పైన పులి-లోన చెలి

అందమైన రచనకు అనంతమైన దృశ్యరూపం: లైఫ్‌ ఆఫ్‌ పై

 

ఊపిరి లాంటిదే ఊహ కూడా.

ఊపిరితో బతికేది ఒక్క బతుకే. కానీ ఊహతో వెయ్యిన్కొక్క బతుకులు బతకొచ్చు’ఓ అందాల రాకుమారుడు గుర్రమెక్కాడు.’ అని కథ మొదలు కాగానే, పాఠకుడు రాకుమారుడయి పోతాడు. కొండలు, వాగులు దాటుతుంటాడు.

‘ ఓడ మునగటంతో ఓ కుర్రవాడు వచ్చి లైఫ్‌ బోట్‌లో పడతాడు’ అనగానే ఆ విపత్తు పాఠకుడికి వచ్చి పడుతుంది.

ఇలా, ఒక్క్కొక్క కథలో ఒక బతుకు. ఒక్కో బతుకులో చూసే వింత ప్రదేశాలూ, మనుషులూ, జీవులూ, అనుబంధాలూ, ఏడుపులూ, నవ్వులూ…ఓహ్‌!

కథ చదివినప్పుడు నిర్మితమైన ఊహలు చెక్కు చెదరవు. వాటిని ఎవరూ కూల్చలేరు. ఊహలో దృశ్యాలు మాత్రమే కాదు, శబ్దాలూ, వాసనలు, స్పర్శలూ, రుచులూ వుంటాయి.

అందుకే, చదివేసిన కథనే, తెరమీద కొత్తగా చూడాలంటే, ఎంతో కొంత అభద్రత. ఊహ కూలుతుందేమోనన్న భయం.

కానీ ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ (ఇంగ్లీషు) చిత్రం ఆ భయం మొత్తాన్ని తీసివేసింది. ఇది ముందు నవల. రాసింది యాన్‌ మార్టిల్‌. ఈ నవలకు (2002లో) మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ రావటంతో, ప్రపంచమంతటా సాహితీ ప్రియులు ఎగబడి చదివారు. చదివిన ప్రతీ వారూ, సుదీర్ఘకాలం(227 రోజులు) తాము సముద్రంలో ఉండిపోయినట్లు భావిస్తారు. ఇదొక అపురూపమయిన అనుభవం.

ఈ నవలను సినిమాగా తీస్తున్నారని వార్త రాగానే, పాఠకులు తమ ఊహ మీద దాడి జరుగుతుందన్నారు. ఈ భయం పాఠకులకే కాదు, కొన్ని సార్లు రచయితలకు కూడా వుంటుంది. తమ కథల్నీ, నవలల్నీ సినిమాలుగా తీశాక, వాటిని చూసి గుండెలు బాదుకున్న రచయితలు ప్రపంచమంతటా వున్నారు. ఆ మధ్య ఇంతే ప్రసిధ్దమయిన నవల ‘గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’ను సినిమా తీస్తామని వచ్చినప్పుడు, ఆ నవల రాసిన అరుంధతీ రాయ్‌ ముందుగా నే భయ పడి పోయారు. ‘ నా నవల దురాక్రమణకు గురవటానికి నేను అనుమతించను’ అని తెగేసి చెప్పేశారు.

కానీ యాన్‌ మార్టెల్‌ అలా కాదు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ ను సినిమాగా తీయటానికి అనుమతించారు. తీస్తానని ముందుకొచ్చిన దర్శకుడు అంగ్‌ లీ. ఆయన సామాన్యుడు కాడు. సృజనకు మారు పేరు. దృశ్యాల పరంపరలో అప్పుడే పెనువేగం- అంతలోనే ప్రశాంతత వుంటాయి. ఎప్పుడూ చూడని వింతా, ఎంతో పరిచితమైన చింతా పక్కపక్కనే కదులుతుంటాయి. దశాబ్దం క్రితం ఆయన తీసిన ‘ క్రౌచింగ్‌ టైగర్‌, హిడెన్‌ డ్రాగన్‌’కు అన్ని దేశాల ప్రేక్షకులనుంచి ప్రశంసలు వచ్చాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ ను పతాక స్థాయిలో చూపిస్తారాయన. గురు,శిష్య సంబంధానికి ఇదే చిత్రంలో కొత్త భాష్యం చెబుతారు.

అంతటి మహా కళాకారుడి చేతికి ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ చిక్కింది.

‘నేను సినిమాలను వెతుక్కోను. నా సినిమాలే నన్ను వెతుక్కుంటాయి.’ అంటారాయన.

నిజమే. ‘లైఫ్‌ ఆఫ్‌ ఆఫ్‌ పై’ లీని వెతుక్కుంది.

సాహసాన్నీ, తత్వాన్నీ- పడుగూ, పేకల్లా పేనుకుంటూ వెళ్ళిపోయాడు రచయిత. అదే ‘లీ’ కోరుకునేది. అంతే. అది సినిమాగా సాక్షాత్కరించింది.

photo By: SoniaT 360.

 ‘సులోచనాలు’ కావాలి!

మామూలు కళ్ళతో చూస్తే, ఈ కథను మూడు ముక్కల్లో చెప్పేయవచ్చు: ఓడ మునక, లైఫ్‌ బోట్‌లో కుర్రాడు, పులి సహ యానం, సురక్షితంగా ఒడ్డుకు చేరటం.

అందుకే, ఈ సినిమా చూడటానికి అదనంగా నేత్రాలు కావాలి. (ఎలాగూ త్రీ-డీ సినిమా కదా, చూడటానికి అదనంగా రెండు కళ్ళు పైన తగిలించుకోవాలను కోండి!) అవి అంతర్నేత్రాలు.

మానవోద్వేగాలను వాటితోనే చూడగలం. ప్రమాదంలో చిక్కుకుని పరిహాసాలాడటమూ, బతుక్కీ చావుకీ మధ్య సరిహద్దును చెరిపేయటమూ, పెనుకోపంలో చిరుజాలిని ప్రకటించటమూ- మామూలు కళ్ళు చాలవు.

ఫీలింగ్స్‌ కథను నడపవు, కథే ఫీలింగ్స్‌ను నడుపుతుంటుంది.

‘పై’ అని పేరు మార్చుకున్న ‘పిస్సిన్‌ పటేల్‌’ అనే కుర్రవాడు( ‘పిస్సింగ్‌’ ‘పిస్సింగ్‌’ అని ఏడిపిస్తుంటే మార్చుకోక ఏం చేస్తాడూ..!) నాలుగు సెట్టింగుల్లో వున్న నాలుగు అనుభవాలను కలిపి, గుదిగుచ్చి, మనకిచ్చేసి తాను పెద్దవాడయి పోతాడు.

మొదటిది: హద్దులున్న ప్రపంచం. అదే జూ.

రెండవది: అవధులు లేని ప్రపంచం. సముద్రం

మూడవది:అందని ప్రపంచం: తేలే అడవి

నాల్గవది : చిన్నబోయిన ప్రపంచం: గది.

జూలో ప్రయోగమూ, సముద్రంలో సాహసమూ, అడవిలో సౌందర్యమూ, గదిలో మృత్యువూ చూస్తాడు.

జంతువుల మధ్యలో వున్నప్పడు, దేవుళ్ళను వెతుకుతాడు. ప్రతీ మతానికి ఒక కథ కావాలి- అని తెలుసుకుంటాడు ‘పై’.

కథ సరే – నిజమేమిటి?

