కలహం బహిర్గతం! కాపురం అంతర్గతం!!

Apcongres1s_EPSతెలిసింది, తెలియనట్లూ

తేల్చేసింది తేల్చనట్లూ

నాన్చేసింది నాన్చనట్లూ

చెప్పటాన్ని ఏమంటారో తెలుసా? మేధోమథనం.

అన్ని పార్టీల్లోనూ కుమ్ములాటలుంటాయి.కాస్త మర్యాదగా చెప్పాలంటే అంత:కలహాలుంటాయి. ఎక్కువ మర్యాదగా చెప్పాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం వుంటుంది.

రాత్రి తాగొచ్చి తన్నే భర్తకూ, పగలంతా తిట్టి పచ్చిమంచినీళ్ళివ్వనీ భార్యకూ మధ్య వుండే సంసారాన్ని నిర్వచించమని వాళ్ళనే అడిగామనుకోండి. ఆయనేమంటారూ-భార్యా భర్తలన్నాక ‘వంద’ వుంటాయి- అంటాడు. అప్పుడు ఆమె సిగ్గుతో ముడుచుకుపోతూ- ఆయన ‘వంద’ అంటున్నారు కానీ, నా హ్యాండ్‌ బ్యాగ్‌లో ‘పది’ రూపాయిలకు కూడా వుంచరు. చి..లి..పీ…!- అంటూ మర్యాద పూర్వకంగా చెబుతుంది. దీనిపేరే అంతర్గత ప్రజాస్వామ్యం.

ప్రతీ పార్టీలోనూ పెద్దల మధ్యల మధ్య ఇంచుమించు ఇలాంటి అన్యోన్యతే నడుస్తుంటుంది.

పీసీసీ అధ్యక్షులు బొత్సకీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికీ మధ్య అంతర్గతంగా ఏ గడ్డి వేసినా భగ్గుమంటుంది. కానీ బహిరంగంగా ఇద్దరీ మధ్య లక్ష్మీ బాంబు వెలిగించినా తుస్సుమంటుంది.

వీరిద్దరి అన్యోన్యతనూ చూసి ఈర్ష్య పడ్డ వాళ్ళే ‘జంప్‌ జిలానీ’లు మారి గోడలు దూకేశారు.

అయినా సరే. వీరిద్దరూ ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అంటూ తమ ‘అంతర్గత ప్రజాస్వామ్యాన్ని’ కొనసాగించేస్తున్నారు.

బొత్స వ్యాపారప్రయోజనాలను దెబ్బతీసేలా కిరణ్‌ చేయించిన ఎక్సయిజు దాడులూ, కిరణ్‌ ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టే బొత్స ప్రయత్నాలూ- అన్నీ ఈ ‘అంతర్గత ప్రజాస్వామ్యం’లో భాగాలే. అంతే కాదు, ఇవీ పార్టీలోనూ, బరుటా బహిరంగ రహస్యాలు.

అయినా, ‘కాంగ్రెస్‌ నుంచి ఎవరు వెళ్ళిపోయినా సరే, మేమిద్దరం వుంటే చాలు’ అని మధ్యలో ఇద్దరిలో ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇద్దరికీ పడదని అందరికీ తెలుసు. అయినా తెలియనట్లు, ఎవరికీ తెలియదన్నట్లు అందరి ముందూ మాట్లాడటమే ‘మేధోమథనం’ అంటారు.

పార్టీ హైమాండ్‌ తేల్చేసిన విషయాలు చాలా వుంటాయి. వాటిని తేల్చనట్లు మాట్లాడుకొని, హైకమాండ్‌ మనసులోని మాటనే తీర్మానం చేసి పంపించటం మేధోమథనంలో అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకునే విషయం.

అల్లుడు కూతుర్ని కొట్టిన క్వార్టర్‌ దిగిపోయేవరకూ కొడుతున్నాడని తెలుసుకున్న మామ పండక్కి పిలవ దలచుకోడు. ఈ విషయం అల్లుడికీ తెలుసు, కూతురికీ తెలుసు. అయినప్పటికీ భార్యా భర్తలిద్దరూ ఓ మలి సంధ్య వేళ కూర్చుని మేధోమథనం చేస్తుంటారు.( ఆ వేళే సరిఅయిన సమయం. అతడికి తెల్లవార్లూ కొట్టిన మందు పూర్తిగా దిగిపోయి, మళ్ళీ కొట్టటానికి నాలుక లాగేస్తున్న సమయం అదే. అలాగే ఆమెకు తిట్టితిట్టి విసిగిపోయి, తిట్టటానికి నోరు రాని వేళకూడా అదే) అందుకే ఇద్దరూ ఆ వేళప్పుడు కొన్ని విషయాలలో ఏకాభిప్రాయానికి వస్తుంటారు. అలా ఇద్దరూ తీసుకున్న అభిప్రాయాన్ని ఫోన్‌లో మర్యాద పూర్వకంగా మామకు అల్లుడు తెలియచేస్తాడు: ‘మామయ్యా పగలంతా ‘నోటి’ పనితో మీ అమ్మాయీ, రాత్రంతా ‘చేతి’ పనితో నేనూ ఎంత బిజీగా వుంటామో మీకు తెలియనది కాదు. చిలకా, గోరింకలు( రెండు పక్షులూ సామెతలోనే కలుస్తాయి) లా జీవిస్తున్న మేము- పండక్కి వచ్చి మీ ఆశీస్సులూ, అత్తయ్య ఆశీస్సులూ తీసుకుందామని ఎంతగానో ఆశించాం. కానీ వీలుకావటం లేదు. అన్యధా భావించకండి’

దాందో ‘ఫ్యామిలీ హైకమాండ్‌’ లాంటి మామయ్య సంతృప్తి చెందుతాడు. తర్వాత ఎవరి కొట్టుడు వారిదే, ఎవరి తిట్టుడు వారిదే. ఇలాంటి తీర్మానాలు మేధోమథనంలో కీలకం.

‘ఫ్యామిలీ హైకమాండ్‌’ కున్న ఒకే ఒక్క గాలిమేడను రెండు భాగాలు చేయటంలో ఏళ్ళ తరబడి నాన్చుతున్నాడు. అందులో తన భార్యకు రావలసిన వాటా వుందని కూడా అతడికి తెలుసు. తనకొచ్చే వాటా మీద భర్త కన్నేయటం ఆమెకసలు నచ్చటం లేదు. దాంతో ‘గాలి మేడ’ విభజన ఎప్పటిప్పుడు వాయిదా పడుతోంది.

ఆ విభజన ఇప్పట్లో మామ చెయ్యడని ఇద్దరికీ తెలుసు.

అయినా సరే. మలి సంధ్య వేళలో ఇద్దరూ చర్చిస్తారు:

‘మన వాటా మన కొచ్చేస్తే… ఇదుగో నీమీద వొట్టేసి చెబుతున్నా… మందు ముట్టను కాక ముట్టను.’ అంటాడతను.

‘నా వాటానాకిచ్చేస్తే.. ఇదుగో ఈ తాగుబోతు సచ్చినోడు మీద వొట్టెయకుండా చెబుతున్నా… ఈణ్ణి తిట్టను కాక తిట్టను.’

అంతలోనే ఇద్దరూ నాలుక కరిచేసుకుంటారు. ‘ఇలా ఏకాభిప్రాయానికి వచ్చేస్తే మన ‘ఫ్యామిలీ హైకమాండ్‌’ కు నచ్చదంటే నచ్చదు. ‘గాలి మేడ’ను విభజించటం అలా వుంచి, మన కాపురాన్ని కూల్చే స్తాడు.’ అని అతడంటాడు.

‘అవున్రా! అప్పుడు నువ్వు కొట్టటానికి వుండదు. నేను తిట్టటానికి వుందడు.’ అని ఆమె సై అంటుంది.

అప్పుడు ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.

‘గాలి మేడ ను కూల్చితే మా కాపురాన్ని కూల్చినట్లే’ అంటాడు అల్లుడు.

‘గాలి మేడను కూల్చక పోతే మా కాపురాన్ని కూల్చినట్లే’ అంటుంది కూతురు.

ఎలా చూసినా ‘గాలి మేడ’ను ‘గాలిమేడ’లా వుంచటమే మేలనిపిస్తోంది… అని ఆనక ‘హైమాండ్‌’ తీరిగ్గా ప్రకటించుకోవటానికి- ఈ భిన్నాభిప్రాయం సర్వత్రా అవసరం.

చూశారా ఇప్పటికే నాన్చేసిన విషయాన్ని, ఎలా నాన్చనట్టు చర్చించి తీర్మానించారో…! అందుకే మేధో మథనం ఓ తంతు. పెళ్ళిలాంటి తంతు. తాంబూలాలిచ్చేసుకున్నా తన్నుకు చచ్చే తంతు. డోన్ట్‌ మిస్‌ ఇట్‌!!

-సతీష్ చందర్

(ఆంధ్రభూమి దినపత్రికలో 16 డిశంబరు 2012 న ప్రచురితం)

1 comment for “కలహం బహిర్గతం! కాపురం అంతర్గతం!!

Leave a Reply