దాసరి ‘మళ్ళీ పుట్టాడు’!

ప్రేక్షకుడికి కనపడని వాడూ, వినపడని వాడూ దర్శకుడు. ఈ నిర్వచనం దాసరి నారాయణరావు వచ్చేంత వరకే. తర్వాత మారిపోయింది. దర్శకుడు క.వి( కనిపించి వినిపించేవాడు) అయిపోయాడు. దర్శకుడిగా వుంటూ కూడా ఎక్కడో అక్కడ చిన్న పాత్రలోనయినా ఆయన తళుక్కున మెరిసేవారు. సినిమా అయ్యాక కూడా చిన్న ‘లెక్చరిచ్చి’ కానీ, వదలే వారు కారు. నాయకానాయికలు కలసిపోయి, పెళ్ళిపీటలెక్కాక అక్షింతలు వేసేదే అంతకు ముందు ‘శుభం’ కార్డు కింద లెక్క. కానీ దాసరి సినిమాలో, ఆయన ‘అక్షింతలు’ వేశాకే ఈ కార్డు పడేది. (అవినీతిమీదో, అన్యాయం మీదో, అలక్ష్యం మీదో ప్రేక్షకులకు ఆ మాత్రం ‘అక్షింతలు’ తప్పనిసరి). అలా దర్శకుణ్ణి తెర మీదకూ, పోస్టర్‌ పైకీ తెచ్చారు దాసరి. అప్పట్లో (డెభ్భయిలలో) సినిమా పోస్టరు పైన దర్శకుడి పేరు రావటం తమిళంలో కె.బాలచందర్‌కీ, తెలుగు నాట దాసరికి మాత్రమే సాధ్యమయ్యింది. బాలంచందర్‌ పేరు ‘ఫిలిం’ బొమ్మ మీద వుంటే, దాసరి పేరు మేఘం మీద వుండేది.

‘స్టార్ డమ్‘ హీరోల అబ్బసొత్తు కాదు..!

ఏ రంగంలోనైనా ఆద్యుడే, ఆరాధ్యుడవుతాడు. పేరొందిన హీరోలతో సినిమాలు తీసిన రాజమౌళి, ఒక హాస్యనటుణ్ణి(సునీల్‌)ని హీరోగా పెట్టి (2010లో) ‘మర్యాద రామన్న’ తీసిఅదే స్థాయి హిట్‌ ఇచ్చి, ‘స్టార్‌డమ్‌’ హీరోకే కాదు దర్శకుడికీ వుంటుందని నిరూపించినప్పుడు విమర్శకులు సరికొత్తగా నివ్వెరపోయారు. కానీ ఈ పనిని, అంతకు ముందు నాలుగు దశాబ్దాల క్రితమే దాసరి దర్శకుడిగా తన తొలిచిత్రంతోనే చేశారు. అప్పటి హాస్యనటుడు రాజబాబును హీరోగా పెట్టి ‘తాత మనవడు’ సినిమా తీసి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చారు.

‘ది లాస్ట్  ఎంపరర్’ దర్శకుడి ఆశ్చర్యం

ఒకటా, రెండా.. ఏకంగా 140 చిత్రాలకు దర్శకత్వం వహించి, ప్రపంచ రికార్డు (లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు) సృష్టించారు. రాశి పెరిగితే వాసి తగ్గుతుంటారు. కొంత వరకూ దాసరి విషయంలోనూ నిజం కావచ్చు. కానీ ఇన్ని తీసినా, ఆయన చురుకుగా వున్నంత కాలమూ ప్రతీ ట్రెండ్‌కూ  మూలకర్త అవుతూ వుండేవారు. ఒక సారి, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో పాల్గొనటానికి, ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, బెట్రులూసీ (‘లాస్ట్‌ ఎంపరర్‌’ ఫేమ్‌) హైదరాబాద్‌ వచ్చారు. ఆయనతో పాటు దాసరి వేదిక పంచుకొన్నప్పుడు- ఇన్ని సినిమాలు దాసరి ఎలా తీయగలిగారని- ముక్కు మీద వేలేసుకున్నారు. ఆప్పటికే బెట్రూలూసీ వృధ్ధుడు. తీసినసినిమాలు ఏడో, ఎనిమిదో వున్నాయి.. అంతే. అఫ్‌కోర్స్‌.. అవన్నీ అద్భుత దృశ్యకావ్యాలు. అది వేరే విషయం.

అన్నీ ‘ఉదయాలే’.. అస్తమయాలు లేవు..!

పత్రికారచన అంటేనే పరిశోధన- అని నిరూపించిన పత్రిక ‘ఉదయం’. రెండు ఎడిషన్లతో వచ్చి, అగ్రస్థానం లో వున్న ‘ఈనాడు’కు గట్టి పోటీ ఇచ్చింది. తొట్టతొలిగా పత్రికారచయితలకు అవధుల్లేని స్వాతంత్య్రాన్నిచ్చింది ‘ఉదయమే’. ప్రచురణ కర్తగా ఈ పత్రికను అందించింది దాసరే. తెలుగు పత్రికా రంగంలో నేడు పేరొందిన సంపాదకుల్ని వేళ్ళ మీద లెక్కించవచ్చు. వారందరికీ జనని దాసరి సృష్టించిన ఉదయం.

ఆయన ఆద్యత్వం సినిమా, పత్రికా రంగాలకే ఆగిపోతే, దాసరికి ఇంతటి ఇమేజ్‌ వచ్చేది కాదు. రాజకీయ రంగంలోనూ ఆయన తన ప్రయోగాలు తాను చేశారు.

