ప్రజాస్వామ్యానికి వసంతమొచ్చింది!

samaykyaఉద్యమాలప్పుడు ప్రజలకు అసౌకర్యాలేకాదు, అధికారాలు కూడా ఉచితంగా వస్తాయి. నిన్న మొన్నటి దాకా నడిచిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ, నేడు నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, అసౌకర్యాలూ, అధికారాలూ పక్కపక్కనే కనిపించాయి.

అసౌకార్యాలు అనేకం. ప్రయాణమయి వెళ్ళాలనుకుంటాం. బస్సులుండవు. రైళ్ళుంటాయి కానీ, సీట్లుండవు, ప్రయివేటు బస్సులుంటాయి, కానీ అవి ‘గాలి’లో వుంటాయి. అంటే వేగంలో కాదు, ధరల్లో కాదు. దాదాపు ‘ఎయిర్‌'(విమాన)చార్జీల స్థాయిలో వుంటాయి.

బీపీ పడిపోయిందని ప్రభుత్వాసుపత్రికి వెళ్తాం. అప్పటికే ‘షుగర్‌’ పడిపోయిందని నిరాహార దీక్ష చేస్తున్న నేత ఆసుపత్రిలో చేరుస్తారు. ఎలాగయినా తోసుకుని వెళ్దామనుకుంటే, చికిత్స గేటు దగ్గరే లభిస్తుంది. సూది మందు కోసం వెళ్ళి, లాఠీ మందుతో తిరిగి వస్తాం. అప్పటికే వైద్యుల డ్యూటీ పోలీసులు తీసేసుకుని వుంటారు.

ఎవరి ఇంట్లో వారు కూర్చుంటే మాత్రం, అసౌకర్యాలుండవా? పొద్దున్నే కాఫీ తాగుదామన్న ఆశతో లేస్తాం. వేడి వేడి కాఫీ కప్పులోకి వస్తుంది. కానీ రంగే మారుతుంది. నల్లగా కనిపిస్తుంది. పాలులేని డికాక్షన్‌ రంగును చూసి చాలాకాలమయిందన్న సంతృప్తితో తాగేస్తుంటాం. ఉద్యమం ముదిరిపోయి కొన్ని చోట్ల పాలవ్యాన్లు కూడా నిలుపు చేశారని తర్వాత టీవీలో చూసేస్తుంటాం.

భోజనం చేద్దామనుకుంటే, కూరల్లో కొత్త రుచులు వస్తాయి. ఉదాహరణకు ఉల్లిలేని కూరల్ని తిని కూడా చాలా కాలమయి వుంటుంది. మామూలు గానే ఉల్లి బంగారమయి పోయింది. దానికితోడు రవాణా స్తంభించిన కారణం కనపడకుండా పోయింది. అందుకని భోజనం సగంలోనే ముగించి లేచి పోతుంటాం. అవిధంగా ఉద్యమం ఏదయినా మనమూ ‘అర్థ’ నిరాహార దీక్షలు చేస్తాం.

ఇవన్నీ అసౌకర్యాల జాబితా.

మరి అధికారాలో..? ఉన్నాయి. ఎప్పుడూ ప్రజల్ని నేతలే ఆడిస్తారు. ఎప్పుడో కానీ, నేతల్ని ప్రజలు అడించరు. కడకు ఎన్నికలప్పుడు ప్రజలు దగ్గర కొచ్చి వంగి, వంగి దండాలు పెడుతున్నట్టు కనిపిస్తారు కానీ, ఆ దండాల్లో ‘భయం కానీ, భక్తి కానీ’ ఎక్కడా కనిపించవు. ‘మీనోట్లు మీకిచ్చేస్తాను, నా వోట్లు నాకిచ్చేయండి.’ అనే వర్తక లాంఛనం మాత్రమే కనిపిస్తుంది. ఎన్నికలప్పుడు నేతలకు ప్రజలు ‘ధరవున్న వస్తువుల్లాగా’ కనిపిస్తారు కానీ, మనుషుల్లా గా పొరపాటున కూడా కనిపించరు. బహిరంగ సభలకు శ్రోతలు తరలి రావాలి. ‘ఉత్తనే వస్తున్నారా? పైసలిస్తే వస్తున్నారు’ అని అనుకునేంత పొగరు నేతలో కనిపపిస్తుంది. ఇక వోటు సరే సరి. కొనేసుకుంటున్నానే అనుకుంటాడు.

