మాటలో పాగా!

ఒక్కడే.

మాట్లాడతాడు. తనలో తాను కాదు. తన ముందున్న వారితో. తనకు దూరంగా వున్నవారితో. వందలు, వేలు, లక్షలు, కోట్ల మందితో!

అప్పుడు మాట మంత్రం కాదు. మాధ్యమం.

మాధ్యమం మారణాయుధమూ కాగలదు. మృత సంజీవినీ కాగలదు. అక్షరం చేసి ముద్రించినా, శబ్దం చేసి వినిపించినా, దృశ్యం చేసి చూపించినా, లేక ముద్రిత శబ్దచలనచిత్రంగా మార్చి అంతర్జాలంలో ఆవిష్కరించినా మాట మాటే.

మాట మీద పెత్తనం వున్న వాడే, నేడు భూమండలాన్ని శాసిస్తున్నాడు.

భూమి మీదా, డబ్బు మీదా కొందరికే పెత్తనం వున్నప్పుడు భూస్వామ్యమనో, ధన స్వామ్యమనో ప్రజాస్వామిక వాదులు గుండెలు బాదుకున్నారు. కొందరే యజమానులయితే, ఎందరో బానిసలుంటారని వేరే చెప్పనవసరం లేదు.

మాధ్యమంగా మారిన మాట మీద కూడా కొందరి పెత్తనమే వుంది. ఇదే మాధ్యమస్వామ్యం.

కొందరికే నోరుంటే, ఎందరో మూగవారవ్వాలి. అయ్యారు. అవుతున్నారు.

మనం పత్రిక చదవం; పత్రికే మనల్ని చదువుతుంది.

మనం ఎఫ్‌ఎం(రేడియో) వినం; ఎఫ్‌ ఎమ్మే మనల్ని వింటుంది

మనం టీవీ చూడం; టీవీయే మనల్ని చూసేస్తుంది.

అంతర్జాలం మనకు చిక్కదు; అంతర్జాలానికే మనం చిక్కుతాం.

మాట నేర్చిన అల్పసంఖ్యాకుల ముందు, అధిక సంఖ్యాకులెప్పుడూ మూగవారే. ఏది చదవాలో, ఏది వినాలో, ఏది చూడాలో, ఏది వెతుక్కోవాలో మాధ్యమస్వాములే చెబుతారు.

ఊరే లేని ‘అస్పృశ్యుడి’తో, దేశం కోసం పోరాడమని చెప్పింది కూడా వీరే.

కడుపు మండి కూలివాడు భూస్వామ్యం మీదా, కార్మికుడు ధనస్వామ్యం మీదా పిడికిలి బిగించినట్లు, మూగశ్రోత కూడా మాధ్యమ స్వామ్యం మీద ‘వెర్రిగొంతు విచ్చుకుంటాడు’

సరిగ్గా అలాంటి చారిత్రక సందర్భంలోనే (1920) అంబేద్కర్‌ ‘మూక్‌ నాయక్‌’ (మూగ వాళ్ళ నాయకుడు) అనే పత్రికను ప్రారంభించారు. ఇది యుధ్ధమే. మాట మీద మౌనం తలపెట్టిన మహా సంగ్రామమే. ఈ సమరం నేటికీ కొనసాగుతోంది.

మాటకారి చేసే మోసం ఎప్పుడూ ఒక్కటే: ఎజెండాను మార్చటం. అంటే మౌనాన్ని అంగీకారం గానో, అర్థాంగీకారంగానో వక్రీకరించటం.

దేశభక్తితో ఊగిపోతున్న జాతీయోద్యమ పత్రికలు కూడా ఇదే పని చేశాయి. ఎక్కడివరకో ఎందుకు బాలగంగాధర తిలక్‌ స్థాపించిన ‘కేసరి’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని అందరితో అనిపించినట్టే, ఊరువెలుపల వున్న అస్పృశ్యుల చేత కూడా అనిపించాలనుకున్నది. కానీ, అస్పృశ్యులు అనాల్సింది : ‘స్వగ్రామం నా జన్మహక్కు’ అని కదా! రెండు వందల యేళ్ళ పాటు తమ దేశాన్ని తమకు కాకుండా చేసిన తెల్ల దొరల మీద సవర్ణ భారతీయులకు కలిగించాల్సిన కోపం వేరు; మూడు వేల యేళ్ళ పాటు తమ ఊరును తమకు కాకుండా చేసిన నల్ల దొరల మీద ‘అంటరాని’ భారతీయులకు రగిలించాల్సిన ఆగ్రహం వేరు. కానీ అప్పటి అగ్రవర్ణ పత్రికలు ‘అస్పృశ్యుల’ ఎజెండాను మరుగు పరచి, తమ ఎజెండానే వారి మీద రుద్దాయి. ఇది మాధ్యమ స్వామ్యానికి మచ్చుతునక.

జెండాను మార్చటం కన్నా ప్రమాద కరం- ఎజెండాను మార్చటం. ఈ కుట్రను భగ్నం చెయ్యాలంటే మూగవాళ్ళు మాట్లాడాలి. ప్రత్యామ్నాయ మాధ్యమానికి రూపకల్పన చెయ్యాలి.

ఈ పనిని నాడు దేశవ్యాపితంగా మహత్మా ఫూలే, అంబేద్కర్‌ లు చేస్తే, తెలుగు నాట భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్నలు చేశారు. వారి వారసత్వంగా సమాంతర పత్రికారచన నేటికీ కొనసాగుతూనే వుంది. ఈ సత్యాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించే ప్రయత్నమే కవి, పాత్రికేయుడు, పరిశోధకుడు జి.కె.డి ప్రసాద్‌ రావు ‘ తెలుగు దళిత పత్రికలు- ఆవిర్భావ, వికాసాలు- విశ్లేషణాత్మక పరిశీలన’ అనే తన సిధ్ధాంత వ్యాసంలో చేశాడు. చాలా వరకూ సఫలీకృతుడయ్యాడు కూడా.

xxx                            xxx                         xxx

నా భూమి నా కివ్వు- అన్నట్లు, నా మాట నా కివ్వు అనగలగటం చైతన్యమే. దళితులు ఈ చైతన్యాన్ని మూడు విధాలుగా ప్రకటించారు.

ఒకటి: తమ పత్రికలలో తాము ప్రకటించటం.

రెండు: తమకు సంఘీభావం తెలిపే పత్రికలలో ప్రకటించటం

మూడు: తమకు విరుధ్ధభావ జాలమున్న అగ్రవర్ణ, అగ్రవర్గ, హిందూ పత్రికలలో ప్రకటించటం.

ఈ ముప్పేట భావప్రకటనా సమరంలోను మైలు రాళ్ళనూ, గెలుపు ఓటములనూ రచయిత నమోదు చేశారు.

నిజానికి, మూడూ మూడు ప్రత్యేక పోరాటాలు. మూడింటి గమ్యం ఒక్కటే: తమ ఎజెండాను తాము పలకటమే.

కానీ మూడింటి వ్యూహాలు వేరు.

xxx                xxx                     xxx

మనం తెల్లవాడి కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివి వుండవచ్చు. కానీ వాడు వచ్చాక బళ్ళు వోడలయినట్లు, ఆకులు పేజీలయ్యాయి. తెల్లని కాగితం మీద అక్షరం నల్లబోయింది. అచ్చోసి వదిలేస్తే, అందరికీ చేరిపోయింది. మాటకారులు గొంతు చించుకోవటం మాని, ‘చేయి చేసుకోవటం’ మొదలు పెట్టారు. వక్తలు కాస్తా, పత్రికా రచయితలయ్యారు. మూగ శ్రోతలే, మూగ పాఠకులయ్యారు.

తెల్లవాడిదే తొట్టతొలి ‘ముద్రణా మాధ్యమ స్వామ్యం’ కాబట్టి, వాడి మాటనే అందరి చేతా పలికించాడు.

వేదాలు పఠించిన వారే, ఆంగ్లమూ ఆధ్యయనం చేసి, తొలుత ఈ పత్రికల్లో తెల్లవాడి ఎజెండానే పలికారు. పలికించారు. తర్వాత స్పృహలోకి వచ్చి తమ ఎజెండాను తాము వెతుక్కున్నారు.

