జేబు ‘దేవత’లున్నారు జాగ్రత్త!

Photo By: Jay Malone

మన జేబుల్లో చేతులు పెట్టేవాళ్ళంతా జేబుదొంగలు కారు. వాళ్ళల్లో ఆప్తులుండవచ్చు, ఆత్మీయులు వుండవచ్చు. పిల్లలూ వుండవచ్చు,ప్రియురాళ్ళూ వుండవచ్చు.

‘నీ జేబులో ఎంత వున్నాయి?’

తన మృదువయిన చేయిని తన ప్రియుడి జేబులో పెడుతూ అడిగింది ఓ అమ్మాయి.

‘చెయ్యి పెట్టేసావ్‌ కదా! నువ్వే చూస్కో’

అన్నాడు ప్రియుడు. అంతకు మించి ఏ ప్రియుడు మాత్రం ఏమనగలడు లెండి?

‘రెండువేలున్నాయి’

కరెన్సీ నోట్లను తన ముని వేళ్ళను పైకి తీస్తూ ప్రకటించింది.

‘రెండేనా? నాలుగు వేళ్ళుకదా నువ్వు పెట్టిందీ?’

ఆయాస పడుతూ ఆడిగాడు ప్రియుడు. ఆయాసం రాదూ..? ఆమె స్పర్శకు అప్పడికే అతడి గుండె వేగం రెట్టింపయ్యింది.

‘అరేయ్‌ పిచ్చీ! నేనంటున్నది నా చేతి వేళ్ళ గురించి కాదు. నే జేబులో వున్న సొమ్ము గురించి..!

అని ఖాళీగా వున్న రెండో చేత్తో ముద్దుగా అతడి నెత్తి మీద ఒక్కచ్చింది. అంత ఆప్యాయంగా కొట్టాక బుర్ర పనిచేస్తుందా.. చెప్పండి!

బుధ్ధిని బజ్జోపెట్టి, గుండెను మాత్రమే మేల్కొలినప్పుడు- ఏ శస్త్ర చికిత్సయినా చేసుకోవచ్చు. ఆమె అదే పనికి ఉపక్రమించింది.

‘రేయ్‌ సన్నాసీ, నీ కెంత కావాలిరా?’

రెండు వేల రూపాయిలను కళ్ళ ముందు పెట్టుకుని అడిగింది.

‘నాకేం తెలుసు?’

అలాగే అంటాడు కదా, మత్తులో వున్న ప్రియుడు. స్పర్శ ఒక ఎనెస్తీషియా!

‘నాకు తెలుసు. నన్ను మా హాస్టల్‌ దిగబెట్టి నువ్వు వెళ్ళేటప్పుడు, దార్లో నీ బైక్‌కు లీటర్‌ పెట్రోలు కొట్టించుకో. నువ్వసలే పిచ్చి మాలోకం. కడుపు మాడ్చుకుంటావ్‌. మధ్యలో ఆగి ఓ బర్గర్‌ తిను. అందుకు ఈ రెండు వందలూ సరిపోతాయి.’

అని చెప్పి, రెండు వందలూ అతడి జేబులో పెట్టేసి, మిగిలిన పద్దెనిమిది వందలూ తన పర్సులో పెట్టేసుకుంది.

ఆమె చెప్పినట్టే, అతడు ఆమెను హాస్టల్‌ దగ్గర దిగబెట్టి బైక్‌ మీద వెనుతిరిగాడు.

బైక్‌ రోడ్డు మీదే పరుగెడుతోంది. కానీ తాను మాత్రం గాలిలో తేలుతున్నాడు.

అతని మనసంతా ఒక్కటే పలవరింత: ‘ నా ప్రేమ దేవత నాకు రెండు వరాలిచ్చింది. ఒకటి: ఉచిత పెట్రోలు. రెండు: ఉచిత బర్గర్‌’

తన డబ్బే తనకిచ్చిందనీ, అదికూడా ఆమె కొట్టాల్సింది కొట్టేశాకే మిగిలింది ఇచ్చిందనీ అతడికి ఎవరు చెబుతారు? ఒక వేళ ఎవరన్నా వెళ్ళి, అతడి రెండు చెవుల్లోనూ రెండు గొట్టాలు పెట్టి చెప్పినా వినడు.

ఎందుకంటే ఆమె శస్త్రచికిత్స ముగించింది కానీ, అతడికిచ్చిన ‘ఎనస్తీషియా'( మత్తు)ని తీయలేదు. కావాలంటే, ఇదే మత్తు మీద, మరుసటి రోజు కూడా ఇదే మాదిరి శస్త్ర చికిత్స ఆమె చేయగలదు.

కాబట్టి, జేబుల్లో చేతులు పెట్టిన వాళ్ళల్లో చోరులే కాదు, ప్రేమ దేవతలు కూడా వుండవచ్చు.

ప్రజల జేబుల్లో ఇంతే ప్రేమతో రాజకీయ పార్టీలు పెడుతుంటాయి.

మనల్ని కొట్టేసి, మనకే పెడుతుంటాయి. కష్టార్జితాన్నంతా కొట్టేసి, కిలోబియ్యాన్ని రెండు రూపాయిలకే ఒక పార్టీ కొలిస్తే, ఇంకాస్త ప్రేమను అదనంగా ఒలకబోసి ఒక్కరూపాయికే కొలిచింది ఇంకో పార్టీ.

రైతు ఫలసాయాన్నంతా వడ్డీలద్వారా, శిస్తుల ద్వారా రకరకాలుగా కొట్టేసి, నీళ్ళు తోడే మోటారుకు ఉచితంగా విద్యుత్తు నిస్తానంటుంది వెనకటికి అధికారంలో వున్న పార్టీ.(వాళ్ళు చెప్పినట్టుగా ఉచితంగా తీగలొచ్చేశాయి కానీ, కరెంటు రాలేదు)

ఈ ‘ఉచిత’ సాయంతో బతకటం ‘ప్రియమయి’ పోయి చద్దామనుకున్నప్పుడు ఏ పార్టీ అతడికి ‘పురుగుమందు’ను ఉచితంగా పంపిణీ చేయలేక పోయింది. దాంతో సొంత ఖర్చుతోనే ప్రాణం తీసుకోవాల్సి వచ్చింది. అది వేరే విషయం.

రెండువేలలో పద్దెమనిది వందలు కొట్టే ఈ ప్రేమను కూడా ఇన్నాళ్ళూ నోచుకోలేక పోయారు రాష్ట్రంలో ఎస్సీలూ, ఎస్టీలూ. వారికి కేటాయించిన ‘ఉప ప్రణాళిక’ నిధులు మొత్తం దారి మళ్ళేవి.

కానీ తొలిసారిగా, ప్రేమ దేవత లాగా, అదే తరహాలో మత్తు ఇచ్చి, అదే శస్త్ర చికిత్స, అదే పద్ధతిలో ఎస్సీ,ఎస్టీల జేబుల్లో రెండు వందలు పెట్టి, మీ ఇళ్ళకు ‘ఉచిత విద్యుత్తు’ ఇచ్చాను పొండి- అని ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అనే సరికి, నిజంగానే వారు గాలిలో తేలుతున్నారు.

ఇదే మత్తు మీద ఇంకో రెండు శస్త్ర చికిత్సలు చేయటానికి ఆ పార్టీ సిధ్ధమవుతోంది.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 7 ఏప్రిల్ 2013 వ సంచికలో ప్రచురితం)

1 comment for “జేబు ‘దేవత’లున్నారు జాగ్రత్త!

  1. Sir ! MSC garu chala baga chepparu……but vine varu leru kada?? who can spare their Ear to listen??? prayaa vyardhame ina cheppaka tappadu cheppi teeralasinde vinaka pothe vadi kharma!!!???

Leave a Reply