‘నాకు ప్రజాస్వామ్యాన్ని చూపించవూ?’

‘ఇదేం అన్యాయం గురూ? న్యాయాన్ని కూడా అమ్మేస్తారా?’

ఇదే ప్రశ్న. కోపం వచ్చిన వాళ్ళూ, కోపం రాని వాళ్ళూ, కోపం వచ్చినట్టు నటించిన వాళ్ళూ వేసేస్తున్నారు. అంతే కాదు, న్యాయమాట్లాడేవారూ, న్యాయం మాట్లాడని వారూ, రెండూ కానీ వాళ్ళూ కూడా వేసేస్తున్నారు.

ఇదేం విడ్డూరం ‘బెయిలు’కు లంచమా?

ప్రశ్న వెయ్యరూ మరి? దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం వుందన్న భ్రమలో కోట్లాది మంది బతికేస్తున్నారు. చూసిన వారెవ్వరూ లేరు. పెళ్ళినాడు పురోహితుడు చూడమన్న అరంధతీ నక్షత్రాన్ని ఏ పెళ్ళికొడుకు చూశాడు కనక?

కానీ ప్రజాస్వామ్యాన్ని నిజంగా చూడాలనుకున్న వాళ్ళకి ఒక సదుపాయం వుంది. దానికి నాలుగు ముఖాలు. ఒక్కొక్క ముఖాన్ని ఒక్కొక్కసారే చూడగలం. నాలుగుముఖాలతో ప్రజాస్వామ్యం నిజంగా దర్శనమిచ్చేస్తే, తట్టుకునే శక్తి ఎవరకీ వుండదు. నాలుగు ముఖాలూ నాలుగు చోట్ల వుంటాయి.

ఎవరన్నా సికింద్రాబాద్‌ స్టేషన్‌ రైలు దిగి ఆటో దగ్గరకి వచ్చి ‘ప్రజాస్వామ్యం’ దగ్గరికి తీసుకు వెళ్ళ మంటే, ఆటో అబ్బాయి నాలుగు అడ్రసులకి తిప్పాల్సి వుంటుంది.

ముందు అసెంబ్లీ దగ్గరకు తెస్తాడు. ‘ఇక్కడొక ముఖం వుంటుంది. లోపలకి వెళ్ళి చూడొచ్చు. కానీ స్వంత రిస్కు మీద వెళ్ళాలి.మహానటులుంటారు. చూసి తట్టుకోగలగాలి’ అంటాడు. సందర్శకుడు ధైర్యవంతుడయితే చూసి వస్తాడు.

ఆ తర్వాత సెక్రటేరియట్‌ కు తెస్తాడు.’ఇక్కడ ప్రజస్వామ్యం రెండు ముఖం వుంటుంది. కాకపోతే పెండింగు ఫైళ్ళ మధ్య ఇరుక్కుని వుంటుంది. తొలగించి చూద్దామని ప్రయత్నిస్తే, మీద పడతాయి. ప్రాణహాని వుంటుంది’ అని మళ్లీ అక్కడకు తెస్తాడు.

తర్వాత కోర్టుకు తెస్తాడు. ‘అక్కడందరూ నల్ల కోట్లతో వుంటారు. ప్రజాస్వామ్యం మూడో ముఖం ఒకే సారి చూపించారు. కనీసం నూటొక్క వాయిదాలకు తిరగాలి.’

ఇక తన తోచిన మీడియా చానెల్‌కు తెస్తాడు. ‘ఇది మీడియా నాలుగో ముఖం. వెంటనే కనిపిస్తుంది. చూడు కానీ పలకరించకు. ఎడాపెడా మోతెక్కించేస్తుంది- ఒక చెవిలో నిజాలతో, మరొక చెవిలో అబధ్ధాలతో. బుర్రతిరిగి చస్తావ్‌.’ అని సందర్శన పూర్తి చేసి మీటరు చూపిస్తాడు. ఆరువందల రూపాయిలు అవుతుంది. అయితేనేం? ప్రజాస్వామ్యాన్ని చూసానన్న తృప్తితో ఆ సందర్శకుడు మళ్ళీ అదే సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చి రైలైక్కి వెళ్ళిపోతాడు.

ఇకమీదట ప్రజాస్వామ్యాన్ని చూడటానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆటో ఖర్చు కూడా అంత కాదు. ఒక వందరూపాయిలతో పోతుంది. ఎలాగంటారా?

సందర్శకుడు ఎప్పట్లాగానే సికింద్రాబాద్‌లో దిగీ దిగగానే, ఆటో ఎక్కి,- ‘ప్రజాస్వామ్యం’ దగ్గరకి పోనియ్‌ అంటాడు. అతడు రయ్‌ మని తెచ్చి ఒక చోట ఆపుతాడు. ‘ప్రజాస్వామ్యం వచ్చేసింది. దిగు’ అంటాడు ఆటోవాలా.

‘ఎలాకనిపిస్తున్నాను నేను? చదువుకోలేదనుకుంటున్నావా? అక్కడ ఏమి రాసుందో చూడు’ అని బెదరిస్తాడు సందర్శకుడు.

‘నువ్వే చదువు?’ అంటాడు ఆటోవాలా.

‘చంచల్‌ గూడా జైలు’ అంటాడు సందర్శకుడు.

‘ఇదే మరి ప్రజాస్వామ్యం వుండేది. దానికున్న నాలుగు ముఖాల్ని ఇక్కడ కలిపి చూడవచ్చు. ఎమ్మెల్యేలూ, మంత్రులూ(శాసన శాఖ), ఐయ్యేఎస్‌ అధికారులూ( కార్యనిర్వాహక శాఖ), లాయర్లూ,జడ్జిలూ( న్యాయశాఖ) , మీడియాధిపతులు( మీడియా) కలసి ఒకే చోట దర్శనమిస్తారు. అదృష్టవంతుడివి.ములాకత్‌ పెట్టుకో’ అని తన వందా తాను తీసుకుని బయిటే వెయిట్‌ చేస్తాడు. జీవితంలో ప్రజాస్వామ్యం విశ్వరూపం చూసిన సందర్శకుడు మళ్ళీ వచ్చి ఆటో ఎక్కుతాడు.

‘దర్శనం బాగా అయ్యిందా?’ అడుగుతాడు ఆటో వాలా?

‘ బాగానే అయింది కానీ, ప్రజాస్వామ్యం జెలులోపల వుండిపోతే, బయిట ఏమున్నట్లూ…?’

‘ఇంకెవరూ? నువ్వూ, నేనూ. అంటే ప్రజలు’ ఆటోవాలా జవాబు.

‘అసలు వీళ్ళని జైలుకు ఎవరు పంపినట్టూ?’ సందర్శకుడు నోరు వెళ్ళబెట్టి మరీ అడిగాడు.

‘ఇంకెవ్వరూ? నువ్వూ, నేనూ. అంటే ప్రజలు.’ ఆటోవాలా పుటుక్కున తేల్చేస్తాడు.

ఆటో రిక్షా కదూల్తూనే వుంటుంది. మళ్ళీ ఆటో వాలాయే కలగ చేసుకుంటాడు.

‘ఎలక్షనప్పుడు నేను ఆటో తీయను. నాకు అయిదొందల రూపాయిలూ, ఒక బీరూ, ఒక బిర్యానీ ఇంటికి ఫ్రీగా వచ్చేస్తాయి. పనొక్కటే వెళ్ళి వోటు వేసి రావటం.’ అంటాడు.

‘అలా చేసే,్త ప్రజస్వామ్యం జెల్లోకి వెళ్ళిపోతుందా?’

‘వెళ్ళకుండా వుంటుందా? ఒక్కో వోటునే వెయ్యి రూపాయిలు కొన్న నాడే మనకి అర్థం కావాలి. వీడు ఎన్నికయ్యాక దేన్నయినా కొనేస్తాడని. ప్రజాస్వామ్యంలో వుండే నాలుగు ముఖాల్ని టోకున కొన్నా కొనేస్తాడని. లేదా దేన్నయినా అమ్మేస్తాడని. ఏం డౌటా?”

‘నువ్వు చెప్పే మాటల మీద నాకిప్పుడిప్పుడే నమ్మకం కుదురుతోంది.’ అంటాడు సందర్శకుడు.

రైల్వే స్టేషన్‌ కు చేరువవుతాడు.

జైల్లో ప్రజాస్వామ్యాన్ని దర్శించుకున్న సందర్శకుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఆటో దిగుతాడు. దిగేముందు ఆటో వాలాను చూస్తూ… ‘మనకి ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలట్రీ పాలనే బెస్టు’ అంటాడు.

ఆటో పగలబడి నవ్వుతూ ‘ అక్కడ నిన్నటిదాకా ఆర్మీ చీఫ్‌ గా వున్నాయనకే పద్నాలుగు కోట్లు లంచమివ్వ బోయారట. బేరం తెచ్చింది మాజీ సైనికకాధేరేనట’ అని తేల్చేశాడు.

సందర్శకుడు దారి మరచి పోయి ‘ఇంతకీ నేను ఏ రైలు ఎక్కాలి?’ అని అడుగుతాడు.

-సతీష్‌ చందర్‌

1 comment for “‘నాకు ప్రజాస్వామ్యాన్ని చూపించవూ?’

Leave a Reply