కొన్నాళ్ళకు ఈ ‘ఆంగ్ల విద్యావంతులే’ ఆంగ్లంలోనూ, భారతీయ భాషల్లోనూ పత్రికలు స్థాపించి, మాధ్యమ స్వాములయ్యారు.

అయితే వీరంతా, ఇలా అనుకోగానే అలా పత్రికలు పెట్టలేదు. ముందు ఉద్యమాలు లేవ దీశారు. ఆ తర్వాతే వీరికి మాధ్యమం అవసరమయింది. ముందు తెల్ల వాడికి ముద్దొచ్చే సంస్కరణోద్యమాన్ని తెచ్చారు. అదీ అలా నడుస్తుండగానే వీరిలో కొందరు అదే తెల్లవాడికి తిక్కరేగే జాతీయోద్యమాన్ని తెచ్చారు.

రెంటికీ పత్రికలవసరమయ్యాయి.

అంబేద్కర్‌ జీవిత చరిత్ర రాసిన ధనుంజయ్‌ కీర్‌ మాటల్లో చెప్పాలంటే, ఆ రోజుల్లో, ‘ పత్రిక లేని నేత , రెక్కల్లేని పక్షి’ లాంటి వాడు.

సంస్కరణోద్యమ నేతలు తెల్లవాడి చల్లని నీడన చక్కగా పత్రికా వ్యవస్థాపనకు పూనుకున్నారు. వీరి సంస్కరణకి కేంద్ర బిందువు స్త్రీ.

స్త్రీ అంటే వేరెవరో కాదు. వేద పండితుణ్ణి ట్టుకున్నా, వేదం పఠించటానికి నోచుకోని స్త్రీ.

ఆ స్త్రీ చుట్టూ రెండే రెండు దురాచారాలు: సతీసహగమనం, బాల్యవివాహం.

ఈ రెండూ ఒకే నాణేనికి రెండు వైపులు. బ్రాహ్మణుల్లోనూ, రాజపుత్రుల్లోనూ ఈ దురాచారాల్ని పరమ పవిత్రంగా ఆచరించే వారు.

ఇంగ్లీషు చదువులు చదివాక కానీ, ఈ వర్ణాలలోని ఉత్తమ పురుషులకు తాము తమ స్వంత స్త్రీలను చంపేస్తున్నా మన్న స్పృహ రాలేదు. దాంతో స్త్రీలను బతకనియ్యటమే సంస్కరణ అయిపోయింది. చదవ నివ్వటం, పునర్వివాహం చేసుకోనివ్వటం పెను విప్లవాలయిపోయాయి.

ఈ ఉద్యమానికి అగ్రభాగాన నిలిచిన రాజారామమోహన్‌ రాయ్‌ పత్రికల అవసరాన్ని గుర్తించి ముందు బ్రాహ్మణికల్‌ మేగజైన్‌(1821) స్థాపించి, ఏడాది తిరగకుండానే ‘సంవాద కౌముది’ అనే మరోపత్రికను నెలకొల్పారు.

ఆయన ఉద్యమం ఈ స్త్రీలకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

అయితే, బతుకే చావుగా కాలం వెళ్ళదీసే కోటాను కోట్ల ఇతర భారతీయ స్త్రీలు వున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో ‘అస్పృశ్య’ స్త్రీల స్థితి నరకమే. వారికి గుండెల మీద రవికెలు కూడా నిషిధ్ధమే. కొన్ని చోట్ల వారిని జోగిని, మాతంగిల పేర్ల మీద ఊరందరికీ వేశ్యలుగా మార్చుకునే వారు.

రాజారామమోహన్‌ రాయ్‌ తెచ్చిన సంస్కరణ వాద ఉద్యమ ఎజెండా వీరికి సరిపోతుందా?

శూద్ర, అతి శూద్ర స్త్రీల ఉధ్ధరణకు వేరే ఎజెండా ఉండి తీరాలి. ఇలా ఆలోచించిన సంస్కరణ వాది జ్యోతిరావు ఫూలే.వెనుక బడిన కులం పుట్టిన ఈ స్త్రీల కోసం ఉద్యమాన్ని తన ఇంటినుంచే మొదలు పెట్టారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దాడు. ఆమె చేత అస్పృశ్య స్త్రీలకు విద్యాబోధన చేయించారు. ఆమె కవిగా, సంస్కర్తగా మారారు. ఆయన ఆశయాలను కార్యరూపంలో పెట్టటానికి (1873లో)సత్య శోధక్‌ సమాజ్‌ స్థాపించారు. ఈ బడుగు వర్గాల స్త్రీ జనోధ్ధరణ కు ప్రత్యామ్నాయ భావజాలం అవసరం అయింది. ఈ ఎజెండా ను ముందుకు తీసుకు వెళ్ళటానికి ఈ సమాజ్‌ నుంచే కృష్ణారావు బాలేకర్‌ సంపాదకత్వంలో'(1879లో) ‘దీన బంధు’ అనే పత్రికను ప్రారంభించారు.

అభిమానం ప్పుకోవటానికి వస్త్రాలే లేని స్త్రీల ఉధ్ధరణకూ, పరదా చాటున మగ్గుతున్న స్త్రీల విముక్తి కీ ఒక ఎజెండా కుదరదన్నదే ఫూలే దంపతుల అభిప్రాయం.

ఆ రోజుల్లో ‘దీనబంధు’ పత్రిక మీద విష్ణుశాస్త్రి చిప్‌లుంకర్‌ వంటి అగ్రవర్ణ ఛాందస జాతీయవాదులు విరుచుకు పడ్డారు. ఈ పత్రిక శూద్ర, అతి శూద్ర స్త్రీల అభ్యున్నతికే కాకుండా, ఆ వర్గాలకు చెందిన పేద రైతుల కష్టాలనూ, ఇసుక కార్మికుల కడగండ్లను వెలుగులోకి తెచ్చింది.

అప్పట్లో చాలా మంది సంస్కరణ వాదుల్లాగా ఫూలే తెల్లవారి విధానాలకు తలాడించలేదు. వారిచ్చే ఇంగ్లీషు విద్యను స్వాగతిస్తూనే, విద్యావిధానాన్ని ఫూలే తూర్పారబెట్టారు. ఈ విధానం తిరగి వేద పండితుల పిల్లల్నే ఇంగ్లీషు చదువుల్లో ఆరి తేరేటట్లు చేస్తుంది కానీ, అత్యధికులుగా వున్న శూద్ర, అతిశూద్రులకు ప్రయోజనకరంగా లేదని తన రచనల్లో ఉతికి ఆరేశారు.

అంతే కాదు, బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీఅ ఉధ్ధరణకే కంకణం కట్టుకున్నదని బ్రహ్మసమాజ్‌ వంటి సంస్థలను కూడా ఎత్తి పొడిచారు. ‘మీ సంస్థల సహాయం మాకవసరం లేదు. మా గురించి దిగులు పడకండి’ అంటూ ప్రత్యామ్నాయ మాధ్యమానికి ఆనాడే శ్రీకారం చుట్టాడు.

అదే సమయంలో అగ్రవర్ణ స్త్రీల కష్టాల పట్ల కూడా ఫూలే దంపతులు ఆచరణాత్మకంగా తమ సానుభూతిని ప్రకటించారు.

బాల్యవివాహాల కారణంగా చాలా మంది బ్రాహ్మణ వితంతువులు వంచనకు గురయి గర్భాలు దాలిస్తే, వారికి పుట్టిన పిల్లలను అక్కున చేర్చుకుని, అనాధశరణాలయాలను తెరచిన మహనీయులు ఫూలే దంపతులు.

ఇలా జాతీయ స్థాయిలో సంస్కరణోద్యమానికి సమాంతర ఉద్యమాన్ని ఫూలే తెస్తే, తెలుగు నాట ఆ పనిని భాగ్యరెడ్డి వర్మ లాంటి వారు చేశారు. అందుకోసం ప్రత్యామ్నాయ మాధ్యమాన్ని సృష్టించుకున్నారు.

