పిల్ల ‘మర్రి’!

కేరికేచర్: బలరాం

పేరు:  మర్రి శశిధర రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: నాలుగో కృష్ణుడు… అనగా రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : పిల్ల ‘మర్రి'( అవును. నాన్న పెద్ద ‘మర్రి’. మర్రి చెట్టు నీడన మరో మొక్క పెరగదంటారు. కావచ్చు. కానీ మరో మర్రి పెరుగుతుంది.) జూ.మర్రి

విద్యార్హతలు : ముఖ్యమంత్రి కావటానికి కావలసిన అర్హతలన్నీ వున్నాయి. మరీ ముఖ్యంగా రిజర్వేషన్‌ వుంది. కొన్ని ఉద్యోగాల్లో మాజీ సైనికులకు కోటా ఇచ్చినట్లు, రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వోద్యోగాలకు మాజీ ముఖ్యమంత్రుల తనయులకు రిజర్వేషన్‌ ఇస్తున్నారు. ఇంతవరకూ అసెంబ్లీ స్పీకర్‌,( నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు.), కేంద్ర మంత్రుల( ఎన్టీఆర్‌ కుమర్తె పురంధేశ్వరి, కోట్ల విజయభాస్కర రెడ్డి ) ఎంపికలో ఇప్పటికే ఈ కోటాను పాటించారు. నా తండ్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు, కాబట్టి ఈ కోటాలో నేను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థించ వచ్చు. కానీ వైయస్‌ తనయుడు జగన్‌కు మాత్రం ఈ కోటా వర్తింప చేయలేదు. అది వేరే విషయం

హోదాలు : హైదరాబాద్‌ బ్రదర్స్‌ ఒకరిగా నాకు ప్రత్యేక మైన హోదా వుండేది. మరో బ్రదర్‌ పి.జనార్థన రెడ్డి. ముఖ్యమంత్రిగా వున్న వైయస్‌ను వ్యతిరేకించటానికి మా ఇద్దరికీ అప్రకటితంగా సంక్రమించిన హోదా అది.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: తెలంగాణ వాడిని, హైదరాబాద్‌ వాడిని కూడా. ఇంకా చెప్పాలంటే, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వాడిని. (హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణను ఇవ్వలేని పక్షంలో, అధిష్ఠానం నన్ను ముఖ్యమంత్రిని చేయవచ్చు.)

రెండు: సీమాంధ్ర వాదిని.(అంటే సమైక్యాంధ్ర వాదినని కాదు సుమా! సీమాంధ్రులకు సైతం ఇష్టుణ్ణి అని చెప్పటం.) నాన్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపినందుకు తెలంగాణ వారికీ, ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్‌లో కలిపి సీమాంధ్రవారికీ ప్రీతిపాత్రులయ్యారు. ఆయన వారసత్వమే నాకూ వచ్చింది.అందుచేత నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వల్ల సీమాంధ్ర వాదులుకూడా సంతోషిస్తారు.

అనుభవం : తుపానుల వంటి ‘జాతీయ విపత్తు’ల్ని ఎదుర్కొనే మేనేజ్‌మెంట్‌ లో నాకు ప్రత్యేక అనుభవమూ, అందుకు తగ్గ పదవీ వున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏకకాలంలో రెండు తుపానులు వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్‌ తుపానూ, సీమాంధ్రలో జగన్‌ తుపాను. ఇవి తీరం దాటే టప్పుడు పెనుగాలులు వీస్తాయి. పలు కాంగ్రెస్‌ వాదులు ఇళ్లు కోల్పోయినట్లు పదవులు కోల్పోతారు. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటే. నాలాంటి అనుభవజ్ఞుడు అవసరం.

సిధ్ధాంతం : ‘మర్రియలిజం’ ( నాన్న గారి సిధ్ధాంతం ఇది. ఆయనకి ఏది నిజమని తోస్తే అదే సిధ్ధాంతం. నక్సలైట్ల మీద నిషేధం ఎత్తి వేయటం వల్లే పరిష్కారమనుకుంటే ఎత్తి వేసేవారు.)

వృత్తి : నీడనివ్వటం (మర్రిని కదా). నాకు సిఎం పదవి ఇచ్చిచూడండి. ఎంతమందికి నీడ నిస్తానో..?

హాబీలు :1. వ్యవసాయం( గ్రామాల్లో అయితే ఇది వృత్తి. నగరంలో వుండే నాకు హాబీ). నేను చదివిన శాస్త్రమిదే లెండి.

2. నీటి తగాదాలు తీర్చటం.(రాజకీయాల్లో నీరు ‘యెత్తు’లెరుగు.)

మిత్రులు : ఒకే ఒక్కడు. పీజేఆర్‌ ఆయన ఇప్పుడు లేరు.

శత్రువులు : కాంగ్రెస్‌లోనే వుంటారు. నాన్నను ముఖ్యమంత్రిగా దించింది, అప్పటి కాంగ్రెస్‌లో వున్న వారే కదా!

మిత్రశత్రువులు : పగటికి రేయి శత్రువని చెప్పగలమా? సూర్య ‘కిరణ’ం వెళ్ళిపోగానే, ‘శశి’ కాంతులు రావొచ్చు. అది సహజం. ఇంతకు మించి మాట్లాడితే, సిఎంగా నాకున్న అవకాశాలు సన్నగిల్లతాయి.

వేదాంతం : ఎప్పుడు వచ్చామన్నది కాదు, ‘బ్యాలెట్‌’ పడిందా, లేదా? (నేను వస్తే, గిస్తే ఎన్నికల ముఖ్యమంత్రిగా నే వస్తాను.)

జీవిత ధ్యేయం : అమెరికా అధ్యక్షులుగా చేసిన తండ్రీ కొడుకుల్ని సీనియర్‌ బుష్‌, జూనియర్‌ బుష్‌ అనేవారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, నాన్నను సీనియర్‌ మర్రిని చేయాలని.

-సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 8-15 నవంబరు 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply