తెరచుకోనున్న ‘ఫ్రంట్‌’ డోర్‌!

తెలంగాణలో ‘హంగ్‌’ భయాలు

jayalalitha-mulayamసీమాంధ్రలో వోట్ల శాతంపై లేనిపోని ఆశలు

మూడో ఫ్రంట్‌ వైపు టీఆర్‌ఎస్‌, వైయస్సార్సీపీల మొగ్గు?

కేంద్ర సర్కారులో రెండు పార్టీలూ కీలకం?

యూపీయే కూడా ‘ఫ్రంట్‌’ వెనుకే!?

 రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయిన వెంటనే, అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఇవి రెండు స్రవంతుల్లో నడుస్తున్నాయి. ఒకటి: రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎలా, ఎవరు ఏర్పాటు చెయ్యాలి? రెండు: రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన పార్లమెంటు సీట్లను కేంద్రంలో ఎవరికి ఇవ్వాలి? ఎన్డీయేకా? కాంగ్రెస్‌కా? ఇంకా గర్భస్త శిశువుగానే వున్న మూడో ఫ్రంట్‌ కా?

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎవరికి వారు తమంతట తాము ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యగలమని ధీమాలు ప్రకటిస్తున్నా, ‘హంగ్‌’ భయాలు ఈ రెండు పార్టీలనూ వెంటాడుతూనే వున్నాయి. మ్యాజికల్‌ ఫిగర్‌ 60 (మొత్తం సీట్లు 119) రాక పోతే ఏమిటీ- అన్న అంశం రెండు పార్టీలనూ బాధిస్తూనే వుంది. టీఆర్‌ఎస్‌ పైకి 70కి పైగా తమకు వస్తాయని చెబుతున్నా, ఆ పార్టీనేతలే కొందరు 45- 50 దగ్గర ఆగిపోతే, కింకర్తవ్యం? అని ఆంతరంగిక సమావేశాల్లో తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు పరిస్థితి కూడా అంతే. వీరికి 40- 45 మధ్యన వస్తే, ఏం చెయ్యాలి? వీరు కాక మజ్లిస్‌, సిపిఐలు ఇద్దరికీ చేరువలో వున్నారు. హఠాత్తుగా మజ్లిస్‌ ‘కింగ్‌ మేకర్‌’ పాత్ర పోషించే అవకాశం వుంది. తమకు ఎలా లేదన్నా 7 సీట్లు వరకూ వస్తాయని మజ్లిస్‌ నేతలు లెక్కలు కడుతున్నారు. ఇక సిపిఐ కూడా గణనీయమైన సంఖ్యలో నే తెచ్చుకోవచ్చు. అంటే ఓ 10-12 సీట్ల వరకూ తక్కువయితే వీరు టీఆర్‌ఎస్‌కయినా, కాంగ్రెస్‌ కయినా ప్రభుత్వ ఏర్పాటులో సహాయ పడగలరు. అందుకని వీరిని తమ వైపు ముందుగానే తిప్పుకోవటానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విషయంలో మజ్లిస్‌ కాంగ్రెస్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం వుంది. ఇదిలా వుంటే, టీఆర్‌ఎస్‌కు అవసరమనుకుంటే, బీజేపీ కూడా మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోలేదనే ప్రచారం కూడా నడుస్తోంది.

సీమాంధ్రలో ఇలాంటి హంగ్‌ భయం ఏమీలేదు. వైయస్సార్సీపీకీ, టీడీపీ-బీజేపీకీ మధ్యే పోటీ. కిరణ్‌ కుమార్‌ రెడ్డి జైసమైక్యాంధ్ర పార్టీ యుధ్ధం రంగంలోకి వెళ్ళక ముందే ఓడిపోయింది. కాంగ్రెస్‌ వెళ్ళీ వెళ్ళగానే చతికిలపడింది. పోలింగ్‌ శాతం 80 వరకూ వచ్చేసరికి ఎవరి అంచనాలు, వారు వేస్తున్నారు. ఇలా పెరగటం వెనుక వోటరుకున్న ఉద్వేగం కనిపిస్తోంది. అది సెంటిమెంటు కావచ్చు; ఆగ్రహం కావచ్చు. ఆపుతాం, అపుతాం- అని చెప్పి, రాష్ట్రవిభజనను ఆపలేక పోయారనో, లేక విభజన విషయంలో రెండేసి మాటలు మాట్లాడారనో మనసులో పెట్టుకుని మరీ వోటేసినట్టు కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో ఒక్క వైయస్సార్‌ కాంగ్రెసే సమైక్య నినాదాన్ని బలంగా వినిపించింది. టీడీపీ ‘రెండు కళ్ళు’ ,’రెండు చిప్పలు’, ‘సమన్యాయం’- అంటూ నసిగింది. రెండు ప్రాంతాలలో రెండు రకాలుగా ప్రవర్తించింది. కానీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రం ముందు ఎలాగున్నా, సిడబ్ల్యుసి ప్రకటన వెలువడుతోందని తెలియగానే, రాజీనామాల అస్త్రాన్ని సంధించింది ‘సమైక్య నినాదాన్ని’ అందుకుంది. అందుచేత ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎలా చిరునామాగా మారిందో, అంతిమంగా సమైక్యానికి కూడా వైయస్సార్సీపీ అలా మారింది. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వనే ఇచ్చింది. కాబట్టి సీమాంధ్ర వోటరు ఆగ్రహానికి కారణం రాష్ట్ర విభజనే అయితే, ఆ వోటరు వైయస్సార్సీపీ వైపే తిరగాలి. అలాకాకుండా ‘మోడీ గాలి’ అనో, బాబు ‘అభివృధ్ధి’ అనో మాట్లాడితే, ఈ మాటలు తెలంగాణలోనూ వినపడ్డాయి. అక్కడా తేలిపోయాయి. వైయస్సార్సీపీకి ఎలా లేదన్నా 100కు పైగా రావచ్చని, ఆ పార్టీకి సంబంధించనివారూ, వ్యతిరేకించచే వారు సైతం లెక్కలు కడుతున్నారు. ( మొత్తం 175 సీట్లలో 88 మేజికల్‌ ఫిగర్‌). కానీ టీడీపీ-బీజేపీ వారు కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ‘విశ్వాస ప్రకటనల్ని’ చేస్తున్నారు. అది వేరే విషయం.

ఇక రాజకీయాల్లో రెండో విషయం: కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారు? తెలంగాణలో టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైయస్సార్సీపీలు బీజేపీనీ తిట్టిపోసినా, ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయేను దూరంగా వుంచుతామని చెప్పలేదు. అలాగే యూపీయేకే మద్దతు ఇస్తామని హామీ పడలేదు. ఈ రెండూ కాక, మూడోఫ్రంట్‌ ఆవిర్భవించే అవకాశాలు కూడా లేక పోలేదు. ఎన్డీయే ఎక్కువ సీట్లు తెచ్చుకున్న ఏకైక పక్షంగా వచ్చినా మేజికల్‌ ఫిగర్‌ (272+) వస్తుందన్న హామీలేదు. యూపీయే దీ ఇదే పరిస్థితి. ఎన్డీయేకున్న మతతత్వ ముద్ర వల్ల, ప్రాంతీయ పార్టీలు అటు వైపు వెళ్ళవు. యూపీయేకయితే సాధ్యమవుతుంది. కానీ యూపీయేకు బాగా తక్కువ సీట్లు వచ్చిన పక్షంలో, మూడోఫ్రంట్‌ ఏర్పాటుకు కాంగ్రెస్‌ తాను తప్పుకుని దారివేస్తుంది. ఈ స్థితిలో అటు టీఆర్‌ఎస్‌, ఇటు వైయస్సార్సీపీలు మూడోఫ్రంట్‌కు మద్దతు ఇచ్చినా, లేదా అందులో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘రాష్ట్రప్రయోజనాలు ఎవరు చూస్తారో వారికే మద్దతు ఇవ్వనున్నట్లు’ రెండు రాష్ట్రాలలోని, ఇద్దరు నేతలూ వేర్వేరు సందర్బాలలో ప్రకటించారు. కాబట్టి, పోలింగ్‌ తర్వాత రాజకీయం దేశంలోనూ, రాష్ట్రాలలోనూ మరింత రసవత్తరంగా వుండోబోతోంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 10-16 మే 2014 వ తేదీ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “తెరచుకోనున్న ‘ఫ్రంట్‌’ డోర్‌!

  1. రాజకీయాల మూడవ ముఖం అధికారంలోకి వస్తే అది కప్పల తక్కెడయే అవుతుంది. దేశం పెనం మీదనుండి పొయ్యిలో పడ్డచందం అవుతుంది. పది సంవత్సరాల అసమర్ధత, అవినీతులకు, దేశమంటే అవగాహనలేనివాళ్ళ పాలన తోడౌతుంది. భగవంతుడొక్కడే దేశాన్ని ఈ మూడవముఖం బారినుండి తప్పించగలడు. భగవంతుని అనుగ్రహం ఈ జాతికి కావాలి.

Leave a Reply