పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!

చరిత్రంటే- పేరూ, ప్రతిష్ఠలు మాత్రమే కాదు; మచ్చలూ, బొట్లూ కూడా. చెరపటం అంత చిన్న విషయం కాదు. పుట్టు మచ్చంటే, పుట్టు మచ్చే. చచ్చినా చెరగదు. పచ్చ బొట్టూ అంతే. మోజు పడి పొడిపించుకున్నంత ‘వీజీ’ కాదు- చికాకు పడి చెరిపేసుకోవటానికి. ముళ్ళపూడి వెంకటరమణ (‘ముత్యాల ముగ్గు’ కోసం) రాసినట్టు, ‘సెరిత్ర.. ! సెరిపేత్తే సెరిగి పోదు, సింపేత్తే సిరిగి పోదు.’

ఈ రహస్యం మన రాష్ట్ర మంత్రులకు అర్థమయి నట్లు లేదు. అందుకే ‘గోడ మీద రాతల్ని’ చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం మీదా ‘రాజ’ ముద్ర వుండటానికి వీల్లేదు.(అదే లెండి. రాజశేఖర రెడ్డి ముద్ర.)- అంటూ ‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది. అది ఆషామాషీ పీఠం కాదు. మంత్రుల్లో పది మందితో ఏర్పడ్డ విశ్లేషణ పీఠం. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ చతికిల పడ్డ విషయం తెలిసిందే.( తెలుగుదేశం- అయితే వెల్లికిలా పడింది. దాని గొడవ దానిది లెండి.) తర్వాత కాంగ్రెస్‌ నేతలకు ‘అకాల’ జ్ఞానమొచ్చి పడింది.

‘మేమేల వైయస్‌ విధేయులను బహిష్కరించ వలె..? బహిష్కరించితి ఫో, యేల ఉప ఎన్నికలకు కాలుదువ్వ వలె..? దువ్వితిమి ఫో.. యేల జర్రున జారి, చతికిల పడవలె..? పడితిమిఫో..యేల జగన్‌ నవ్వ వలె…? హిస్సీ..!’ – అంటూ తలపట్టుకున్నారు.

అంతే. ఆఘమేఘాల మీద కమిటీ వేశారు. ఈ కమిటీ శోధించి, శోధించి ఒక బ్రహ్మ(బహిరంగ) రహస్యాన్ని తవ్వి తీసింది. ‘సొమ్మొకడి. సోకొకడిది’ లాగా, ‘పథకాలన్నీ కాంగ్రెస్‌వీ, పేరు మాత్రం రాజశేఖర రెడ్డిది’. ఇప్పుడేం చెయ్యాలి? పథకాలుంచి, పేరు చెరిపేయాలి. పథకాల లోగోల్లోంచి వైయస్‌ ఫోటో తొలగించాలి. గోడమీద ‘దేవదాసు- పార్వతి’ అని రాసుందనుకోండి. నచ్చని వాళ్ళెవరో వచ్చి, ‘పార్వతి’ ని చెరపేసి ఆ స్థానంలో ‘పంకజం’ అని రాస్తే ఎలావుంటుంది? చదివే వాళ్ళు ‘పంకజం’ అనే చదువుకుంటారు. అలాగే ఒక్కొక్క పథకానికీ, నేతకీ అలాంటి లంకె ఏర్పడుతుంది. ‘బియ్యం’ పథకం అనగానే ఎన్టీ రామారావే గుర్తుకొస్తారు. ఆయన అధికారంలో వుండగా బియ్యాని ‘కిలో రెండు రూపాయిల’కు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ఈ బియ్యాన్ని ఓ పది పైసలు తక్కువకే ( రు.1.90) ఇచ్చారు. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ బియ్యాన్ని ఏకంగా ‘రూపాయి’ కే ఇస్తున్నారు. కానీ, ఇప్పటికీ బియ్యమంటే ‘అన్నే’. మరెవరూ కారు. (ఎన్టీఆర్‌ చనిపోయినప్పుడు ‘తొణికిన పేదవాడి అన్నం గిన్నె’ అని ఒక దినపత్రిక పతాక శీర్షిక పెట్టింది.)

అలాగే పేదవారికి పక్కా ఇళ్లు అని అనగానే ‘ఇందిరా గాంధీ’యే గుర్తుకొస్తారు. అలాగే ‘ఉచిత విద్యుత్తు’ అన్నా, ‘ఆరోగ్యశ్రీ’ అన్నా, 108 అన్నా, పావలా వడ్డీ రుణాలన్నా- వైయస్‌ పేరే గుర్తుకొస్తుంది.

వీటి పేరు పక్కన ఎవరి పేరు రాసినా, వైయస్‌ అనే చదువుకుంటారు. నిజానికి ‘రాజీవ్‌ ఆరోగ్యశ్రీ’ అంటూ ముందు రాజీవ్‌ పేరే వుంటుంది, ఆయనా దానిని ‘వైయస్‌’ గానే చదువుకుంటున్నారు. ఇవన్నీ పేర్లు తెచ్చిన పథకాలు.

