గుడ్డొచ్చి ప్రతీసారీ పిల్లను వెక్కిరించదు. ఒక్కొక్కసారి రక్షిస్తుంది. తాతకు దగ్గుల్నే కాదు, పెగ్గుల్ని నేర్పించే మనుమలుంటారు. తండ్రిని మించిన .. కాదు,కాదు, తండ్రిని పెంచిన తనయులు కూడా వుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం పరపతిని, అఖిలేష్ అలాగే పెంచారు.
భారత రాజకీయాలకు కొడుకులూ కొత్త కాదు, కూతుళ్ళూ కాదు. కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక, పేరుమోసిన రాజకీయ నేతలు ఒక్కసారి ఇళ్ళల్లోకి చూసుకున్నారు తమకు ఎలాంటి కొడుకులు వున్నారని: రాజకీయాల కోసం పెళ్ళినే కాదనుకున్న రాహుల్ గాంధీ లాంటి రత్నమా? పెళ్ళాడిన భార్య (డింపుల్))))) ఓటమికి కారణమయిన వారికి ఓటమి రుచి చూపించిన అఖిలేష్ యాదవ్ లాంటి మాణిక్యమా? (2007 ఎన్నికలలో డింపుల్ పై రాజబబ్బర్ పోటీ చేసినప్పుడు అతని తరపున రాహుల్ ప్రచారం చేసి డింపుల్ ఓటమికి కారకులయ్యారు. అలాంటి రాహుల్‌కు పరాజయమంటే అనుభవం లోకి తెచ్చారు.)
ఇప్పుడు (2012) జరిగిన ఐదు రాష్ట్రాల( యుపి తో పాటు, మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్) ఎన్నికలలోనూ కొడుకుల ప్రస్తావన బాగానే వచ్చింది. ములాయం సింగ్ తనయుడి పేరు తర్వాత బాగా వినిపించిన పేరు, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు సుఖ్‌బీర్ సింగ్ బాదల్. సర్దార్జీలకు మార్పు మీద సరదా ఎక్కువ. ఒక టర్మ్‌లో పాలించిన పార్టీని తర్వాత టర్మ్‌లో దించేస్తారు. అలాంటి సరదాకు ఆడ్డుకట్ట వేసిన వాడు సుఖ్‌బీర్. వరసగా రెండవ దఫా కూడా అకాలీ దళ్ అధికారంలోకి వచ్చేటట్టు చేసి ఎనిమిది పదులు దాటిన తండ్రిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతున్నాడు.
ఎనభయ్యేళ్ళు దాటిన తండ్రికి పడక్కుర్చీయే వేయని ఈ రోజుల్లో ఏకంగా పదవికుర్చీ వేసే కొడుకు వుంటే ఎవరికయినా ఎంత ముచ్చట!
పూర్వం కొడుకులంటే నేతల తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించే వారసులు. ఇప్పుడు రాజకీయాల్లో కొడుకులు అలా లేరు. తండ్రులు వుండగానే రాజకీయాల్లోకి ప్రవేశించి, తండ్రుల్ని మరింత పెద్ద నేతలుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే తమ తర్వాత ఎలాగూ, వారే ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారనుకోండి అది వేరే విషయం.
అందుచేత తాము బతికుండగానే, తాము అధికారం వెలగబెట్టటానికే రాజకీయాల్లోకి కొడుకుల్ని ప్రవేశపెట్టాలన్న కోరిక ఈ మధ్య బలంగా పెరిగిపోతుంది. అయితే ఇలాంటి కొడుకుల్ని దించే ముందు, వారికి ఎలాంటి శిక్షణల్ని ఇప్పించాలన్నది పెద్ద ప్రశ్న.
సినిమాల్లోనే చూడండి. హీరోలు తమ కొడుకుల్ని హీరోలు చెయ్యటానికి కొన్ని కిటుకులు కనిపెట్టారు. కొడుక్కి ముఖమున్నా లేక పోయినా ఫర్వాలేదు. జిమ్ములో పడేసి, ఏ కీలుకాకీలు వంచేస్తే ‘సిక్స్‌ప్యాక్’ తో బయిటకొస్తాడు. నటన గొడవ తర్వాత. మండుటెండలో పొడిఇసుకలోకి చెప్పుల్లేకుండా అరికాళ్ళతో చిందులేయిస్తూ, పక్కన మ్యూజిక్ పెట్టేసి ‘కొరియోగ్రాఫర్’ను చూసుకోమంటే, స్టెప్పులు వచ్చేస్తాయి. ఉండే ఇంటికి చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడలు పెట్టి, పక్కఇంటిలో లేడీస్ బ్యూటీ పార్లర్ పెట్టిస్తే, గోడలు దూకటం అలవాటయి, మెల్లమెల్లగా ఫైట్లు వచ్చేస్తాయి. దాంతో కొడుకు హీరో అయిపోతాడు.
ఇలాగే రాజకీయ నేతలు తమ కొడుకులకు శిక్షణ ఇవ్వవచ్చు. ఇప్పుడు నేర రాజకీయాలు పూర్తిగా ‘వర్క్ అవుట్’ కావు కాబట్టి అప్పటి విద్యలు ఇప్పుడు పనికి రావు. ప్రత్యర్థిని ‘ఫినిష్’ చెయ్యటం లేదా దయదలచి ‘కిడ్నాప్’ చెయ్యటం, ‘టోకున వోట్లు’ వేసి పెట్టటం( రిగ్గింగ్ చెయ్యటం) – వంటి పాత ప్రక్రియలకు కాల దోషం పట్టింది.
మెత్తని మాట, చల్లని నవ్వూ, ఆత్మీయమైన అభివాదం- ఇలాంటి వాటిల్లో ఆరితేరి పోవాలి. కలల్ని.. అందమైన కలల్ని అమ్మేయగలగాలి. ఉదాహరణకు కడుపు నింపే కల కన్నా, కలర్ టీవీ కల నమ్మటం నేర్చుకోవాలి. అంటే మాంచి సేల్స్ మన్ గా తీర్చి దిద్దాలి.
ఏ కలను అమ్మాలీ- అన్నది ప్రాంత, ప్రాంతానికీ, రాష్ట్ర, రాష్ట్రానికీ మారి పోతుంది. ప్రతీ సారీ సంక్షేమాన్నే కాదు, సంక్షోభాన్ని కూడా అమ్మగలగాలి.
కాశ్మీరు వుందనుకోండి. సంక్షోభమే రాజకీయానికి సరుకు. ఈ రహస్యం నెహ్రూ సమకాలికుడయిన షేక్ అబ్దుల్లాకి తెలుసు. షేక్ వూరుకుంటాడా? ఇదే గుట్టును కొడుకు ఫరూక్ అబ్దుల్లాకి చెవిలో చెప్పాడు. ఫరూక్ తిరిగి తన కొడుకు ఒమర్ అబ్దుల్లాకి చెప్పాడు. దీంతో తరాల తరాలకు ఈ ‘సేల్స్‌మన్ షిప్’ వచ్చేస్తోంది.
కావాలంటే ఈ ‘సేల్స్‌మన్ షిప్’ను విదేశాలనుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు. అమెరికాలో సీనియర్ బుష్షు, ఆయన కొడుకు జూనియర్ బుష్షును చిన్నప్పుడు ‘తుపాకి బొమ్మలు’ చూపించి ఆడించారో ఏమో- తర్వాత ‘యుధ్ధాన్ని’ అమ్మటంలో జూనియర్ ఆరితేరి పోయాడు. ఏ దేశం కొంచెం పరాకు గా వున్న దాన్ని ఇరాక్ చేసి చూపించటం నేర్చుకున్నాడు. దానినే స్వంత దేశపు (అమెరికా) ఎన్నికలలో కలగా అమ్మేశాడు.
ఇవాళ పుత్రుడున్న ప్రతీనేతా… ‘చూడరా! ఆ అఖిలేష్ ను చూసి నేర్చుకో..’ ‘కొడుకంటే సుఖబీర్ రా!’ అని ఉక్రోషం ప్రకటిస్తున్నారు కానీ, వాళ్ళకి ‘సేల్స్‌మెన్ షిప్’ లో శిక్షణ ఇవ్వటం లేదు. శిక్షణ అంటే గనుల్నో, సర్కారీ భూముల్నో అమ్మటం కాదు. కలల్ని అమ్మటం. ఈ పనిలో ఎక్కడ తేడా వచ్చినా… జనం నిద్రలేచి మొత్తం రాజకీయ కుటుంబాన్నే అమ్మేయ గలరు!!
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రికలో 10-3-12 వ తేదీ సంచికలో ప్రచురితం)