మన జేపీ, కేజ్రీవాల్‌ కాలేరా?

Dr._Jayaprakash_Narayan‘చీచీచీ చీనా వాడు, చౌచౌచౌ చౌనీ దాన్ని ప్రేమిస్తాడు’ అన్నాడు శ్రీశ్రీ. ఏ రేంజ్‌కు ఆ రేంజ్‌ ప్రేమలుంటాయి. మమమ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే కుర్రాడు వివివి విప్రోలో పనిచేసే కుర్రదాన్ని ప్రేమిస్తాడు. రాజకీయాల్లో పొత్తులు కూడా అంతే. పేరు మోసిన పార్టీల మధ్యే పొత్తులు వుండాలన్న రూలు లేదు. నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోవచ్చు. పువ్వు పుట్టగానే ‘ప్రేమించినట్టు’, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) పుట్టగానే పొత్తు పెట్టుకోవటానికి సిధ్దపడుతోంది.

‘గంతకు దగ్గ బొంత’ను వెతుక్కునే పనిలో భాగంగా, రాష్ట్రంలో ‘లోక్‌ సత్తా’ దొరికింది. అయితే ఈ ‘స్టోరీ’ కరెక్టు కాదూ, లోక్‌ సత్తా యే, పొత్తుకు వెంటబడుతోందీ- అన్న కథనం కూడా లేక పోలేదు. ఎవరు ఎవరి వెంట బడితే, ఏం- కానీ, రెండు పార్టీ ‘లవ్‌’ సిగ్నల్స్‌ ఇచ్చుకున్నాయి. రెండు పార్టీల అధినేతల (కేజ్రీవాల్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌) ‘జాతకాలూ’ కలిశాయి కూడా. ఇద్దరూ, యూపీయస్సీ వారు నిర్వహించే ‘సివిల్‌ సర్వీసెస్‌’ రాసి అధికారులయిన వారే. కాకుంటే ఒకరిది : ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌), మరొకరిది: ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌(ఐయ్యేఎస్‌). అలాగే ఇద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేసిన వారే. ఇద్దరూ ‘అవినీతికి వ్యతిరేకంగా’ ఉద్యమం చేసినవారే. తీరులు వేరు. వేదికలు వేరు. కాకుంటే చిన్న తేడా. జయప్రకాశ్‌ నారాయణ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ- అన్నీ ఆయనే. కానీ ఢిల్లీ అడ్డాగా వచ్చిన ‘లోక్‌పాల్‌’ ఉద్యమానికి కర్త అన్నాహజారే. కేజ్రీవాల్‌ కేవలం పక్క వాయిద్యం మాత్రమే. ఈ మాత్రం తేడాలు వున్నా, జాతకాలు సరిపోయాయి. కానీ, వియ్యం అందుకునే నాటికి వీరి అంతరాలలో తేడా వుంది. జేపీ, కేజ్రీవాల్‌లు ‘భూమ్యాకాశాలు’ గా వున్నారు.

పార్టీ నెలలు పెట్టి తొమ్మిది నెలల కాలంలో తన ‘చీపురు’ గుర్తుతో, ఢిల్లీ రాజకీయాలను తుడిచి పారేశాడు, ‘వద్దనకున్నా వెంటపడి మరీ ఇచ్చిన కాంగ్రెస్‌ మద్దతు’తో అధికారంలోకి వచ్చారు. జేపీ అలా కాదు. ఆయన రాజీనామా చేసి, నెలలు కాదు, 19 యేళ్ళు కావస్తోంది. తర్వాత హక్కుల ఉద్యమ సంస్థలాగా ‘లోక్‌సత్తా’ ను స్థాపించారు. 2006లో ‘లోకసత్తా’ పార్టీగా అవతరించింది. అంటే ఇప్పటికి ఏడేళ్ళవుతోంది. కానీ 294 అసెంబ్లీ స్థానాలున్న అంధ్రప్రదేశ్‌ లో ‘లోకసత్తా’ సాధించుకున్న స్థానం ఒకే ఒక్కటి. ఆ సభ్యుడు కూడా జేపీయే. ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ కూడా ఆయనే. ఎలా చూసినా అసెంబ్లీలో జేపీ ‘ఏక్‌ నిరంజన్‌’. ఈయన ప్రాతినిథ్యం వహించే నియోజక వర్గం(కుకట్‌ పల్లి) కూడా సొంత జిల్లాలో లేదు. హైదరాబాద్‌ లో వుంది. కానీ ఆ నియోజవర్గంలో తన ‘సామాజిక వర్గాని’కి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువగా వుంది.

