సంపన్నవతీ, సౌందర్యవతీ అయిన మూడుపదుల మహిళను ప్రశ్నించాడు లాయరు- బోనులో నిలబెట్టి.
‘ముళ్ళూ కాదు, ఆకులూ కాదు. ముడుపులు. పెళ్ళంటే ముడుపులు… అని నేననుకోలేదు, నన్ను కట్టుకున్న మొగుళ్ళు అనుకున్నారు.’
మహిళ అయివుండియూ, ముద్దాయి అయి వుండియూ, ఆమె తలయెత్తి సమాధానం చెప్పటంతో లాయరికి చిర్రెత్తుకొచ్చింది.
‘అంటే కట్నమనా..?’
‘ముడుపులనే..! ఆడదాని దగ్గర పుచ్చుకుంటే కట్నమవుతుంది.అడ్డమయిన వాడి దగ్గరా పుచ్చుకుంటే లంచమవుతుంది’
లాయరుకి తాను ఇరవయ్యేళ్ళ క్రితం మామ దగ్గర నొక్కేసిన పదెకరాల చెక్కా గుర్తుకొచ్చి గొంతు పొడారిపోయింది.
‘సరే చెప్పు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ అధికారిగా వున్న ఈ మూడో భర్తనుంచి ఎందుకు వదిలేయలనుకుంటున్నావ్?’
‘ఆదాయానికి మించిన ఆస్తులున్నాయి.’
‘ఆస్తులు నీకే వచ్చాయి కదా..?’
‘లేదు. వేరే యింటికి వెళ్ళాయి. ఆయనకి చిన్నిల్లు వుంది.’
కోర్టులో ఎవరో కిసుక్కున నవ్వారు. ఎవరో ఏమిటి? ఈ మధ్యనే చేరిన ఆడ లాయరు. లాయరుగారికి కూడా చిన్నిల్లు వున్న సంగతి బారు బారంతటికీ తెలుసు.
‘మరి రెండో భర్త అయిన పోలీసు ఇన్స్టెక్టర్ని ఎందుకు వదిలేశావ్?’
‘నేను వదిలేయ్ లేదు. అతడే వదిలేశాడు.’
‘ఎందుకని? నేనే వాడి చేత తప్పతాగించి కొట్టేదాన్ని’
కోర్టులో ఒక్క ఆడలాయరు కాదు, మొత్తం ఆడ లాయర్లందరూ గొల్లుమని నవ్వారు.
‘ఎందుకు కొట్టేదానివి?’
‘దొంగల దగ్గర కొట్టేసిన దొంగ నగలు ఎక్కడ దాచాడో చెప్పమని’
‘పోలీసులంతే..కొంచెం తికమక పడితే నిజం చెప్పేస్తారు. నీ భర్త లాయరయితే నీ పప్పులుడికేవి కావు.’ అనేశాడు ఉక్రోషం తట్టుకోలేక.
‘నా మొదటి భర్త లాయరే!’
ఈ సారి కోర్టులో, ఒక్క ఆడ లాయరు కానీ, ఒక్క మగలాయరు కానీ ఎవరూ నవ్వలేదు.
‘ఓహో! అతణ్ణి నువ్వు వదిలేశావా? నిన్ను అతడు వదిలేశాడా?’
‘రెండూ కాదు. పోయాడు.’
‘ చంపేశావా?’
‘చచ్చాడు… నల్ల కోటేస్కోలేక’
ఈ జవాబుకు కోర్టులో కలకలం. న్యాయవాదులంతా తము నల్లకోట్లను తడిమి చూసుకున్నాడు. జడ్జిగారు అందరినీ అదిలించి నిశ్శబ్దాన్ని నిలబెట్టారు.
తన జవాబుకు న్యాయవాది అడక్కుండానే ఆమె వివరణ ఇచ్చింది.
‘ఒక కేసులో, ఒక్క సారిగా కోటి రూపాయిల సూట్ కేసు ఇంటికొచ్చింది. అంతా బ్లాక్ మనీ. ‘నల్లకోట’ంటే అదే..! దానిని బ్యాంకులో వేసుకోవాలా? ఇనప్పెట్టెలో వేస్కోవాలా? లా ఎక్కువ తెలిసి పోతే బీపీయే కదా! అని రాత్రంతా ఆలోచించి, పొద్దున్నే గుండె ఆగి చచ్చాడు.’
ఆమెను ప్రశ్నిస్తున్న లాయరు గ్లాసుతో నీళ్ళుతీసుకుని గటగటా తాగేశాడు. తాను ఎవరి తరపున వాదిస్తున్నాడో మరచిపోయి, మూడుపదుల ముద్దుగుమ్మకు తాజా భర్త అయిన ప్రభుత్వాధికారినుంచి విడాకులు ఇప్పించేయాల్సిందిగా కోర్టువారిని తడబడుతూ కోరేశాడు.
కానీ, ఎందుకో కేసుతో సంబంధంలేక పోయినా కానీ, ఆమెను చివరిగా ఓ ప్రశ్న వేశాడు.
‘చూడమ్మా! ఊరికే ఉత్సాహం తట్టుకోలేక అడుగుతున్నాను. నాల్గవ భర్తగా ఎవరిని చేసుకుందామనుకుంటున్నావ్?
రాజకీయ నాయకుణ్ణా?’
ఈ ప్రశ్నకు మాత్రం ఆమె ముఖంలో కొంచెం సిగ్గు తొణికిసలాడింది. తలకూడా కాస్త దించుకుంది.
‘నాకు ఈ మూడు పెళ్ళిళ్ళూ కా ముందు, ఒక రాజకీయ నాయకుణ్ణి ప్రేమించాను..!’
అంతటా నిశ్శబ్దం.
‘మరి అతణ్ణే ఎందుకు పెళ్ళిచేసుకోలేదు?’
‘అతడికి అప్పడికే పెళ్ళయింది.గనుల కంపెనీ వాడి కూతురితో..’
*** *** ***
ఇప్పుడు రాష్ట్రంలో ఓటరుది కూడా ఆ మూడు పదుల ముద్దుగుమ్మ పరిస్థితే.
అభ్యర్థులే కాదు.. ఏకంగా పార్టీల అధినేతలూ, రాష్ట్ర పాలన చేసిన వారే వేల కోట్ల స్కాముల్లో ఇరుక్కున్నారు.
మరీ ముఖ్యంగా నాలుగు కీలక పక్షాలూ ఒకరి ‘గుట్టు’ను ప్రసార సాధనాల సాక్షిగా రట్టు చేసుకున్నారు.
ఎన్నికలు.. ఎన్నికలు… అని ఉబలాటపడుతున్నారు, కానీ, నిజంగా ఎన్నికలొస్తే, వీళ్ళల్లో ఎవరిని ఏలికలుగా తెచ్చుకోవాలి?
బ్యాలెట్ పేపరే, పెద్ద చార్జి షీటులా కనిపించేటప్పుడు, ఎవరిని ముందు ‘లోపల’ వెయ్యాలి?’ అని అనుకుంటాం తప్ప, ఎవరిని వరించాలి- అనుకోలేం కదా?
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రికలో 19నవంబరు2011 నాడు ప్రచురితం)