తెలుగు లో తిట్టు లేదా? తెలుగు మీద పట్టు లేదా?

‘మీరెవరు?’

ప్రశ్నే. సాదాసీదా ప్రశ్నే. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు,ఎవరో ఒకరికి ఈ ప్రశ్న ఎదురవుతుంది. స్థలమూ, సందర్భమూ సమాధానాన్ని నిర్ణయిస్తాయి.

స్థలం: మనదేశంలోని ఒకానొక గ్రామం. సందర్భం: ఆ ఊరికి కొత్త కావటం. అడిగిన వ్యక్తి: ఆ పల్లెలో ఓ పెద్దాయన.

ఆ కొత్త వ్యక్తినుంచి వచ్చే సమాధానాలు ఏయే రకాలుగా వుండవచ్చు.

‘నేనొక ఇంజనీరుని’; ‘నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాను.’ ‘నేను పర్యాటకుణ్ణి’

ఆ పెద్దాయన ఆశిస్తున్నది వీటిల్లో ఏ ఒక్క సమాధానమూ కాదు.

అప్పుడా కొత్త వ్యక్తి పెద్దాయన ఆంతర్యాన్ని గ్రహిస్తాడు. తన కులం ఏమిటో చెబుతాడు.

ఇలాంటప్పుడే ‘నేను తెలుగు వాణ్ణి’ అని చెప్పివుండవచ్చు కదా.., అని అనిపిస్తుంది. అవును. మనిషికి ఉనికి తన భాష కాదా..? కులమే ఉనికా..? కులం పేరు చెప్పుకుని హెచ్చులకు పోయినట్లు, భాష తో విర్రవీగలేమా..? పలు భాషల భారతం మనది. మరి కులాలూ ఎక్కువేనే..? భాషల్లో ప్రత్యేకతలుంటాయి; కులాల్లో అంతరాలు వుంటాయి. ఒక భాష పక్కన మరొక భాష వుంచి పోల్చవచ్చు; కానీ కులాలను (వాటి మూలాలయిన వర్ణాలనయినా సరే!) ఒక దాని కింద ఒక దానిని వుంచాల్సిందే.

అయితే భాష పేరుతో రొమ్మువిరుచుకునే దేశంలో లేరా..? ఇలా అనగానే చటుక్కున మనకి బెంగాలీలూ, తమిళులూ స్ఫురణకు వస్తారు. వారికి తమ భాష గర్వకారణంగా వుంటుందని మనం నమ్మేస్తాం. మనకి కాస్త దిగులుగా కూడా వుంటుంది కూడా. ‘చూడండి. ఒక బెంగాలీ మరొక బెంగాలీని ఎలా ప్రోత్సహిస్తాడో..! మనమూ ఉన్నాం. ఒక తెలుగు వాణ్ణి చూసి మరొక తెలుగు వాడు ఓర్వ లేడు.’ ఇది మనకు అలవాటయిన ఫిర్యాదు.

ఈ ఫిర్యాదునే పరిశోధనకు తీసుకుని ఎవరయినా ముందుకు వెళ్ళితే బాగుంటుంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులలో భాష ముందు ఏదో మేరకు కులం చిన్నబోయివుండాలి. ప్రజలు తమను ‘ఉనికి’నీ లేదా ‘అస్తిత్వాన్ని’ చెప్పటానికి భాషను ముందు పెడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో లాగానే ఈ రెండు రాష్ట్రాల్లోనూ కుల వ్యవస్థ పీఠం వేసుకునే కూర్చున్నది అనుమానం లేదు. సంస్కరణోద్యమానికి బెంగాలూ, ద్రావిడోద్యమానికి తమిళనాడూ పుట్టినిళ్ళుగా వున్నవన్నది జగమెరిగిన రహస్యం. ఈ రెండు ఉద్యమాలూ సాంఘిక జీవితంలోకి తమ తమ మాతృభాషల ద్వారా చొచ్చుకుపోయాయి. ఎలా, ఏమేరకు ప్రభావితం చేసాయీ అని నిరూపించవచ్చు కానీ, ఇక్కడ అప్రస్తుతం.

