కొత్త బిల్లు తెచ్చింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ను కల్పించే బిల్లు అది. ఈ బిల్లు మీద బీజేపీ ఏదో ఒకటి చెప్పాలి. ఈ బిల్లుకు అమోదం ఇస్తే, కాంగ్రెస్‌ను చేజేతులా పైకెత్తినట్లవుతుంది. వ్యతిరేకిస్తే, ఎస్సీ,ఎస్టీలకు బీజేపీ వ్యతిరేకమన్న- ఆరోపణ నిజమవుతుంది. అయితే ఈ సంకట స్థితి వల్ల ఇప్పటికిప్పుడు బయిట పడుతుంది. కానీ యూపీయే సర్కారు మనుగడకు కీలకమయిన సమాజ్‌ వాదీ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును తన వోటు బ్యాంకు అయిన బీసీలకు వ్యతిరేకమని భావిస్తోంది. అందుకనే కదా- ఈ బిల్లును సమర్థించే బహుజన సమాజ్‌ వాదీ పార్టీ సభ్యుడితో, సమాజ్‌ వాదీ పార్టీ సభ్యుడు పెద్దల సభలో ముష్టిఘాతానికి సిధ్ధమయ్యారు? ఇది కాంగ్రెస్‌కు రాబోయే రోజుల్లో తలనొప్పే.

కేంద్రంలో ఎస్సీ, ఎస్టీల భక్తి ఎంత తీవ్రమయి పోయిందో, ఇక్కడ రాష్ట్రంలో బీసీల భక్తి అంత కీలకమయి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలో కోటా 50 శాతం దాటకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వటంతో, కాంగ్రెస్‌ బిక్క చచ్చిపోయింది. 2006 ఎన్నికలలో ఇచ్చినట్టే ఇప్పుడు 60.55 శాతం కోటా ఇవ్వటానికి వీలు కాదు. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 18.36 శాతం కోటా, ఎస్టీలకిచ్చే 8.25 కోటానూ మార్చటానికి వీలుండదు. ఎటొచ్చీ బీసీల కిచ్చే కోటాను 33 శాతం నుంచి 22 శాతానికి కుదించుకోవాల్సి వుంటుంది. ఇందుకోసం సుప్రీం కోర్టును ఆశ్రయించ వచ్చు. కానీ, సుప్రీం మార్గదర్శకాలననుసరించే ఈ తీర్పు చెప్పినట్లు హైకోర్టు చెబుతోంది. కాబట్టి ఫలితం వుంటుందో లేదో, తెలియదు.

అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘వంద మంది బీసీలకు టిక్కెట్లు’ అంటూ, తన బీసీ భక్తిని చాటుకుంది. ‘టిక్కెట్లేం ఖర్మ. ఏకంగా వంద సీట్లనూ అన్ని పార్టీలూ కలిసి రిజర్వు చేద్దామా?’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రతిసవాలు విసిరింది. బీసీలను ఆకట్టుకోవటానికి, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యూహమంటూ లేదు. ఈ లోపుగా ఇలా స్థానిక సంస్థల ఎన్నికలొచ్చి మీద పడ్డాయి.

అయితే ఈ కోటా గొడవ ‘బీసీల’తోనే ముగిసి పోలేదు. స్థానిక సంస్థల్లో ‘కోటాలో కోటా’ వంది. అంటే 50 శాతం మహిళ కోటా వుంది. ఈ మేరకు, బీసీ మహిళల అవకాశాలూ తగ్గిపోతాయి. ఈ ‘కోటా’ సమస్యను ఎదుర్కోవటానికి ఒక కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు 33 శాతం మంది బీసీ అభ్యర్థులను నిలబెట్టటం. కానీ దీని వల్ల బీసీ అభ్యర్థుల విజయావకాశాలు తగ్గుతాయి. ఒక స్థానంలో కాంగ్రెస్‌ బీసీ అభ్యర్థిని నిలబెడితే, అదే స్థానంలో ఇతర పార్టీలు ఆగ్రవర్ణాల వారిని నిలబెట్ట వచ్చు. వారితో తలపడటానికి అవసరమయ్యే డబ్బూ, దస్కం బీసీ అభ్యర్థులకు వుంటాయా? ఒక వేళ మిగిలిన పార్టీలు కూడా ఇలాగే 33 శాతం మంది బీసీలకు టిక్కెట్టు ఇచ్చినా, వారు నిలబడే స్థానాలు వేరుగా వుండవచ్చు.

