‘గ్లాసు’ జారి, ‘ఒళ్ళం’తయ్యిందే..!

Photo By: jenny downing

గ్లాసే కదా- అని కొట్టి పారెయ్యలేం. ఒక్క గ్లాసు తో మనిషి తూలిపోవటం మామూలే. కానీ అదే గ్లాసుతో రాజ్యాలకు రాజ్యాలే కూలిపోయాయి. మన కళ్ళముందే 1994లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోయింది. అవును. సారా గ్లాసుతోనే.

దాంతో గ్లాసుల్లేని రాజ్యాన్ని తెస్తానని ఎన్టీఆర్‌ భీషణ ప్రతిజ్ఞచేసి, మరో మారు గద్దెనెక్కారు. అనుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం రోజునే తొలి సంతకం మీద ‘గ్లాసు బోర్లించారు’. మద్య నిషేధాన్ని అమలులోకి తెచ్చారు.

ఆ తర్వాత ఆయన్ని ‘దించి’, ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు నాయుడు- గ్లాసులేం ఖర్మ- సీసాల్నే బోర్లించేస్తానంటూ రోడ్డు మీద కొచ్చారు. అన్నంత పనీ చేశారు. అక్రమంగా నిల్వచేసిన మద్యం సీసాలను ఆయనే సపరివారంగా వెళ్ళి బద్దలు కొట్టారు. ఈ దృశ్యాలను చూసిన ‘మందు బాబు’లు తమ గుండెలు భళ్ళు మన్నట్టు ఫీలయ్యారు. అయితే వారి హృదయాలు ఆ విధంగా క్షోభించటం చూసి ఆయన చలించిపోయినట్టున్నారు. నెలలు తిరగకుండానే ‘నీళ్ళు’ వదిలారు- అవును మద్యంలోకే. మద్యపాన నిషేధానికి చరమ గీతం పాడేశారు. పైకి చెప్పే కారణం మామూలే: ఇతర రాష్ట్రాలనుంచి మద్యం మన రాష్ట్రానికి అక్రమ రవాణా అవటం వల్ల- ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పోతుంది; మన ఖజానా గుల్లవుతుంది.

ఇక అప్పటి నుంచీ మద్యం అమ్మకాలు మితిమీరి పోయాయి. అయితే కేవలం వైన్లషాపుల వల్లా, బార్ల వల్లా ఈ అమ్మకాలు పెరగలేదు. ఇవి కాకుండా ఇతరేతర షాపుల్లో కూడా మద్యం అమ్ముడుపోతోంది. ఈ షాపుల్నే ‘బెల్టు షాపు’లంటారు. ‘మందు బాబులు’ కూడా ‘బెల్టుషాపు’ల్లో కొనటానికి తెగ ముచ్చటపడతారు. ఇరవయి నాలుగ్గంటల్లో ఎప్పుడయినా మద్యం కొనుక్కోవచ్చు. అంతే కాదు, ‘బెల్టు షాపు’ పెట్టుకోవటానికి ఎలాంటి లైసెన్సూ అవసరం లేదు. మద్యం విక్రయాలు ఎంతగా పెరిగితే, మద్యం టెండర్ల మీద సర్కారుకు అంత ఎక్కువగా ఆదాయం వస్తుంది. లైసెన్సుల్లేక పోవటం వల్ల వచ్చే నష్టం కన్నా. ఈ లాభం ఎక్కువగా వుంటుంది. అందుకే సర్కారు ఈ ‘బెల్టు షాపుల్ని’ చూసీ చూడ నట్లు వదిలేస్తుంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో లక్షన్నర పెగా బెల్టు షాపులున్నాయి.