అందుకే రాష్ట్రం మారినప్పుడు ‘మీరెవరు?’ అని అంటే వారు ‘నేను బెంగాలీయుణ్ణి’ ‘నేను తమిళుణ్ణి’ అని వారు చెప్పగలిగినట్లుగా మనతెలుగు వాళ్ళు మాత్రం ‘నేను తెలుగువాణ్ని’ అని చెప్పలేరు. రాష్ట్రమేమిటి.. దేశం దాటినా చెప్పలేం. కావాలంటే తెలుగు పేరిట సంఘాలు పెట్టుకుంటాం కానీ, మళ్ళీ అవి కూడా ‘కులాన్ని’ పట్టియిచ్చేవిగానే వుంటాయి. అమెరికాలోని అత్యధిక తెలుగు సంఘాలు ఇందుకు ‘సుదూర’ ఉదాహరణలు.

‘మీరెవరు?’ అనడిగినప్పుడు నిజంగా ‘నేనెవర్ని?’ అని కులాల్ని మరచి ప్రశ్నించుకుంటే సమాధానం సుస్పష్టమవుతుంది. ‘నేను ఏది అనుభూతి చెందుతానో.. నేను ఏది ఆలోచిస్తానో.. అదే నేను’. ఆలోచనలూ, అనుభూతులూ అధిక శాతం పక్కవారితో పంచుకొనేవే. పంచుకునే కొద్దీ అవి పరిణతి చెందుతుంటాయి. అందుకు భాషే వాహిక. మాట్లాడగా మాట్లాడగా ఈ భాషే ఎలా అనుభూతి చెందాలో, ఎలా ఆలోచించాలో కూడా నేర్పుతుంది. అలా భావాలకు మాతృక అవుతుంది కూడా. అంటే తొలుత నేను ఎత్తుకున్న భాషే, నన్ను ఎత్తుకుంటుంది. అనేక అనేక సమూహాల, అనేకానేక తరాల అనుభూతులనూ, ఆలోచనలూ మోసిన భాష నాకు విలాసమవుతుంది; ఉనికి అవుతుంది.

‘నీచు’ పంపకం!

భావాలను పంచుకోవటానికే భాష ఉందనుకున్నప్పుడు.. ఎలా పంచుకుంటున్నామన్న ప్రశ్న కూడా పొడుచుకొస్తుంది. సంపద పంపిణీలో అసమానతలున్నట్టే , భాష పంపకంలోనూ వ్యత్యాసాలుంటాయా? పక్క వారితో పంచుకున్నంతవరకూ భాష ప్రజాస్వామికంగా వుంటుంది. హెచ్చు తగ్గులున్నచోట పై వారు కిందవారితో పంచుకోవాల్సి వుంటుంది. అప్పుడది పంపిణీ కాకుండా, పెత్తనమవుతుంది. పై వాళ్ళ భాషలో పెత్తందారీ భావజాలం అనివార్యంగా వుంటుంది. ‘తెల్ల’వాడి భాష ‘నలుపు’ని అలాగే చిన్న బుచ్చింది. ‘నిజమే కాబోలు తెలుపే అందానికీ, జ్ఞానానికీ చిహ్నం కాబోలు’ అని నల్లవాడు కూడా నమ్మేశాడు. మనం మాత్రం తక్కువ తిన్నామా..? ‘మాంసాహారాన్ని’ శాకాహారం తినే ‘పై’ వర్ణాల వారు ‘నీచు’ అనలేదూ..? అలా అనేస్తే ఆ మాటను ‘కింది’ వర్ణాల వారు శంకించకుండా స్వీకరించేశారు. భాష మహిమ! ‘ మా అయ్యకు నీచు(సు) లేకుండా ముద్ద దిగదు’ అని మురిపెంగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

భాష లో భావజాలం వుంటుంది. ఈ వాక్యాన్ని ఒప్పుకుంటే, భాషలో రాజకీయాలు వుంటాయిని కూడా ఒప్పుకుని తీరాలి. రాజకీయానుభూతులూ, రాజకీయానుభవాలూ భాష ద్వారానే బట్వాడా అవుతాయని కూడా నమ్మాలి. రాజకీయాలకు పార్శ్వాలు రెండు: ఆధిపత్యం, ధిక్కారం. రాజకీయాలే సాహిత్యచరిత్రలో అధ్యాయాలను మారుస్తుంటాయి. పురాణ,ప్రబంధ, భావ, అభ్యుదయ, విప్లవ సాహిత్య యుగాలు అలా వచ్చిన యుగాలే. ఇంకా చెప్పాలంటే ఒక ఆధిపత్యం మీద మరొకటి తిరుగుబాటుగా వచ్చింది. ఏ యుగానికా అభివ్యక్తి. తెలుగు భాష ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తూ వచ్చింది.

‘ఈతిట్టుకు తెలుగేదీ..?’

గత సహస్రాబ్ది 70వ దశకం వరకూ వచ్చిన ఉద్యమరాజకీయాలకు సరిపోయిన భాష, 80వ దశకం వచ్చేసరికి సరిపోలేదు. అంత వరకూ తెలుగు భాషతో సాముగరిడీలు చేసిన కవులూ, రచయితలూ తమ వ్యక్తీకరణలకు భాష సరిపోవటం లేదని ఫిర్యాదు చేశారు. అంతవరకూ వ్యక్తి సమూహంగా మారిన వైనమే. అది అభ్యుదయం కావచ్చు; విప్లవం కావచ్చు. కానీ సమూహం నుంచి వ్యక్తి తలెత్తి చూడటం 80వ దశకం నుంచే మొదలయింది. దీనినే ‘అస్తిత్వ రాజకీయం’ అన్నారు. స్త్రీ తొట్టతొలుత ఈ రాజకీయం మాట్లాడింది. శత్రువులేనిదే అస్తిత్వం వుండదు. పురుషుడూ, పురుషాధిక్యభావ జాలమే స్త్రీకి శత్రువులు. ‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు’ అని తన శత్రువుల్ని పోల్చుకున్నారు స్త్రీ వాద కవి సావిత్రి. ఆగ్రహవ్యక్తీకరణ ‘అస్తిత్వ రాజకీయాని’కి ఆయవు. కానీ ఏ తిట్టు తిట్టినా ఆది తిరిగి స్త్రీకే తగులుతోంది. తల్లినో, చెల్లినో, అక్కనో, ఆలినో నిందించకుండా ఒక్క తిట్టూ లేదు. భాషలోని పురుషాధిక్యం వారికి కొత్తగా అర్థం కావటం ఆరంభమయింది. ‘మొగుడు’ అంటే ‘స్వేచ్ఛా భక్షకుడనీ’ ‘పెళ్ళి’ అంటే ‘పెద్ద శిక్ష’ అనీ వారు తెంపు చేశారు. ఇప్పటి ‘వివాహ వ్యవస్థ’లోని అప్రజాస్వామిక వైఖరిని తప్పు పట్టారు. అంతెందుకు? గౌరవ వాచకాల్లోనూ స్త్రీ ‘వైవాహిక స్థితి’ ని గుర్తు చెయ్యటాన్ని నిరసించారు. (పెళ్ళయినా, కాకపోయినా పురుషుడి పేరు ముందు ‘శ్రీ’ పెట్టవచ్చు. కానీ స్త్రీకి అలా కాదు. పెళ్ళి కాకుంటే ‘కుమారి’ అనీ, పెళ్ళయితే ‘శ్రీమతి’ అనీ ఆమె పెళ్ళిగుట్టును రట్టు చేస్తారు.) తమ ‘లైంగిక బానిసత్వం’ మీద నిప్పులు చెరిగారు. ‘శరీర రాజకీయాల’ పై నిస్సంకోచంగా మాట్లాడారు. అవాక్కయిన మగ రచయితలు కొందరు ఈ వ్యక్తీకరణలను ‘నీలి కవిత్వం’గా ఆడిపోసుకున్నారు.

