బీజేపీ-కాంగ్రెస్‌ల సమర్పణ: ‘స్వామి..రారా!’

swamyస్వామి తలచుకుంటే కేసులకు కరువా? ‘కలహభోజనుడు’ సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వివాదం. ఆయన ఏ పార్టీలో వున్నా ‘వన్‌ మ్యాన్‌ ఆర్మీ’ (ఏక సభ్య సైన్యం) లాగా వుంటారు. కూపీలూ లాగటంలోనూ, లొసుగులు వెతకటంలోనూ దిట్ట. అయితే అన్ని కూపీలూ నిలబడవు. కొన్ని వీగిపోతుంటాయి. ఆయన ఎవరి మీదయినా గురిపెట్టారంటే, ఇక వారి చుట్టూనే తిరుగుతుంటారు. రాజకీయంగా ఆయనకు కాంగ్రెస్‌ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే వుంచుతారు. ఈ మధ్య కాలంలో ఆయన కారణంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఒకటి: వాణిజ్య అవసరాల నిమిత్తం రాహుల్‌ గాంధీ తాను బ్రిటిష్‌ పౌరుణ్ణని చెప్పుకున్నాడంటూ స్వామి ఆరోపణ చేశారు. రెండు: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ‘టేకోవర్‌’ విషయంలో వేల కోట్ల భూములను రాహుల్‌ , కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కైంకర్యం చేయబోయారని కోర్టులో పిటిషన్‌ వేశారు. (అయితే ఈ పిటీషన్‌ 2012లోనే వేశారు. కానీ దానిపై ట్రెయిల్‌ కోర్టు, ఇద్దరినీ వ్యక్తిగతంగా హాజరు కావలిసిందిగా సమన్లు పంపింది.

ఇప్పుడు ఈ ‘కేసు’ చుట్టూనే పాలక, ప్రతిపక్ష నేతలు తిరుగుతున్నారు. తమపై ఎన్డీయే సర్కారు, మరీ ముఖ్యంగా ప్రధాని కార్యాలయం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటు, కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేస్తున్నారు. న్యాయపరంగా సాగుతున్న కేసును, రాజకీయం చేయాలని చూస్తున్నారనీ, స్వతంత్రమైన న్యాయవ్యవస్థ ను కించపరచేలా మాట్లాడుతున్నారనీ బీజేపీనేతలు కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేస్తున్నారు.

ఒక కేసు- రెండు రాజకీయాలు, అన్నట్లుగా పార్లమెంటులో ప్రతిపక్ష, పాలక సభ్యుల తీరు కనిపిస్తోంది. ‘నేను ఇందిరా గాంధీ కోడలిని, ఇలాంటి బెదిరింపులకు లొంగను’ అంటూ సోనియా, ఈ సందర్భంలో ఇందిర ను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, ‘1978 వేరు 2015 వేరు. ఇందిర ఇందిరాయే; సోనియా సోనియాయే’ అని బదులిచ్చారు. ‘చట్టానికి ఎవరి కోడలు అన్న విషయం అనవసరం. అందరూ సమానులే’ అని కూడా వ్యంగ్రాస్త్రాలు సంధించారు.

ఇందిరాగాంధీ కూడా తన మీద కక్ష సాధింపుగా తనను కేసుల పేరుతో అప్పటి జనతా ప్రభుత్వం వేధించిందని జనం ముందుకు వస్తే ఆమెకు విపరీతమైన సానుభూతి వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో కూడా సోనియా అలాంటి సానుభూతినే ఆశిస్తున్నారా? ఇది ఒక అంశమయితే, అప్పుడు కూడా దళితుల సమస్యనే ఇందిరాగాంధీ అస్త్రంగా అప్పటి జనతా సర్కార్‌ మీద ప్రయోగించారు. బెల్చీలో జరిగిన దాడుల విషయంలో పార్లమెంటులో సర్కారును నిలదీశారు. ఇప్పుడు కూడా ఫరీదాబాద్‌ దగ్గర జరిగిన దళితుల (పసికందుల) హత్యాకాండను సోనియా అస్త్రంగా తీసుకున్నారు.

