నటించటమంటే మరేమీ కాదు, నమ్మించెయ్యటమే.
తానే కృష్డుణ్ణని నమ్మించేశారు ఎన్టీఆర్ ఆరోజుల్లో. ఎంతటి ఎన్టీఆర్‌కయినా మిత్రులూ, అభిమానులతో పాటు శత్రువులు కూడా వుంటారు కదా! వాళ్ళల్లో భక్తులు కూడా వుండే వుంటారు. వారికష్టం ఎంతటిదో ఊహించుకోండి. కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి ఊహించుకుంటే ఎన్టీఆర్ వచ్చేస్తుంటాడు. మరి ఎన్టీఆరే కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి తలచుకుంటే, ఆయనకు ఏ రూపం కనపడేదో..?! ఆది ఆయన గొడవ. వదిలేద్దాం.
మొత్తానికి వందేళ్ళ కాలంలో దేశం మొత్తం మీద గొప్ప నటుడెవరంటే,(ఒక సర్వే ప్రకారం) ఎక్కువ మంది ఆయన పేరుకే టిక్కు పెట్టారట! అఫ్ కోర్స్. ఆయన రాజకీయాల్లో కూడా అంతే సమాన ప్రతిభతో నటించాలి. పలుసార్లు నటించారు కూడా. చైతన్య రథమెక్కి స్పీచ్ దంచినా, టాంకుబండు మీద నిరాహార దీక్ష చేసినా, జనం కదలిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఏమి చెప్పినా, ఏమి చేసినా నమ్మాల్సిందే. కానీ అప్పుడప్పుడూ ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినట్లు, రాజకీయాల్లో కూడా (1989 లో)ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అంటే వాటిల్లో ఆయన నమ్మించలేక పోయివుంటారు. లేదా తాను నమ్మించటానికి చేసిన ప్రయత్నంలో తన యూనిట్ సభ్యులు సహరించి వుండక పోవచ్చు.
అంతే కాదు, తాను రాజకీయాల్లోకి వచ్చాక కానీ తనకు బోధపడి వుండదు. ఇక్కడ తనను మించిన నటులు వున్నారని. లేకుంటే రెండు సార్లు తనను నమ్మించి, తన కుర్చీని ఇద్దరు లాక్కొనే వారు కారు. ఈ రెండు సందర్భాల్లోనూ తనని ‘వెన్నుపోటు’ పొడిచారని బాధపడ్డారు.
నిజానికి, ఒక వ్యక్తి కూర్చున కుర్చీని అతనికి తెలియకుండా తీసేసి, కింద పడేటట్టు చెయ్యటం కళ. దీనిని ‘వెన్నుపోటు’ అని చిన్నబుచ్చటం మర్యాద కాదు. ఈ కళపేరు కూడా నటనే. ఇలా తనకూర్చున్న కుర్చీని లాక్కొన్న ఇద్దరూ, ఆ లెక్కన, ఎన్టీఆర్‌ను మించిన మహానటులయి వుండాలి.
ఎన్టీఆర్ తన నటనతో సాధారణ జనాన్ని మాత్రమే నమ్మించగలిగారు. కానీ ఆ ఇద్దరూ సాటి నటుల్లాంటి తమ పార్టీ శాసన సభ్యుల్ని నమ్మించగలిగారు.
అనుకుంటాం కానీ, నమ్మించటం అంత తేలికయిన పని కాదు.
కాబట్టి, నటన అవసరం సినిమాల్లోనో, రంగస్థలం మీదనో కాదు, అన్ని రంగాల్లోనూ వుంది. అంతెందుకు వ్యక్తిగత జీవితంలోనూ వుంది.
కానీ అదేమిటో, సినిమాల్లోనూ, రంగ స్థలంలోనూ తమ నటనా కౌశలాన్ని చూపగలిగిన వారు- జీవితంలో చూపలేరు. సావిత్రి మహానటి. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. ‘దేవదాసు’లో పార్వతి వేషం వేస్తే ఆమే పార్వతి అనుకుంటాం, ‘కన్యాశుల్కం’లో మధురవాణి పాత్ర వేస్తే ఆమే మధురవాణి అన్న భ్రమ కలుగుతుంది. అలా నమ్మించేస్తారామె ప్రేక్షకుల్ని.