ఇక ఎన్నికలయ్యాక కూడా ప్రజల్ని వస్తువుల్లాగే చూస్తారు కానీ, ధరలేని వస్తువుల్లాగా చూస్తారు. రేషన్‌ కార్డు కోసమో, కులధ్రువీకరణ పత్రం కోసం వచ్చే వారినో ‘అనుమానం’తో చేస్తారు. ఎమ్మార్వో కార్యాలయంలో న్యాయం జరగలేదని, ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళితే, గేటు ముందు వాళ్ళు చూస్తుండగానే తుర్రున వెళ్ళిపోతారు.

అంటే నేతల జుత్తు, ప్రజలకు ఎన్నికలప్పుడూ దొరకదు, ఆ తర్వాతా దొరకదు. మరెప్పుడు దొరుకుతుంది? ఒకే ఒక్క సారి.

ఏదో ఒక ఉద్వేగం కారణంగా జనం రోడ్డ మీదకు వచ్చినప్పుడు. ఉద్యమాలు చేసినప్పుడు. (అఫ్‌కోర్స్‌! ఒక్కొక్క సారి ఈ ఉద్యమాలను రగిలించటానిక కూడా రాజకీయ పక్షాలు రచించవచ్చు అది వేరే విషయం.)

గత నాలుగున్నరేళ్ళగా రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో ఎప్పుడూ ఉద్యమమే నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, ఆ ప్రాంతపు ఎమ్మెల్యేలూ, ఎంపీలూ, మంత్రులూ, తమ తమ సొంత నియోజకవర్గాలకు వెళ్ళటానికి వణికి చచ్చారు. ఇప్పుడు సీమాంధ్రలోని పరిస్థితీ అంతే. తమ సొంత నియోజకవర్గాలకు వెళ్ళాలంటే కష్టంగా వుంది. ఊరి పొలిమేరల్లోనే అపేస్తున్నారు. ఇప్పుడు నిజంగా నేతల కళ్ళల్లో భయం కనిపిస్తోంది. తమ సొంత ఊరి ప్రజలే; సొంత నియోజకవర్గపు ప్రజలే. తలచుకుంటే వణుకు పుడుతోంది. వెళ్ళే ముందే తమ అనుయాయుల్నీ, అనుచరుల్నీ వంద ఆరాలు తీస్తున్నారు. ‘ఫర్వాలేదులే అన్నా! పోతే కారు అద్దాలు పోతాయి. నువ్వు బయిలు దేరి వచ్చేయ్‌ అన్నా!’ అని తమ వ్యక్తిగత అనుచరులు భరోసా ఇస్తున్నా కదలలేని పరిస్థితి. పొలిమేరల్లోనే ‘రాజీనామా పత్రాల’ను చూపిస్తే, వాటినే ‘అనుమతి పత్రాలు’గా గుర్తించి, లోనికి రానిస్తున్నారు.

‘పదవి కావాలా? ప్రజలు కావాలా? తేల్చుకో.’ ఈ ప్రశ్నను ఉద్యమంలో మమేకం అయిన ఓ సాధారణ పౌరుడు అడగగలుగుతున్నాడు.

పెద్ద పెద్ద నేతలు, మహా మహా మంత్రులూ, ‘స్టారాధి స్టారులూ’, ‘వీరాధి వీరులూ’, ప్రజల ముందు చేతులుకట్టుకుని సమాధానాలు చెప్పాల్సి వస్తోంది. ‘నేనెందుకు రాజీనామా చెయ్యలేదంటే. మీ కోసమే. అడిగేవాడు పార్లమెంటులోనో, అసెంబ్లీలోనో ఉండాలి కదా!’ అని చెప్పిన వినటం లేదు. ‘మా చెవుల్లో పువ్వులేమన్నా కనిపిస్తున్నాయా, అన్నా!’ అని జనం అడుగుతున్నారు.

ఇలా అనుకుని అలా రోడ్ల మీదకు వేల, లక్షల సంఖ్యలో రాగలుగుతున్న జనంలో ఇంత శక్తి వుంటుందా? ప్రజలు పాలించేదే ప్రజాస్వామ్యం అయితే, ప్రజలు శాసించేదే ప్రజాస్వామ్యమయితే అది కనిపించేది ఇలా అప్పుడప్పుడూ. ఉద్యమకాలమే ప్రజాస్వామ్యానికి వసంత కాలం.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 1సెప్టెంబరు 2013 వ తేదీ సంచికలో వెలువడింది.)

1 comment for “ప్రజాస్వామ్యానికి వసంతమొచ్చింది!

Leave a Reply