గోరంత వినోదం! కొండంత వాస్తవం!!

parampara1

తారాగణం: నరేష్‌, ఆమని, రావికొండలరావు, మోనిషా, సంతోష్‌

సంగీతం:అర్జున్‌ కుమార్‌

కూర్పు: పరేష్‌ కందర్‌

ఛాయాగ్రహణం:ప్రసన్‌ జైన్‌

నిర్మాతలు :రూపాదేవి మధు మహంకాళి, మధు మహంకాళి

కథ,మాటలు, కథనం, దర్శకత్వం:మధు మహంకాళి

 

ఒకప్పుడు కళకీ, కామర్స్‌కీ పొంతన కుదిరేది కాదు. అందుకని సినిమాలు ఆర్ట్‌ చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు- అని రెండు పాయల్లాగా వుండేవి. కానీ ఇప్పుడు రెండూ దాదాపు కలసిపోయాయి. అయినా, అప్పుడప్పుడూ కళ మోతాదు కాస్త పెంచి ‘ఫీల్‌ గుడ్‌’ సినిమాలు తీస్తుంటారు. అలాంటి ఒక ప్రయత్నమే ‘పరంపర’. బాలీవుడ్‌, టాలివుడ్‌లలో ఓ పదిహేను చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మధు మహంకాళి, స్వీయ దర్శకత్వంలో సొంతంగా ఈ సినిమా తీశారు.

కథ ఏమిటి?

పల్లెకు ఎక్కువా పట్టణానికి తక్కువలాగా వుండే ఊరిలో, పవన్‌ అనే ఒక స్కూలు కుర్రాడికి, షటిల్‌ బ్యాడ్మింటన్‌ మీద వల్లమాలిన మోజు వుంటుంది. వాళ్ళ నాన్న రాఘవ( నరేష్‌) కు ఈ విషయం తెలుసు కానీ పెద్దగా ప్రోత్సహించడు. తల్లి(ఆమని) మాత్రం అనుకూలంగా వుంటుంది. అనుకోకుండా, వీళ్ళంతా పవన్‌ వాళ్ళ తాతయ్య (రావికొండలరావు) వుండే ఊరుకి వెళ్తారు. అది పూర్తిగా పల్లెటూరే. పవన్‌ని వెంటబెట్టుకుని రాఘవ్‌ మోపెడ్‌(టీవీయస్‌) మీద తిప్పుతాడు. చిన్నప్పుడు ఏ చెరువు ముందు, ఏ చెట్టుకింద కూర్చుని కవిత్వం రాసేవాడో, అక్కడకు తీసుకువెళ్తాడు రాఘవ్‌. బాల్యస్మృతుల్ని అలా పంచుకుంటూ కొడుక్కి మరింత దగ్గరవుతాడు. తండ్రి వదిలేసిన కవిత్వాన్ని తిరిగి రాయించాలని కొడుకూ, కొడుక్కి ఇష్టమైన షటిల్‌బ్యాడ్మింటన్‌లో ప్రోత్సహించాలని తండ్రీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఓ ఘటన జరుగుతుంది. తండ్రీ కొడుకల అనుబంధం పతాక స్థాయికి చేరుతుంది.


parampara2ఎవరు ఎలా నటించారు?

ఇందులోని నటులు గొప్పగా నటించారనో, జీవించారనో చెప్పటం కష్టం. ‘చించెయ్యటాలూ’, ‘ఇరగదీసెయ్యటాలూ’ లాంటి విపరీతకృత్యాలకు కూడా పాల్పడలేదు. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు ప్రవర్తించారు.(‘బిహేవ్‌’ చేశారు.) నరేష్‌ మధ్యవయసున్న మధ్యతరగతి పాత్రలోకి ఒదిగిపోయాడు. అతని ముఖంలోకి దిగులయినా, ఉత్సాహమయినా మెల్లగా పొద్దుకుంగినట్టో, మెత్తగా తెల్లవారినట్లో వచ్చాయి తప్ప, చకచకా రావు. అతని భార్యగా నటించిన ఆమని కూడా. ఆమె ఇంటిపనిలో ఆమె వుంటూ, వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. తాతయ్య పాత్రలోకి రావికొండలరావు అలా నడచివచ్చేశారంతే. చిత్రమేమిటంటే, బాల నటులూ, కొత్తనటులూ, నటులుకాని ఊరి పౌరులూ అందరూ తమకి తగ్గట్టుగా ప్రవర్తించేశారు.


parampara3హైలైట్స్‌:

సినిమాటోగ్రఫీ

కథనం

నరేష్‌ నటన

డ్రాబ్యాక్స్‌

మాటలు

పాటలు,

సంగీతం

తెరవెనుక తీరు ఎలా వుంది?

కెమెరాను అందంగా చూపటానికే కాదు, అందంగా చెప్పటానికి వాడుకున్నారు సినిమాటోగ్రఫర్‌. దర్శకుడు సైతం ఈ కళలో చెయ్యితిరిగిన వాడు కావటం వల్ల, ఈ పనిని సమర్థవంతంగా చెబుతుంది. ఈ చిత్రంలో పాత్రలకన్నా కెమెరాయే ఎక్కువ మాట్లాడుతుంది. జ్ఞాపకాలను నీడల్లోకి తర్జుమా చేసి చూపిస్తుంది. ఆట ఆడేటప్పుడు లేని నాన్నను ఉన్నట్టు ఊహించుకొనే భ్రమనూ, శిధిలమయిన కళాశాల ఒపెన్‌ ఆడిటోరియం మీదకు వచ్చిన ఏళ్ళక్రితం నాటి ఉత్సవాన్నీ, దిగులును పెంచే నిశ్చలమైన తటాకాన్నీ మనసు మీద ముద్రవేసేటట్టుగా చూపించారు. ఈ సినిమాలో కూడా చెట్టుకూడా ఒక పాత్రగా మారిపోవటానికి కారణం ఈ ఛాయగ్రహణమే.

మాటలు మాత్రం నిరుత్సాహపరుస్తాయి. పాత రేడియోనాటకాల్లో సంభాషణల్లా కృతకంగా వుంటాయి. పాత్రలు ఎంత సహజంగా ప్రవర్తిస్తాయో, అంత అసహజంగా మాట్లాడాయి. ఎక్కడా ఒక విరుపుగానీ, ఒక విసురుగానీ కనిపించవు. ‘పంచ్‌’లకు అలవాటుపడ్డ ప్రేక్షకుడికి పూర్తి నిరుత్సాహాన్నిస్తుంది. సంగీతం కూడా అంతంత మాత్రమే. కాకుంటే, సన్నివేశంలోని భావోద్వేగాన్ని పెంచకపోయినా, ఎక్కడా చెడగొట్టలేదు. ఉన్న కొన్ని గీతాలూ గుర్తే వుండవు. యాక్సిడెంట్‌ జరిగిన తీరును కథాక్రమంలో అంచెలంచెలుగా వెల్లడించే కూర్పు బాగుంది.

విశ్లేషణ

parampar4కొడుకు ఇష్టం తెలుసుకోకుండా, తండ్రి తనదయిన పద్దతిలో అతణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలనుకుని భంగ పడ్డ ‘కాన్సెప్ట్‌’లతో సినిమాలు చాలా వచ్చాయి. కొన్నయితే కమర్షియల్‌ హిట్లుకూడా అయిపోయాయి. అయితే ఈ అంశానికి రెండో పార్శ్యం కూడా వుంటుంది. కొడుకు ఇష్టాన్ని తండ్రి తెలుసుకోవటం మాత్రమే కాదు, తండ్రి అభిరుచిని కొడుకు వెతికి పట్టుకోవటం కూడా వుంటుంది. ఇలా చూడటం వల్ల ఈ చిత్రంలో తండ్రీ, కొడుకుల అనుబంధానికి కొత్త నిర్వచనమిచ్చినట్లయ్యింది. కాకుంటే కొడుక్కి ఇష్టవ్యాపకమైన షటిల్‌ బ్యాడ్మింటన్‌ని చూపించినంత సమర్ధవంతంగా, తండ్రి కవిత్వ కౌశలానికి అద్దం పట్టలేక పోయారు దర్శకులు మధు మహంకాళి. అయితే, క్రీడను కేంద్రంగా చేసుకుని వచ్చిన సినిమాగా భావించలేం. ఈకకథ ఏమిటి? ఈ క్రీడలోని గెలుపు ఓటముల ఉత్కంఠను క్లయిమాక్సుకోసం ఉపయోగించుకున్నారు. ‘సై’ లాంటి చిత్రంలో ‘రగ్బీ’ ఆటను కూడా అందుకే వాడారు. కానీ ఈ చిత్రంలో ఈ ‘ఉత్కంఠ’ రావాల్సిన స్థాయిలో రాలేదు. కొన్ని పాత్రలు (పవన్‌ బాబాయి, పవన్‌ ప్రియురాలు) వుండాలి కాబట్టి వుంచినట్టున్నాయి కానీ, వాటిని వృధ్ధి చేసినట్టు కనిపించలేదు. కాకుంటే, తూర్పుగోదావరి జిల్లాలోని పచ్చని పొలాలు, చెట్లూ, కాలువలూ, వంతెనలూ అందంగా కనిపిస్తాయి. ప్రతీ దృశ్యమూ పెయింటింగ్‌లా వుంటాయి. తాత, తండ్రి, కొడుకుల అనుబంధాలు ‘పరంపర’గా వస్తుంటాయి. సంభాషణలు బలహీనంగా వున్నా, కథను నడిపించిన తీరు వల్ల, పలు చోట్ల అనుబంధాలు గాఢం కనిపించి కళ్ళు చెమరుస్తుంటాయి. పల్లెలో జీవితాన్ని ముందే అతిగొప్పగా ఊహించుకోకుండా, ఉన్నది ఉన్నట్టు చూడాలనుకునే వారికి ఈ సిని మా నచ్చవచ్చు. వినోదాన్ని ఆశించన వారికి ఈ సినిమా నిరాశనే మిగులుస్తుంది.

బాటమ్‌ లైన్‌:

ఒక శాతం వినోదం; 99 శాతం వాస్తవం.

-సతీష్‌ చందర్‌

(్రేట్ ఆంధ్ర వారపత్రిక9-15నవంబరు 2014 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply