కొడుకులే, కొడుకులు!!


NARA-LOKESH_R
రాజకీయాల్లో పుత్రవాత్సల్యం మెండు.

అడపా దడపా పుత్రికా వాత్సల్యం కూడా వుండక పోదు.

ఇప్పటి మన నేతలు ఈ విషయంలో దృతరాష్ట్ర, ద్రోణాచార్యుల రికార్డులు కొట్టేస్తున్నారు. కొడుకు( సుయోధనుడి) మీద వున్న ప్రేమతో కొడుక్కి పోటీరాగల భీముడి శిలా ప్రతిమను తన ఉక్కు కౌగిలో తుక్కుతుక్కు చేసేస్తాడు ధృతరాష్ట్రుడు. కొడుకు అశ్వత్థామ చనిపోయాడన్న ‘గాలి వార్త’ వినగానే, ధ్రువపరచుకోకుండానే, యుధ్దంలో అస్త్రాలు వదిలేస్తాడు ద్రోణుడు.

కొడుకులు తర్వాతే, ఎవరయినా. ఇదే నాటి భారతం, నేటి భారతం కూడా. ఉండి ఉండి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తనయుడు లోకేష్‌ హడావిడి మొదలు పెట్టారు. అప్పుడప్పుడూ వచ్చి తళుక్కుమనటం మామూలే. కానీ ఈ మధ్య ‘కూత’ పట్టారు. ఉపన్యాసాలు దంచటం మొదలు పెట్టారు. ‘వహ్వా, వహ్వా. వాట్‌ ఎ స్పీచ్‌!’ అని తెలుగు తమ్ముళ్ళు వంతలు పాడుతున్నారు. వారసుడొచ్చేసినట్లే- అని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు.

ఒకప్పుడయితే, ఈ తెలుగు తమ్ముళ్ళే ‘మరి బాలయ్యో..?’ అని కానీ, ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ రాడా?’ అని కానీ హడావిడి చేసేవారు. ‘వియ్యం’తో బాలయ్య అభిమానులకూ, చంద్రబాబు అనుచరులకూ మధ్య ఈ విషయంలో సంధి కుదిరిపోయింది. గతంలో చంద్రబాబు కూడా తనకు లేని ‘గ్లామర్‌’ కోసం వీరి వైపు ఎంతో కొంత ఆశగా చూసేవారు. 2009 ఎన్నికలలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు కూడా. ఆయన ప్రచార శైలి తెలుగుదేశం వ్యవస్థాపకులు సీనియర్‌ ఎన్టీఆర్‌ తీరును తలపిస్తుందని తెలుగుదేశం కార్యకర్తలు సంబర పడ్డారు. తర్వాత తర్వాత చంద్రబాబుకీ, జూనియర్‌కీ మధ్య వచ్చిన అంతరం తెలిసిందే. అయితే చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించే ముందే, ఈ అంతరాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. పాదయాత్ర చేసిన తర్వాత, జనం పెద్దగా వచ్చినా, రాక పోయినా, కార్యకర్తల్ని మాత్రం చంద్రబాబు తన పూర్తి అదుపులో పెట్టుకున్నారు. ఇదే అదను-అనుకుని తనయుడు లోకేష్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి అంచెలంచెలుగా ప్రవేశపెట్టారు.

ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలేమిటి? అని ఎప్పటికప్పుడు మేధావులు ప్రశ్నిస్తున్నారు కానీ, చాలా రాజకీయ పక్షాలు ఇదే దారిలో వెళ్ళిపోతున్నాయి. ప్రజలకు ఇవి ఏమాత్రం అభ్యంతరంగా కనిపించటంలేదు. అయితే ఇలా కొడుకుల్ని దించే నేతలు ఈ మధ్య, ఒక కొత్త ఫార్ములా కూడా కనిపెట్టారు. అదే ‘దేశానికి నేను, రాష్ట్రంలో నా కొడుకు’. ఈ పనికి జమ్మూ-కాశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్సు అగ్రనేత ఫరూఖ్‌ అబ్దుల్లా, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌లు మన కళ్ళ ముందే పూనుకున్నారు. ఆ ప్రకారం గానే వారు ఒమర్‌ అబ్దుల్లా, అఖిలేష్‌ యాదవ్‌లను తమతమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను చేసుకున్నారు.

ఇప్పడు ఇదే ఫార్ములా ని చంద్రబాబు నాయుడు పాటించటానికి ఉబలాటపడుతున్నట్లున్నారు. అయితే ఈ మాట వినగానే వైరి పక్షాల వారు, ‘రాష్ట్రంలో తనకే దిక్కులేదు. మళ్ళీ కొడుకా?’ అని తప్పకుండా అంటారు. అదీకాక మరో ప్రక్క చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైయస్‌ రాజశేఖ రెడ్డి తనయుడు జగన్మోహన్‌ రెడ్డి, ఏకంగా పార్టీనే పెట్టి ‘సానూభూతి’ పవనం తో సీమాంధ్రలో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు లోకేష్‌ ను దించటం వల్ల, ఇద్దరినీ పోల్చే ప్రమాదం వుంది. అప్పుడు లోకేష్‌ ‘రేటింగ్స్‌’ ఎంత తక్కువగా వుంటాయో వేరే చెప్పనవసరం లేదు. తొలుత జగన్‌ రాజకీయ ప్రవేశం చేసినప్పుడు( అప్పుడు వైయస్‌ జీవించి వున్నారు.) తన స్వంత జిల్లాలో వున్నం ‘క్రేజ్‌’ రాష్ట్రంలోని వేరే జిల్లాలలో వుండేది కాదు. తండ్రి క్రియాశీల రాజకీయాలలో వుండగా, కొడుక్కి పేరు రావటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తమిళ నాడులో కరుణా నిధి తనయులు స్టాలిన్‌, అళగిరులకు కూడా ఇలాగే సమయం పట్టింది. అయితే మన రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ పార్టీలో మాత్రం- కేసీఆర్‌ తనయుడు, కేటీఆర్‌కూ, కవితకూ వేగంగా గుర్తింపు వచ్చింది. బహుశా తెలంగాణలో రాజకీయాలు ‘ఉద్యమ రూపం’ లో వుండటం కారణం కావచ్చు.

అదీ కాక తండ్రి జనాకర్షక నేత అయినప్పుడు కొడుక్కు వచ్చే అవకాశానికీ, కానప్పుడు కొడుక్కి ఎదురయ్యే ఇబ్బందులకూ తేడా వుంది. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించినా, ఎన్టీఆర్‌ కున్న జనాకర్షణలో శతాంశం కూడా పొందలేక పోయారు. తమ పార్టీ కార్యకర్తలు కూడా తమ నేతకు పాలనా సామర్థ్యం వుందని మాత్రమే చెప్పుకోగలరు కానీ, జనాకర్షణ వుందని చెప్పుకోలేరు. ఎన్టీఆర్‌ తర్వాత మళ్ళీ ఆ తరహా జనాకర్షణ వైయస్‌కు వచ్చింది. అందుకనే జగన్‌ రాజకీయ ప్రవేశం, ఎదుగుదలా అంతా సులువుగా జరిగిపోయాయి.

ఎవరు ఎలా ఏ ప్రవేశించినా, వ్యక్తి పూజా, వారసత్వం- అనేవి మాత్రం ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలికంగా చేటు తెచ్చేవే!!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 9-6 మార్చి2013  వ తేదీ సంచికలో  ప్రచురితం)

Leave a Reply