బాట రాజకీయం.. మాట హాస్యం

దాసరి సృష్టిలో రెండు అంశాలు అంతస్సూత్రంగా వుంటాయి. ఒకటి రాజకీయం, మరొకటి హాస్యం. కళావిమర్శ భాషలో చెప్పాలంటే, మొదటిది సారం; రెండవది రూపం. ఆధిపత్యాలను ప్రశ్నించటమే ఆయన రాజకీయం. కులం, వర్గం, జెండర్‌- ఏ రూపంలో వ్యక్తులూ, వ్యవస్థలూ అహంకారాన్ని ప్రదర్శించినా, అయిన ఒంటికాలి మీద లేచేవారు. అలాంటి శత్రుత్వాన్ని చల్లారిపోకుండా పదిల పరచుకునేవారు. ఈ కోపానికి ఆయన హాస్యాన్ని అద్దే వారు. ‘మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’ కు మాటలు రాసినప్పుడే, ఈ వడుపు ప్రదర్శించారు. తమిళంలో ఈ పనిని చో ఎస్‌. రామస్వామి మాత్రమే చెయ్యగలిగేవారు. రాజకీయాల్ని అధిక్షేపించే తీరు దాసరి ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’తో పరాకాష్టకు చేరింది. ఆ పాత్రను ఆయనే పోషించారు. ఏడుకొండలు ముఖ్యమంత్రి అయ్యాక, శాఖల కేటాయింపు వస్తుంది. ఆర్థిక శాఖ, హోం శాఖ, రెవెన్యూ శాఖ… ఇలా అన్ని శాఖలూ తనవే అంటాడు. ‘మరి విద్యాశాఖో..?’ అని తన సెక్రటరీ అన్నప్పుడు ‘అది మాత్రం మనది కాదు’ అంటాడు. కారణం ఏడుకొండలకు చదువులేదు. అలాగే అసంతృప్తి వుందన్న ప్రతీ వాడికీ ఉప ముఖ్యమంత్రి పదవిని ఉదారంగా కట్టబెట్టేస్తాడు.( నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులూ.. ఆయా సామాజిక వర్గాల్లో ని అసంతృప్తిని చల్లార్చటానికి ఇద్దరేసి ఉప ముఖ్యమంత్రుల్ని పెట్టుకున్నారు కదా… అలాగన్న మాట.)

‘సామాజిక న్యాయాని‘కి తెలుగు శంఖారావం

ఇలా మొదలయిన ఆయన రాజకీయ అధిక్షేపం కులాన్ని ప్రశ్నించిన ‘ఒసేయ్‌ రాములమ్మా’ తో పరాకాష్టకు చేరింది. ‘ఊరు చివర పాకలేంది.. పేరు చివర తోకలేంది..?’ అనే పాటకు స్వయంగా ఆయనే అభినయం చేశారు. ఈ చిత్రం తర్వాత ఆయనలో ప్రతక్షంగా రాజకీయాల్లో పాల్గొనాలనే కాంక్ష బాగా పెరిగింది. అణగారిన వర్గాల, కులాల సమీకరణతో ‘సామాజిక న్యాయం’ అనే నినాదాన్ని ఆయన ముందుకు తెచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి కూడా దాసరికి మద్దతు ఇచ్చారు. ‘తెలుగు తల్లి’ పేరు మీద రాజకీయ వేదికను సన్నధ్ధం చేయాలనుకున్నారు. కారణాలు పైకి వెల్లడి కాలేదు కానీ, తర్వాత ఆయన కాంగ్రెస్‌ లో చేరారు. ఎం.పి అయ్యారు. తర్వాత కేంద్ర మంత్రిగా కూడా కాగలిగారు. ఇదే ‘సామాజిక న్యాయాన్ని’ తర్వాత చిరంజీవి చేపట్టి ‘ప్రజారాజ్యం’ పెట్టి, తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ‘సామాజిక న్యాయం’ గురించి మాట్లాడుతూనే వున్నారు.

జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టగల అరుదైన ప్రతిభ దాసరికి సొంతం. దానికి తోడు ఆయన్ని ‘భోళా శంకరుడి ‘ గా మార్చిన పారదర్శకత. ఈ రెంటితో ఆయన జన హృదయాన్ని గెలుచుకున్నాడు. దాసరికి ‘ఉదయాల’తో తప్పు అస్తమయాలతో పనిలేదు. ‘ఇక వుంటా’నని వెళ్ళిపోయారు. ఎప్పటికీ జనం మధ్య ఉండిపోయారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ అని ఆయనే అన్నట్లుగా ‘దాసరి మళ్ళీ పుట్టాడు.

-సతీష్ చందర్

2జూన్ 2017

2 comments for “దాసరి ‘మళ్ళీ పుట్టాడు’!

  1. Really good Tribute. ప్రేక్షకులకు ఆ మాత్రం ‘అక్షింతలు’ తప్పనిసరి… Yes. Some indirect punishment indeed in those days. రాజబాబును హీరోగా పెట్టి ‘తాత మనవడు’ ..700% correct. రాశి పెరిగితే వాసి తగ్గుతుంటారు. కొంత వరకూ దాసరి విషయంలోనూ నిజం కావచ్చు. True. Some movies are quite meaningless. In total… TOP DIRECTOR.

Leave a Reply