రాజారామ్‌మోహన్‌ రాయ్‌ ఎలా కలకత్తా నుంచి సతీసహగమనానికీ వ్యతిరేకంగా పోరాడారో, అలా కోస్తా ఆంధ్ర (రాజమండ్రి) నుంచి బ్రాహ్మణ వితంతువులకు పునర్వివాహాలు చెయ్యాలనీ, స్త్రీలకు విద్యకావాలనీ కందుకూరి వీరేశలింగం స్కంరణోద్యమానికి తెరలేపారు. అందుకు ఆయన (1874లో) ‘వివేక వర్థని’ పత్రికను స్థాపించారు. ఆయన బ్రాహ్మణుడే అయినా బ్రాహ్మణుల్లో ఛాందసులకు మింగుడు పడేవాడు. కొక్కొండ వెంకటరత్నం అయితే ఏకంగా వీరేశలింగాన్ని వెక్కిరించటానికి ‘ హాస్య వర్థని’ అని పత్రిక పెట్టారు. (ఇందుకు విరుగుడుగా మళ్ళీ వీరేశలింగమే ‘హాస్యసంజీవిని'(1876) అనే పత్రికు పెట్టి కొక్కొండకు వాతలు పెట్టారనుకోండి. అది వేరే విషయం). వీరేశలింగం కూడా పండితుల కుటుంబంలో పుట్టి ఆంగ్లవిద్యనభ్యసించిన వాడే. ఆయన ఇంగ్లీషు సాహిత్యాన్నీ, పత్రికల్నీ విస్తారంగా చదివి స్ఫూర్తి పొందారు. బొంబాయినుంచి వచ్చే ‘ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌’ పత్రికను ఆయన తెప్పించుకుని చదివే వారు.(ఇప్పటికీ ఈ పత్రిక ప్రతులు కొన్ని రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో పదిలంగా వున్నాయి). ఇంతటి పోరాటమూ కేవలం అగ్రవర్ణ స్త్రీలకే పరిమితమయిపోయింది.

తెలుగునాట బడుగు వర్గాల స్త్రీల కోసం మరో సంస్కరణోద్యమం బాకీ వుండి పోయింది. అనూహ్యంగా ఈ రుణాన్ని తెలంగాణ గడ్డ మీద ‘అస్పృశ్య’ కులంలో పుట్టిన భాగ్యరెడ్డి వర్మ( మాదిరి భాగయ్య) తీర్చారు. మహారాష్ట్రలో ఫూలే ఏం చేశారో, ఇంచు మించు అదేపనిని ఈయన చేశారు. వీరేశలింగం బ్రాహ్మణ స్త్రీల బాధలకు కరిగిపోతే, భాగ్యరెడ్డి వర్మ అంటరాని కులాల్లో వున్న జోగిని వంటి దురాచారాలకు కదిలిపోయాడు. ఈ దురాచారం మీద మహోద్యమాన్ని లేవ దీశారు. అప్పటి నిజాం ప్రభుత్వాన్ని కదిలించారు. జోగిని దురాచారాన్ని నిషేధిస్తూ శాసనం చేయించారు. అంతేకాదు ‘అంటరాని’ కులాల బాలబాలికల చదువుల కోసం పాతిక వసతి గృహాలను తెరిపించారు. ఈ సంస్కరణోద్యమానికి కరదీపికగా వుండేందుకు (1931లో) ‘భాగ్యనగర్‌’ పత్రికను స్థాపించారు. ఎజెండా వేరయినప్పుడెల్లా చరిత్రలో బడుగులకు ప్రత్యామ్నాయ మాధ్యమం అవసరమవుతుందని ఇలా భాగ్యరెడ్డి వర్మ మరోసారి రుజువు చేశారు.

పత్రికల్లో ఈ రెండు స్రవంతులూ సంస్కరణోద్యమంలోనే కాదు, జాతీయోద్యమంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రెండు ఉద్యమాలనూ రెండు కళ్ళుగా భావించిన క్రాంత దర్శి అంబేద్కర్‌. అందుకే ఒక్కొక్క చారిత్రక సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఉద్యమపత్రికను వెలువరించారు. అయితే ఆయన ప్రతీ ప్రయత్నాన్నీ నిలువరించటానికీ, నీరు గార్చటానికీ చాలా పేరున్న నేతలే ప్రయత్నాలు చేశారు. అంతెందుకు? ఆయన ‘మూక్‌ నాయక్‌’ పత్రిక తెస్తున్నట్లుగా బాలగంగాధర తిలక్‌ ‘కేసరి’లో చిన్న ప్రకటన వేయమని అభ్యర్థించినా వేయలేదు. అక్కడికీ అంబేద్కర్‌ ఆ ప్రకటన అయ్యే ఖర్చు ఇస్తానన్నారు కూడా. తిలక్‌ వంటి ‘దేశభక్తుడే’ ప్రత్యామ్నాయ మాధ్యమాన్ని భరించలేక పోయాడంటే, ఇక మామూలు అగ్రవర్ణ జాతీయ వాదులు ఎంతటి అసహనానికి గురయి వుంటారో ఊహించుకోవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే ‘కేసరి’ లాంటి జాతీయోద్యమ పత్రికలకు ప్రత్యామ్నాయమే ‘మూక్‌ నాయక్‌’.

‘కేసరి’ నినాదం ‘స్వరాజ్య’మయితే, ‘మూక్‌ నాయక్‌ ‘ లక్ష్యం ‘సమ రాజ్యం’. ఈ విషయాన్ని అంబేద్కర్‌ తొలి సంచికలోనే స్పష్టం చేశారు. జాతీయోద్యమానికి సరికొత్త చర్చనీయాంశాన్నిచ్చారు.

హిందూ సమాజమే భారతీయ సమాజమనీ, ఈ సమాజాన్ని బ్రిటిష్‌ వాళ్ళ కబందహస్తాల్లో వుండిపోయిందని నమ్మే బ్రాహ్మణ జాతీయ వాద పత్రికలకు భిన్నమైన వాదనను ఈ సంచికలో రాసిన వ్యాసంలో అంబేద్కర్‌ ముందుకు తెచ్చారు.

హిందూ సమాజం మొత్తం ఒక్క ముక్క కాదనీ, మొత్తం మూడు ముక్కలని తేల్చిఅవతల పారేశారు. బ్రాహ్మణులూ, బ్రాహ్మణేతరులూ, అస్పృశ్యులే ఆ మూడు విభాగాలు.

అంతే కాదు. జాతీయోద్యమానికి సారథ్యం వహిస్తున్న బ్రాహ్మణవాదం లో రెండు ప్రధాన లోపాలను ఎత్తి చూపారు. ఒకటి: జంతువుల్లోనూ, నిర్జీవుల్లోనూ భగవంతుణ్ణి చూడగలరు కానీ, సహ మతస్తులయిన సాటి మనుషుల్ని మాత్రం అంటరాని వారినిగా చూడటం. రెండు: జ్ఞానాన్నీ, విద్యనీ పంచకుండా దాచుకోవటం లేదా గుప్తం చేయటం. ఈ రెండు అవలక్షణాలున్న వాళ్ళు నిజంగా ‘స్వరాజ్యం’ తెచ్చేస్తే, అణగారిన కులాల వారికి ప్రాథమిక హక్కులయనా మిగులుస్తారన్న నమ్మకం ఏమిటి అని ప్రశ్నిస్తారు.

ఇంత బలంగా కొత్త ఎజెండా ముందుకు తేవాలంటే మాట మీద హక్కు ‘అస్పశ్యుడి’కి వుండాలి. అది ‘మూక్‌ నాయక్‌’ వంటి ప్రత్యామ్నాయ ప్రసార సాధనం వల్లే సాధ్యమయింది. ఈ రాతల్నే అంబేద్కర్‌ రాసి ‘కేసరి’ కి పంపించి వుంటే తిలక్‌ ప్రచురించేవారా?( వాణిజ్య ప్రకటనకే చోటివ్వని పెద్ద మనిషి స్వతంత్ర భావ ప్రకటనకు చోటిస్తారా?)

