‘తడిసి మోపి’ దేవి

కేరికేచర్: బలరాం

పేరు : మోపిదేవి వెంకటరమణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: నిరపరాధి( ఒకసారి అరెస్టయిన మంత్రికి ఈ హాదా కన్నా గొప్పది వుండదు.)

ముద్దు పేర్లు : ‘తడిసి మోపి’ దేవి, సంతకాల వీరుడు.

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ (తంబ్‌) ఇంప్రెషన్స్‌. (అందుకే సంతకాన్ని కూడా, నిశానిలా వాడాను. వైయస్‌ నొక్కమన్న చోటెల్లా నొక్కాను. చదవకుండా సంతకం పెట్టాను)

హోదాలు : ఇప్పుడు చెప్పుకుని ఏం లాభం? ‘ఓడలు బళ్ళయ్యాయి.'(వైయస్‌ కేబినెట్‌లో ఓడల, పెట్టుబడుల మంత్రిని లెండి.).

గుర్తింపు చిహ్నాలు : ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చి అరెస్టయిన తొలిమంత్రి ఎవరంటే..? బీట్‌ కానిస్టేబుల్‌ కూడా అడ్రసు చెబుతాడు. ఇందుకు ప్రత్యేకించి గుర్తింపు చిహ్నాలు దేనికి చెప్పండి.

సిధ్ధాంతం : నమ్మినవారి కోసం ఏమయినా ఇస్తాను. పిచ్చిసంతకాలెంత?

వృత్తి : ‘తిను-తినిపించు’ కాదు.(అది ‘క్విడ్‌ ప్రోకో’ కిందకు వస్తుంది). తాగకు. కానీ తాగించు. దీనినే ‘ఎక్సైజు’ వృత్తి అంటారు. ఆ పనిచేయక పోతే, సర్కారే కూలిపోతుంది. రాజీనామాతో ఆ వృత్తిని వదిలేశాను లెండి.

హబీలు :1. చెప్పాను కదా. సంతకాలు పెట్టటమని.( నాడు ఒప్పందాలు మీద చదవకుండా ఎలా పెట్టానో, నేడు మావాళ్ళు రాసుకొచ్చిన నా రాజీనామా పత్రం మీద అలాగే పెట్టాను.)

2. పెట్టింది తినటం, అడిగింది చెప్పటం.( సిబిఐ కస్టడీలోకి వెళ్ళాక ఇంతకు మించి హాబీలేముంటాయి?)

అనుభవం : వెనుకబడిన’ వారి వెనుకపడేదే చట్టం. (చట్టం తన పని తాను చేసుకు పోవడమంటే ఇదే))

మిత్రులు : అదే అర్థం కావటం లేదు. సొంత పార్టీలోని వారే శిలువ ఎక్కించేశారు.

శత్రువులు : అదే అర్థం కాలేదు. రోడ్డు మీద కొస్తే జగన్‌ బృందం తిట్టింది. ఇంట్లో కూర్చుంటే, మా వాళ్ళే సిబిఐకి అప్పగించారు?

మిత్రశత్రువులు : తెలుగుదేశం వారే. ప్రతిపక్షంలో వుండి కూడా సిబిఐ స్వతంత్రంగా వ్యవహరిస్తోందని కితాబులు ఇస్తున్నారు.

జీవిత ధ్యేయం : గన్నుల్ని దించి శాంతియుత మార్గంలోకి కొందరు వచ్చినట్లుగా, నేను ‘పెన్ను’ పట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చేత పెన్ను పట్టాక, పెన్ను మాట చెయ్యి వింటుంది కానీ, చెయ్యి మాట పెన్ను వినటం లేదు. ‘పెన్ను’ను విసర్జించేస్తే, సంతకాల గొడవే వుండదు.

-సతీష్ చందర్

 

 

 

 

Leave a Reply