వైయస్సార్ అంటే ‘నీరు’; కేసీఆర్ అంటే ‘భూమి’. అవును. (ఉమ్మడి) రాష్ట్రంలో వైయస్సార్ ముఖ్యమంత్రి కాగానే ‘జల యజ్ఞాన్ని’ చేపట్టారు. ఎక్కడికక్కడ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టారు. విపక్షాలు దీనిని ‘ధనయజ్ఞం’గా అభివర్ణించే వారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినది మొదలు ‘భూమి’ ‘భూమి’ అంటూనే వున్నారు. ఆయన దృష్టి అంతా ‘భూమి’ మీదనే పడింది. తొలుత అన్యాక్రాంతమయిన ‘గురుకుల్ ట్రస్టు’ భూముల మీద గురిపెట్టారు. ఆ భూముల నిర్మించిన కట్టడాలను కూలగొట్టటానికి సన్నధ్ధమయ్యారు. తర్వాత వరాలు ఇవ్వటంలో కూడా ‘భూ’భ్రమణం చేశారు. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇస్తానని వాగ్దానం కూడా చేశారు. అసెంబ్లీలోని బడ్జెట్ సమావేశాల ముగింపు సన్నివేశంలో కూడా కేసీఆర్ ను రక్షించింది మళ్లీ ‘భూమే’.
ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం పార్టీలు పన్నిన పద్మవ్యూహం నుంచి కేసీఆర్ బయిట పడటానికి నాటకీయంగా ఈ ‘భూమే’ ఆదుకున్నది. పొన్నాల లక్ష్మయ్య మీద వచ్చిన ఆరోపణ ‘భూమి’ మీదే. దళితులకు ‘ఎస్సయిన్’ చేసిన 8.3 ఎకరాల భూమిని నిబంధనలకు విరుధ్దంగా, లక్ష్మయ్య పొందారన్నది ఆభియోగం. శాసనసభా సమావేశాల చిట్టచివరి సన్నివేశంలో సభ్యులు ఆడిన ఈ ‘భూభాగోతం’ నాటకం పాలకపక్షం నెత్తిమీద పాలు పోసింది.
అంతవరకూ ప్రతిపక్షాలు ఎవరి పద్ధతిలో వారు, కేసీఆర్ సర్కారును తలంటారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలే అయిందన్న కనికరం కూడా చూపలేదు. బడ్జెట్ మీద విమర్శించేటప్పుడు రాబడినీ, వ్యయాన్నీ పోల్చకుండా, ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన ‘వాగ్దానాల’నీ, అందుకు చేసిన ‘కేటాయింపుల్నీ’ చూశారు. అలా చూసినప్పుడు, ఆకాశానికీ, భూమికీ వున్నంత తేడా కనిపిస్తుంది. అందుకనే ఎప్పుడూ అర్థం కాకుండా మాట్లాడగలిగే జానారెడ్డి కూడా, క్లిష్టత వీడి స్పష్టంగా మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ‘పెద్ద బాల శిక్ష’ లా వుందని తేల్చిపారేశారు. అయితే ఇలా ‘వాగ్దానాల’తో పోల్చినప్పుడు సహజంగానే సర్కారు దగ్గర సమాధానాలు వుండవు. అందుకనే ప్రశ్నకు సమాధానవివ్వటం అనే పధ్ధతిని కాకుండా, ‘ప్రశ్న’కు ‘ఎదురుప్రశ్న’, ‘దాడి’ కి, ‘ఎదురుదాడి’ అనే వ్యూహాన్ని ఎంచుకుంది. ఇందుకు కాంగ్రెస్ కన్నా, తెలుగుదేశం పార్టీ బాగా ఉపకరించింది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ మీద బాణాలు ఎక్కుపెట్టి, పెద్ద రాధ్ధాంతమే సృష్టించారు.
సర్కారు పగ్గాలు చేపట్టి ఆరునెలలు మాత్రమే అయినా, సమస్యలు తీవ్రమయి కూర్చున్నాయి. మరీ ముఖ్యంగా ‘విద్యుత్’ సమస్య తెలంగాణ సర్కారు పీకకు చుట్టుకుంది. ఫలితాలు ఎంతకీ ఆగని రైతుల ఆత్మహత్యలు కూడా సర్కారుకు పెనుసవాలుగా మారింది. దానికి తోడు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు కూడా, కేసీఆర్‌ను ఇరుకున పెట్టాయి. వీటన్నింటినుంచీ బయిట పడటానికి మార్గాన్ని వెతుక్కుంటున్న కేసీఆర్ సర్కారు ‘అస్సయిన్డ్’ భూముల వివాదం దొరికింది. ఈ వివాదం వల్ల కేసీఆర్ సర్కారుకు రెండు ప్రయోజనాలు చేకూరాయి. ఒకటి: ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కాళ్ళకు బంధనాలు వెయ్యటం. రెండు:ఇదే వంకన మరో మారు ‘దళిత’ భక్తిని చాటుకోవటం. (దళితుడికిస్తానన్న ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ తానే కైంకర్యం చేశారన్న విమర్శ ఎప్పటికీ నడుస్తూనే వుంటుంది.)
ఇదే అదనుగా ‘అన్యాక్రాంతమయిన’ అస్సయిన్డ్ భూముల మీద సభాసంఘాన్ని వేస్తున్నట్టు కేసీఆర్ సభలో ప్రకటించారు. ఆయనే ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ తరహా భూములు తెలంగాణలో 1.9 లక్షల ఎకరాలు వున్నాయి. సందట్లో సడేమియాలాగా దేవాదాయ భూములు, వక్ఫ్ భూములను కూడా సభా సంఘం పరిధిలోకి తెచ్చారు. రేపు ఎవరన్నా దళితులకు ఇస్తామన్న భూమి సంగతి ఏమయిందని సర్కారును నిలదీస్తే, అన్యాక్రాంతమయిన భూముల్ని వెనక్కి తీసుకునే పనిలో వున్నామని చెప్పటానికి సర్కారుకు ఓ మంచి సాకు దొరికినట్లయింది.
మొత్తం మీద కేసీఆర్‌ను ఒక్క ‘భూమే’ అడుగడుగునా ఆదుకుంటోంది.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 29 నవంబరు-5 డిశంబరు 2014 వ తేదీన ప్రచురితం)