బ్రిటిష్‌ వారి అన్యాయమైన పాలన మీద బ్రాహ్మణులు విరుచుకు పడటం ధర్మసమ్మతమయితే, నిజంగా అధికార మార్పిడి జరిగినప్పుడు ఇదే బ్రాహ్మణుల పెత్తనాన్ని అణగారిన వర్గాల వర్గాల వారు నిలదీయటం వంద రెట్లు సమ్మతం అని ‘మూక్‌ నాయక్‌’లోనే అంబేద్కర్‌ రాసిన మరో వ్యాసం లో లెక్క తేల్చారు. అప్పుడర్థమయింది అందరికీ- అంబేద్కర్‌ ఈ పత్రికను ఎందుకు స్థాపించారో!

తిలక్‌ తిలక్‌ లాగే వున్నారు. ‘కేసరి’, ‘కేసరి’లాగానే వుంది.

అంబేద్కర్‌ ఉద్యమంలో మరో మలుపు వచ్చింది.

చెరువుల్లోకి, బావుల్లోకి, ధర్మశాలల్లోకి అస్పృశ్యులకు ప్రవేశం కల్పిస్తూ బొంబాయి శాసన మండలి బోలే తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఈ తీర్మానం అమలును స్థానిక సంఘాలకు అప్పగించింది. ఈ సంఘాల్లో సభ్యులుగా వున్న వారు ‘సంకుచిత మనస్కులు, పాతకాలం వాళ్ళూ, చాందసులూ, తిరోగమనవాదులూ’. వీరంతా అణగారిన వర్గాల వారిని అసహ్యించుకునే వారే! అడ్డుకునే వారినే అమలు చేయమంటే, చేస్తారా?

సర్కారు చట్టం చేసినా వర్ణ సమాజం దానిని చిత్తుకాగితంలా మార్చేస్తుందనీ. అందుకే రాజకీయ స్వాతంత్య్రం కన్నా ముందు అగ్రవర్ణ ఆధిపత్యంలేని సామాజిక స్వాతంత్య్రమే రావాలనీ చాటిచెప్పటానికి అంబేద్కర్‌ ఇదే అదను అని భావించారు.

ఈ విషయాలని అణగారిన వర్గాల వారికే అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నారు. అంటే ఇంత వరకూ ఈ వర్గాలకు ‘గొంతు’గా వున్న అంబేద్కర్‌ ‘కళ్ళూ, చెవులు’గా కూడా మారాలనుకున్నాడు. ఈ పనిని అగ్రవర్ణ మాధ్యమాలు చెయ్యవు. ఇలాంటి సందర్భంలోనుంచే ఆయన ‘బహిష్కృత్‌ భారత్‌’ అనే మరాఠీ పక్షపత్రికను(1927లో) పెట్టారు.

చెరువుల్లోకీ, బావుల్లోకీ రానివ్వకుండా వుండటానికి విద్యావంతులయిన అగ్రవర్ణులు చెప్పే కుంటి సాకులను తన రచనల ద్వారా కొట్టి పారేసారు.

గోవు మాంసాన్ని తింటున్న వారు చేతులు పెడితే నీళ్ళు కలుషితమవుతాయి -అని వాదించినప్పుడు, ఇదే గోమాంసాన్ని తిన్న ముస్లిం చక్రవర్తులూ, బ్రిటిష్‌ క్రైస్తవులూ చేతులు పెట్టినప్పుడు కలుషితమయ్యాయా- అని ప్రశ్నవేశారు.

ఇంతగా కరడుకట్టిన కులవాదులే స్వరాజ్యం తెచ్చేస్తే, అణగారిన వర్గాలను బతకనిస్తారా? అనుమానాన్ని తన పత్రిక ద్వారా నిత్యమూ రేకెత్తించేవారు.

‘మూక్‌ నాయక్‌’ పత్రికలో తిలక్‌ను మెత్త మెత్తగా పరోక్షంగా మొత్తిన అంబేద్కర్‌, ‘బహిష్కృత్‌ భారత్‌’లో నేరుగా నిర్మొహమాటంగా కడిగేశారు.

ఇదే పత్రికలో ఆయన రాసిన సంపాదకీయం(29 జులై 1927)లో ఎప్పటికీ బ్రాహ్మణ జాతీయవాదులకు మింగుడు పడని సవాలు విసిరారు:

కేసరే కనుక అస్పృశ్యుడిగా పుట్టి వుంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనటానికి బదులు ‘అంటరానితనం నిర్మూలన నా జన్మహక్కు’ అని ప్రకటించేవారు.

ఈ వాస్తవాన్ని ఆయన కాదనగలరా?

సమాధానం వుండదు.(ఆయనేమన్నా గురజాడా? ‘మంచియన్నది మాల అయితే మాల నేనగుదున్‌’ అనటానికి.) ఆయనకే కాదు ఆయన వారసులకీ వుండదు.

తిలక్‌ తర్వాత తెరమీదకు జాతీయోద్యమ అగ్రనేతగా గాంధీ ప్రవేశం చేసినప్పుడు, ఆయనతో అంబేద్కర్‌ విభేదించిన అంశాలు జగమెరిగినవే. స్వరాజ్య కాంక్ష అల్ప సంఖ్యాకులది కాదు, అధిక సంఖ్యాకులదని చెప్పటం కోసం గాంధీ జాతీయోద్యమంలోకి ‘అంటరాని’ వారినీ, స్త్రీలనూ, ముస్లింలనూ, చేతి వృత్తుల మీద జీవించే వెనుకబడిన కులాల వారినీ ఆకర్షించటానికి ప్రయత్నించారు. అందుకోసం సంస్కరణోద్యమాన్ని జాతీయోద్యంలో కలిపేసే పని చేపట్టారు. ఈ సమయంలో అణగారిన వర్గాలకు స్పష్టమైన ప్రత్యామ్నాయ మార్గం చూపించాల్సిన అవనరం ఏర్పడింది. తాను ‘స్వరాజ్యానికి’ వ్యతిరేకిని కాదనీ, ‘సమరాజ్యానికి’ హామీ పడే ‘స్వరాజాన్నే’ తాను కోరుతున్నానని బలంగా, రాజకీయ స్వరంతో చెప్పాల్సి వచ్చింది.

ఈ సందర్భానికి సరిపోయే ‘జనత’ అనే మరో పత్రికను (1930లో) స్థాపించారు. సరిగ్గా ఇదే సమయంలో గాంధీ ‘హరిజన్‌’ (1933) అనే పత్రికను ప్రారంభించారు. అయితే గాంధీకి తన పత్రికే కాకుండా, దేశంలోని ‘ప్రధాన స్రవంతి’ పత్రికలన్నీ బాసటగా నిలిచాయి. అణగారిన వర్గాలుగా వున్న ‘అస్పృశ్యులకు’ ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించినప్పుడు, గాంధీ వ్యతిరేకించారు. కానీ ఈ పత్రికలు గాంధీవైపే నిలిచాయి. అంతే కాదు. అప్పటి కాంగ్రెస్‌ వాదులంతా గాంధీని వ్యతిరేకిస్తున్నందుకు తనను ‘ద్రోహి’గా చిత్రిస్తున్నాయని అంబేద్కరే స్వయంగా అన్నారు. అయినా తన పత్రిక ద్వారానే కాకుండా, ఇతర పత్రికలకు లేఖల ద్వారా తన ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఆంబేద్కర్‌ ప్రకటించారు.

తిలక్‌, గాంధీల పాత్రను పోషించటానికి తెలుగు నాట ఎందరో అగ్రవర్ణ జాతీయ వాదులు ముందుకొచ్చారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ముట్నూరి కృష్ణారావుల నుంచి, మద్దూరి అన్నపూర్ణయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు వారకూ తిలక్‌, గాంధీల ఎజెండాలకు తమ పత్రికల్లో ప్రముఖ స్థానం కల్పించారు. కవులూ, రచయితలూ తమ గేయాలతో, రచనలతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించేస్తున్నారు.

