టాపు(లేని) స్టోరీ:
అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.
‘అవినీతి.. అవినీతి.. అవినీతి..!’ అంటూ నిన్నటి వంకీల జుట్టు ‘అపరచితుడి’లాగో, మొన్నటి తెల్ల జుట్టు ‘భారతీయుడి’ లాగో ఊగి పోతాడు. భారత సమాజాన్ని ఆమూలాగ్రం చదివేసి, రోగనిర్థారణ చేసిన వాడిలాగా తల పైకెత్తి ఈ ‘అవినీతే’ అన్ని అనర్థాలకూ కారణమంటాడు. ఈ ఒక్క ‘అవినీతి’ అనే కంతెను తొలగించేస్తే చాలు, భారత సమాజం ‘కడిగిన ముత్యం’ లా మారిపోతుందంటాడు. మరి దీనికి వైద్యం? అది కూడా వుందంటాడు. ఒక్క ‘లోక్‌పాల్’…. ఒకే ఒక్క ‘లోక్‌పాల్’ బిల్లు చట్టమయిపోతే, అవినీతికి చికిత్స జరిగిపోతుంది. దేశం సుభిక్షమయిపోతుంది! చూశారా? సకల రోగ నివారిణిని ఎలా కనిపెట్టాశారో!
అంతే కాదు, ఈ అవినీతిని ప్రోత్సహించే పేదా,సాదా, బీదా, బిక్కీ జనం మీద అలవి మాలిన కోపం కూడా! అసలు రాజకీయ నాయకులూ, అధికారులూ, కడకు న్యాయమూర్తులూ లంచాలు తీసుకోవటానికి కారణమేమిటో తెలుసా? వోటరు. అతడే ‘బీరుకో, బిర్యానీకో, పచ్చనోటుకో’ అమ్మేసుకుంటే- దేశం ఏమయి పోతోంది..?! దాంతో మొత్తం సమస్య అంతా ఎక్కడికి వస్తుంది? ‘కూటికి గతిలేని వాడు వోటుకు నోటుకు పుచ్చుకోవటం’ దగ్గర కొస్తుంది. చూశారా? మధ్యతరగతి వాడికీ, పేదవాడిని తప్పుపట్టటంలో ఎంత ఉత్సాహమో!
సరే, అయిదేళ్ళకొక సారీ, ‘పూటుగా తాగి, పొట్ట నిండా బువ్వ తినే అవకాశాన్ని’ కూడా పేద వోటరు వదిలేసుకుంటాడు. దేశంలో అన్ని తీవ్రమయిన సమస్యలూ పరిష్కారమయిపోతాయా? అలాగయితే, ఏదో ఒకరోజు, అది కూడా వారికిష్టమయిన రోజు పేపరు తీసి, బొత్తిగా ఆసక్తి కలిగించని వార్తలు చదవ మనండి:
– యువతి ప్రేమోన్మాది యాసిడ్ దాడి
– వరకట్నం తేనందుకు అత్తింట్లో కడతేరిన గృహిణి
-సెజ్‌ల కారణంగా ఉపాధిని కోల్పోయిన లక్షలాది మత్స్యకారులు.
-అరబ్బు దేశాలు వెళ్ళి అనాథలవుతున్న భారత కూలీలు.
-మరో చేనేత కార్మికుడి లేదా రైతు ఆత్మహత్య.
-దళిత కూలీల పై అగ్రవర్ణ భూస్వాముల దాడి.
-మళ్ళీ చెలరేగిన మతకలహాలు: పదిమంది మృతి
ఈ తరహా వార్తలు మనకు నచ్చినా నచ్చక పోయినా, మనకు టీవీల్లో, పత్రికల్లో దర్శనమిస్తూ వుంటాయి. మనం మాట్లాడుకునే ‘అవినీతి’కీ వీటికీ సంబంధముందా? బోడిగుండుకీ మోకాలుకీ లింకు వేసినట్లు వేస్తే తప్ప సంబంధం ఏర్పడదు.
కానీ, నోటుకు కక్కుర్తి పడి వోటేసే పేద వాణ్నడగండి! పై సమస్యలన్నింటికీ పరిష్కారాలు తెలియక పోవచ్చు. కానీ ఒకే పరిష్కారముంటుందన్న ‘మూఢ నమ్మకం’తో కూడా వుండడు.
అందరూ దోచుకునే వాళ్ళే అని తెలిసిపోయాక, మొత్తం తినేసేవాడి కన్నా, తిన్నదాంట్లో కొంచెమన్నా పేదలకు పెట్టే వాడు దొరికితే వాడికే వోటేస్తారు. వాడి నుంచీ ‘బీరూ, బిర్యానీ’ గ్రహిస్తారు.
కుల సమస్యను కులసమస్యలాగా, జెండర్ సమస్యను జెండర్ సమస్యలాగా- ఏ సమస్యను ఆ సమస్యలాగా చూస్తారు. చావకుండా బతకటమెలాగో- అటువైపు పోతుంటారు.
చదువుకున్న మధ్యతరగతి మేధావి వదలేసిన సంక్లిష్ట సమస్యను కూడా చదువులేని పేదవాడు అర్థం చేసుకుంటున్నాడు. 364 రోజులూ బువ్వ దొరికితే , పవిత్రమైన వోటుకోసం ఒక్క రోజు ‘బువ్వ’నూ త్యాగం చేయటానికి పేదవాడే ముందుండే వాడు. ‘అవినీతి’ని మధ్యతరగతి ‘వరకట్న నేరస్తుల’ కన్నా ముందే పాతరేసేవాడు. పాఠాలు చెప్పండి. కానీ వెనక్కి తిరిగి బతుకు సిలబస్‌ను ఒక్క సారి సరిచూసుకోండి.
