తిరిగొచ్చిన తూటా

padpic20-6-14పిలుస్తూనే వుంటాం. మనిషి తర్వాత మనిషిని ఈ భూమ్మీదకు ఆహ్వానిస్తూనే వుంటాం. నన్ను నా అమ్మా నాన్నా ఆహ్వానించినట్లు, నేను నా బిడ్డల్ని ఆహ్వానించాను. ఆహ్వానితుడికి ఎర్రతివాచీ పరచనవసరం లేదు; పట్టు బట్టలు పెట్టనవసరంలేదు; పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించనవసరంలేదు. ఆకలినో, నేరాన్నో బహూకరించకుండా వుంటే, అదే పది వేలు. వాడిచేతికి బలపం ఇవ్వక పోయినా ఫర్వాలేదు, నెత్తిన ఇటుకల దొంతర పేర్చకుండా వుంటే చాలు. అన్ని మాటలు ఎందుకు కానీ,వాడిపై జాలి చూపించకపోయినా ఫర్వాలేదు, భుజానికి జోలె తగిలించకుండా వుంటే చాలు.

వస్తూ వస్తూ పిల్లాడికి

బొమ్మ తుపాకీ కొని తెస్తే

వాడు పలక మీద పావురాన్ని గీశాడు.

నాకు నేనే పేలిపోయాను.

ఇప్పుడు వాడే,

స్కూలు నుంచి 

అసలు తుపాకితో తిరిగి వస్తే

పేలిపోవటానికి

నేనూ లేను;

పావురాయీ లేదు.

ఈ భూమ్మీద

జీవితమే యుధ్ధం కావచ్చు;

కానీ యుధ్ధమే జీవితం కాకూడదు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 20-27జూన్ సంచికలో ప్రచురితం)

Leave a Reply