‘కాల్‌’ యములున్నారు జాగ్రత్త!

 

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

టాపు(లేని) స్టోరీ:

‘డాడీ! డాడీ! మమ్మీ కాల్తోంది!’

‘ఎక్కడుంది?’

‘కిచెన్లో!’

కంగారు పడాల్సిన పనేలేదు. ‘తెంగ్లీషు’ కదా అలాగే వుంటుంది. ‘మమ్మీ పిలుస్తోంది’ అని కూడా చెప్పవచ్చు. కానీ మామూలుగా పిలవట్లేదు. ‘మొబైల్లో’ పిలుస్తోంది. దాన్ని పిలుపు అంటే బాగుండదనీ, ‘కాల్‌’ అనే అనాలనీ మొబైల్‌ కంపెనీ వాళ్ళే తేల్చేశారు- టీవీ ప్రకటనల సాక్షిగా. అదీ కాక నాన్న బెడ్‌రూమ్‌లో, అమ్మ కిచెన్లో. దూరం పది గజాలే. కానీ నాన్న ‘మొబైల్‌’ హాల్లో టీవీ ముందున్న టీపాయ్‌ మీద వుండి పోయింది. అక్కడే చంటాడు వున్నాడు. మోగిన ఫోన్‌ను తీసుకుని నాన్న దగ్గరకి వస్తూ చెప్పాడు. అమ అక్కడనుంచి పిలవొచ్చు. కానీ ఆరవాలి. ఎంత శక్తి వృధా! అందుకే ‘కాల్‌’ చేసింది. కాల్‌ అంతా ‘చీపా’? చీపా! చీపున్నరా!!

రూపాయి పడి పోవచ్చు. అమెరికా వైట్‌ హౌస్‌ మెట్ల మీద పడ్డ మరచెంబులా ఖంగు ఖంగు మని శబ్దం చేసుకుంటూ అంగ రంగ వైభవంగా జారిపోవచ్చు. కానీ ‘కాల్‌’ జారదు.(జారేది నోరే లెండి) అరపైసాకు అరవయ్యారు సెకన్లు వాగే అవకాశం వచ్చాక, ఎక్కడనుంచి ఎక్కడకయినా ‘కాల్‌’ చెయ్యవచ్చు. ఎప్పుడు బడితే అప్పుడు ‘కాలొ’చ్చు.

కానీ, వంద కాల్స్‌ ఒక జీవితాన్నే నాశనం చెయ్యవచ్చు.

కాల్స్‌ను లెక్కదీయవచ్చు, రికార్డు చేయవచ్చు, బ్లాక్‌ మెయిల్‌ చేయ వచ్చు.కాలర్‌కీ కాలర్‌కీ లింకులు పెట్టవచ్చు.

చంటాడు చెప్పినట్లు ‘కాల్‌’తో కాల్చక పోవచ్చు కానీ, నిప్పులు పోయవచ్చు- ఎవరి జీవితంలోనైనా సరే. కారు చౌకగా వుంది కదా అని- ‘కాల్‌’ చేసుకుంటూ పోతే, ఎప్పుడోకప్పుడు ‘కాల్‌’యములు ఎదురవ్వ వచ్చు. ఒక తియ్యని గొంతు కవ్విస్తూ ‘కాల్‌’ చేస్తే వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మరీ ముఖ్యంగా జనజీవితంలో వున్న వారికి ఈ జాగ్రత్త చాలా అవసరం. లేకుంటే సాయింత్రం పూట ఏ టీవీ న్యూస్‌ బులెటిన్‌లో స్వీట్‌ వాయిస్‌ తో పాటు సదరు పురుష నేత కంచు కంఠం కూడా వినపడుతుంది.

ఈ మధ్య కొత్తగా ఎన్నికయిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ మొబైల్‌ ‘కాల్స్‌ జాబితా’ను లోకానికి విడుదల చేశారు. (దానిని ఎలా పొందారన్నదీ, అది చట్టబధ్దమా? కాదా? అన్నది తిరిగి దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి.)

ఆ జాబితాలో పలువురితో పాటు, మీడియా ప్రతినిథులూ, ఒక మహిళా వున్నారు. అంతే!

కాల్‌ కాల్‌కీ వున్న మధ్య దూరాలనూ, మధ్య బంధాలనూ ఊహించేశారు. అంతే కాదు కొత్త కొత్త ఊహలకు తావిచ్చేశారు. అందరినీ వదిలేసి ఆ మహిళ పై ఊహాగానాలతో మీడియాలో హోరెత్తి పోయింది. ఎవరీ మహిళ? ఆమెకూ, ఆయనకూ ఏమిటి సంబంధం? అదృష్ట వశాత్తూ స్నేహితురాలనీ, క్లాస్‌ మేట్‌ అనీ తేలింది కానీ, వరసకు చెల్లి అయివుంటే..? అయినా ఒక పురుషుడికీ, స్త్రీ కీ మధ్య ‘మురికి’ బంధాలే తప్ప మంచి పరిచయాలు వుండ కూడదా? అంతా ‘కాల్‌’ మహిమ!

మాట్లాడండి. మాట్లాడుతూనే వుండండి. అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మి, ఆప్తులతోనో, మిత్రులతోనో మాట్లాడుకుంటూ పోతే ఇబ్బందే. ‘కాల్‌’ యముల దగ్గర చిత్రగుప్తులుంటారు. చిట్టాలు రాస్తుంటారు. వాళ్ళకు కాల్సే ముఖ్యం. సంభాషణలు వారి ఇష్టం. మీరు మాట్లాడినవే అక్కడ వుండాలని లేదు. మీకు నప్పే ‘డైలాగులు’ వారు రాసుకోవచ్చు.

అందుకే పక్కనున్న వాళ్ళని కాస్త నోరారా పిలవండి. కానీ ‘మొబైల్స్‌’ తో ‘కాల్‌’ చెయకండి.

నిజమే ‘కాల్‌’ రేట్లు పడిపోయాయి. కానీ విలువలు వాటి కన్నా ముందే పడిపోయాయి.

న్యూస్‌ బ్రేకులు:

 ‘హోదా’ర్పు!

కేవలం సానుభూతినే నమ్ముకున్న జగన్‌ పార్టీకి ఇకపై వోట్లు రావు

-వి.హనుమంతరావు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత

ఓటమి దు:ఖాన్ని అర్థం చేసుకోగలం. కాంగ్రెస్‌నేతలకు కాస్త ఓదార్పు అవసరం. ఈ విషయం తెలిస్తే జగన్‌ బెయిల్‌ మీద వచ్చి మీ కోసం ఓదార్పు యాత్ర చేసే ప్రమాదం వుంది. జాగ్రత్త.

ప్రపంచంలో ఎన్నో అధ్భుతాలు జరుగుతుంటాయి. ఏదో ఒక అద్భుతం జరిగిన నేను రాష్ట్రపతి ఎన్నికలలో గెలవవచ్చు.

-పి.ఎ.సంగ్మా, రాష్ట్రపతి అభ్యర్థి

అవును. ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. హిందూత్వ పార్టీల చేతుల్లో చిక్కటం ఒక ప్రమాదం కూడా కావవచ్చు.

ట్విట్టోరియల్‌

ముగ్డురు నేతలూ- మూడు నీతులూ

చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు- అనే మూడు కోతుల సిధ్ధాంతం మాత్రమే మనకు తెలుసు. నమ్ముతాం కూడా. పూర్వికులు మంచి మాటలే చెబుతారు లెండి. (డార్విన్‌ లెక్కల ప్రకారం నరులమైన మనం, వానరాల్ని తలచుకోవటం అంటే పూర్వికుల్ని తలచు కోవటమే.) మంచి ఎవరు చెప్పినా మంచే కదా! ఇప్పుడు ‘ఓటమి అనవద్దు, ఓటమి వినవద్దు, ఓటమి కనవద్దు’ – అనే ముగ్గురు నేతల విశ్లేషణ అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఉప ఎన్నికలలో ‘నా వల్ల ఇద్దరు గెలిచారు- నాది ఓటమే కాదు’ అని కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన ఒక గ్లామర్‌ నేత అంటే, ‘ ఓటమి గురించి పట్టించుకోకుండా ముందుకు పోదాం’ అని అంటే ‘ముఖ్య’ పదవిని అలంకరించిన మరో కాంగ్రెస్‌ నేత అన్నారు. ‘ఓటమినసలు చూడవద్దు, ఇదంతా సానభూతి’ అని రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద దిక్కయిన ఇంకో నేత అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఈ ముగ్గురూ మూడు ముఖాలు. కానీ, అచ్చంగా బొమ్మల్లో మాదిరిగానే ‘చేతు’ల్తో ముఖాలు దాచుకుని, ముగ్గురు నేతలూ ‘ఓటమి’నే ధ్రువపరస్తున్నారు.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

ఆ రోజులే వేరు!

అమితాబ్‌ ట్వీట్‌ : నా పాత సినిమాలను పదే పదే చూడాలన్న కోరిన జనానికి పెరుగుతోంది. నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే నేనూ అదే పని చేస్తాను.

కౌంటర్‌ ట్వీట్‌: వృధ్ధులంతే. ఫ్లాష్‌ బ్యాక్‌లలోనే గడిపేస్తారు. వయసు మీదపడటం ఆశ్చర్యం కాదు. అది గుర్తించక పోవటమే ఆశ్చర్యం.

ఈ- తవిక

‘పవర్‌’ లెస్‌ ప్రెసిడెంట్‌

ఆర్థిక మంత్రే

రాష్ట్రపతి అయితే.

రాష్ట్రపతి భవనంతా

కొవ్వొత్తుల వెలుగులే.

కరెంటు

ఆదా చేస్తారు కదా మరి!

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘మాదేశంలో నేతలు నేల మీద పాకుతారు. మాది పాకి-స్తాన్‌’

‘మా దేశంలో నేతలు ప్రపంచ ముందు అడుక్కుంటారు. మాది దేబిరి-స్తాన్‌’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

తిను, తినిపించు, నేత (మేత) అనిపించు.

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 27జూన్12 వ తేదీ సంచికలో ప్రచురితం)

 

 

 

2 comments for “‘కాల్‌’ యములున్నారు జాగ్రత్త!

Leave a Reply