ఈ దశకంలో తెలుగు భాషకు ‘జెండర్‌’ పరీక్షే కాదు; ‘మత’ పరీక్ష కూడా వచ్చింది. మైనారిటీ మత విశ్వాసం కలిగిన వారు తెలుగు భాషలోని మెజారిటీ మతాధిపత్యాన్ని ప్రశ్నించారు. మహాకవుల్నే తప్పు పట్టారు. శ్రీశ్రీ ఎప్పుడో వెటకారంగా ‘కసాయిబు’ అనే ప్రయోగం చేశారు. ఇలా అనటాన్ని కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌ నిలదీశారు. ‘మ్లేఛ్ఛుడు’ ‘కిరస్తానీయుడు’ వంటివి కూడా ఇలాంటి అధిక్షేప వాచకాలే.

ఎనభయ్యవ దశకం చివరి పాదంలోనూ , 90వ దశకమంతటానూ తెలుగులో దళిత సాహిత్యం తిష్ట వేసింది. అప్పుడు కూడా దళితుల భాష మీద పెద్ద చర్చే జరిగింది. స్త్రీవాదులు అభ్యంతరం చెప్పిన (స్త్రీని కించపరిచే ) తిట్లను యధేఛ్చగా కొందరు దళిత కవులు వాడారు. అదేమంటే తాముద్దేశించింది అగ్రవర్ణ స్త్రీలనన్నారు.(దళిత స్పృహకు మూల విరాట్టయిన అంబేద్కర్‌ అగ్రవర్ణ స్త్రీని కులవ్యవస్థలో బందీగా చూశారు కానీ, శత్రువుగా ప్రకటించలేదు.) ఇది కూడా కవిత్వమేనా- అంటే ‘దిగంబర కవులు’ వాడలేదా? అన్నారు. శత్రువు ఆయుధాలుగా వున్న పదాలతోనే, శత్రువుని కూల్చగలమా- అంటే ఇదే సందర్భంగా స్త్రీవాదులు విమర్శకు దిగారు. నిజమే కదా..! మనదేశంలో పితృస్వామ్యం, వర్ణవ్యవస్థా పెనవేసుకుని వున్నాయి. కాబట్టి స్త్రీలకూ, దళితులకూ ఈ రెండూ ఉమ్మడి శత్రువులు అవుతాయి. కాబట్టి శత్రువు ‘తిట్లు’ గా వాడే వాటిల్లో ఇద్దరినీ కించపరిచేవే వుంటాయి. ఇప్పటికీ యథాలాపంగా ‘చండాలుడా!’ అని ‘అదేమిటి? చండాలంగా..!’ అని అనే తిట్లు వాడస్తూ వుంటారు. ‘నీచ కులమని’ ఎత్తిపొడవటానికి ఉపయోగించే పదాలివి. ఇదే తిట్టును దళితుడు వాడితే తనని తాను తిట్టుకున్నట్లు వుంటుంది. అందుకే నాలాంటి వాళ్ళు ‘మెడకు ముంత కట్టినట్లు నోటికి బూతు కట్టకండి!’ హెచ్చరించారు.