అలాగే బీహార్‌లో బీజేపీ ఘోరపరాజయం తర్వాత వెంటనే జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో, ప్రతిపక్షాలు మొత్తం బీజేపీని దేశంలో పెరుగుతున్న ‘అసహనం’ ‘సెక్యులరిజం పైదాడుల’ విషయంలో నిజంగానే పాలక పక్షానికి ఎముకల్లో చలి పుట్టిస్తున్నారు. దీనినుంచి దృష్టిని తాత్కాలికంగానయినా మళ్ళించటానికి, ఇలాంటి వివాదమేదయినా వస్తే బాగుండునని భావిస్తున్న బీజేపీకీ ఈ కేసు వరంలా కనిపిస్తోంది.

నిజానికి ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రిక విషయంలో ఇలాంటి ఆరోపణే గతంలో సుబ్రహ్మణ్యస్వామి చేసినప్పుడు, ‘ఈ విషయంలో కోర్టుకు వెళ్ళటానికయినా సిధ్ధమే’ అని కాంగ్రెసే బీరాలు పలికింది. తీరా కేసు విచారణకు వచ్చిన తర్వాత ‘రాజకీయం’ మంటోంది.

ఈ కేసులో బలహీనత ఒకటి స్పష్టంగానే కనిపిస్తోంది. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ లావాదేవీల వల్ల తాను నష్టపోయినట్లుగా ఒక్క వాటాదారూ ముందుకు రాలేదు. ఎవరికీ నష్టంకానీ ప్రయివేటు వివాదంలో, ఎవరు ఎవరిని మోసం చేశారన్నది నిరూపించటం కష్టమైన విషయమే.

ఇంతకీ ఈ వివాదంలో పెద్ద పెద్ద మలుపులూ, సంక్లిష్టతలూ ఏమీ లేవు. ఈ పత్రికను పండిట్‌ నెహ్రూ 1938లో స్థాపించారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా నడిచింది కానీ, పలుసార్లు మూత పడటం, మళ్ళీ తెరుచుకోవటం అన్నది 2008 వరకూ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెరుచుకోలేదు. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ దఫా దఫాలుగా ఈ పత్రికు అప్పు పెట్టి ఆదుకుంది. అంతవరకూ ఈ పత్రిక ‘అసోసియేట్‌ జర్నల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ అనే వాణిజ్య కంపెనీ పేరు మీద నడిచేది. ఇందులో 671 వరకూ వాటా దారులు వుండేవారు. అయితే ఈ అప్పులు తీర్చటం కోసం అన్నట్లు సోనియా, రాహుల్‌ వాటాదారులు (30శాతం) గావున్న ‘యంగ్‌ ఇండియన్‌’ అనే ప్రయివేటు కంపెనీని రు.అయిదు లక్షల మూలధనంతో స్థాపించారు. తర్వాత దాని ఆస్తులు అమ్మి కాంగ్రెస్‌కు బాకీ పడ్డ రు.90 కోట్ల అప్పును తీర్చటానికి ఉపక్రమించింది. అయితే ‘యంగ్‌ ఇండియన్‌’ అన్నది వాణిజ్యేతర కంపెనీ. కానీ ఆరోపణ ఏమిటంటే, పలు చోట్ల స్థిరాస్తులున్నాయి. వాటి విలువ రు.2000 కోట్లు. ఈ మొత్తం ఆస్తులపై కన్ను వేసే ఈ పనికి పాల్పడ్డారన్నది ఆరోపణ. అయితే వాణిజ్యేతర కంపెనీలో, సంస్థల ఆస్తులు వాటాదారులకు వెళ్ళవు. అందుచేత సోనియా, రాహుల్‌ గాంధీలకు ఏమి ప్రయోజనం? ఈ ప్రశ్న కూడా తలయెత్తుతోంది.

అయినప్పటికీ ఈ కేసు విషయంలో పార్లమెంటును స్తంభింపచేసే పనికి కాంగ్రెస్‌ పూనుకొంటోంది. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చేసిన నిరసనకు వచ్చిన సానుభూతి, సొంత సమస్యలపై చేస్తే వస్తుందా- అన్నది ప్రశ్న!!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 11-17డిశంబరు 2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply