మా అప్పలకొండ మాత్రం ముప్ఫైఏళ్ళు దాటిన తరువాత మొదటిసారిగా పుట్టాడు. వాడి పుట్టినరోజును పండుగగా జరుపుకోవడం ఇదే మొదటిసారి. కారణం వాడు ఉద్యోగం నిమిత్తం రెండేళ్ళు దుబాయిలో ఉండిరావడం.
కేకును కోస్తానంటాడు. ఆహ్వాన పత్రిక కూడా అచ్చువేయించాడు. వాడే వచ్చి స్వయంగా పిలిచాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పేరు చూసి, ఎవరో ఉత్తరాది మిత్రుడనుకునేవాణ్ణి. ”ఇట్లు మీ- కె. అప్పల్” అని రాసుకున్నాడు. నాకు తెలసి అప్పలకొండ పుట్టిన రోజు వాడికే తెలియదు. స్కూల్లో వేసినది నిజమైన పుట్టినతేదీ కాదు. ”ఓ అల్లప్పుడు యుద్ధంవొచ్చింది చూడండి, అప్పుడు పుట్టాడు ఈడు” అని వాళ్ళ నాన్న చెబితే, స్కూలు మాస్టారు కాస్సేపు శూన్యంలోకి చూసి ”చైనా యుద్ధమా, పాకిస్తాన్ యుద్ధమా! ఎందుకైనా మంచిది నాలుగేళ్ళు తగ్గించి వేస్తాను” అని ఔదార్యంతో అప్పలకొండ వయస్సు మీద డిస్కౌంట్ ప్రకటించారు.
దుబాయి వెళ్ళొచ్చాక అప్పలకొండ గుడిసె తీసి డాబా వేశాడు. నూరు గుడిసెల మధ్య ఒక డాబా- ‘ఈఫిల్ టవర్’లా ఉంది.
అప్పలకొండకి ఆరో తరగతి చదివే నాటికే పెళ్ళి చేసేశారు. ఇంకా చదువెందుకని, వాడూ వాళ్ళ ఆవిడా చెట్టాపట్టాలు వేసుకుని పొలం పనులకు వెళ్ళారు. వాళ్ళ ‘పంట’ వెంటనే పండి ఒక అబ్బాయీ, అమ్మాయీ.
ఎప్పుడూ సైకిల్ మీదే వచ్చేవాడు. మా ఇంటి ముందుకొచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతుంటే నేను వెళ్ళి సైకిల్ పట్టుకునేవాణ్ణి. అప్పుడు వాడు దిగేవాడు. వాడి సైకిల్‌కి అన్నీ ఉండేవి. ఒక్క బ్రేకులు తప్ప.
అలాంటి అప్పలకొండ హీరోహోండా మీద వచ్చి తనంతట తాను దిగి నాకు ఆహ్వానం ఇస్తే- ఎంత ముచ్చటయ్యిందో! పైగా నాకు దుబాయి నుంచి తెచ్చిన సెంటు సీసా కూడా ఇచ్చాడు.
ఇదంతా చూసిన మా ఆవిడకి హఠాత్తుగా నా అసమర్థత గుర్తుకొచ్చింది. ”మీరు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేను” అని ప్రతి రోజూ అనే మా ఆవిడ, ”మీరు కూడా ఒక ఏడాది పాటు దుబాయిలో ఉండి రాకూడదూ?” అని మాట మార్చింది.
మా ఆవిడకి నా భవిష్యత్తు మీద అంత ఆశ ఉంటే, ఆమె భవిష్యత్తు మీద నాకు ఆశ ఉండదూ…?
”ఒక్క సెంటు సీసాకే మాట మార్చగలిగిన మా ఆవిడను ఎన్నికల్లో ఎందుకు నిలబెట్టకూడదూ…?” అనిపించింది. ఆవిడ ‘సెంటు’మెంటును కాస్సేపు పక్కన పెట్టి, అప్పలకొండ ‘పుట్టినరోజు’ పండగకి వెళ్ళాం.
కొవ్వొత్తుల్ని ఆర్పివేసి, క్యాబేజీని తరిగినట్టు కేకుని తరిగి పారేశాడు. కేకు ముక్కల్ని, కూతురికీ, కొడుక్కి పెట్టాడు. నన్ను కూడా పిలిచి నాకూ పెట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు.
”మా చెల్లాయి నోరు తీపి చెయ్యవా?” అని అడిగాను వాళ్ళ ఆవిడను ఉద్దేశించి. ఆమె తలుపుచాటు నుంచే వరండాలో జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తోంది.
”నీకు తెలుసు కదా! దానికి సాంప్రదాయాలు ఎక్కువ. నలుగురి కంట్లో పడటం ఇష్టం ఉండదు” అన్నాడు. ఆ మాటకి నేనూ, మా ఆవిడ అవాక్కయ్యాం.
