పీకుడందు ‘క్లాసు పీకుడు’ వేరయా!

‘పాఠం చెప్పటం’ వేరు. గుణ పాఠం చెప్పటం వేరు.

ఈ రెండూ కాకుండా, ‘క్లాసు పీకటం’ వేరు.

అనగనగా ఓ అందమైన ఆడపిల్ల. ఆమె వెంట ముగ్గురు.

ప్రేమించానూ, ప్రాణమిచ్చేస్తానూ-అంటాడొకడు. ‘ఎన్నున్నాయిరా, నీ దగ్గర ప్రాణాలు, ఇలా నచ్చిన ప్రతి పిల్లకూ ఇచ్చుకుంటూ పోవటానికీ’, అని, ‘కాఫీ డే’లో వెచ్చని కాఫీ తాగించి చెబుతుంది. ఇది పాఠం.

”ఏయ్‌ పిల్లా లిఫ్టు కావాలా?’-అంటూ అని రోజూ బసుస్టాండు దగ్గరకొస్తాడు ఒక ‘బైకు’ బాబు. ‘ఈ పూట మా అక్కయ్య కివ్వు, రేపు నేను ఎక్కుతాలే.’ అని ఒక ఆడా, మగా కానీ మాడా (హిజ్రా)ను ఎక్కిస్తే- ఇది గుణ పాఠం.

మూడోవాడుంటాడు. ప్రేమించడు, వేధించడు. ఆమె ఎక్కడి కొస్తే, అక్కడి కొస్తాడు. ఆమె పిజ్జా తింటాడు, వాడూ పిజ్జా తింటాడు. చిత్రం. ఆమె లిప్‌స్టిక్‌ కొంటే, వాడూ లిప్‌స్టిక్‌ కొంటాడు.

వాడి నేమీ చెయ్యలేక ‘నేను పిజ్జా తినటం మానేస్తున్నాను, లిప్‌ స్టిక్‌ పెట్టుకోవటం మానేస్తున్నాను. నువ్వు మానెయ్యి.’ అంటుంది. కానీ ముందు తను మానాలి కదా!. ఇదే ‘క్లాసు పీకుడు’

పాఠమైనా, గుణపాఠమైనా, మార్పు కోసం.

కానీ, క్లాసు పీకుడు, యధాతథ స్థితి కోసం.

పాఠం మిత్రులకు చెబుతాం, గుణ పాఠం శత్రువులకు చెబుతాం.

మిత్రులూ, శత్రువులూ కానీ సన్నిహితులు వుంటారా? ఉంటారు. వారే మన నీడలు.

మిత్రుడూ మారొచ్చు. శత్రువూ మారొచ్చు. కానీ నీడ మారదు. మనం మారకుండా. మన నీడలు మారాలనే దురాశ లోనుంచే ఈ ‘క్లాసు పీకుడు’ పుట్టింది.

రాజకీయాల్లో ఎలాగూ శాశ్వత మిత్రులూ, శత్రువులూ వుండరని, ఏనాడో అనుభవజ్ఞులు వుంటారు.

అందుకనే, ఆ స్థానంలో పార్టీల అధినేతలు తమ నీడల్ని ప్రవేశ పెట్టారు. ముందు బాగానే వుంటుంది. తర్వాత తమ నీడల మీద, తమకే విసుకు వస్తుంది.

ఈ సంకటం ప్రతి పార్టీ అథిష్ఠానానికీ వస్తుంది. ఈ మధ్య కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వచ్చింది. ఈ అధిష్ఠానానికి రాష్ట్రంలో మూడు నీడలున్నాయి. ఆ నీడల మధ్య సయోధ్య లేదు.

ఒక వ్యక్తికి ఎక్కడయినా మూడు నీడలు వుంటాయా? మూడేం ఖర్మ. ముఫ్పయి మూడు నీడలుంటాయి. ఆ వ్యక్తి మీద ఎన్ని టార్చి లైట్లు పడితే అని నీడలుంటాయి.

ఒకప్పుడు ఒకే నీడ వుండేది. కారణం అథిష్ఠానం మీద ఒకే లైట్‌ పడేది. అధిష్ఠానం నమస్కరిస్తే, ఆ నీడా నమస్కరించేది. ‘అశేష జనవాహిని’ ముందు అధిష్ఠానం చెయ్యి ఊపితే, నీడా చెయ్యి ఊపేది. ఆ నీడ పేరు వై.యస్‌. రాజశేఖర రెడ్డి.

తప్పు. అథిష్ఠానం చెయ్యి ఊపినప్పుడు, నీడ వినమ్రంగా చేతులు జోడించి నిలబడాలి.

అందుకే, ఆ నీడ స్థానంలో పలు నీడల్ని తేవాలనుకున్నది అథిష్ఠానం. తన మీద ఎక్కువ లైట్లు ఫోకస్‌ చేయించుకున్నది. పలు నీడలు వచ్చాయివా.టిలో చాలా లైట్లు వెలిగి ఆరిపోగా మూడు లైట్లు మిగిలాయి. దాంతో మూడే నీడలు మిగిలాయి.

వాటి పేర్లే- ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ నేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ.

ఇంకా చెప్పాలంటే, ఒకరు:చెక్‌. ఇంకొరు: క్రాస్‌ చెక్‌, మరొకరు: కౌంటర్‌ చెక్‌.

అధికారాన్ని వాడుకుని మహావృక్షాలుగా ఎదిగి పోతున్న వారి ఆటకట్టించటానికి ఒకరూ, వృక్షాలకు బదులు మొక్కల్ని పీకేయకుండా చూడకుండటానికి ఇంకొకరు, తేడా వస్తే, చెట్లు పీకే వ్యక్తినే పీకేయగలనని చెప్పటానికీ ఇంకొకరు- అని అర్థం చేసుకోవాలి. అసలు నీడలకు ఇచ్చిన బాధ్యతలే కొట్టుకుచచ్చేవయితే, ఆ నీడల మధ్య సఖ్యత ఎలా వుంటుంది?

నీడలు మారాలంటే అథిష్ఠానం వైఖరి మారాలి.

అథిష్ఠానానికి వున్న ఉద్దేశ్శాలు మారాలి.

ఇవేమీ మారకుండా, నీడలు మారిపోవాలన్న అత్యాశలో భాగంగానే ఈ మధ్య ఈ మూడు నీడల్నీ ఢిల్లీ పిలిపించి పార్టీ అథిష్ఠానం తరపున రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గులామ్‌ నబీ అజాద్‌ ‘క్లాసు పీకారు’.

అనగా, ‘మేం మారం కానీ, మీరు మాత్రం మారండి’ అని మూడు నీడలకీ చెప్పారు.

మూడు నీడలూ మూడు వేరు వేరు కారుల్లో వచ్చినప్పుడు ఆయన బాధపడ్డారు. ఇలా చేస్తే సయోధ్య లేదన్న ‘కారు కూతలు’ ఎక్కువ అవుతాయన్నారు. అందు చేత, పంపించేటప్పుడు ముగ్గుర్నీ ‘ఒకే కారు’లో ‘ఎ.పి.భవన్‌కు పంపించారు.

నీడల ఐక్యత ఎంత సేపు వుంటుంది? లైట్లు పడని కొన్ని గంటలుంటుంది. ఆ తర్వాత లైట్లు పడ్డాయి.

మళ్ళీ మూడు నీడలూ, మూడు వేర్వేరు విమానాల్లో, మూడు వేర్వేరు వేళల్లో రాష్ట్రానికి చేరుకున్నాయి.

‘క్లాసు పీకుడు’ అలా పనిచేస్తుంది.

జరిగిన ఏడు స్థానాల ఉప ఎన్నికల వోటమికి ఏ నీడను నిందించినా, అథిష్ఠానం తనను తాను నిందించుకున్నట్టే.

రేపు జరగబోయే 18 స్థానాల్లో సగానికి సగమయినా తేవాలని నీడలకు ‘టార్గెట్‌’ పెట్టిందనుకోండి. అథిష్ఠానం తనకు తాను టార్గెట్‌ పెట్టుకున్నట్లే.

కాబట్టి, ఒక నేత నీడలకు ‘క్లాసు పీకితే’ తన్ను తాను కొరడాతో కొట్టుకున్నట్లే.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక 8-4-12 వ సంచికలో ప్రచురితం

2 comments for “పీకుడందు ‘క్లాసు పీకుడు’ వేరయా!

  1. “మిత్రుడూ మారొచ్చు. శత్రువూ మారొచ్చు. కానీ నీడ మారదు. మనం మారకుండా. మన నీడలు మారాలనే దురాశ లోనుంచే ఈ ‘క్లాసు పీకుడు’ పుట్టింది.” అంటూ చాలా బాగా చెప్పారండి !

Leave a Reply