కానీ, ‘ఆప్‌’ అలా కాదు. సామాజికంగా అట్టుడుగున వున్న వారూ, ఢిల్లీ శ్రామిక వాడల్లో వున్న వారూ ఈ పార్టీకి మద్దతు ఇచ్చారు.

గత రెండుదశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్‌లో మీడియా జేపీ కల్పించినంత ప్రచారం, మరే పార్టీలో, ఏ నేతకూ ఇవ్వలేదు. ఒక ప్రముఖ మీడియా సంస్థ అయితే ‘జేపీ’ని భుజాన వేసుకుని ఇప్పటికీ మోస్తూనే వుంది. ఇంత గాలి కొట్టినా, 2009లో 1.5 శాతం మాత్రమే జేపీ దక్కించుకోగలిగారు.

కాబట్టి, పొత్తు విషయంలో ఎవరు వెంట ఎవరు పడాలన్నది, వేరే చెప్పనవసరం లేదు. కేజ్రీవాల్‌ అవసరమే జేపీకి వుంటుంది కానీ, జేపీ అవసరం కేజ్రీవాల్‌కు వుండదు. అంటే కేజ్రీవాల్‌ ఆశించినట్లుగా జేపీ నడుచుకోవాలి కానీ, జేపీ ఆశించినట్టుగా జేపీ నడుచుకోరు. ‘ఆప్‌’ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించింది. కానీ అప్పటికే జేపీ రాష్ట్ర విభజన చేస్తున్న తీరు మీద విమర్ళ వర్షం కురిపిస్తున్నారు. ఆయన్ని కొందరు ‘సమైక్యవాది’ అనీ, మరి కొందరు చంద్రబాబు ‘సమన్యాయ’ వాది అనీ ముద్రలు వేశారు. కానీ అంతిమంగా ఆయన తనంతట తాను ‘తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం’ అని ప్రకటించాల్సి వచ్చింది. కారణం: ‘ఆప్‌’తో పొత్తును ఆశించటం. కడకు జేపీ కూడా రాజకీయం కోసం రాష్ట్ర విభజన అంశంలో ఇన్ని ‘టర్న్‌’లు కొట్టటం కొంచెం ఆశ్చర్యంగానే వుంటుంది. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కేనా? అన్నది ప్రశ్న.

ఇన్నాళ్ళూ జేపీ రాజకీయాల్లో ‘తామరాకు మీద నీటి బొట్టు’ లాగా జీవించారు. ఆయనకు ఏ మలినమూ అంటలేదు. సంతోషమే. కానీ, రాజకీయం కూడా అంటలేదు. రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎన్నో సమస్యల మీద ప్రజలు ఎన్నో రకాలుగా ఉద్యమించారు. కానీ ఏ ఉద్యమానికీ ఆయన సారథికాలేక పోయాడు. ఏ నినాదానికి కర్త కాలేక పోయాడు. రాజనీతిని పోటీ పరీక్షల కోసం చదివే విద్యార్థిలాగా అభ్యసించటానికీ, ప్రజాఉద్యమాల్లో మునిగితేలే ఉద్యమకారుడిలా అధ్యయనం చేయటానికీ తేడా వుంటుంది. ఈ చిన్న తేడా తెలిస్తే దశాబ్దం క్రితమే గొప్ప నేత అయ్యే వారేమో. కానీ రాజకీయాల్లో ఒక్క సారి మిస్సయిన బస్సు మళ్ళీ మళ్ళీ రాదు

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 25-31 జనవరి 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “మన జేపీ, కేజ్రీవాల్‌ కాలేరా?

  1. ఆఆఆ ఆర్టికల్ చచచ చాలా బాగుంది సార్… జేపీకీ- కీజ్రీవాల్ క్రేజీకీ వున్న తేడాను స్పష్టం చేశారు. పొత్తులకు ఎదిరేదేదీ బబబ బాగా వివరించారు……

Leave a Reply