న్యూస్ బ్రేకులు:
నీడ లేని నీతి!
అవినీతిని నిర్మూలించాలనుకునే వారు, తమ పోరాటాన్ని ముందు తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలి.
-అబ్దుల్ కలామ్, భారత మాజీ రాష్ట్రపతి
అయితే కొన్ని కోట్ల మంది చెట్ల కిందనుంచి తమ పోరాటాన్ని ప్రారంభించాలి. తలదాచుకోవటానికీ గుడిసే లేని పదిరూపాయిలు పోలీసోడికి లంచమిచ్చి ప్లాట్ ఫాం మీద పడుకుంటాడు. వాడయితే పోరాటాన్ని ప్లాట్ ఫాం మీద నుంచి ప్రారంభించాలి…!?
రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో లోక్‌బిల్లును ఆమోదింప చేసుందుకు కేంద్ర ప్రభుత్వం సిధ్ధంగా వుంది.
-సల్మాన్ ఖుర్షీద్, కేంద్ర న్యాయశాఖా మంత్రి
అసలు ముందు కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం వస్తుందా? ‘రాహుల్‌ను ప్రధాన అభ్యర్థిగా ప్రకటించటం’లో మినహా మరే ఇతర విషయాల్లోనయినా- ‘హస్తమ’ంటే అయిదు వేళ్ళే.( అయుదు అభిప్రాయాలే.)
ట్విట్టోరియల్
‘సారీ’ కన్నా ‘ఉరి’ మేలు!
‘సారీ’! ఒక్క మాటే. చెప్పమన్నది కూడా ఒక్క మాటే. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నది ఒకే ఒక్క క్షమాపణ. ‘క్షమాపణా? ఆయనెందుకు చెప్పాలి?’ అని ఆయనకన్నా ముందు దేశమంతటా వున్న ఆయన భక్తులకు కోపం వస్తుంది. గాంధీ గారి దేశంలో, గాంధీ గారి సొంత రాష్ట్రంలో, ‘హింస’కు ‘హింస’తోనే బదులిస్తే, మోడీ ఎందుకు సంజాయిషీ ఇవ్వాలి. ఆయన అప్పుడు(2002లో) ముఖ్యమంత్రిగా వుండొచ్చు. రక్షణనిచ్చే పోలీసులు మొత్తం ఆయన చెప్పు చేతల్లోనే వుండొచ్చు. అయినా, గోద్రా అనంత అల్లర్లకు మోడీ ఎందుకు చెప్తారు? వేల మంది మరణించి వుండవచ్చు. అల్లర్లు జరిగినప్పుడు మోడీ తట్టుకోలేక ‘కళ్లు మూసుకుని’ వుండొచ్చు. బాధ భరించలేక ‘చూసీ, చూడనట్లు’ వుండొచ్చు. అంతమాత్రం తప్పు పట్టేస్తారా? తానే కనుక దగ్గర వుండి పొడిపించినట్లు రుజువయితే, తనను ‘బహిరంగంగా ఉరితీయవచ్చు’ అని ఒక ‘ఉర్దూ పత్రిక’కు ఇచ్చిన ఇంటర్వ్యూ, పాపం ఆ పత్రిక సంపాదకుణ్ణి ఇరకాటం లో పెట్టేసింది. ‘మైనారిటీ’ల పై ద్వేషం రగిలిస్తేనే కానీ, ‘మెజారిటీ వోట్లు’ రావన్న ‘రామరాజ్య’ నీతి జీర్ణమయి పోయాక, ‘మోడీ’కి పాపం ‘సారీ’ చెప్పాలని వున్నా, చెప్పలేరు.
‘ట్వీట్ ‘ఫర్ టాట్
‘అన్నా’ర్తులు!
పలు ట్వీట్స్ :దేశానికి అన్నా (హజారే) కావాలి. ఆయన ఆరోగ్యం ముఖ్యం. నిరాహర దీక్షు దిగివుండాల్సింది కాదు.
కౌంటర్ ట్వీట్: పాపం. అన్నం లేని వారికి ‘అన్నా’ ఎవరో తెలీదు. లేకుండా వారు కూడా ఆందోళన చెందేవారు.
ఈ- తవిక
‘బాడ్’ మింటన్
కిరణ్ చేతిలో
బ్యాట్టుంది.
బాలెక్కడికి
వెళ్ళిందో?
కొట్టింది గల్లీలోనే
కానీ,, వెతకాల్సింది ఢిల్లీలో..!
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘విడదీస్తే మూడు, కలిపేస్తే ఒకటి.. ఇది ఏగణితం?’
‘సీమ-గణితం. అక్కడి నేతలు కొందరు రాష్ట్ర విభజనకు చెప్పిన లెక్క ఇది?’
కొట్టేశాన్( కొటేషన్):
తివారీకీ శరీరం వుంది. దానికీ వ్యాయామం కావాలి.
-సతీష్ చందర్
31-7-12
రాసెవాడికి చేసెవాడు లొకువ అనిపిస్తుంది. చేసెవాడు ఆన్నా హజారె, రాసేవాడు సతీష్ చందర్
Thanks for your comment
నిజమే. సంపన్నుడికి మధ్యతరగతి వాడు లోకువ. మధ్యతరగతి వాడికి పేదవాడు లోకువ. ఓసీకీ బీసీ లోకువ. బీసీకి ఎస్సీ లోకువ. ఎస్సీకి ఎస్టీ లోకువ. మెజారిటీకి మైనారిటీ లోకువ. పురుషుడికి స్త్రీ లోకువ.
లోకువల్ని ఎదిరించటమే Politics of Identity.
పాపం అన్నా హజారే అమాయకుడు. ఆయన్ని ఫలాయనవాదులు వాడుకుంటున్నారు.
సతీష్ చందర్