‘మా కొద్దీ తెల్ల దొరతనం’ అని గరిమెళ్ళ సత్యనారాయణ పాడుతుంటే జనం ఊగిపోయేవారు.

అప్పుడే.. ఒక స్వరం.. అంబేద్కర్‌ స్వరాన్ని పోలిన ధిక్కార స్వరం భిన్నంగా వినిపించింది.

‘మా కొద్దీ నల్ల దొరతనం’ అన్నారు కుసుమ ధర్మన్న .

అచ్చంగా తిలక్‌కు అంబేద్కర్‌ వేసిన ప్రశ్నే.

మూడువేల ఏళ్ళ మూగతనాన్ని వదలి అస్పృశ్యుడు వేయాల్సిన ప్రశ్నే.

ఈ సైధ్ధాంతిక యుధ్ధం చెయ్యటానికే ఆయన రాజమండ్రి కేంద్రంగా (1937లో) ‘జయభేరి’ని మోగించారు.

అప్పటికే (1921లో) తిలక్‌, గాంధీ భావజాలాన్ని ప్రచారం చెయ్యటానికి మద్దూరి అన్నపూర్ణయ్య ఇదే రాజమండ్రి నుంచి’కాంగ్రెస్‌’ అనే పత్రికను స్థాపించేశారు. ఈ పత్రికకు వెంకటప్పయ్య, క్రొవ్విడి లింగరాజులు కూడా పనిచేశారు. అయితే గాంధీ సైతం మౌనం దాల్చిన సందర్భంలో ఈ పత్రిక మాట్లాడింది. భగత్‌ సింగ్‌ ను ఉరితీస్తున్నప్పుడు, ఆయనది హింసావాదం అన్న అభియోగాన్ని పక్కన పెట్టికూడా, ఈ పత్రికలో ‘వీరబలి’ అనే సంపాదకీయం ప్రచురితమయ్యింది. ఇంత చైతన్యమున్న ఈ ‘కాంగ్రెస్‌’ పత్రిక కూడా ‘తెల్ల దొరతనం’ మీద విరుచుకు పడింది కానీ, అగ్రవర్ణ దురహంకారాన్ని ప్రశ్నించలేదు.

అందుకే ధర్మన్నకు ప్రత్యామ్నాయ మాధ్యమం అవసరమయ్యింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ‘ప్రజలను కూడగట్టుటకు, సంఘములుగా ఏర్పరచుటకు, సంఘీభావం కుదుర్చుటకు, స్వాతంత్య్ర యుధ్ధమునకు, జాతి దాస్య విముక్తి పోరాటమునకు. వీరులను తయారు చేయుటకు హరిజనులకు ప్రత్యేకముగా పత్రికలు అవసరము’.

మాధ్యమం నీదయితేనే మాటా నీదవుతుంది- అనే సత్యాన్ని సంస్కరణోద్యమ, జాతీయోద్యమ కాలాల్లో అణగారిన వర్గాల నేతలు స్వీయానుభవంతో తేల్చి చెప్పారు.

xxx                                   xxx                                    xxx

అగ్రవర్ణ జాతీయ వాదులు అనుకున్నట్టే జరిగింది. ‘సమరాజ్యం’ కాకుండా, ‘స్వరాజ్యమే’ వచ్చింది. ‘తెల్ల’దొరతనం పోయి ‘నల్ల’ దొరతనం మీద పడింది.

భూస్వామ్యం, ధనస్వామ్యం, మాధ్యమస్వామ్యం- అన్నీ అతికొద్దిమందిగా వున్న అగ్రవర్ణులకే దక్కాయి. మెజారిటీ మూగబోయింది.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక, ఇక్కడ కూడా అదే తంతు. ‘మువ్వన్నెల’ ప్రజాస్వామ్యమే. అంటే ‘మూడు అగ్రవర్ణాలే’ ఏ పార్టీలో నైనా.

నోటు ఎవరిదయితే వోటూ వారితే, మాటా వారిదే.

దాంతో పత్రికలూ, ఇతర ప్రసార మాధ్యమాలూ ‘మువన్నెల్లో’నే కనిపిస్తూ వచ్చాయి.

ఈ ‘మూడు వర్ణాల’ మాధ్యమ చరిత్రలోనూ మూడు దశలున్నాయి.

ఒకటి: పైసల దశ (ఈ దశలో కేవలం లాభాల కోసమే పత్రిలు పెట్టారు.)

రెండు: పైరవీల దశ (ఈ దశలో పైరవీలు చేసుకుని ఇతర వ్యాపారాలను వృధ్ధి చేసుకోవటం పత్రికలు స్థాపించారు)

మూడు:పదవుల దశ( కేవలం పదవుకోసమో, పార్టీని అధికారంలోకి తేవటం కోసమో పత్రికలు తెచ్చారు)

కె.ఎల్‌.ఎన్‌ ప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’ ని స్థాపించటానికీ, రామోజీరావు ‘ఈనాడు’ స్థాపించటానికి అభిరుచి కొంత దోహదపడ్డప్పటికీ లాభార్జనే వారి ప్రధానోద్దేశ్యం. అప్పటికే ఇదే దారిలోకి అంతకు ముందే మొదలయిన ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ ‘ఆంధ్రభూమి’ దినపత్రికలు వచ్చేసాయి.

అయితే పత్రికలు ‘ఉద్యమాలదశ'( సంస్కరణోద్యమం కావచ్చు, జాతీయోద్యమం కావచ్చు) దాటి ‘పైసల దశ’కు వచ్చేసరికి, ‘మాట’ సరుకయిపోయింది.

సరకన్నాక వినియోగదారుకు నచ్చేదివ్వాలి. అప్పుడు కానీ పాఠకులెవరన్న స్పృహ రాలేదు. పాఠకులంటే- కొని చదివే పాఠకులెవరూ, ఇతరులు కొంటే చదివే పాఠకులెవరూ- ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. అంతే కాదు. పత్రికను కొనుకుండా చదివినా ఫర్వాలేదు, వారికి ఇతర వినియోగవస్తువులు కొనే అలవాటు వుంటే చాలు. వారిని చూపించి కూడా పత్రికు వాణిజ్య ప్రకటనలు తెచ్చుకోవచ్చు. లాభాలను పెంచుకోవచ్చు.

దాంతో ‘మాధ్యమ స్వామ్యం’ నిర్వచనం విస్తృతమయ్యింది. మాట మీద పెత్తనం ప్రత్యక్షంగా ప్రచురకర్తది వున్నా, పరోక్షంగా వినియోగదారుదీ, ప్రకటన కర్తదీ వుంటుంది.

వినియోగదారులు ఎలా వున్నా, ప్రకటన కర్తలు తిరిగి ఆ ‘మూడు వర్ణాల’ వారే వుంటారు.ఎందుకంటే కోట్లల్లో వ్యాపారం చేసి, వాణిజ్య ప్రకటనలు ఇచ్చే దమ్ము వారికే వుంటుంది.

వినియోగదారులంటే మధ్యతరగతి వర్గం, ఎగువ మధ్యతరగతి వర్గం- ఇందులోకి రెండు దశాబ్దాల క్రితం వరకూ షెడ్యూల్డు కులాల వారూ, వెనుకబడిన కులాల వారూ రాలేదు. దళిత వాడల్లోకి కూడా పేపర్‌ బోయ్‌ వెళ్ళటం ఈ మధ్యనే మొదలయింది.

దాంతో ఎలా చూసినా ‘మాట’ మీద ముప్పేట పెత్తనం వీరికే చెల్లింది. వీరు నడిపే, కొనే, చదివే, ప్రకటనలు ఇచ్చే పత్రికలే అనివార్యంగా ‘ప్రధాన స్రవంతి’ పత్రికలయ్యాయి. ఈ పత్రికలు నెలకొల్పినవే ప్రమాణలయ్యాయి.

‘ఆ రోజులే వేరు. పత్రికలకు విలువలుండేవి’ అంటూ మనం గుర్తు తెచ్చుకుంటూ మురిసిపోయేవి ఈ ప్రమాణాలే.

