‘ఫుడ్‌’ ప్రో కో! మగణ్ణి చూసుకో!

టాపు(లేని) స్టోరీ:

మరో మారు దేశ విభజన జరిగింది. ఈ సారి కూడా దేశం రెండుగా విడిపోయింది. కానీ అవి పాకిస్తాన్‌-ఇండియాలు కావు. భారత్‌-ఇండియాలు. అంత తేలిగ్గా జరిగిపోతుందా? భజనకీ, విభజనకీ ఒక్క అక్షరమే తేడా. భక్తి వుంటే భజన, విరక్తి వుంటే విభజన. ఇండియా మీద విరక్తి కలిగింది ఒక దేశభక్తుడికి. దాంతో ఈ నిర్ణయానికి వచ్చేశారు. ఆయన దృష్టిలో నగరాలు వుండే ది ఇండియా, పల్లెలు వుండేది భారత్‌. అయితే పల్లెలెలా వుంటాయి? నగరాలు ఎలా వుంటాయి? గుర్తు పట్టటమెలా?

పల్లెల్లో చెట్లు భూమ్మీద వుంటాయి. నగరాల్లో చెట్లు కుండీల్లో వుంటాయి.

పల్లెల్లో మద్యం బెల్టుషాపుల్లో దొరుకుతుంది. నగరాల్లో వైన్‌ షాపుల్లో దొరుకుతంది.

అంత వరకూ అసలు పల్లే ఒకటిగా వుండదు. ఒక భాగం ఊరుగానూ, ఇంకొక భాగం వాడగానూ వుంటుంది.

కానీ ఈ దేశభక్తుడు ఇలాంటి వంద గుర్తులు చెప్పి మనల్ని అయోమయంలో పడవేయదలచుకోలేదు. అందుకని ఒకే ఒక గుర్తు చెప్పారు.

పల్లెల్లో అత్యాచారాలు(రేపులు) జరగవు. నగరాల్లో అత్యాచారాలు జరుగుతాయి.

ఈ పరిశోధనను వెల్లడించిన దేశభక్తుడు చిన్నవాడేమీ కాదు. సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగవత్‌.

పల్లెల్లో అత్యాచారానికి లైసెన్సు వుంది. ఆ లైసెన్సు పేరే కులం. దళిత మహిళమీద ఆత్యాచారం చేయమని అగ్రవర్ణ భూస్వామికి లైసెన్సు ఇచ్చింది ఈ కులమే. ఈ సౌకర్యం చాలక, దైనందిన అత్యాచారానికి కొన్ని మాతంగుల్నీ, జోగినీలను సృష్టించింది ఈ కులమే.అమ్మ కడుపులో వుండగానే ఆడ బిడ్డ నుదుటి మీద ‘వేశ్యాంగన’ అని రాసింది ఈ కులమే కదా!

మన పలెల్లో స్త్రీలను సామూహిక అత్యాచారం చేసి, హత్యచేసిన దారుణ నేపథ్యం ఏనాటి నుంచో వుంది. పల్లెల్లో దైవ భక్తి ఎంత వుంటుందో, ‘దయ్యపు’ భీతి కూడా అంతే వుండేది. ‘అస్పృశ్య’ మహిళలను అలా చంపేశాక, ఆమె దయ్యమయి హంతకుల్ని పీక్కు తింటుందన్న భయంతో, ఆమెను ‘క్షుద్ర దేవత'( దేవతల్లో కింది వర్ణం)లు గా మార్చి, బలులు, నైవేద్యాలు పెట్టిన సందర్భాలున్నాయి. అలా అత్యాచారానికి గురయిన కింది వర్ణపు మహిళ బందిపోటుగా మారితే ఇప్పుడు ‘ఫూలన్‌ దేవి’ అయ్యారు. అంతే తేడా.

భగవత్‌ పనిలో పనిగా దేశ విభజనతో పాటు, కుటుంబ విభజన కూడా చేసేశారు.

పెళ్ళంటే ఏమిటి? ఒక ఒప్పందం. భర్త భార్యతో చేసుకున్న ఒడంబడిక. ఈ ఒప్పందం ఎప్పుడు తెగిపోతే అప్పుడు కుటుంబ విభజన జరిగిపోతుంది. తప్పేముంది? భగవత్‌ చెప్పింది నిజమే కదా- అనిపిస్తుంది.

కానీ ఒప్పంద సారాంశం వినాలి. అదికూడా ‘నీకిది- నాకది’ లా అనిపించే ‘క్విడ్‌ ప్రోకో’ గుర్తుకు వస్తుంది. ‘భర్తను సుఖపెట్టటమే భార్య విధి. నా ఇంటిని చూసుకుంటూ నన్ను సుఖపెట్టు. అందుకు ప్రతిగా నీ అవసరాలు చూసుకుంటాను.’ అని భర్త (ఏకపక్షంగా )రాసిన ఒప్పందానికి ఆమె అంగీకరించి వస్తుంది. ఆమె అలా(శయినేషు రంభ, కార్యేషు దాసిలా) సుఖపెట్టక పోతే, భర్త వదిలేస్తాడు. అప్పుడు కుటుంబ విభజన జరిగిపోతుంది. ఇన్ని పనులు చేసినందుకు ఇంతకీ ఆమెకు ఇచ్చేదేమిటి? కాస్త తిండి. బహశా ఈ ఒప్పందాన్ని ‘ఫుడ్‌’ ప్రోకో- అని పిలుచుకోవచ్చేమో! ఎప్పుడో ధర్మం నాలుగు ‘వర్ణాలా’ నడిచే రోజుల్లో, భర్త చస్తే భార్యను అతడితో కలిపి తగలేసే రోజుల్లో- గొప్ప సామాజిక వ్యవస్థ వుండేదనీ, అదే భారతమనీ, అప్పటిదే అన్యోన్య దాంపత్యమనీ గట్టి అనుమానం. సామాజిక శాస్త్రాలు ఏమాత్రం బుర్రల్లోకి ప్రవేశించని నగరంలోని కార్పోరేటు కుర్రవాళ్లు కూడా ఈ అనుమానాన్ని స్వీకరించవచ్చు. ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుతో వృధ్ధులు’ అని కవి ఊరికే అన్నాడా..!?

