దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎలక్షన్ ‘డేమే’జర్ ( ఎలక్షన్ మేనేజ్ మెంట్ అన్నది పాత మాట. ఎలక్షన్ ‘డేమే’జ్ మెంట్ అన్నది కొత్త బాట. గోవా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఇన్ చార్జ్‌గా నేను ఇదే అవలంభించాను. మన వల్ల శత్రుపక్షం ‘డేమేజ్’ అవ్వాలి. నిజానికి ఈ (2017) ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ సర్కారును ఏర్పాటు చేసింది. ఎవరితో.. కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. బీజేపీ పరువు పోయింది కదా… అదీ మన ‘డేమే’జ్ మెంట్… అర్థం చేసుకోరూ….!?)
వయసు : వయసు తో పని ఏముంది? పెళ్ళికయినా… పదవి కయినా..! ( కానీ అదేమిటో ఈ మధ్య ఒక్కొక్క పదవీ ఊడుతోంది. గోవా ఇన్ చార్జ్‌గా నన్ను తప్పించారు. తొందర్లో పార్టీ అధిష్ఠానం కూడా తెలుసుకుంటుంది.)
ముద్దు పేర్లు : ‘ట్విట్టీ’జయ్ సింగ్ ( మనసులో ఏది దాచుకోను. ఏ ‘ఫీట్’ చేసినా, వెంటనే ‘ట్వీట్’ చేసేస్తాను.) ‘అగ్గీ’ రాజా( అసలు ‘దిగ్గీ రాజా’ను. కానీ ఏ మధ్య ఎక్కడ వెళ్ళితే ‘అగ్గి’ రాజేస్తున్నాను. తెలంగాణ పోలీసులే నకిలీ వెబ్ సైట్‌తో యువకుల్ని ఉగ్రవాదం పైపు ఆకర్షిస్తున్నారని కామెంట్ చేసి ‘అగ్గి’ పెట్టాను. నా మీద కేసు పెట్టారు.) దిగ్వివాద సింగ్ ( ఏ సమస్యలోనైనా సరే… మనం వేలుపెడితే వివాదం కావల్సిందే.)
విద్యార్హతలు :బ్యాచిలర్ ఆఫ్ మానేజింగ్ ఫెయిల్యూర్స్.( వైఫల్య నిర్వహణలో పట్ట భద్రుణ్ణి) కాబట్టే రాహుల్ గాంధీకి మార్గదర్శకుణ్ణి కాగలిగాను. నా శిక్షణలో ఆయన్ని ‘ఉక్కు మనిషి’ గా మార్చేశాను. కాబట్టే.. ఓటమి తర్వాత, ఓటమి తర్వాత ఓటమి… ఎన్ని ఓటములొచ్చినా చెక్కు చెదరకుండా వున్నాడు. మొన్న జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓటమిని అసలు లెక్కే చెయ్యలేదు.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: రూపంలోనే వృధ్ధుణ్ణి… సారంలో యువకుణ్ణే. ( తలలు బోడులయిన తలపులు బోడులవునా…ఇలా అని తెలుగులోనే కాదు.. ప్రపంచ భాషల్లోని కవులు కూడా అన్నారు.) అందుకే ఎక్కడయినా కయ్యానికి కాలుదువ్వుతాను.
రెండు: ఎవరి మీద ఎంతటి ఆరోపణ చెయ్యటానికయినా వెనకాడను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్‌కు ‘వ్యాపం’ స్కాములో ప్రమేయం వుందని అనెయ్యలేదూ…!?
సిధ్ధాంతం : ఒకప్పుడూ మాకూ సిద్ధాంతం వుండేది. మా పార్టీ పెట్టి నూరేళ్ళయి పోయింది. అందుకే మాలో కొద్ది మందికి మాత్రమే గుర్తు వుంటుంది.
వృత్తి : రెండు వృత్తులు. ఒకటి : వోటు తో ఎదుర్కోవటం. రెండు: నోటితో ఎదుర్కోవటం. అధికారంలో లేనప్పుడు రెండో వృత్తే ఆదుకుంటుంది.
హాబీలు :1. నిత్యమూ మీడియాలో కనిపించటం.( మా ఇంట్లో నో మీడియా ప్రతినిథి వున్నారు.)
2. బోరు కొట్టినప్పుడెల్లా తెలుగు రాష్ట్రాలను సందర్శించటం.( కాంగ్రెస్ ఒక చోట శాసన సభ వెలుపల వున్నా లోపల వున్నట్లూ, ఇంకొక చోట లోపల వున్నా వెలుపల వున్నట్లూ వుంటుంది. అందుకే నాకు ఆసక్తి కరంగా వుంటుంది.)
అనుభవం : పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను. ( కానీ ఎన్నడూ ముఖ్యమంత్రి చేయని రాహుల్ ని ప్రధాని మంత్రిగా చేసే బాధ్యత చేపట్టాను. ఇంతకు మించిన అనుభవం ఏముంటుంది?)
మిత్రులు :పార్టీలో వున్నవారందరూ మిత్రులని నమ్మాను. గోవాలో ఏమయింది. కళ్ళ ముందు ఫిరాయించేశారు.
శత్రువులు : అదే మా బాధ. చాలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని కనీసం శత్రువుగా కూడా చూడటం లేదు.
మిత్రశత్రువులు : కాంగ్రెస్ లో కౌగలించుకుని ఆహ్వానించే నేతల్లో అధికశాతం వీరే.
వేదాంతం : అనుభవించు .. ‘రాజా’!
జీవిత ధ్యేయం : రాహుల్ ని కనీసం ఒక్క రోజయినా ప్రధాన మంత్రిగా చూడటం.
-సతీష్ చందర్
Your dream will become a reality on one day