తన కోపమె తన ‘మిత్రుడు’

జనాగ్రహం

కిక్కూ, కోపమూ- రెండూ ఒక్కటే.
ఎక్కినంత వేగంగా దిగవు.
ఎక్కించుకున్న వారు కూడా, దించుకోవాలని కోరుకోరు.
కిక్కెక్కిన వాడూ, కోపం వచ్చిన వాడూ తెలివి తప్పడు. తప్పిన తెలివిని తెచ్చుకుంటాడు.
తాగ ముందు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా పలకలేని వాడు, మూడు పెగ్గులు బిగించాడంటే, బీబీసీ చానెలే.
గ్రామరూ, గట్రా రావని, వణికి చావకుండా, ఆంగ్లంలో చెలిరేగిపోతాడు. నాకు తెలిసి, కేవలం నోరారా ఇంగ్లీషు మాట్లాడటం కోసం పీకల దాకా బిగించేవారున్నారు.
ఎప్పుడో నేర్చుకున్నవీ, మరచిపోయాననుకున్నవీ అలా అవలీలగా గుర్తుకొచ్చేవి కిక్కులోనే.
జ్ఞాన ప్రదర్శన చేయటానికే కాదు, పాత కక్ష తీర్చుకోవటానికి కూడా కిక్కెక్కిన వేళే అనువయినది.
భార్యా విధేయుడిక్కూడా, కడుపులో దాచుకున్న కోపాలుంటాయి. కట్నం కోసం ఎంత కాంప్రమైజ్‌ అయ్యాడో కిక్కులో వున్నప్పుడే తెరలు తెరలుగా తన్నుకుంటూ వస్తుంది.
‘ఏంటే.. నాజుగ్గా, తీగలాగా వున్నానని అనుకుంటున్నావా? తప్పులేదు. అలాగే ఫీలవ్వు. డ్రమ్ము కూడా తాను స్లిమ్ముగా వున్నానను కుంటుంది.’
అవును. ఇలాగనాలని ఎప్పటి నుంచో అనుకుంటాడు. కానీ కడుపులో వున్నది కక్కే ముహూర్తం ఇలా కిక్కొచ్చినప్పుడే అతడికి వస్తుంది.
కోపం కూడా సౌకర్యాన్నే కల్పిస్తుంది. కోపం వస్తే అర్భకుడు కూడా ‘అగ్నిహోత్రావధాన్లు’ అయిపోతాడు.
ఎంతటి వాణ్నయినా ఎదిరించేస్తాడు.
పరమ శుంఠ తనకు బాస్‌గా వున్నాడని ఎప్పటికప్పుడు నలిగిపోతున్న ఉద్యోగి, కోపం వచ్చే వేళకోసం ఎదురు చూస్తూ వుంటాడు. మరో కొత్త ఉద్యోగం ఖరారయినప్పుడు ఆ వేళ రానే వస్తుంది. అప్పుడు తెగించి కోపం తెచ్చేసుకుంటాడు. కాదు, కాదు, కోపం తెచ్చుకుని తెగించేస్తాడు.
‘సార్‌! నిజం చెప్పేస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడెల్లా నాకు ఒకటే ఫీలింగ్‌ కలుగుతుంది. ఆఫీసు బాయ్‌ వచ్చి ఆఫీస్‌ మేనేజర్‌ సీట్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది.’
ఈ మాట చెప్పాలని నాలుగేళ్ళు ఎదురు చూసి ఇలా కోపం వచ్చిన శుభవేళ అనేస్తాడా ఉద్యోగి.
ఇలా అనటం వల్ల ఆ ఒక్క ఉద్యోగి కోపం మాత్రమే కాదు, చాలా మంది సహోద్యోగులు తమ కోపం తీరినట్టుగా భావిస్తారు.
ఇలాంటప్పుడే ఎవరికయినా అనుమానమొస్తుంది- తన కోపమె తన ‘మిత్రుడే’మో-నని.
కిక్కొచ్చినప్పుడూ, కోపమొచ్చినప్పుడూ అనాల్సినవన్నీ అనేసి.. ‘సారీ, ఆ క్షణంలో ఏదో అనేశాను.’ ఒక్క ఉపశమన వాక్యం ప్రయోగించి జనజీవన స్రవంతిలో కలిసి పోవచ్చు.