ఇవి కాకుండా ‘జల యజ్ఞం’, గనుల లీజు, భూముల ధారాదత్తం- ఇలాంటి వన్నీ వైయస్‌ హయాంలో జరిగినవే. ఇవి అపఖ్యాతి తెచ్చిన అంశాలు. అయితే కాంగ్రెస్‌ ఇప్పడు అపఖ్యాతి మొత్తాన్ని వైయస్‌ ఖాతాలో వేసి, ఖ్యాతిని తన ఖాతాలో వేసుకునేందుకు అష్ట కష్టాలు పడుతోంది. అందులో భాగమే ఈ ‘ధర్మాన’ విశ్లేషణలు.

ఇప్పుడు పథకాలన్నింటి మీదా ఇందిరమ్మ పేరే పెట్టాలన్నది- ఈ కమిటీ ఉద్దేశ్యం. ఫలితంగా వైయస్‌ పేరును రాష్ట్ర కాంగ్రెస్‌ నిఘంటువునుంచి తొలగించ వచ్చన్నది ఆంతర్యం. పాద యాత్ర(2003)కు ముందు వైయస్‌ పేరు చిన్నదే. అంతకు ముందు దశాబ్దమున్నర కాలంగా ఆయనొక ‘నిత్య అసమ్మతి నేత’. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులలో ఎవరితోనూ సయోధ్యలేదు. అలాంటిదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానమే, ఆయనను ప్రోత్సహించింది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించేసి ‘ఏ రాజ్యం తేవాలి?’ అన్న ప్రశ్న వచ్చినప్పుడు ‘సోనియా రాజ్యం తెస్తాం’ అంటే నప్పేలా లేదు. అందుకు సవాలక్ష కారణాలు. (అప్పటికే ఆమె మీద ‘ఇటలీ’ ముద్రలు వేశారు.) దాంతో రాజీవ్‌ కన్నా ముందుకు వెళ్ళి ‘ఇందిరమ్మ రాజ్యం తెస్తాం’ అని నినాదం ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా సరే,

అనుకోని జనాదరణ ఒక్కసారిగా ఆయన పేరుకే వచ్చిపడింది. ఎన్టీఆర్‌ తర్వాత అంతటి జనాకర్షణను పొందారు. దాంతో ఆయన ‘ఉచిత విద్యుత్తు’ అన్నా గొప్పగానే అనిపించింది. ఆ తర్వాత ఆయన ఏ పథకం ప్రకటించినా, ఆయన ఖాతాలోనే పడుతూ వచ్చింది. నిజానికి అవన్నీ కాంగ్రెస్‌ పథకాలే కావచ్చు. ‘పనికి ఆహార పథకం’ కేంద్రం దే కావచ్చు. దానిక్కూడా ‘వైయస్‌’ కే పేరు వచ్చింది. నిజానికి జనాకర్షక పథకాలు ‘తక్షణ ఉపశమనాని’కి తప్ప చికిత్సకు పనికి రావు. కానీ ‘వ్యక్తిపూజ’కు అలవాటు పడ్డ ప్రజలు ఈ రహస్యాన్ని గ్రహించ లేరు.

‘ఎమర్జన్సీ’ చీకటి రోజులను భారత ప్రజలకు చూపిన ‘ఇందిరమ్మ’ పేరును ఇంత ధైర్యంగా ఎందుకు పెట్టగలుగుతున్నారు? ప్రజలకు పక్కా ఇళ్ళు గుర్తున్నట్టుగా ప్రాథమిక హక్కుల్ని కోల్పోయిన స్పృహ వుండదు. ఇదే వివరణ వైయస్‌ కూ సరిపోతుంది. ‘క్విడ్‌ ప్రోకో’ పేరు మీద వేల కోట్లను వైయస్‌ ఆర్జించారన్న ఆరోపణలు, ఆయనకున్న జనాకర్షణ ముందు వీగిపోతాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌ చేతి మీద వైయస్‌ ఒక పచ్చ బొట్టుగానే ఎప్పటికీ మిగిలిపోతారు.

-సతీష్ చందర్
26-7-12

1 comment for “పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!

  1. ఆపరేషన్ సక్సెస్..పేషంట్ డెడ్.. బట్ పోస్ట్ మార్టెం రిపోర్ట్ ఎలాంగ్ విత్ డెత్ సరిఫికేట్ ఈజ్ నీడెడ్ టు క్రిమేట్ ద బాడీ. దట్ రిపొర్ట్ వజ్ ప్రిపేర్డ్ బై ఎ టీమ్ ఆఫ్ వూండెడ్ సోల్జెర్స్.
    రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఆగిపోయిన పెళ్ళికి భాజా భజంత్రీలన్నట్లు తయారైంది (అ)ధర్మాన కమిటీ.తమ తమ జిల్లాల్లో పార్టీని బతికించుకోలేని పది మంది మగ పురుషులంతా(మంత్రులు) 2014 ఎన్నికల్లో పార్టీ ఔట్ అని తేల్చేశారు.
    మహిళా సాధికారత గురించి, ఎన్నికల్లో 33 శాతం, స్థానికంలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ల గొంతులు చించుకునే కాంగ్రెస్ మంత్రుల సమన్వయ కమిటీలో ఒక్క మహిళకూ చోటివ్వలేదు. రోగం తెలుసు, రోగి చచ్చాడని తెలుసు. చస్తాడనీ తెలుసు, ఎలా చచ్చాడో ఇప్పుడు తెలుసుకున్నారు.

Leave a Reply