కొత్త సహస్రాబ్ది తొలి దశంకంలోనే తెలంగాణలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం ఊపందుకుంది. మళ్ళీ భాష ప్రస్తావన వచ్చింది. తెలంగాణ భాషను చిన్నబుచ్చుతున్నారూ -అని ఆందోళనలు మొదలయ్యా యి. వీరు సాహిత్యకారుల ప్రయోగాల మీద కాకుండా, ఎక్కువగా మాధ్యమల్లో వాడే భాష మీద ఎక్కు పెట్టారు. ఆంధ్ర ప్రాంతంలో రెండు మూడు జిల్లాల వాళ్ళు వాడే భాషనే ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారు? ‘వచ్చాడు’ అనటానికి బదులు ‘అచ్చిండు’ అంటే ఎందుకు నవ్వులాటగా వుంది? సినిమాల్లో ప్రతినాయకుల(విలన్ల)చేతనే తెలంగాణ యాసను ఎందుకు మాట్లాడిస్తున్నారు? దాంతో ఈ ఉద్యమ కాలంలోనే విడుదలయి ‘దూకుడు’ చిత్రంలో హీరో( మహేష్‌ బాబు) చేతనే తెలంగాణ యాస మాట్లాడించారు. ఇటీవల విడుదలయిన ‘ఫిదా’ చిత్రంలో అయితే నాయిక(హీరోయిన్‌) చేతనే తెలంగాణ యాసనీ, మాండలీకాల్నీ మాట్లాడించారు. ఇక తెలంగాణ సాహిత్యమంటేనే తెలంగాణ మాండలీకంలో రాయాలనే స్థాయికి తెలంగాణ కవులూ, రచయితలూ వచ్చేశారు. పాట సరే- వచన కవిత, కథ, నవలలు సైతం తెలంగాణ యాసలోనే నడిచాయి. దినపత్రికలలో వార్తల శీర్షికలు మారిపోయాయి. తెలంగాణ టీవీ చానెళ్ళలో అయితే ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది.

అలా 1980 నుంచి నేటి వరకూ నడిచిన అస్తిత్వ ఉద్యమాల శకంలో కవులూ, రచయితలూ భాషలోని ఆధిపత్య స్వభావాన్ని ప్రశ్నించారు.

ఉత్పత్తి నుంచే వ్యుత్పత్తి!

పద సృష్టికీ వస్తూత్పత్తకీ సంబంధం వుంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘వ్యుత్పత్తి’కీ ‘ఉత్పత్తి’కీ సంబంధం వుంటుంది. ఉత్పత్తి అంటే వస్తు సేవల సృష్టి, రవాణా ఇవన్నీ వస్తాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇంగ్లీషులోకి ఎన్నో కొత్త జాతీయాలు వచ్చి చేరిపోయాయి.(షశీస్త్ర ఱఅ ్‌ష్ట్రవ షష్ట్రవవశ్రీ అనే మాట అలాంటిదే) యంత్రాలతో తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఓడలలో తరలించే వారేమో.. నావికాయానంలో వుండే పలు పదాలు భాషలో కీలక స్థానం సంపాదించాయి (ఉదా: ్‌ఱజూ శీట ్‌ష్ట్రవ ఱషవపవతీస్త్ర). బ్రిటిష్‌ వలస పాలకులు పారిశ్రామిక ఉత్పత్తులను పరిచయం చేశాక కూడా భారతీయ భాషల్లో వ్యవసాయ, వ్యవసాధారిత వృత్తుల నుంచే పదసృష్టి జరుగుతూ వచ్చింది.

అసలు ఈ వృత్తుల వెలుపల దళితులూ, స్త్రీలూ ఉండిపోయారు. ఒకరు ఊరు వెలుపల ఉండిపోతే, ఇంకొకరు వంటింట్లో ఉండిపోయారు. అందుచేత ఉత్పత్తి నుంచి ఆవిర్భవించే పదజాలానికి వారు దూరంగా పెరిగారు. భాష వెలుపల వుండిపోయిన వారిని సంబోధించే ‘నిందావాచకాల’ సృష్టితో కూడా వారికి ప్రమేయం లేదు. ‘వెధవా’ ‘ముండా’ అని అంటున్నప్పుడు కూడా ఈ పదాలు ప్రత్యేకించి తమను కించపరచటానికి మాత్రమే సృష్టించారన్న ఎరుక కూడా ముందు వారికి కలిగేది కాదు. దాంతో తాము చేసినదే పదసృష్టి అని ‘వ్యవసాయ, అనుబంధ వృత్తుల’తో సంబంధం వున్నవారు మాత్రమే కాదు, తెలుగు సమాజం మొత్తం భావించింది.