ఎంత కాదన్నా, వాణిజ్యానికో నీతి వుంటుంది: వినియోగదారుని సంతృప్తి పరచాలి. అతడు తూకం చూసుకుంటాడు( అంటే పాత పత్రికలు ఎంత తూగుతున్నాయన్నది మాత్రమే కాదు.). ‘సమతూకం’ పాటించ మంటాడు. ‘సిష్పాక్షిత’ ముఖ్యమంటాడు.

ఈ పనిని సమర్థవంతంగా చేయటానికి వృత్తిరహస్యాలు తెలిసిన సంపాదకులవసరమయ్యారు. వీరు ‘మాట’ను రెండు ముక్కలు చేశారు. ఒక దానిని ‘వార్త’ అన్నారు. మరొక దానిని ‘వ్యాఖ్య’ అన్నారు. ‘నిష్పాక్షికత’ను వార్త కు పరిమితం చేసి, ‘వ్యాఖ్య’ల్లో తమ స్వంత అభిప్రాయలను ప్రకటించేవారు. దీనినే తాము అనుభవించిన అపురూపమయిన ‘స్వేఛ్చ’గా అప్పటి సంపాదకులు చెబుతుంటారు.

పత్రికాధిపతికి పైసలే ప్రధానం కాబట్టి ఈ వ్యాఖ్యల్లో తలదూర్చేవారు కారు.

ఈ మొత్తం ‘పైసల’ దశలో దళితులూ, ఇతర అణగారిన కులాల వారెక్కడున్నారు. వారు ప్రచురణ కర్తలూ కారు, ప్రకటన కర్తలూ కారు. పోనీ సంపాదకులూ కారు. పత్రికను కొని చదివేవారు అక్కడక్కడా వున్నా, ఇతర వినియోగవస్తువులను విరివిగా కొనే వినియోగదారుల జాబితాలోకి రారు. అందుచేత ‘ఊరు’కి వెలుపలే వుండి పోయినట్లు, వీరు ‘మాట’కి కూడా వెలుపలే వుండిపోయారు.

కాకుంటే రిజర్వేషన్ల కారణం ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా, అధికారులుగా ఉన్నప్పుడు, వారివారి ఔద్యోగిక కలాపాల గురించి ఎప్పుడన్నా, అడపా దడపా వార్తలు గా వస్తూ వుండేవి. ఇంతకు మించి వీరికి పత్రికల్లో ప్రవేశమే దొరక లేదు.

‘స్వరాజ్యం’ వచ్చిన తర్వాత మూడు దశాబ్దాలూ పత్రికల్లో దాదాపు ఈ ‘పైసలదశే’ నడిచింది.

‘అగ్రవర్ణ’ మాధ్యమానికి- లాభార్జనే ఎజెండా అయినప్పుడు, అణగారిన కులాలకు ‘ప్రత్యామ్నాయ’ మాధ్యమం వుండనవసరం లేదా?

ఉంది అదే ‘ఉద్యోగార్జన’ లేదా ‘విద్యార్జన’!

ఈ ప్రత్యామ్నాయ చర్చనీయాంశాన్ని ముందుకు తెచ్చిన ఉద్దండులు ఇద్దరు: బి.వి.రమణయ్య, యెండ్లూరి చిన్నయ్య.

ఈ పత్రికలకు అధిక శాతం పాఠకులు దళితులే. విద్య వారికి ఎంత ముఖ్యమో చెబుతూనే, అంబేద్కర్‌ జీవితాన్నీ, భావజాలాన్నీ దళితుల దగ్గరకి తీసుకు వెళ్ళారు.

రమణయ్య ఈ కాలంలోనే రిపబ్లికన్‌ పార్టీ నుంచి ఈ ప్రాంతం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈయనకు ‘పాలేరు’ నాటకం రాసిన కవి బోయి భీమన్న సన్నిహితులు. ఒక పాలేరు చదువు వల్ల కలెక్టర్‌గా ఎలా మారగలిగాడనే ఇతివృత్తం ఆరోజుల్లో ఎందరినో ప్రభావితం చేసింది. రమణయ్య నడిపిన ‘జై భీమ్‌’, ‘రిపబ్లికన్‌ జ్యోతి’ పత్రికలు కూడా ఈ స్ఫూర్తిని అందించాయి.

తెలుగు వారికి అంబేద్కర్‌ జీవితాన్ని పరిచయం చేసిన వారు యెండ్లూరి చిన్నయ్య. ఈయన ‘ఆంధ్ర రిపబ్లిక్‌’ ‘ప్రజాబంధు’ అనే తెలుగు పత్రికలతో పాటు ‘ది పీపుల్స్‌ హెరాల్డ్‌’ అనే ఇంగ్లీషు పత్రికను కూడా నడిపారు. విద్యవల్లనే అంబేద్కర్‌ అంత పెద్ద నాయకుడు కాగలిగాడనే స్ఫూర్తిని దళిత వాడల్లోకి ఈయన తీసుకు వెళ్ళగలిగారు.

అయితే వీరు నడిపే పత్రికలకు వాణిజ్యవేత్తల ఆలంబన ఏమీ లేదు. దళితుల్లో విద్యావంతులయిన వారిచ్చే చందాలపైనే నడిచేవి. అయినా ఆ తరానికి అవసరమయిన ప్రత్యామ్నాయ మాధ్యమాన్ని చూపించగలిగారు.

ఎనభయ్యవ దశకంలోనే ‘పైరవీల’ దశ ప్రారంభమయ్యింది. లాభార్జనతో పాటు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనే కోరిక మొదలయ్యింది. దేశవ్యాపితంగా ‘ఎమర్జన్సీ’ కారణంగా డెభ్యయ్యవ దశకంలో పత్రికల పీక మీద కత్తి పెట్టారు. ఎమర్జన్సీ చీకట్లను చీల్చుకుంటూ పుట్టిన ‘జనతా పార్టీ’ చాలా పత్రికలకు ఆశాకిరణం అయింది. తెలుగు నాట ‘ఈనాడు’ ఎమర్జన్సీని వ్యతిరేకిస్తూ, జనతా పార్టీ భావజాల వ్యాప్తికి వేదిక అయ్యింది. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం పతనమయి, తిరిగి ఇందిరాగాంధీ గద్దెనెక్కిన నాలుగేళ్ళకు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వచ్చింది. ఒక అగ్రవర్ణం (రెడ్డి) కాంగ్రెస్‌లో కీలకమయితే, మరొక అగ్రవర్ణం మ్యూనిస్టు పార్టీల(కమ్మ)లో కీలకం గావుంది. అప్పుడు పుట్టిన ‘తెలుగుదేశం’ పార్టీ ఆవిర్భావ, వికాసాలకు ‘ఈనాడు’ ఇచ్చిన మద్దతు బహిరంగ రహస్యమే. అవసరమయితే, పత్రికల అధిపతులు ‘కింగ్‌మేకర్‌’లు వుండగలరన్న భావన ఈ స్థితిలోనే స్థిరపడింది. (అప్పటికే పత్రికల కోటాలో ఇద్దరు పత్రికాధిపతులు రాజ్యసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ పధ్ధతి వేరు.) రాజకీయాలను ప్రత్యక్షంగా నడిపింటమే అగ్రవర్ణ పత్రికల ఎజెండా అయింది. ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, పదవులు పందేరాల వరకూ పత్రికల జోక్యం పెరిగింది.ఈ ‘పైరవీల’ దశలో పైసలకు పైసలూ, అధికారానికీ అధికారమూ వచ్చాయి. ఈ దశలోనే ‘వార్త’లకూ, వ్యాఖ్యలకూ తేడాలేక పోయింది. వార్తే వాఖ్యయి పోయాక, పత్రికాధిపతే సంపాదకుడయి పోతాడు. అప్పుడు అభిప్రాయాలను ప్రకటించటానికి ప్రత్యేకించి వృత్తి సంపాదకులు అవసరం పెద్దగా వుండదు.( మహా వుంటే, పత్రిక వ్యవస్థాపనప్పుడు వుంటుంది. అంతే.)