కాబట్టి కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న బీసీలకు ఎలా చూసినా భంగపాటు తప్పేలా లేదు. అంటే ఒకే సారి, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు బీసీల వోటు బ్యాంకు నుంచి ప్రతి కూల పరిస్థితి ఏర్పడే లా వుంది. అయితే ఎస్సీల విషయంలో కేంద్రంలో కాంగ్రెస్‌ కొంత భక్తి ప్రకటించే అవకాశం వచ్చినా, రాష్ట్రంలో మాత్రం ఆ చిన్న అవకాశం కూడా మిగలలేదు. రాష్ట్రంలో ఎస్సీల వోటు బ్యాంకు రెండు ఉపకులాలలు( మాల, మాదిగలు)గా విడి పోయి వుంది. సీమాంద్రలో ‘మాల’లు ఎక్కువ. ఇక్కడ మొత్తం ఎస్సీలలోనే అత్యథిక శాతం ‘క్రైస్తవులు’ . అంటే దళిత క్రైస్తవులు. వీరు వైయస్‌ మరణానంతరం జగన్మోహరెడ్డి వెంటే వున్నారు. తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కారణంగా ఎస్సీలు ‘టీఆర్‌ఎస్‌’ వెంట వున్నారు. ఇక్కడ అధిక శాతం మాదిగలు వుంటారు. వీరు ‘వర్గీకరణ’కు అనుకూలురు. వీరి వోటు బ్యాంకు కోసం ఈ మధ్యనే తెలుగుదేశం ‘ఎస్సీల వర్గీకరణ’ను మరో మారు రంగం మీదకు తెచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం కేవలం సీమాంధ్రలోవున్న ఎస్సీల కోసం- దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చే అంశానికి చట్ట బధ్దత ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. బహుశా ఈ బిల్లును త్వరలో పార్లమెంటులో పెట్టే అవకాశం వుంది.

ఇలా, కోటాలతో, బుల్లి బుల్లి తాయిలాలతో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఎస్సీ,ఎస్టీ, బీసీలను నటిస్తే, ఆయా సామాజిక వర్గాల ప్రజలు విశ్వసించే పరిస్థితి వుందా?

వి.పి.సింగ్‌ ‘మండల్‌ రాజకీయాల’కూ, కాన్షీరాం ‘బహుజన రాజకీయాల’కూ తెరతీసాక, రాష్ట్రాలలో అణగారిన కులాల వారికి తమంతట తాము ‘రాజ్యాధికారానికి’ రావాలీ- అని కాంక్ష పెరిగింది. అంటే తమ తమ సామాజిక వర్గాల సిధ్ధాంత కర్తల వ్యూహాలతో, నాయకత్వంతో అధికారంలోకి రావాలన్నది వారి కోరికలో ప్రధానాంశం. ఈ మార్గంలో పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన వారే లాలూ, ములాయం, మాయవతులు. ఈ విషయంలో ‘మినీ భారతమ’యిన ఉత్తరప్రదేశ్‌ పెద్ద ప్రయోగ శాలగా మారింది. ఇప్పుడక్కడ ఎస్సీ,ఎస్టీల పార్టీ అంటే ‘బీఎస్పీ’. బీసీల పార్టీ అంటే ‘ఎస్సీ’. అంటే అక్కడ మాయావతి ‘ఎస్సీఎస్టీల’కు న్యాయం చేస్తానంటే నమ్ముతారు, ములాయం ‘బీసీ’లకు న్యాయం చేస్తానంటే నమ్ముతారు. ఇతర అగ్రవర్ణాల వారు వీరికి ఎన్ని హామీలు ఇచ్చినా గాలిలో కలిసి పోతాయి. ఇప్పుడు ‘పదోన్నతుల’ విషయంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న ఎస్సీ,ఎస్టీ భక్తి కూడా గంగలో కలిసిపోవచ్చు.

దాదాపుగా ఇదే స్థితి ముందుగా ఉత్తరాది రాష్ట్రాలలో, కాస్త ఆలస్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వచ్చింది. కర్ణాటకలో లింగాయత్‌ల సంక్షేమం గురించి లింగాయత్‌ వోటు బ్యాంకు మీద పట్టున్న లింగాయత్‌ నేతే మాట్లాడాలి. అప్పుడే నమ్ముతారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ రకమైన రాజకీయాలు ప్రవేశించేవే. కానీ, గత మూడున్నరేళ్ళ కాలంలో రెండు ప్రమాదాలు జరిగిపోయాయి. ఒకటి: ‘సామాజిక న్యాయాన్ని’ చిరంజీవి ‘ప్రజారాజ్య’ పార్టీ పెట్టేసి, తిరిగి కాంగ్రెస్‌లో కలిపేయటం. రెండు: హెలికాప్టర్‌ ప్రమాదంలో వై.యస్‌ రాజశేఖర రెడ్డి మరణించటమూ, ఆ సానుభూతి ఆయన కుమారుడు జగన్హోహన రెడ్డికి వచ్చి పడటం.

ఫలితంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ సిధ్ధాంత కర్తల వ్యూహాలతో రాజకీయాలు రావటం మరోపదవీ కాలం పాటు వాయిదా పడింది.

ఇప్పుడు రాష్ట్రంలో ఆరని చిచ్చుల్లా వున్నవి రెండే రెండు అంశాలు: తెలంగాణ ఉద్యమం, వైయస్‌ పై సానుభూతి. వీటి ముందూ- అన్నీ చిన్నవే అయిపోతున్నాయి. ఈ స్థితి 2014 వరకూ కొనసాగుతూనే వుంటుంది.

ఫలితంగా ఈ రెండు ‘ఉద్వేగాల’కు లోనయ్యే వోటింగ్‌ సరళి ప్రధానంగా వుంటుంది. కాబట్టి తెలుగుదేశం కానీ, కాంగ్రెస్‌ కానీ, ఎస్సీ,ఎస్టీ, బీసీ- భజన ఎంతగా చేసినా అది ఇప్పుడయితే వోటరును ప్రభావితం చెయ్యక పోవచ్చు. ఒక వేళ మూడు. నాలుగేళ్ళకు ఈ ఉద్వేగాలు చల్లారాక, ఈ వర్గాలలో తిరిగి రాజకీయ చైతన్యం వస్తే రావచ్చు. అప్పుడయినా ఆయా వర్గాల గురించి, ఆయా వర్గాల సిధ్ధాంత కర్త ల స్ఫూర్తితో ఏర్పడ ్డ పార్టీలే ఆ వర్గాల అభ్యున్నతి గురించి చెబితే నమ్ముతారు కానీ, అగ్రవర్ణాలు వారు చెబితే వినరు.

ఇప్పుడయితే, బడుగులపై కపట భక్తికి ‘మార్కెట్టు’ లేనట్లే!!

-సతీష్‌ చందర్‌

 

 

1 comment for “కలసి రాకే, ‘కుల’కలం!

  1. Good analysis Sateesh garu. Thanks for the inputs. I gess is so that a new party should emerge from BC’s for their betterment. Political parties are offering 100 seats to BC’s. What happen if BC’s also offer seats to upper cast people. This should happen in AP.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *