కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!

కుర్చీ కే కాదు, కుర్చీ పక్కన కుర్చీకి కూడా విలువ వుంటుందని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నారు.

క్లాస్‌ రూమ్‌లో ఒకే ఒక కుర్చీ వుంటుంది. దాంట్లో టీచర్‌ కూర్చుంటారు. దాని పక్కన వేరే కుర్చీ వుండదు. కాబట్టి, విద్యార్థులకు కుర్చీ గురించే తెలుస్తుంది కానీ, పక్క కుర్చీ గురించి తెలీదు. కాక పోతే, హోమ్‌ వర్క్‌ చేయని విద్యార్థుల చేత మాత్రం పూర్వం ‘గోడ కుర్చీ’ వేయించే వారు. అంటే లేని కుర్చీని వున్నట్టుగా భావించి కూర్చోవటం. అది కూడా టీచర్‌ పక్కనే అలా కూర్చోవాలి.

కాబట్టే కుర్చీల గురించి చిన్నప్పుడు కలిగిన జ్ఞానమొక్కటే: ఉన్న కుర్చీలో కూర్చోవటం గౌరవం; లేని కుర్చీలో కూర్చోవటం శిక్ష.

యూపీయే సర్కారు లో ఉన్నది కూడా ఒక్కటే కుర్చీ. అక్కడ కూడా టీచరే కూర్చుంటారు. కానీ ఆవిడని టీచర్‌ అనరు, చైర్‌పర్సన్‌ అంటారు. (చూశారా! పదవిలోనే కుర్చీ వుంది.) ఆవిడ పేరు సోనియా. అంతకు మించి పెద్ద కుర్చీ అంటూ అక్కడ ఏమీ లేదు. మరి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ ఎక్కడ కూర్చుంటారు? చూశారా! పెద్ద సందేహమే. ఈ సందేహమే ‘టైమ్‌’ పత్రికకు వచ్చింది. ఆయనకు ఎందుకు కుర్చీ లేదంటూ, ఆరా తీసింది. మన్‌ మోహన్‌ కూడా తనకు ఇచ్చిన హోం వర్క్‌ చేయలేదని(అండర్‌ ఎచీవర్‌- గా మిగిలారని) తేల్చింది. హోంవర్క్‌ చేయకపోతే, టీచర్‌ వేసే శిక్ష ‘గోడకుర్చీ’ యే కదా! అంటే లేని కుర్చీలో కూర్చోవటమే కదా! అంటే శిక్షే కదా!

అలాంటి ఈ ‘గోడకుర్చీ’ పక్కన తనకు కుర్చీ వేయలేదని, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ అలిగారు. ఆ స్థానంలో తనకన్నా జూనియర్‌ కేంద్ర రక్షణ మంత్రి ఆంటోనీని కూర్చోబెట్టారని ఆయనకు కోపం. మరీ అంత ముచ్చట పడితే ఆయన చేత కూడా ‘గోడకుర్చీ’ వేయించే వారే.

కానీ పవార్‌కు ‘కుర్చీ’ల గురించి తప్ప ‘గోడకుర్చీ’ల గురించి తెలిసినట్టులేదు. ఆయనకు తెలిసిన లెక్కెల్లా ఒక్కటే. మన్‌మోహన్‌ సింగ్‌ కుర్చీ సంఖ్య ఒకటి అయతే, దానికి పక్కన వుండే కుర్చీ సంఖ్య రెండు. ఇంత వరకూ అందులో ప్రణబ్‌ ముఖర్జీ కూర్చున్నారు. ఇప్పుడు తాను కూర్చోవాలనుకున్నారు. కానీ అయనకు తెలియన రహస్యమేమిటంటే, ఇంత వరకూ ప్రణబ్‌ ముఖర్జీ కూడా లేని కుర్చీలోనే కూర్చున్నారు. యూపీయే సర్కారుకు ఏ సంక్షోభమొచ్చినా హాజరయి, బయిటపడవేసే ఇబ్బంది కరమైన శిక్ష అది.

పోనీ శరద్‌పవార్‌ తరహాలో అంకెల్లోనే కుర్చీలను లెక్కించినా, ఆయన లెక్క తప్పు. యూపీయే చైర్‌పర్సన్‌ కుర్చీ సంఖ్య ఒకటి. ప్రధాని కుర్చీ సంఖ్య(టైమ్‌ పత్రిక ప్రకారం) సున్నా. రెంటినీ కలిపి చదివితే, పది. అంటే యూపీయే సర్కారులో ఎవరి స్థానాన్నయినా ఆ తర్వాత అంకె నుంచే లెక్కించాలి. అంటే ఇంతకు ముందు ప్రణబ్‌ ముఖర్జీ కూర్చున్న స్థానం పదకొండు. అంటే ఇంతా చేసి, శరద్‌ పవార్‌ కొట్లాడుతున్నది పదకొండో స్థానం కోసమా? ఇలా ఆలోచిస్తేనే ఆయన మీద జాలేస్తుంది.

ఎలాంటి పవార్‌! రాజీవ్‌ గాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి కుర్చీకి ( అప్పటికి ఆ కుర్చీ నెంబరు ఒకటే లెండి.) పోటీ పడిన వారిలో ఆయన ఒకరు. (ప్రణబ్‌ ముఖర్జీ, అర్జున్‌ సింగ్‌ కూడా పోటీలో వున్నారు.) అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ఈ పదకొండో ( ఆయన దృష్టిలో రెండో) స్థానం కోసం తపిస్తున్నారు.రాజీవ్‌ గాంధీ ప్రధానిగా వుండే రోజుల్లో ఈ స్థానాన్ని ‘కో పైలట్‌’ అని కూడా అనే వారు. (రాజీవ్‌ గాంధీ స్వతాహాగా పైలట్‌ కావటం వల్ల ఈ పేరు రాలేదు సుమా!)

సాక్షాత్తూ భారత దేశపు ఆర్థిక రాజధాని ముంబయిలో చక్రం తిప్పిన నేత పవార్‌ కు ఈ చిన్న గణితం తెలియదా? తెలుసు. కుర్చీల లెక్క మారుతుందనీ తెలుసు. ప్రధాన మంత్రి పదవికి అనతి కాలంలో తిరిగి ‘ఒకటో’ నెంబరు వస్తుందనీ తెలుసు. అందుకే ఈ పేచీ. రాజీవ్‌ తనయుడు రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో ‘పెద్ద పాత్ర’ పోషించబోతున్నానని ప్రకటించిన రోజునే ‘సంఖ్యా మానం’ మారుతుందని గ్రహించారు. కాబోయే ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌కే కాంగ్రెస్‌లో అందరూ మొగ్గు చూపుతారనీ తెలుసు. తాను ఎప్పటికయినా ‘పైలట్‌’ (ప్రధాని) కావాలన్న కళ్ళ ముందు కరిగిపోక ముందే, ‘కో పైలట్‌’ కుర్చీని రిజర్వ్‌ చేసుకోవాలన్నదే ఆయన తాపత్రయమంతా.

తీరని ఏ కోరికనయినా మరచిపోవచ్చు. ఆ ఒక్క కోరికా కుర్చీలో కూర్చోవాలన్నదయితే ఎప్పటికీ మరచిపోలేరు. ఎన్డీయేలో అద్వానీని ఇలాంటి కోరికే వేధిస్తుందని అంటూంటారు. అయిన కూడా రెండో నెంబరు కుర్చీ వరకూ వచ్చారు కానీ, ఒకటో నెంబరులో కూర్చోలేక పోయారు.

డార్విన్‌ మానవ పరిణామ క్రమం మాత్రమే రాసి వదిలేశాడు. రాజకీయ పరిణామ క్రమం రాయటం మరచిపోయాడు. మనిషి ముందు నాలుగు కాళ్ళతో నడిచే వాడనీ, తర్వాత ముందు రెండు కాళ్ళూ పైకెత్తాడనీ, క్రమేపీ అవిచేతులుగా మారాయనీ చెబుతుంటారు. (అందుకే, మన చేతుల్ని పట్టుకుని ‘ఇవి చేతులు కావనుకో’ అని బతిమిలాడుతుంటే బాధ పడకూడదు. అతడు సత్యమే చెబుతున్నాడు. అతడు పట్టుకున్నవి ఒకప్పటి కాళ్ళు.)

రాజకీయ పరిణామ క్రమం వేరుగా వుంటుంది.

ముందు రాజకీయ నాయకుడు పాకుతాడు-ఇతరుల పాదాలు పట్టటానికి.

తర్వాత నిలబడతాడు- ఎన్నికల్లో.

ఆపైన పరుగెడతాడు- పదవుల కోసం

చివరిగా కూర్చుంటాడు- జనం మీద పాదాలు మోపటానికి.

ఒక్కసారి కూర్చున్నాక, అహం మీద కొస్తుంది. కుర్చీలో కూర్చున్నవాడు, కుర్చీలో కూర్చున్న వాడినే గౌరవిస్తాడు.

కుర్చీ లేని వాణ్ణి అవమానిస్తాడు. అప్పుడే చిచ్చు రేగుతుంది.

లంకలో కుర్చీలో కూర్చున్న రావణాసురుడు, కుర్చీలేని హనుమంతుణ్ణి అవమానిస్తాడు. అప్పుడు తన తోకనే చుట్టలా చుట్టి ఎత్తయిన (నెంబర్‌ వన్‌) కుర్చీగా మార్చుకుని కూర్చుంటాడు హనుమంతుడు. తన రాజ్యంలో రావణాసురుణ్ని నెంబర్‌ టూ గా మారిస్తే వూరుకుంటాడా? హనుమంతుడి తోకకు చిచ్చు పెట్టడూ? ఫలితం తెలిసిందే.

-సతీష్‌ చందర్‌

 

 

 

 

 

 

 

2 comments for “కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!

Leave a Reply