‘గ్రేటర్‌’ కోట పై ‘గులాబీ’ జెండా..!?

KCR‘గ్రేటర్‌’ కోట పై ఏ జెండా ఎగురుతుంది? ఈ చర్చ కేవలం హైదరాబాద్‌ కే పరిమితం కాదు. అలాగని రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయినది కూడా కాదు. దేశం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తున్నది. ఎన్ని పార్టీలు బరిలో వున్నా, అంతిమంగా ఆడేది మూడు ముక్కలాటే! అవును. ముక్కోణపు పోటీయే. టీఆర్‌ఎస్‌- మజ్లిస్‌లు పేరుకు వేర్వేరుగా పోటీ చేస్తున్నా, ఈ రెంటిదీ ఒకే ముఖం. ఆ పార్టీల మధ్య ముందస్తు అవగాహన వుంది. కార్పోరేటర్‌ ఎన్నికలు ముగిశాక, మేయర్‌ ఎన్నికలప్పుడు కలవాలన్నది అవగాహన సారాంశం. ఇక ఒక డజను డివిజన్లలో కత్తులు దూసుకున్నా, ఇతర డివిజన్లలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ల మధ్య అధికారికమైన పొత్తు వుంది. ఇక మూడవది కాంగ్రెస్‌ పార్టీ. అయితే గెలుపు వోటములతో సంబంధం లేకుండా లోకసత్తా, వామ పక్షాలు కలిపి మరో కూటమి వుంది కానీ, యుధ్ధక్షేత్రం వారి ఉనికి నామ మాత్రంగానే వుంటుంది. కాబట్టి అంతిమంగా వుండేది త్రిముఖ పోటీ మాత్రమే.

మూడు ముక్కలాట:

మొత్తం 150 స్థానాలలో గెలిచిన కార్పోరేటర్లతో పాటు, ఇతర ప్రజాప్రతినిథులు కూడా మేయర్‌ ఎన్నికల్లో తమ వోటు హక్కును వినియోగించుకుంటారు. ఈ మూడు వైపులా ప్రచారం ముమ్మరంగానే సాగింది. బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు( చంద్రబాబు, కేసీఆర్‌), రోడ్‌ షోలలో ముఖ్యమంత్రుల తనయులు( లోకేష్‌, కేటీఆర్‌) రెండు కూటమి ల నుంచి ప్రచారాన్ని వేడెక్కించారు. కానీ, కాంగ్రస్‌ నుంచి ఈ రెండు రాష్ట్రాల నుంచి స్టార్‌ క్యాంపెయినర్స్‌ పెద్దగా లేరు. బీజేపీ నుంచి వెంకయ్య నాయుడు శంఖం పూరించారు. ఇక మజ్లిస్‌ సరేసరి. వారి అధినాయకత్వమే (ఓవైసీలు) హైదరాబాద్‌లో మకాం చేస్తుంది.

గెలుపు సరే, సీట్లెన్ని?

ఎన్నికలన్నాక కొన్ని ముందస్తు అంచనాలు వస్తూనే వుంటాయి. ఇప్పటికయితే టీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో వుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పార్టీలు కూడా లోపాయి కారి గా తమ తమ సర్వేలను నిర్వహించుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్‌ఎస్‌ నాయకత్వం తమకు 70 సీట్లు వచ్చే అవకాశం వుందని చెబుతోంది. ఇతర ప్రజాప్రతినిథులతో కలుపుకొని, స్పష్టమైన మెజారిటీని తాము సాధిస్తామని ప్రచారం చేసుకొంటోంది. అంటే, ఎవరి ప్రమేయమూ లేకుండా, తామే మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకోగలమని బాహాటంగానే చెబుతున్నారు. కేసీఆర్‌ కూడా ఆమేరకు ధీమాగా వున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్ని సీట్లు రాకపోవచ్చనీ, కాకుంటే అత్యధిక మెజారిటీని సాధించిన ఏకైక పార్టీగా నిలుస్తుందని ఆ పార్టీలోనే కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు, మజ్లిస్‌ మద్దతును తీసుకుంటుందన్నది బహిరంగ రహస్యం. అయితే మజ్లిస్‌ కూడా మేయర్‌ స్థానానికి పట్టు పడితే ఏమిటన్నది కూడా ఒక ప్రశ్న. గతంలో కాంగ్రెస్‌- మజ్లిస్‌లు ఇలాగే మేయర్‌ స్థానాన్ని సగం పదవీకాలం ఒకరూ, మిగతా పదవీ కాలాన్ని ఒకరూ పంచుకున్నారు. అయితే అలాంటి ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ ముందు నుంచే గండి కొడుతోంది. టీఆర్‌ఎస్‌ ఎన్ని ఎక్కువ స్థానాలను సంపాదిస్తుందన్న అంశం మీదనే, చర్చల్లో టీఆర్‌ఎస్‌కు పై చేయి వుండటం ఆధారపడుతుంది. ఎన్నికల అనంతరం పొత్తు అనివార్యమయితే, పూర్తి కాలపు మేయర్‌ పదవిని పొందటానికి టీఆర్‌ఎస్‌ అన్ని పాచికలనూ వాడుతుంది. డిప్యూటీ మేయర్‌ పదవిని మాత్రమే ఇవ్వజూపుతుంది. అంతే కాదు, అందుకు కూడా టీఆర్‌ఎస్‌ దగ్గర మరో పాచిక వుంది. రాజ్యసభ పదవిని మజ్లిస్‌ కు ఆశచూపి, ఆ పదవిని కూడా వదలుకునేటట్లు చేసినా చెయ్యవచ్చు.

పొత్తుల మధ్య కత్తులు

ఇక బీజేపీ- టీడీపీ ల పొత్తు, సెటిలర్లు వోటర్లు వుండే 12 డివిజన్లలో, ఎన్నికలకు ముందే చిత్తయ్యింది. ఈ రెంటి పొత్తు, ఇటీవల జరిగిన వరంగల్‌ ఉప ఎన్నికలలో బెడిసికొట్టింది. ఈ కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు గ్రేటర్‌ ఎన్నికలలో రెండవ స్థానానికి పోటీ పడుతున్నట్లుగా వున్నాయన్నది అంచనాలు వేస్తున్నారు. గత 19 నెలల కాలంలో, హైదరాబాద్‌లో పెద్దగా పుంజుకున్నది లేదు. పైపెచ్చు, బీహార్‌ ఎన్నికలలో ఆ పార్టీ పొందిన పరాజయ ముద్ర అన్ని చోట్లా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్‌ సరేసరి, ప్రధాన ప్రతిపక్షంగా ఎక్కడా ఇరుకున పెట్ట లేక పోయింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పోటీలో లేక పోవటం వల్ల, ఆ పార్టీ వోట్లు, వెళ్ళితే టీఆర్‌ఎస్‌కు వెళ్ళే అవకాశం తప్ప, వేరే పార్టీకి వెళ్ళవని పరిశీలకులు చెబుతున్నారు.

కేసీఆర్‌ గ్రేటర్‌ వ్యూహానికి, ధీటైన ప్రతివ్యూహాలను వెయ్యటంలో ఎందుకనో ఇతర పక్షాలు ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటినుంచీ వెనుకబడే వుంటున్నాయి. అందుకే కాబోలు ఈ ఎన్నికలలో తమ పార్టీ గెలుపొందక పోతే, తాను మంత్రి పదవినుంచి వైదొలగుతానని, సులువుగా సవాలు చెయ్యగలిగారు. అయితే ఎంత కాదన్నా, కాంగ్రెస్‌, బీజేపీలు జాతీయ పార్టీలు. వాటికంటూ ఒక వోటు బ్యాంకు పలు డివిజన్లలో వుంటుంది. అందుచేత వోట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ ఫలితాలకు సంబంధించిన ఉత్కంఠ ‘గ్రేటర్‌’ లో కలుగుతూనే వుంటుంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 29 జనవరి- ఫిబ్రవరి 2016 సంచికలో ప్రచురితం)

Leave a Reply