”చక్కగా ఆలూమగలు కలిసి పొలం పనులు చేసుకున్న వీళ్ళకి కొత్తగా ఈ ఘోషా ఏమిటబ్బా?” అనుకున్నాం. అందరూ వెళ్ళిపోయాక నన్నూ, మా ఆవిడనీ ఇంటి లోపలికి తీసుకువెళ్ళి- వాళ్ళ అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాడు. ”దీనికి మంచి సంబంధం చూడు” అన్నాడు.
‘అప్పుడే పెళ్ళెందుకు?’ అన్నాను.
‘ప్రేమలో పడిందిలే’.
”ఎవరితో?”
”నా మేనల్లుడు కిష్టిగాడితో.”
”మరింకేం? చేసెయ్యొచ్చు కదా!” అన్నాను.
”చేస్తానన్నా, లక్ష రూపాయల కట్నం కూడా ఇస్తానన్నా.”
”మరేమన్నాడు?”
”నాకు లేదేంటీ ఎదవ డబ్బూ! నీ పిల్లనియ్యి చాలు” అన్నాడు.
”ఇంకేం మరి! కట్నం ఖర్చు కూడా తప్పిందిగా!” తేల్చిపారేశాను.
”కట్నం లేకుండా పెళ్ళి చెయ్యటానికి- నేనేమన్నా అడుక్కు తింటున్నానా?” అప్పలకొండ ఆవేశంగా అన్నాడు.
నాకు తెలిసి అప్పలకొండ వాళ్ళ కుటుంబాల్లో ఇటువంటి వరకట్నపు గొడవలేమీ లేవు. నచ్చితే చాలు. పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు.
కానీ అప్పలకొండకి- బర్త్‌డే కేక్ లాగా, భార్యకి ఘోషా లాగా- వరకట్నం ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది.
అల్లుడేమో కట్నం తీసుకోనంటున్నాడు. ఇవ్వకుండా పెళ్ళి చేస్తే తన ‘లెవెల్’ యేంగానూ! అని, అప్పలకొండ ఫీలింగు.
నేనూ, మా ఆవిడా కలిసి- ఎలాగోలా అప్పలకొండ మేనల్లుణ్ణి కట్నం తీసుకునేలా ఒప్పించి పెళ్ళి జరిపించేశాం.
అప్పలకొండ ఇంకా రెండు రోజుల్లో బయలుదేరాలి. ఈ లోగా గల్ఫ్‌లో గొడవల్తో అతడి వీసా రద్దయ్యింది.
అప్పలకొండ గాలి తీసిన బుడగలా అయిపోయాడు. హీరోహోండా అమ్మేశాడు.
ఒకరోజు పాత అప్పలకొండలా సైకిల్ మీద వాళ్ళ ఆవిడను ఎక్కించుకొని వచ్చి ఎప్పటిలాగే మా ఇంటి ముందు కేకలు పెట్టాడు. నేనూ, మా ఆవిడ ఇద్దరమూ వెళ్ళి పట్టుకుంటే సైకిల్ దిగాడు.
”డాబా అమ్మకానికి పెట్టా!” కబుర్ల మధ్యలో చెప్పాడు.
”గల్ఫ్‌లో నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం పేరేమిటి?” అనడిగా.
”కార్లు కడగడం” అన్నాడు.
మా ఆవిడ ‘సెంటు’మెంటు వొదిలిపోయింది.
”సరేలే! నీ డాబా వేరేవాళ్ళు కొనడమెందుకు? నేనే కొంటాను” అని చెప్పి లక్ష రూపాయలు చేతిలో పెట్టాను. దాంతో- చిన్న కోళ్ళ ఫారం ప్రారంభించారు. ఆ లక్ష వాళ్ళ మేనల్లుడిచ్చిందే.
‘గరీబీ హఠావో'(పేదరికమా పారిపో!) అన్న మాటని మా అప్పలకొండ తిరగేసి అర్థం చేసుకున్నాడు. ‘గరీబోం హఠావో'(పేదలారా పారిపోండి) అనుకున్నాడు.
పుత్తడి అమ్మినా డబ్బు వస్తుంది. నెత్తురు అమ్ముకున్నా డబ్బు వస్తుంది.
డబ్బుతో దక్కే చిరు గౌరవానికి నెత్తురోడ్చాడు నా అప్పలకొండ!
-సతీష్ చందర్
(ఈ రచన ‘జనసందేశ్’ అనే పత్రికలో ‘చంద్రహాసం’ కాలమ్ కింద వెలువడింది. తర్వాత అదే పేరుతో వచ్చిన పుస్తకంలో కూడా వచ్చింది.)
adbhutham sir
Very good.
Chadive kodhi Inka Migili Poendhemo anna Feeling tho chadhivanu sir chaala bagundi Its realy intrested