 న్యూస్‌ బ్రేకులు:

‘ఆస్తి’కులు కారు, నాస్తికులే!

పెరిగిన విద్యుత్తు బిల్లులు కట్టటానికి ప్రజలు ఆస్తులు అమ్ముకోవాలి

-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత

అక్కడికి జనానికి ఆస్తులు మిగిలినట్లు.. పోదురూ మరీరూ…!

నగదు బదలీ పథకం చారిత్రాత్మకం

-జైరామ్‌ రమేష్‌, కేంద్ర మంత్రి

అదే భయం. సరిగా అమలుకాక పోతే, చరిత్రగానే మిగిలిపోతుంది.

ట్విట్టోరియల్‌

‘చీర్‌’ గాళ్స్‌

Photo By: John Benson

ఐపిఎల్‌ క్రికెట్‌ వచ్చిన తొలి రోజుల్లో ఆ మోజే వేరు. ఆటలో సిక్సర్లు కొట్టినా, ఫోర్లు కొట్టినా చూసే జనం ఎలాగూ ఊగి పోతారు. ఈ ఊపు సరిపోదని కొంత మంది ఆడపిల్లలు ఉత్సాహపరుస్తూ నృత్యాలు చేస్తారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో జరిగే జాతరలో స్త్రీలు ఇలాగే నృత్యాలు చేస్తారు. వారు అనివార్యంగా కింది వర్ణాల వారే అవుతారు. వారు ఈ ఐపిఎల్‌ ఆటలో వేసే నృత్యాలు వేసే ఆడవాళ్ళను చూసినా అలాగే అనిపించేది. కానీ వీరు సంపన్న దేశాలనుంచి వచ్చిన కాస్తోకూస్తో విద్యావంతులయిన సంపన్న మహిళలే. వీరిని ప్రపంచం ముద్దుగా ‘చీర్‌ గాళ్స్‌’ అని పేరు పెట్టుకుంది. వీరిని చూసి మన ‘భారతీయ సంస్కృతి’ గుర్తుకు తెచ్చుకున్న వారు తెగ బాధపడిపోయారు. వారి నృత్యాలకు అభ్యంతరం లేదు కానీ, వారు కట్టుకున్న సగం దుస్తులకు అభ్యంతరం చెప్పారు. దానిదేముందీ- అని వారు మరుసటి రోజు ‘చీర’ గాళ్స్‌గా మారారు. అబ్బే ఏమీలేదు. జారే చీరలు కట్టుకొని అంతకన్నా ఎక్కువ ఎక్స్పోజింగ్‌ చేశారు. భారతీయ యువమోర్ఛా అధ్యక్షుడు అనురాగ్‌ పాండేకు కూడా అలాంటి బాధే వచ్చింది. ఇండియా అసభ్యంగా మారుతోందని. అవును కదా-విదేశాల్లోని పోర్నో తారలు కూడా వచ్చి మన సినిమాల్లో అలాగే నటించేస్తే ఎలా.. చీర కట్టుకుని నటించాలి కానీ…!

 ‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

‘కామా’జికం

పలు ట్వీట్స్‌: సామూహిక అత్యాచారానికి బలయిన అమ్మాయి పేరు చెబితే తప్పేమిటి?

కౌంటర్‌ ట్వీట్‌: అప్పుడు ‘సామాజిక’ అత్యాచారం జరుగుతుంది.

ఈ- తవిక

భూతం

‘ఎవరక్కడ చీకట్లో

దయ్యంలాగా?

వెలుగులోకి రావచ్చు కదా!’

‘తెల్లవారనీయండి వస్తాను.’

‘లైట్‌ వేస్కో.’

‘గుండె ఆగి చస్తారు. నన్ను చూడలేక కాదు,

కరెంటు బిల్లు చూడలేక?’

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘మేధోమథనానికీ, బుర్రబద్దలు కొట్టుకోవటానికీ తేడా ఏమిటి?’

‘ఒక చోట మెదళ్ళుంటాయి, బుర్రలుండవు; ఇంకొకచోట బుర్రలుంటాయి, మెదళ్ళుండవు.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

కుర్చీ ఏ కొడుక్కి ఇవ్వాలనీ, తల యే కూతురి వొడిలో వాల్చాలనీ ఆలోచించే వాడే ‘కరుణ’ గల తండ్రి!

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 8 జనవరి 2013 సంచికలో ప్రచురితం)

Leave a Reply