పాదుకా ‘ప్రచారా’భిషేకం!

చెప్పుల్లో కాళ్ళు పెట్టటమూ, తప్పుల్లో వేళ్ళు పెట్టటమూ చిన్న విషయాలు కావు. అయినా సరే, చిన్న పిల్లలకు ఈ రెండు పనులూ సరదా. చెయ్యకుండా వుండలేరు. నాన్న చెప్పుల్లోనో, నానమ్మ చెప్పుల్లోనో కాళ్ళు పెట్టటానికి ఉబలాటపడతారు. పెద్దచెప్పులూ, బుల్లి పాదాలూ..! ఇదో ఆట. ఈ ఆటే వారసత్వ రాజకీయం. మిగిలిన దేశాల మాట ఎలా వున్నా, మన దేశంలో ఈ ఆటకు డిమాండ్‌ ఎక్కువ. ఒకప్పుడు రాచరికమంటేనే రాజకీయం. వంశాంకురం – అనే వాడు శుంఠయినా, జ్ఞానయినా తండ్రి తర్వాత తండ్రి చెప్పుల్లో కాళ్ళు పెట్టేసి, సింహాసనం పట్టేసేవాడు. ఇంకొందరు తెలివయిన శుంఠలు కూడా వుండే వారు. తండ్రి బతికుండగానే ఆయన చెప్పుల మీద కన్నేసే వారు. తండ్రికి సుఖప్రదమైన జైలులో విశ్రాంతి కలుగచేసి తాము తండ్రి చెప్పుల్ని కాళ్ళు పెట్టేసి, రాజ్యాన్ని పాలించేసే వారు. ఈ చెప్పుల కోసం, ఈ కుర్చీ కోసం తండ్రులను కడతేర్చిన వారు కూడా వున్నట్టు చెబుతారు కానీ, అది వినటానికే కష్టంగా వుంటుంది.

రాచరికం పోయినా ఈ చెప్పులాట కొనసాగుతూనే వుంది. రాజుల్ని కొలిచే మనుషులు ప్రజాస్వామ్యం వచ్చాక తమ ‘సేవకుల’ను ప్రభువుల్లాగా చూసుకుంటున్నారు. మంత్రయినా, ముఖ్యమంత్రయినా, ప్రధానమంత్రయినా – ప్రజాస్వామ్యంలో ‘సేవకులే’ కదా! కానీ మన వాళ్ళు ఆ ‘సేవకుణ్ణే’ కాదు, ఆ ‘సేవకుడి’ కుటుంబాన్నీ, బంధుమిత్ర సపరివారాన్నీ ‘రాచకుటుంబీకుల్లా’ కొలుస్తారు. ‘సేవకుడి’ తర్వాత ఆ పోలికలు కొడుకులోనో, కూతురులోనో, మనవడిలోనో, మనవరాలిలోనో వెతుకుతారు. అందుకని, వారసులు కూడా ఈ ‘చెప్పులాట’ను ద్విగుణీకృత ఉత్సాహంతో ఆడేస్తుంటారు.

ఏ రాహుల్‌ గాంధీయో ‘రోడ్‌షో’కి వస్తే, చెట్లెక్కి చూసే వాళ్ళూ, పుట్లెక్కి చూసే వాళ్ళూ- ఏమంటుంటారు? ‘చూసావా? రాజీవ్‌ గాంధీలాగే వున్నాడు కదా!’ అని మురిసిపోతుంటారు. రాహుల్‌ గాంధీ కూడా ఏం చెయ్యాలి? రాజీవ్‌ గాంధీ వేసుకునే స్టయిల్‌లోనే ‘లాల్చీ పైజమా లాల్చీలే వేసుకోవాలి. మామూలు ఫ్యాంటూ, షర్టూ వేసుకుంటానంటే నడవదు. ‘వారసుణ్ణి’ వెతుక్కునే వాళ్ళు- నిరాశకు గురవుతారు. ఆమె సోదరి ప్రియాంక కయితే ఇంకా కష్టం. ఆమెలో ఆమె నాయనమ్మ ను చూస్తామంటారు జనం. దాంతో ప్రియాంక రెండు తరాల ముందు మనిషిని అనుకరించాలి. ఇందిరా గాంధీ ఏ నేత చీరకట్టారో, ఆ తరహా నేత చీరే కట్టాలి. హెయిర్‌ స్టయిల్‌ కూడా దాదాపు ఆమెనే గుర్తుకు తేవాలి. అక్కడతో అయిపోతుందా? ఇందిరమ్మ నడచినట్లు నడవాలి. ఎన్నికలప్పుడు ఇందిరమ్మ పేదల ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళను ఎలా పలకరించారో, అలాగే పలకరించాలి. ఒక్క సారి బామ్మ చెప్పుల్లో కాళ్ళు పెట్టాక , బామ్మ చెప్పు చేతల్లోనే నడవాలి.

దేశమొక్కటేనేమిటి? రాష్ట్రం మాత్రం తక్కువ తిందా? రాష్ట్ర ప్రజలకు ‘ముఖ్య’ ‘సేవకుడి’గా ముద్ర వేసుకున్న వైయస్‌ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత, ఆయన చెప్పుల్లో ఆయన తనయుడు వైయస్‌ జగన్మోహన రెడ్డి కాళ్ళు పెట్టేశారు. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆయన మాదిరి తెల్లపంచె, తెల్ల చొక్కా వేయలేదు. తన చారల చొక్కా తాను వేసుకున్నారు. కానీ ప్రసంగం మొదలుపెడితే చాలు, తండ్రి ఎలా దీర్ఘాలు తీస్తూ, సాగ దీస్తూ మాట్లాడే వారో అలాగే మాట్లాడే వారు. ‘రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నట్టే వుంది’ అని ఇదే జనం ఆయన చూడ్డానికి వచ్చారు. అక్కడితో ఆగలేదు, తండ్రి ఎలా తన కన్నా చిన్నవాళ్ళను తలమీదా, మెడమీదా చెయ్యివేసి చెయ్యి వేసి ‘వాత్యల్యపూరితం’గా పరామర్శించేవారో, అలాగే తన తండ్రి చనిపోయిన తర్వాత ఏళ్ళ తరపడి నిరవధికంగా దు:ఖిస్తున్న వారిని అలాగే ‘ఓదార్చారు’. కాకుంటే తన కన్నా పెద్దవాళ్ళను కూడా అదే తరహాలో దీవించారు. తప్పదు మరి. ఒక్క సారి తండ్రి చెప్పులు వేసుకున్నాక, చెప్పుల మాట తను వినాలి కానీ, తన మాట చెప్పులు వినవు.

వారసత్వపు ముచ్చట ఇంకా తీరకుండానే, జగన్‌ తన తండ్రి చెప్పుల్లోనే కాదు, తండ్రి ‘తప్పుల్లో కూడా వేళ్ళు’ పెట్టారంటూ సిబిఐ అరెస్టు చేసి జైల్లో పెట్టింది. దాంతో తన పాత్రను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పోషించాల్సి వచ్చింది. విజయమ్మ విజయమ్మలాగే వచ్చారు కానీ, షర్మిల మాత్రం షర్మిలలాగా రాలేదు. ఒక పాదాన్ని తండ్రి వైయస్‌ చెప్పులోనూ, ఇంకో పాదాన్ని అన్న జగన్‌ చెప్పులోనూ పెట్టి నడవటం మొదలు పెట్టారు. ‘నేను. షర్మిలని. రాజన్న కూతుర్ని. జగనన్న చెల్లెలిని’ అన్నారు. కానీ తండ్రినే ఎక్కువ అనుకరించారు. ఆమె అభివాదం చేస్తున్నట్లుగా ఒక చెయ్యి చాచి, అరచెయ్యిని మాత్రమే ఆడిస్తుంటే, ‘రాజశేఖర రెడ్డి చెయ్యి ఊపి నట్లే వుంద’ని వచ్చిన జనం అనటం మొదలు పెట్టారు.

ఆ మధ్య (2009లోజరిగిన ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున జూనియర్‌ ఎన్టీఆర్‌కూడా ‘తాత చెప్పులు’ వేసుకు రావటమే కాకుండా, తాత( ఎన్టీఆర్‌) మాదిరి ‘ఖాకీ డ్రస్సు’ వేసుకుని, తాత ఎక్కిన ‘చైతన్య రథమెక్కి’, తాత కొట్టిన ‘డైలాగులు’ కొడితే, జనం ‘కెవ్వు’మన్నారు. అదేలెండి. మారిన సినిమా భాష ప్రకారం ‘కేక’ అన్నారు. తాత బాగా పూనేసారో ఏమో, రథం దిగి తాత ‘సైకిలు’ కూడా తొక్కేసారు. అప్పటినుంచీ తాత చెప్పులు ఎవరు వేసుకుంటారు? కొడుకు బాలయ్యా? మనవడు జూనియరా? ఈ ప్రశ్న సంచలన వార్తలు లేనప్పుడెల్లా, మీడియాకు చర్చనీయాంశంగా మారింది.

పిల్లలు ముచ్చట పడి పెద్దల చెప్పుల్లో కాళ్ళు పెట్టటం మాత్రమే కాదు, పెద్దలే తమంతట తాము పిల్లల్ని తొడుక్కోమని తమ చెప్పులివ్వటం కూడా వారసత్వ క్రీడలో భాగమే.

ఈ సాంప్రదాయాన్ని పలు ప్రాంతీయ పార్టీలు పోషిస్తాయి. తన చెప్పులు- ‘సొంత కొడుక్కివ్వాలా? సోదరుని కొడుక్కి ఇవ్వాలా?’ అని రెండు దశాబ్దాలు ఆలోచించి సొంత కొడుకయిన ఉద్దవ్‌కే ఇచ్చారు మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్‌ థాకరే. దాంతో సోదరుని కొడుకు రాజ్‌ థాకరే అలిగి వేరే కుంపటి పెట్టారు. అదే వేరే విషయం.

‘నాకు కొడుకయినా, కూతురయినా ఒక్కటే’ అన్న జెండర్‌ న్యాయాన్ని పాటిస్తూ, ఇద్దరికీ (కేటీఆర్‌కీ, కవితకీ) తొడుక్కోవటానికి చెరో చెప్పూ ఇచ్చి సమ వారసత్వాన్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు కేసీఆర్‌.

ఇదంతా ప్రజాస్వామ్యం లో జరుగుతున్న ‘పాదుకా పట్టాభిషేకమే’!

(ఆంధ్రభూమి దినపత్రిక 10 జూన్ 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

 

 

1 comment for “పాదుకా ‘ప్రచారా’భిషేకం!

Leave a Reply