రిచర్డ్‌ పార్కర్‌ . అది బెంగాల్‌ పులి పేరు. తన జూలో వుంటుంది. మాంసపు ముక్క తో బోను దగ్గరకు వస్తాడు. కొంచెం వుంటే అది అతడి చెయ్యి తినేసేదే. ‘ఆకలేస్తే తినేయటం నిజం’ ఇది వాళ్ళ నాన్న దగ్గరుండి చూపించినన పాఠం.

అవును. మనల్ని తినేసే వాళ్ళతోనే మన సహజీవనం. ఇది ప్రయోగం.

 

ఆకలే మృగం. అది తీరాక జీవి, జీవే.

హైనా, జీబ్రా, వానరమూ తినబడ్డాక, పడవలో మిగిలింది తనూ, రిచర్డ్‌ పార్కరే.

పట్టిన చేపలతో దాని ఆకలి తీర్చాక రిచర్డ్‌ పార్కర్‌ తన మాట వింటుంది. ఇది సాహసం.

 

సముద్రం మధ్యలో సౌందర్యం. గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌ లాంటి తేలే తోట.

ఈవ్‌ తోనే కాదు, పులితో నూ తిరగవచ్చు.

తిరిగాడు. చిత్రమైన తోట అది, మోహించి మింగేస్తుంటుంది.

సౌందర్యం ఎప్పుడూ అంతే. తనలో లయం చేసుకుంటుంది.

 

ఇంత జీవితాన్ని పంచబోతే, గదిలో మనుషులు ఊరుకోరు.

ఓడ ఎలా మునిగిందో చెప్పమంటారు కానీ, నిజం వినరు.

ఎందుకంటే, వాళ్ళు అప్పటికే ఒక మతం పుచ్చేసుకున్నారు. ఓడలు ఇలాగే మునుగుతాయి. అందులోని మనుషులు ఇలాగే బయిటపడతారు- అన్న కథను ఆ మతం వాళ్ళ బుర్రలోకి ఎక్కించేసింది. అవును యాంత్రికత కూడా ఒక మతమే. అందులో ఉద్వేగాలకు చోటుండదు.

 

యాంత్రికతా ఒక మతమే!

మతం పుచ్చుకున్న వారు- మనం చెప్పింది వినరు. తాము వినదలచుకున్నదే మనం చెప్పాలి.

వాళ్ళ కోసం పడవలో వున్న జంతువుల స్థానంలో ఓడ ప్రమాదంలో పోగొట్టుకున్న తల్లీ, తండ్రీ, సోదరుణ్నీ పెట్టి కథ చెప్పితే నమ్ముతారు. ఇదే మృత్యువు. బతకటం మరచిపోవటమే చావు.

 

యాన్‌ మార్టెల్‌ తన నవలలో చెప్పిన ఈ తత్వాన్ని, లీ దృశ్యమానం చేశాడు. ఫలితంగా నవల చదివిన ప్రేక్షకుడికి రెండు అనుభవాలు మిగిలాయి. రెండు ఊహలు కలిగాయి. రెంటినీ ఎవరూ కూల్చలేరు.

పులిని చూస్తే, రక్తమాంసాలతో పాటు, ఆవేశకావేశాలున్న నిజమైన పులిలాగే అనిపిస్తుంది. అది సి.జి.ఐ ( కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ఇమేజరీ) పులి అని పొరపాటున కూడా అనిపించదు. ‘అవతార్‌’లో మనుషుల్లాగా. అలాంటి వాళ్ళు వుంటే బాగుండుననిపిస్తుంది.

చివర్లో పులి – ఒడ్డుకొచ్చేశాక- తన పైనుంచి దుమికి ఒళ్ళు విరిచి, థ్యాంక్స్‌ అయినా చెప్పకుండా, తన వైపయినా చూడకుండా వెళ్ళి పోతుందని బాధపడతాడు ‘పై’.

పులి పులే. వెనక్కి తిరిగితే బాగుండదు!!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక కోసం రాసినది)

2 comments for “పైన పులి-లోన చెలి

Leave a Reply