ఎందుకు కలవం- పాత పగలు తీర్చేసుకున్నాం కదా!
అందుకే కోపం అప్పు కాదు, ఆస్తే.
ఈ ఆస్తి విలువ తెలిసిన వాళ్ళు దానిని అపురూపంగా కాపాడుకుంటారు.
ఒక్కరికి ఒక్కసారి వచ్చిన కోపానికే ఇంత విలువ వుంటే, లక్షల మందికి ఒక్క సారిగా వచ్చిన కోపానికి ఎంత విలువ వుంటుంది?
ఇలా వచ్చిన మూకుమ్మడి కోపాన్నే, జనాగ్రహమనీ, ప్రజా చైతన్యమనీ చెబుతూ వుంటారు.
దీని విలువ అపారమని ఉపయోగించుకునే వారు ఇట్టే గ్రహిస్తారు.
ఇంత విలువయిన ఆస్తి రోడ్డు మీద వుంటే, దానికోసం కొట్టుకోకుండా వుంటారా?
రాష్ట్రంలో ఇలాంటి మూకుమ్మడి కోపం ఇప్పుడు ప్రాంతం కారణంగా వచ్చింది. ‘రాష్ట్రం ఎందుకు విభజించరు?’ అని ప్రత్యేక వాదులకీ, ‘రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?’ అని సమైక్య వాదులకీ ఇలాంటి మూకుమ్మడి కోపాలు వచ్చాయి.
ఈ రెండు కోపాలు, రెండు ఖరీదయిన ఆస్తులు.
ఇప్పుడయితే ‘ప్రత్యేక వాదుల’ ఆగ్రహం పతాక స్థాయికి చేరింది. తెలంగాణ ప్రాంతంలో ఈ ఆగ్రహాన్ని మించిన విలువయిన ఆస్తి మరొకటి లేదు.
ఈ ఆస్తిని పంచుకోవటంలో పార్టీలూ, గ్రూపులూ నేడు పోటీలు పడుతున్నాయి.
తెలంగాణా చైతన్యమనబడే ఈ ఆస్తి మొత్తం నాదే నన్నట్లు టీఆర్‌ఎస్‌ జెండాలు పాతుతోంది.
మాకూ వాటా వుందని ఇటీవలే ‘ప్రత్యేక మతం’ పుచ్చుకున్న తెలుగుదేశం శిబిరాలు వేస్తోంది.
జనం రావడమే చైతన్యమయితే ఈ ఆస్తికి అసలు వారసులుము తామే నంటూ ఓ విప్లవ కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ఎం.ఎల్‌-న్యూడెమాక్రసీ) ఖమ్మంలో జనప్రదర్శన చేసింది.
‘ఇచ్చేదీ మేమే, తెచ్చేదీ మేమే’ అని చెప్పుకుంటూ, ఈ చైతన్యంలో మొత్తం వాటా తమదేనని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సరిహద్దు రాళ్ళు పాతుతున్నారు.
‘ఈ ప్రత్యేకమ’నే కూతను అందరి కన్నా ముందు తామే కాకినాడలో కూసామని చెపుతూ ఈ ఆస్తిలో తమ భాగాన్ని గుర్తు చేస్తున్నారు బీజేపీ వారు.
వీరు కాక ‘తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తున్నది బడుగులే కాబట్టి’ ఈ ఆస్తి బడుగులదే నని ఒక వర్గం ఆశ పడుతోంది.
కోపం చల్లారకుండా వున్నంత వరకే ఆస్తి. అ తర్వాత పంచుకోవటానికి ఏముంటుంది?
చూస్తుంటే, ఈ సామూహిక కోపం చల్లారే వరకూ, వీరికి భాగాలు తెగేలా లేవు.
(ఆంధ్రభూమి దినపత్రిక 24 సెప్టెంబరు 2011 సంచిక లో వెలువడింది)

-సతీష్‌ చందర్‌

3 comments for “తన కోపమె తన ‘మిత్రుడు’

Leave a Reply