‘తిరం’జీవి

కేరికేచర్: బలరాం

పేరు : చిరంజీవి

దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర మంత్రి (గతంలో మా సామాజిక వర్గానికి చెందిన సినీ దర్శకుడికచ్చారే అలా..)

ముద్దు పేర్లు : ఆటు పోట్లకు వీలుగా రెండు పేర్లున్నాయి. హిట్టయితే ‘మెగా’, ఫ్లాపయితే ‘చిరు'(సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఇవే ముద్దు పేర్లు). తిరుపతిలో పోటీ చేసి గెలిచినప్పుడు మాత్రం కొందరు- ‘ఆహా! ‘తిర’ంజీవి అన్నారు. ఇప్పుడా సీటు పోతే పత్రికల వాళ్ళు – కాంగ్రెస్‌ కు ‘తిరు’ క్షవరం అని హెడ్‌లైన్లు పెట్టరు. ‘చిరు’ క్షవరం అంటారు… అదీ నాబెంగ!

విద్యార్హతలు : ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ షాట్స్‌'(ఏ షాట్‌లో యాక్షన్‌ ఆ షాట్‌లోనే. పీఆర్పీలో షాట్‌ వేరు. కాంగ్రెస్‌లో షాట్‌ వేరు.)

హోదాలు : స్వంత పార్టీలో ఒకటో స్థానం కన్న, పర పార్టీలో నాలుగో స్థానం మిన్న.(కిరణ్‌, బొత్స, రాజనరసింహ స్థానం మనదే.)

గుర్తింపు చిహ్నాలు : రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ప్రతీ వోటరు నన్ను గుర్తు పడతారు, గుర్తుంచుకుంటారు. ఒక్క పాలకొల్లు లో తప్ప. పుట్టిన ప్రాంతం కదా- అలాగే వుంటుంది.)

సిధ్ధాంతం : కొడుకా? తమ్ముళ్ళా? అంటే ఇద్దరూ సమానమే. కాకుంటే, కొడుకు కాస్త ఎక్కువ సమానం.(అందుకే ‘పవన్‌’ అని పిలవబోయి కూడా ‘చరణ్‌’ అని అంటూంటానని ఇటీవల ఒక బహిరంగ సభలో కూడా చెప్పాను.)

వృత్తి : అబ్బే.. ఏం మారలేదండీ? ఏదో అనుకున్నాను కానీ, రాజకీయాలు కూడా సినిమాల్లాంటివే. ఇక్కడ స్క్రీన్‌, మాటలు రాసివ్వటానికి సిధ్దహస్తులుంటారు. బొత్స కావచ్చు. కిరణ్‌ కావచ్చు. ‘ఇన్వాల్వ్‌డ్‌’గా చెప్పటమొస్తే చాలు. అది మనకి వెన్న తో పెట్టిన విద్య కదా!

హబీలు :1. స్టెప్పులు వేగంగా వెయ్యటం.( నా ‘లెగ్‌వర్క్‌’ వేగంగా వుంటుందని కొరియోగ్రాఫర్లు అంటారు.) అందుకే కదా, పీఆర్పీపీ నుంచి కాంగ్రెస్‌కు అంత వేగంగా స్టెప్‌ వేశాను.

2. ఏదో నాకు తోచినంతలో చిన్న చిన్న త్యాగాలు చెయ్యటం.( రక్త దానం చెయ్యటం, ఓడిన సీటునే కాదు, గెలిచిన సీటును కూడా వదలుకోవటం. తిరుపతి ఎమ్మెల్యే సీటు వదలు కోలేదూ..?) దాని వల్ల భగవంతుడే అంతకు మించి పెద్ద వరాలు ఇస్తాడు. రాజ్యసభ సీటు అలా వచ్చిందే.

అనుభవం : సినిమాల్లోనే హీరోలూ, విలన్లూ వుంటారు. రాజకీయాల్లో అందరూ కమెడియన్లే. అఫ్‌ కోర్స్‌ మనకు కామెడీ కూడా తెలుసనుకోండి. (సినిమాల్లో తొడ కొడితే ఈల వేస్తారు. రాజకీయాల్లో తొడ కొడితే నవ్వుతారు. అలా చేస్తే, పంచెలతో పాటు, పదవులు కూడా ఊడతాయి.)

మిత్రులు : బయిట వున్నప్పుడు మిత్రులూ, శత్రువులూ వేర్వేరుగా కనిపించారు. కాంగ్రెస్‌లో ఇద్దరూ కలిసే వుంటారు.. కామెడీగా!

శత్రువులు : చేతిలో మైకు వున్నంత వరకే, అవతలి వాడు శత్రువులా కనిపిస్తాడు. మైకు దించితే మిత్రుడే. ఎన్నికల్లో ఒట్టు పెట్టుకున్నా, తిట్టుకున్నా రెండూ ఒక్కటే. ఆనక తీసి గట్టు మీద పెట్ట వచ్చు.

మిత్రశత్రువులు : మీడియా వారు. నేను పార్టీ పెట్టే వరకూ ‘ఎప్పుడు పెడతావ్‌?’ అని వెంటపడ్డారు. తీరా పెట్టాక, ‘ఎప్పుడు మూస్తావ్‌?’ అని వేధించారు.

జీవిత ధ్యేయం : ముఖ్యమంత్రి మీద మోజులేదన్నాను కదా! అది లేనప్పుడు రాజకీయ జీవితానికి పెద్ద ధ్యేయమేముంటుంది చెప్పండి?

-సర్‌
(ఒక రాజకీయవార పత్రికలో ప్రచురితమైనది)

2 comments for “‘తిరం’జీవి

  1. రామ్ చరణ్ లో ర , చ తీసుకుని ‘ రచ్చ ‘ అని పెట్టారట.. చిరంజీవి నూట యాభయ్యో సినిమా తీస్తే చిరంజీవిలో ‘ చిం ‘ , ‘ జీ ‘ తీసుకుని , అసలు పేరు వరప్రసాద్ లో ‘ ప్ర ‘ తీసుకుని ” చింప్రంజీ ” అని పెడితే పవన సుతుడు సంతోషిస్తాడని అయిన వారి భోగట్టా !!

Leave a Reply