కానీ జీవితంలో ఈ మహానటిని నమ్మించేసే వారు తారసిల్లారు. ఫలితంగా ఆమె అందం, ఆరోగ్యం, ఐశ్యర్యం- అన్నీ కోల్పోయారు. వారు ఆమెను మంచిన మహానటులన్న మాట. సిల్క్‌స్మితలూ, దివ్యభారతిలనయితే నిజజీవితంలోని నటులు ఆత్మహత్య చేసుకునేలా చేసేశారు.
అలాగే జీవితంలో నటించేవాళ్ళందరూ, తెర మీద విజయవంతం కాలేరు.
రెండు నటనలకూ ఏదో తేడా వుంది. ఇక్కడా, అక్కడా నమ్మించే ప్రక్రియలు వేరన్నమాట.
సినిమాలో అయినా, రంగస్థలం మీదయినా, ‘మీరు చూస్తున్నది నిజం కాదు’ అని చెప్పటానికి అనేక ఆధారాలు వుంటాయి. ఇది సినిమాయే, ఇతను ఎన్టీఆరే, కృష్ణుడు కాడు – అంటూ టైటిల్స్ దగ్గర నుంచే హెచ్చరిస్తూ వుంటారు. అంతే కాదు, మధ్యలో ‘ఇంటర్వెల్’ ఇచ్చి, ‘ఇందాక చూసిన ఫైటింగ్ నిజం కాదు, ఇప్పుడు తింటున్న పాప్ కార్న్ నిజం’ అని గిల్లి కూడా చెబుతాడు.
అంటే ఏది చూస్తున్నామో అది కల్పన అన్న స్పృహలో వుంటూనే, ఆ కాస్సేపూ నిజంలా భ్రమిస్తాం.
అయితే నిజ జీవితంలో మనల్ని స్పృహలోకి తెచ్చే జాగ్రత్త ఎవరూ తీసుకోరు.
కీచకుడే ప్రేమికుడి వేషంలో వస్తే, అతడు కీచకుడన్న స్పృహ కలిగించటానికీ ఎవరూ వుండరు. కాబట్టే జీవితంలో నమ్మించటానికి మేకప్పూ, కాస్ట్యూమ్స్‌తో పనివుండదు. అలాగే నిజజీవితంలో నటులకు కథ, మాటలూ, స్క్రీన్ ప్లే కూడా రాసి పెట్టరు. ‘ఇలాగే నటించాలని’ ఏ దర్శకుడూ సూచనలివ్వడు.
అంతా స్వంతం. సర్వమూ స్వంతం. అలాంటి పరిపూర్డుడయన కళాకారుడే నిజజీవితంలో మహానటుడయి పోతాడు. ఈ గుర్తింపు వాడికి ఇవ్వటం ఇష్టం లేక మనం ‘వంచకుడు’ అని ఆడి పోసుకుంటాం.
ఆ లెక్కన తెర మీద జీవించేది నటన, జీవితంలో నటించే వంచన అవ్వాలి.
మార్కెట్టు వచ్చి, అనుబంధాల స్థానంలో అవసరాలను నిజ జీవితంలో మహానటులు తెగ పుచ్చిపోతున్నారు.
‘ఈవెనింగ్ షోకు ఐమాక్స్ టికెట్లు తీస్తున్నావ్ కదా! ఐ లవ్యూ!’ అని ఎస్మెమ్మెస్ (సంక్షిప్త సందేశం) పంపుతాడు ప్రియుడు తన ప్రేయసికి.
ఇది నటనా ? కాదా?
చెప్పటానికి మీరెవరు? నేనెవర్ని?
ఆమె చెప్పాలి. ఈ ప్రేమను ఆమెను నమ్మిందా? లేదా? అని. నమ్మి ఊరుకుంటే నటన. నమ్మి మోసపోతే వంచన! రాను రాను, వంచకులే వర్థిల్లుతున్నారు.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 13-3-2013 వ తేదీ సంచికలో ప్రచురితం)