మద్యం మీద వచ్చే ఆదాయంలో పేదవాడు చెల్లించేదే ఎక్కువ. ఇది అతడికి అనారోగ్యాన్నీ. అతడి కుటుంబానికి దరిద్రాన్నీ ఏకకాలంలో బహూకరిస్తుంది. అందుచేత ఈ బెల్టు షాపుల మీద కోపం వస్తే, గతలంలో నెల్లూరు జిల్లాలో రోశమ్మకు వచ్చినట్టు, పేద మహిళలకు రావాలి. తమ భర్తలు తప్పతాగటం వల్ల, తమ బిడ్డలను పస్తులుంచాల్సి వస్తుందని సర్కారు మీద విరుచుకు పడాలి.

కానీ చిత్రంగా ఈ కోపం చంద్రబాబుకు వచ్చింది. 1996లో ఎవరి నిర్ణయం వల్ల మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందో, ఆయనకే ఈ ఆగ్రహం రావటం విచిత్రం కాదూ! ఎందుకు రాదూ? ఆయన అవసరం అలాంటిది. తొమ్మిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో వుండిపోయిన ప్రతిపక్షనేతకు ఎలాగయినా మళ్ళీ అధికారంలోకి రావాలన్నది తక్షణావసరం అవుతుంది. అందుకోసం, ఎన్ని దారులున్నాయో అన్నీ వెతికేస్తారు. తిరిగి తిరిగి ఆయన ‘గ్లాసు’ బోర్లించటం వరకూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, మలి సంతకం ‘బెల్టు షాపుల మూసివేత’ ఫైలు మీదే పెడతానని ప్రతిజ్ఞ చేశారు.( తొలి సంతకం ‘రైతుల రుణ మాఫీ ఫైలు మీద పెడతారట లెండి!). మద్యపాన నిషేధం మీద తన మామ పెట్టిన సంతకానికి విలువ లేకుండా చేసిన చంద్రబా బే, మద్యాన్ని అదుపు చేయటానికి సిధ్ధమవ్వటం వింతల్లో కెల్ల పెద్ద వింత.

అంటే ఒక వేళ నిజంగానే ఆయన మాటల్ని నమ్మేసి, ఆయన పార్టీనే గెలిపించేసి, ఆయన్నే ముఖ్యమంత్రి ని చేసేస్తే, అనుకున్నట్టుగా ముందు సంతకం పెట్టేసి. ఎప్పటిలాగానే బెల్టుషాపులు రద్దు చేయించేసి. కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్లీ బెల్టుషాపుల్ని వదిలేస్తే, అడిగే నాథుడెవరుంటారు?

అయతే బెల్టు షాపుల వల్ల అనర్థాలున్నమాట వాస్తవమే. లైసెన్సు పొంది వైన్‌ షాపు ఇళ్ళ మధ్య వుంటే, వద్దని గొడవ పెట్టటానికి వుంటుంది. కానీ లైసెన్సే లేని బెల్టుషాపులు ఇళ్ళ మధ్యో, గుళ్ళ మధ్యో వున్నా అడిగే నాథుడుండరు.

తానే పాముకు పాలు పోసి పెంచి ఇప్పుడు ‘పాము! పాము!’ అని అరిస్తే ఎలా? చంద్రబాబు వరస చూస్తే అలాగే వుంది. ఇంత వరకూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ ‘గ్లాసు’ను పూర్తిగా బోర్లించ లేక పోయింది. కారణం ఒక్కటే: సర్కారు సారావల్లా, మద్యం వల్లా వచ్చే ఆదాయానికి అలవాటయి పోయింది. ప్రభుత్వ ప్రత్యక్ష నేతృత్వంలో ఒకప్పుడు ‘ప్రభుత్వ సారాయి దుకాణాలు'(ప్రసాదులు) నడిస్తే, నేడు అదే ప్రభుత్వ పరోక్ష సహకారంతో ‘బెల్టు షాపులు’ నడుస్తున్నాయి. అంతే తేడా!!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 8-15 జూన్ 2013 వ సంచికలో ప్రచురితం)

1 comment for “‘గ్లాసు’ జారి, ‘ఒళ్ళం’తయ్యిందే..!

Leave a Reply