‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది!

‘కిరణ’ం ప్రకాశించటం లేదు. రాష్ట్రంలో ఇది వార్త కాదు.

ఎందుకు ప్రకాశించటం లేదు? ఇదీ ప్రశ్న.

ఈ ప్రశ్నకు పలువురూ ఇచ్చే జవాబు వేరు. పార్టీ అధిష్ఠానం వెతుక్కుంటున్న సమాధానం వేరు.

కిరణంలో కాంతి తక్కువయిందని అందరూ అంటారు.

కానీ, పార్టీ హైకమాండ్‌ అలా అనదు. చుట్టూ చీకటి తక్కువయిందీ- అని అంటుంది.

అందుకే కాబోలు- ‘కిరణ్‌’ చుట్టూ చీకట్లు పెంచుతోంది.

కిరణ్‌ మంత్రి వర్గంలో ‘కళంకితుల’ శాతం పెరుగుతున్న కొద్దీ, ఆయన ఉనికి పెరుగుతుందన్నది హైకమాండ్‌ భావన కాబోలు. ఇంతవరకూ మిణుకు మిణుకు మని దిగులుగా మెరుస్తున్న ‘కిరణం’ ఇప్పటికయినా ప్రకాశవంతంగా కనిపించక పోతుందా-అని ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చిగురంత ఆశ కాబోలు.

ఎందుకంటే, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తర్వాత కేబినెట్‌ లో ‘పెద్ద దిక్కు’గా వున్న వ్యక్తి పేరు దర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఆయన పేరు వాన్‌ పిక్‌ భూముల కేసు ఛార్జి షీటులో చోటు చేసుకుంది. అలాంటి ‘ధర్మానే’ చిన్న బోతే, ‘కిరణ్‌’ కనిపించక పోతారా?

పాపం! అధిష్ఠానం పిచ్చిగానీ, కిరణ్‌కు అంత అప్పనంగా గ్లామర్‌ వచ్చి పడుతుందా? ఇప్పటికే ఎంతో చేశారు.

కిరణ్‌ నెత్తి మీద కిలో రూపాయి బియ్యం మూట పెట్టారు. ‘రూపాయి’ విలువ అర్థరూపాయికి పడిపోయింది కానీ, ఆయన విలువ పెరగలేదు.

మహిళలకిచ్చే రుణాల మీద ఉన్న ‘పావలా’ వడ్డీ కూడా తీసేశారు. పథకం దివాళా తీసింది కానీ, ఆయనకు ఐదు పైసల ఖ్యాతి అదనంగా రాలేదు.

అలాంటిది ఆయన చుట్టూ వున్న మంత్రుల ముఖాలకు మసి పులిమితే, కిరణ్‌ ముఖం ప్రకాశిస్తుందా?

వైయస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం, వైయస్‌ పేరును ఏమి చెయ్యాలి? అన్నది కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వచ్చిన సమస్య. (నిజానికి, అది తెచ్చుకున్న సమస్య కూడా కావచ్చు.) ముందుగానే వైయస్‌ తనయుడు జగన్మోహన రెడ్డిని పక్కన పెట్టటానికి పథకం వేసుకున్నారు. జగన్‌ను కాదన్నాక, వైయస్‌ పేరును కాంగ్రెస్‌ ఏమి చేసుకోవాలి?

మొదటి అవకాశం: వైయస్‌ పేరును వాడుకోవాలి

రెండవ అవకాశం: వైయస్‌ ఖ్యాతిని మాత్రమే వాడుకుని, ‘అపఖ్యాతి’ ఏదయినా వుంటే జగన్‌ ఖాతాలో వెయ్యాలి.

మూడవ అవకాశం: వైయస్‌ ఖ్యాతీ వద్దు, అపఖ్యాతీ వద్దు.

నాల్గవ అవకాశం: వైయస్‌ను శత్రువుగా చూడాలి.

చిత్రమేమిటంటే- రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఈ నాలుగు అవకాశాలనూ, నాలుగు దశలు గా ఉపయోగించుకోవాలని చూసింది. కానీ, నాలుగు దశల్లోనూ విఫలమయ్యింది. నష్టం అంతటితో ఆగినా బాగుండేది. ఈ నాలుగు దశల్లోనూ ప్రత్యర్థిగా వెలుపల వుంచిన జగన్‌ శక్తిని నాలుగింతలు చేసింది. దాంతో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జగన్‌ తన తడాకా చూపించారు.

ఎంత గింజుకున్నా ,వైయస్‌ హయాంలో కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన జనాకర్షక పథకాలు- వైయస్‌ పేరుతోనే వుండిపోయాయి. తద్వారా వచ్చిన ‘జనాకర్షణ’ వైయస్‌ తర్వాత జగన్‌ కే సంక్రమించింది. కానీ కాంగ్రెస్‌కు రాలేదు.

పోనీ, వైయస్‌ హయాంలో జరిగినట్లుగా సిబిఐ తవ్వి తీసిన ‘అవినీతి’ నంతా జగన్‌కేసే కడదామనుకుని ఆశించారు. కానీ అది తిరిగి, తిరిగి వచ్చి అరడజను మంత్రుల పీకకు చుట్టుకోనున్నది. అందులో తొలివరసలో తల పెట్టిన వారు ఇద్దరు. ఒకరు: మోపిదేవి వెంకటరమణ, రెండు: ధర్మాన ప్రసాద రావు. వేరే (ఫెరా) కేసులో శిక్ష పడ్డ పార్థ సారథి ఈ జాబితాలోకి రాక పోయినా, మరో నలుగురు మంత్రులు ఈ వరసలో వున్నారు.

ఇప్పుడు ధర్మాన కేసులో ‘ధర్మ’ సంకటం వచ్చిపడింది.

వాన్‌పిక్‌ భూములు కేసు అభియోగ పత్రంలో తన పేరున్నదని తెలిసిన వెంటనే ధర్మాన తన మంత్రి వదవికి రాజీనామా చేశారు. ధర్మానను ‘ప్రాసిక్యూట్‌’ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతిని సిబిఐ అనుమతి కోరింది. అనుమతి ఇవ్వాల్సింది సాంకేతింగా గవర్నర్‌ అయినప్పటికీ, ముఖ్యమంత్రి సలహా మేరకే ఆయన వ్యవహరించాలి. అనుమతి ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పేస్తే, వెంటనే రాజీనామా కూడా ఆమోదించాల్సి వస్తుంది. ధర్మాన రాజీనామాను ఆమోదించేస్తే, తర్వాత ‘కళంకితులు’గా పేరొందిన మరో నలుగురు మంత్రులు (సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాలక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణలు) భవిష్యత్తులో రాజీనామా అనబడే పదవీ త్యాగానికి సిధ్ధపడాలి. ఈ ‘ధర్మ’ సంకటం నుంచి బయిట పడటానికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆయనకు అత్యంత సన్నిహితులూ జుట్టు పీక్కుంటున్నారు.

యుధ్ధం యుధ్ధమే.

మొదలు పెట్టటం వరకే మన చేతుల్లో వుంటుంది.

మధ్యలోకి వచ్చాక, వైదొలగుతాను- అంటే వీలుపడదు. ముందుకు వెళ్ళటం ఎంత ప్రమాదకరమో, అర్థాంతరంగా యుధ్ధ విరమణ చెయ్యటం కూడా అంతే ప్రమాదకరం.

ఇప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి అదే అయ్యింది.

ఒక్క సారి సిబిఐ రంగంలోకి దిగి జగన్‌ మీద పెట్టిన ‘క్విడ్‌ ప్రోకో’ అభియోగాలను విచారించటం మొదలు పెట్టినప్పుడు, ఈ విచారణ ప్రక్రియ జగన్‌నూ, ఆయన వెంట వున్న అనుయాయులనూ మాత్రమే ఇబ్బందుల పాలు చేస్తుందని భావించి వుంటారు.

కానీ ప్రక్రియ ప్రతాపం అక్కడితో ఆగ లేదు. కాంగ్రెస్‌ మంత్రుల వరకూ వచ్చేసింది.

తమకు కష్టంగా వుంది కదా- అని సగంలో యుధ్ధం ఆపేస్తానంటే వీలవుతుందా?

కాళ్ళు తెగినా, చేతులు తెగినా, కడకు శిరస్సులే తెగిపోయినా యుధ్ధం చెయ్యాల్సిందే.

కానీ అందుకే మంత్రుల్లో చాలా మంది సిధ్ధంగా లేరు. కాబట్టే, ధర్మాన రాజీనామాను అంగీకరించ కూడదని అంత బిగ్గరగా అరుస్తున్నారు.

సమస్య ధర్మానతో ముగిసి పోలేదు. ఎందుకంటే అది కేవలం ధర్మానతోనే ప్రారంభం కాలేదు. అయితే ఇలా యుధ్దం మధ్యలో ‘శరణు, శరణు’ అని అరుస్తున్న వారి కేకల్ని పార్టీ అధిష్ఠానం పట్టించుకుంటుందా? అంటే చెప్పలేం.

ప్రత్యర్థి జగనే జైల్లో వుండి, యుధ్ధాన్ని కొనసాగిస్తున్నారు. సీమాంధ్రను దాటి తెలంగాణ వరకూ తనకున్న జనబలాన్ని ప్రదర్శించుకుంటూ వెళ్తున్నారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ద్వారా తన స్వరాన్ని వారికి చేరుస్తున్నారు.

ఇలాంటి స్థితిలో కాంగ్రెస్‌ హఠాత్తుగా ‘తెల్ల జెండా’ ఎత్తేస్తే, కాంగ్రెస్‌ ఇంతవరకూ చేసిన యుధ్ధమంతా వృధా అయి పోదూ? ఇది ఢిల్లీ పెద్దల ఆలోచన.

కాబట్టి ధర్మాన కేసులో ప్రాసిక్యూషన్‌ కు అనుమతివ్వటంలో తాత్కాలిక తాత్సారం చేసినా, అంతిమంగా అనుమతించమనే హైకమాండ్‌ చెప్పవచ్చు. ఇలా చెయ్యటం వల్ల కాంగ్రెస్‌ రెండు ప్రయోజనాలను ఆశిస్తుంది.

ఒకటి: కాంగ్రెస్‌ మంత్రుల మీద కూడా అభియోగాలు మోపటానికి వెనకాడలేదంటే, సిబిఐ స్వతంత్ర సంస్థేననీ, అది అందరూ అంటున్నట్టుగా ‘కాంగ్రెస్‌ బ్యూర్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ కాదనీ నిరూపించుకోవచ్చు.

రెండు: అవినీతిని ఏరి వేసే విషయంలో తమకు పర తమ బేధాలుండవనీ చెప్పవచ్చు.

అంటే, దాదాపు మంత్రి మండలిలో నాలుగో వంతు కూలిపోతుంది – అని తెలిసి కూడా పార్టీ అధిష్ఠానం తెగిస్తుందన్న మాట.

ఇప్పుడు పార్టీ అధిష్ఠానం, కాంగ్రెస్‌ లో రాష్ట్ర మంత్రులు పోయినా పట్టించుకోదు. శాసన సభ్యులు కుప్ప కూలిపోయినా పట్టించుకోదు. 2014 ఎన్నికల నాటికి అత్యధిక మైన పార్లమెంటు స్థానాలను గెలచుకోవటమే కాంగ్రెస ధ్యేయం.

ఇందు కోసం ఏ ఎత్తులకయినా సిధ్ధమే, ఏ పొత్తులకయినా సిధ్ధమే. ఆగర్భ శత్రువుతో చేతులు కలిపేయ మన్నా కాంగ్రెస్‌ సిధ్ధంగానే వుంటుంది. అధిష్ఠానానికి ఇప్పుడు కంటి ముందు కనపడుతున్న ఏకైక లక్ష్యం: రాహుల్‌ గాంధీని ప్రధాని చెయ్యటం.

ఈ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటమనేది అధిష్ఠానం తొలి ప్రాధమ్యం కాదు. కేవలం రాహుల్‌ కు మద్దతు కూడటమే ప్రధమ ప్రాధమ్యం.

అందుకోసం, నేడు విషం కక్కిన వారితో కూడా పొత్తు పెట్టుకోవటానికి కాంగ్రెస్‌ సిధ్ధంగా వుంది. ఈ ఆలోచనలు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు సహజంగానే నిరాశను కలిగిస్తాయి.అందుకే, ధర్మాన రాజీనామాను ఆమోదించ వద్దనీ, ప్రాసిక్యూషన్‌ కు అనుమతించ వద్దనీ ఈ మంత్రులు డిమాండ్లు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో వున్న కాంగ్రెస్‌ నేతలకూ, ఢిల్లీలో వున్న కాంగ్రెస్‌ పెద్దలకూ మధ్య ఇలాంటి స్పర్థలు ఇక ముందు ముందు మరిన్ని ఎదురు కావచ్చు. కానీ అంతిమంగా రాష్ట్ర కాంగ్రెస్‌ మీద ఢిల్లీ కాంగ్రెసే గెలుస్తుంది.

-సతీష్‌ చందర్‌
17-8-12

1 comment for “‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది!

Leave a Reply