దాంతో, ఎప్పుడయితే స్త్రీలు, దళితులు తమ ఉనికిని చెప్పే ప్రయత్నం చేశారో, ఉన్న పదాలు వారికి సరిపోలేదని తొలుత భావించారు. కానీ వారూ ఇంతకు మించి పదసృష్టి చేసిన అంశాన్ని తర్వాత తర్వాత గ్రహించారు. సమాజం భావిస్తున్నట్లు వారు ఉత్పత్తికి దూరంగా లేరు. అసలు పారిశ్రామిక ఉత్పత్తి అంటే ఏమిటి? ముడిసరుకును, సంపూర్ణమైన వస్తువుగా మార్చటమే కదా! అలాంటి పిండిని రొట్టె చేస్తే అది ఉత్పత్తి కాదా..! స్త్రీవాద కవి అన్నట్లు ‘గరిట తిప్పటమే’ స్త్రీల ప్రధాన వృత్తిగా చేశారు కానీ, దానిని ఉత్పత్తి గా గుర్తించలేదు. అందుకే ఇప్పటికీ స్త్రీల శ్రమ ‘స్థూల జాతీయోత్పత్తి'(జి.డి.పి)లో భాగం కాలేక పోయింది. ఇంత ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఎంత పదసృష్టి జరుగుతుందీ..! పదసృష్టే కాదు.. వారి సంభాషణల్లో ఎన్నెన్ని సొంపైన వాక్యాలు వచ్చిపడుతుంటాయి? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్త్రీల సంభాషణలను వినే కదా అంత పఠనీయమైన తెలుగును తన కథల్లో రాశారు? చలం మాత్రం తక్కువ తిన్నారా? ఉరలు, పరుగులు తీసే వాక్యసృష్టి చేశారు. ఎక్కడనుంచి తెచ్చారు స్త్రీల జీవితాల నుంచే. తర్వాత తర్వాత పురుషులు చేపట్టే అన్ని వృత్తులూ వారు చేపట్టారు. ఇప్పుడు ‘ప్రధాన స్రవంతి’గా ఊరేగుతున్న తమ భాషను చూడగలిగారు.

దళితుల్ని ఊరువెలుపలికీ, వ్యసాయోత్పత్తి వెలుపలకీ నెట్టేసి మూడువేల యేళ్ళయ్యాక, వారిలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఇది తేలాలంటే వారు ఏ వృత్తులు చేశారు? ఇతరులు భయపడే (తలారి, కాటికావరి వంటి) వృత్తులూ, ఇతరులు చీదరించుకునే (మృత కళేబరాలను శుభ్రం చెయ్యటం వగైరా) వృత్తులు మాత్రమే చేసినట్లు పైకి కనిపిస్తారు. జాగ్రత్తగా కనిపిస్తే ఊరులో వుండే సమస్త వృత్తుల్నీ వారు నిర్వహించారు. ఒక రకంగా చెప్పాలంటే గ్రామ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వాడ ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకున్నారు. కాబట్టే ఇన్నేళ్ళు సజీవంగా వుండగలిగారు. తమ మంచాలు తామే చేసుకుని, తమ కంచాలు తామే సమకూర్చుకుని, తమ శిరోజాలను తామే కత్తిరించుకుని, తమ స్థాయిలో తమ పంటలు తామే పండించుకుని, తమ పెళ్ళిళ్ళకు తామే పౌరోహిత్యం వహించుకుని, తమ బాజా భజంత్రీలు తామే మోగించుకున్నారు. ఇతర కులాల వారికి తమ కులవృత్తి మాత్రమే వస్తే, వీరికి పలు వృత్తుల మీద పట్టు వుంటుంది. ప్రత్యామ్నాయ వస్తు సృష్టి వున్నప్పుడు, ప్రత్యామ్నాయ పదసృష్టి తప్పకుండా వుంటుంది. ఈ పదసంపదతో కావ్యసృష్టి జరుగుతుంటే తెలుగు సాహిత్యం ఎంత పరిపుష్టం అవుతుందో చెప్పలేం. దానికి తోడు వీరు ప్రధాన పారిశ్రామికోత్పత్తిలో భాగమయ్యారు. పట్టణాలకు, నగరాలకు వలసపోయి విద్యావంతులయ్యారు. ఆఫ్రో-ఆమెరికన్‌ రచయితల ఇంగ్లీషుకీ, శ్వేత జాతీయులైన అమెరికన్ల ఇంగ్లీషుకీ తేడా వుంటుంది. ఆఫ్రో-అమెరికన రచయితల ఆంగ్ల పద సృష్టి అమెరికన్‌ సాహిత్యానికే కొత్త సొబగులు అద్దింది. ఆంగ్ల వాక్యమూ అంతే. ఒకనాటి అలెక్స్‌ హెయిలీ (రూట్స్‌) నుంచి ఇప్పటి టోనీ మారిసన్‌( సాంగ్‌ ఆఫ్‌ సొలోమోన్‌) వరకూ ఎన్నో కొత్త జాతీయాలనూ, పదాలనూ భాషలో ప్రవేశపెట్టారు. తెలుగులో దళిత రచయితలు కూడా ఆ దారిలోనే పయనించి, భవిష్యత్తులో కొత్త సంపదనిస్తారు.

ఇన్ని వర్గాల,వర్ణాల, సమూహాల పద సృష్టిని గౌరవించి, స్వీకరించిన నాడు తెలుగు ప్రజాస్వామికమవుతుంది. తమ ఉనికిని ప్రకటించటానికి ప్రయత్నించిన సమూహాలే, తెలుగు భాష అస్తిత్వాన్ని గుర్తుచేశాయి. తమకు భాష సరిపోవటంలేదని ఫిర్యాదు చేసిన వారు తామూ పదసృష్టికర్తలమే అని గ్రహించారు. ఇదే ప్రయాణం ఇలాగే కొనసాగితే.. తెలుగు భాష కొత్త కాంతులీనుతుంది.

అప్పుడు తెలుగు రాష్ట్రాల వెలుపల ‘మీరెవరు?’ అని ప్రశ్నిస్తే (ఫలానా కులం వాళ్ళం అని కాకుండా) ‘తెలుగు వాళ్ళం’ అని గర్వంగా చెప్పుకోగలం. భాష విషయంలో బెంగాలీల్లాగా, తమిళుల్లాగా ఎంతో కొంత విర్రవీగగలం!

-సతీష్‌ చందర్‌

(15 అక్టోబరు 2017 వ తేదీన నేను తాపీధర్మారావు పురస్కారం అందుకున్న సందర్భంగా చేసిన ప్రసంగానికి వ్యాసరూపం.)

5 comments for “తెలుగు లో తిట్టు లేదా? తెలుగు మీద పట్టు లేదా?

  1. భాష విస్తృతి వైవిధ్యం వ్యక్తీకరణలో చురుకుదనం ఆ యా సామాజిక వర్గాల జీవన ఆర్థిక సామాజిక సాంస్కృతిక సంబంధమైన స్థాయీ భేదాల సమష్టి సంపద. అన్ని వర్గాల సమగ్ర అభివ్యక్తి స్వరూపమే భాష !
    – Prof P C Narasimha Reddy

  2. ఎంత బాగా చెప్పారో.., “జగమెరిగిన రహాస్యం” వ్యాసం మొదలుపెట్టిన తీరు అద్భుతం.ఆ రోజు విన్నదానికంటే చదువుతుంటే ఇంకా వివరంగా బావుంది..రెండవ పేరాలో భాష పరిణామక్రమం చాలా బాగా చెప్పారు సార్ ..ధన్యోస్మి

  3. తెలుగు వా(డ)చకం లో
    మాంచి పట్టున్న దిట్ట … యమ్మెస్.చందర్ సర్!!!
    ధన్యవాదములు … జై భీమ్!!!

Leave a Reply