ఈ ‘పైరవీల దశ’లో తెలుగు నాట దళితులు ‘ప్రత్యామ్నాయ మాధ్యమాల’ను సృష్టించారా? ఈ ఎనభయ్యవ దశకంలోనే అగ్రవర్ణ రాజకీయాలు దళితుల ప్రాణాలతో చెలగాటమాడాయి. ‘కమ్మ’ వారు సృష్టించిన ‘తెలుగు దేశం’ పార్టీ అధికారంలో వున్నప్పుడు కారంచేడులో కమ్మ భూస్వాములు దళితుల పై హత్యాకాండకు పాల్పడ్డారు. మళ్ళీ ‘రెడ్ల’ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ‘రెడ్లు’ చుండూరులో రెడ్డి భూస్వాములు దళితులను వేటాడి చంపారు.

అప్పుడే కోస్తా అంధ్రలో దళితోద్యమం రగిలింది. ఈ ఉద్యమంలోనుంచే ప్రత్యామ్నాయ దళిత మాధ్యమాలుగా పత్రికలు వచ్చాయి. బొజ్జాతారకం సంపాదకత్వంలోని ‘నలుపు’, కత్తి పద్మారావు నేతృత్వంలోని ‘దళిత శక్తి’, ‘దళిత రాజ్యం’లు కొత్త ఎజెండాను ముందుకు తెచ్చాయి.

జాతీయోద్యమ కాలంలో ‘తిలక్‌, గాంధీ’ల నినాదాలకు, అంబేద్కర్‌ ఎలాంటి ప్రత్యామ్నాయ నినాదాలు ఇచ్చారో, తారకం, పద్మారావులు కూడా ఈ దశకంలో అదే పనిని అంతే తీవ్రస్వరంతో చేశారు.

అప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్టీఆర్‌, ఆయనను బలపరచే పత్రికలూ ‘తెలుగువాడి ఆత్మగౌరవం’ ముఖ్యమని అంటే, అంతకన్నా ముందు ‘దళితుడి ఆత్మగౌరవం’ ముఖ్యమని గొంతెత్తి పలికారు. (‘స్వరాజ్యం’ కనా ముందు ‘సమరాజ్యమే’ ముందు అన్న నినాదం తప్పకుండా స్ఫురణకు వస్తుంది.)

ఇక తొంభయ్యవ దశకం, ఆతర్వాత ఇరవయ్యొకటవ శతాబ్బపు తొలిదశకం అగ్రవర్ణ పత్రికారచనలో ప్రజాస్వామిక వాదులు వణికి చచ్చేటంత మార్పులు వచ్చాయి. నష్టాలు వస్తాయని తెలిసి, ఆ నష్టాలను నెత్తిమీద వేసుకోవటానికి సిధ్ధపడి పత్రికా స్థాపపనకు దిగిపోయారు. ‘పైసలు పోతే పోతాయి, పదవులొస్తాయి కదా!’ అంటూ ముందు కొచ్చేశారు. అంటే వాణిజ్యవేత్తలకు బదులు, సాక్షాత్తూ రాజకీయ నాయకులూ, రాజకీయాల్లోకి చేరాలనుకునే వారూ పత్రికలు పెట్టటం మొదలు పెట్టేశారు. ఎమ్మెల్యే అవుదామనుకున్న పెద్దమనిషి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి అవుదాం, లేదా ముఖ్యమంత్రిగా నిలదొక్కుకుందాం- అనే మహానేతల వరకూ కోట్లకు కోట్లు నష్టాలకు సిధ్ధమై పత్రిలు పెట్టారు. ఒకరో ఇద్దరో మినహా వీరంతా ‘పాలక కులాల’కు చెందిన వారే.

వీరికి సొంతడబ్బాలే వార్తలు, పర నిందలే వ్యాఖ్యలు. వెరసి పంచరంగుల్లో వెలువడే అందమైన కరపత్రాలు.

అందుచేత వీరికి వృత్తి సంపాదకులతోనే కాదు, ఇతర వృత్తి పాత్రికేయులతో కూడా పెద్ద పని వుండదు.(అందుకనే అవసరమయితే భారీ వేతనాలిచ్చి వృత్తి పాత్రికేయులను కూడా అనుచరులుగానో, ఉద్యోగులుగానో మార్చుకోగలరు.) కాక పోతే ఈ రాతల వల్ల తల యెత్తే న్యాయపరమైన వివాదాలకు తమ తరపు మనిషి ఒకరుండాలి కాబట్టి, ఆ వ్యక్తిని సంపాదకుడని చెప్పి కోర్టు బోనుల్లో నిలబెడతారు.

అయితే ఈ దశ ప్రచురణ కర్తల్లోనే కాకుండా పాఠకుల్లోనూ, ప్రకటన కర్తల్లోనూ భారీ మార్పులు తెచ్చింది. కార్యకర్తలూ, అభిమానులూ, అనుయాయులే పాఠకులుగా మారిపోయారు. వీరు కులాన్ని బట్టీ, ప్రాంతాన్ని, మతాన్ని బట్టి కూడా ఏర్పడ్డారు. పైసల దశలో పాఠకులంటే కేవలం వినియోగదారులే. వారిలో ప్రధానంగా ఈ విభజన లేదు. ఇక ప్రకటన కర్తలు కూడా కేవలం పత్రిక వ్యాప్తిని బట్టి కాకుండా, కులాన్ని బట్టి కూడా ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.(ఈ పశోధన పత్రికల వరకే కాబట్టి ఈ దశలోనే వచ్చిన టీవీ వార్తా చానెళ్ళ తీరు తెన్నుల గురించి ప్రస్తావించటం లేదు.)

ఇంత స్పష్టంగా అగ్రవర్ణాలు, ఏ కులానికి ఆ కులం ‘హౌస్‌ జర్నల్స్‌’ నడుపుకుంటున్నట్టు నడిపేస్తూ, తమ సొంత పదవీ కాంక్షల్నే ఎజెండాలు గా మార్చేసుకున్నప్పుడు, దళితుల నుంచి ప్రత్యామ్నాయంగా ప్రసార సాధనాలు వచ్చాయా?

మండల్‌ సిఫారసులు అమలులోకి వచ్చిన తర్వాత బీసీలూ, బ్రాబ్రీ విధ్యంసం తర్వాత ముస్లిం మైనారిటీలు, రాజకీయంగా ఎస్సీలకు(దళితులకూ), ఎస్టీలకు(గిరిజనులకూ) దగ్గరయ్యారు. దీంతో దేశమంతటా ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల’తో కొత్త ప్రత్యామ్నాయాలు మొదలయ్యాయి. కాన్షీరాం భాషలో చెప్పాలంటే, ఇది ‘బహుజన’ శకం. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు అంధ్రప్రదేశ్‌ను తాకాయి. ఇక్కడి దళిత నాయకులు సైతం ‘బహుజన సమాజ్‌’ పార్టీలో చేరారు. ఒక దశంలో కాన్షీరాం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఒక వెల్లువను చూశారు. కానీ బ్యాలెట్‌ బ్యాక్స్‌ దగ్గర కొచ్చేసరికి అది చల్లారి పోయింది. ఇందుకు కారణాలనేకం. అవి ఇక్కడ అప్రస్తుతం.

అగ్రవర్ణ మాధ్యమాలు ,తమ మూడు వర్గాలలో ఏ వర్ణానికి ఆవర్ణాన్ని అధికారంలోకి తేవటమే ఎజెండాగా పెట్టుకున్నప్పుడు, ‘బహుజనులకే రాజ్యాధికారం’ అనే ఎజెండాతో పత్రికలు ఆవిర్భవించాయి.

వాటిలో ఎక్కువ కాలం నిలిచినవీ, నిలిచి వెలుగుతన్నవీ కొరివి వినయకుమార్‌ ‘బహుజన పరివర్తన’, పల్నాటి శ్రీరాములు ‘బహుజన కెరటాలు’, వరుణ్‌ కుమార్‌ ‘సమాంతర’ పత్రికలు.

ఇలా అన్ని దశల మాధ్యమాల చరిత్రలోనూ దళితులు సృష్టికి, ప్రతిసృష్టి చేస్తూనే వున్నారు. ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తునే వున్నారు. కానీ ‘లౌడ్‌ స్పీకర్ల’న్నీ అల్పసంఖ్యాకులైన అగ్రవర్ణాల చేతుల్లోనే వుండి పోవటం వల్ల, అధిక సంఖ్యాకులు ఎంత బిగ్గరగా అరచినా తెలియటం లేదు.

ఈ ‘లౌడ్‌ స్పీకర్లే’ ప్రధాన స్రవంతి పత్రికలుగా ఊరేగుతున్నాయి. భూమి వున్నవాడికే, పెట్టుబడి వున్న వాడికే, ‘లౌడ్‌ స్పీకర్‌’ కూడా వుంటుంది.

భూమి మీద జెండా పాతినట్టు, ‘మాట’ మీద కూడా జెండా పాతాలి.

అప్పుడే మాధ్యమ స్వామ్యం లో దళితుల మాట, దళితులకొస్తుంది.

xxx                        xxx                       xxx

అస్పృశ్యుల్లాగా, చాలాకాలం శూద్రులూ మూగ వారే. కాకుంటే వారు కాస్త ముందుగా మాట తెచ్చుకున్నారు.

అందుకే ఇంకా మాట్లాడలేని వారి పట్ల తొలిదశలో కొంత సానుభూతి వుంటుంది.

బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా వచ్చిన శూద్ర చైతన్యం నిజంగా బలమైనదే. ఇదే తమిళనాట ద్రావిడ చైతన్యమయ్యింది.

తెలుగు నాట త్రిపురనేని రామస్వామి చౌదరి ఇంచుమించు ఇదే చైతన్యాన్ని ప్రకటించారు. బొందితో స్వర్గం వెళ్లటానికి తపస్సు చేసిన శూద్రుణ్ణి రామడి చేత బ్రాహ్మణ వాద ఎలా సంహరింప చేసిందో, ‘సూతపురాణం’లో చెప్పారు. పెళ్ళిళ్ళకు విధిగా బ్రాహ్మణుడుడే పురోహితుడుగా వుండనవసరంలేదంటూ శూద్ర పురోహితులను కూడా ప్రవేశ పెట్టారు. ఇదే సామాజకి వర్గానికి చెందిన కొండవీటి వెంకటకవి కూడా ఎన్టీఆర్‌ తీసిన ‘దాన వీర శూర కర్ణ’కు సంభాషణలు రాస్తూ, భారతం రాసిన వ్యాసుడి దగ్గర నుంచి, రుషుల మూలలాను వెలికి తీస్తూ కౌరవ, పాండవ వంశాలన్నీ ‘ఏనాడో కులహీనమయ్యాయనీ’ ఇప్పుడు ‘కులము.కులము.. అని వ్యర్ధ వాదన’లెందుకని సుయోధనుని పాత్ర చేత చెప్పిస్తారు. ఒక పక్క బ్రాహ్మణవాదం పై విరుచుకు పడ్డ సామాజిక వర్గానికి చెందిన భూస్వాములే కారంచేడులో దళితుల మీద దారుణమారణ కాండకు తలపడటం ఆశ్చర్యమేమీ కాదు. భూమి మీదా, సంపద మీదా, మాధ్యమం మీద పెత్తనం వచ్చేసరికి శూద్రునికి కూడా అగ్రవర్ణత్వం సిధ్థిస్తుంది. దాంతో తాము కూడా ఒకప్పుడు ‘మూగ’ వారమనే ఎరుకను మరచిపోతారు.

అలాగే మరోశూద్ర వర్గం (కాపు సామాజిక వర్గం) నుంచి వచ్చి బ్రాహ్మణ వాదం మీదా, కులవాదం మీదా యుధ్ధం ప్రకటించిన మరో ప్రముఖ రచయితా, పత్రికా రచయితా తాపీ ధర్మారావు నాయుడు. ఈయన ‘జనవాణి’ అనే పత్రికకు సంపాదకుడిగా వున్నాడు. స్యయంగా ‘కాగడా’ పత్రికను స్థాపించారు. బ్రాహ్మణవాదం మీద, ఈ వాదానికి ఆలంబనగా వున్న వైదిక మతం మీదా చాలా తీవ్రమైన దాడి చేశారు. ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెండుకు?’ , ‘ఇనుప కచ్చడాలు’ అనే ఆయన రచనలు ఇందుకు మచ్చుతునకలు. అంతేకాదు, ఆయన రాసిన సినీ గేయాలలోనూ, సంభాషణలలోనూ అగ్రవర్ణ భావ జాలాన్ని తూర్పారబెట్టారు. మరీ ముఖ్యంగా ఆయన ‘మాలపిల్ల’ సినిమాకు రాసిన సంభాషణలు అప్పటికీ మూగవారిగానే వుండి పోయిన ‘అస్పృశ్యుల’కు కొత్త ఆశలను చిగురింప చేశాయి. అయితే ఇదే సామాజిక వర్గం నుంచి తర్వాత తర్వాత వచ్చిన నేతలు కొన్ని చోట్ల, అస్పృశ్యుల పట్ల మిత్రపూరితంగానూ, కొన్ని చోట్ల శత్రుపూరితంగానూ వ్యవహరించారు. అంటే, భూమి మీదా, సంపదమీదా, మాధ్యమం మీద ఆధిపత్యం దొరికిన చోట ‘అస్పృశ్య’ కులస్తులను హీనంగానే చూశారు. అలా కాకుండా భూమిలేని నిరుపేద కూలీలుగా వున్న చోట్ల మాత్రం సంఘీభావానికి కృషి చేశారు.

వంగవీటి మోహన రంగా, ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణ రావు, చిరంజీవి- వీరు వివిధ రాజకీయ సన్నివేశాల్లో దళితులకు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు వచ్చారు. కానీ దీర్ఘకాలికంగా ఎవ్వరూ నిలబడలేదు. అయితే దాసరి నారాయణ రావు స్థాపించిన ‘ఉదయం’ పత్రిక ద్వారా దళితులకు జరగుతున్న అన్యాయాలను వెలికి తీసే ప్రయత్నం కొంతలో కొంతయినా చేశారు. కాబట్టే కారంంచేడు మారణకాండప్పుడు ఈ పత్రిక ‘కారంచేడు పొలాల్లో పులి చంపిన లేడి నెత్తురు’ అనే శీర్షితో వాస్తవాలను ప్రచురించగలిగింది.

అయితే ‘సానుభూతి’ కానీ, ‘సంఘీభావం’ కానీ కేవలం సామాజిక చైతన్యం తో ప్రకటించేవి మాత్రమే కాదు. రాజకీయంగా తమకు అవసరమయినప్పుడు మాత్రమే ఆయా సామాజిక వర్గాలు దళితుల పట్ల సంఘీభావాన్ని ధృఢంగా ప్రకటిచగలుగుతాయి.

ఈ పరిస్థితి దేశవ్యాపితంగానే మండల్‌ సిఫారసుల అమలుకు ప్రధానిగా (1989లో) చొరవ చూపిన తర్వాతనే వచ్చింది. బీసీలకూ, విద్యా,ఉద్యోగ రంగాలలో కోటా ఇచ్చినప్పుడు, రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా దేశమంతటా అగ్రవర్ణులు విరుచుకు పడుతున్నప్పుడు వారికి తోడుగా మిగిలింది ఎస్సీలే. ఈ అనివార్యతలోంచి వచ్చిన సంఘీభావం ఒక శాశ్వత రాజకీయసమీకరణకు దారితీసింది. ఈ సంఘీభావంతో పత్రికలు వచ్చాయి. తెలుగులో గౌతు లచ్చన్న వంటి వారు (1976లోపెట్టిన ‘బహుజన’ పత్రిక వంటి ఒకటి రెండు పత్రికలు మినహా, ఎస్సీలపై బీసీలు సంఘీభావం ప్రకటించే పత్రిలు 1990 తర్వాత వచ్చినవే. ఇందులో ఉ. సాంబశివరావు, కె.జి.సత్యమూర్తి(ఈయన ఎస్సీయే)తో కలిసి 1990లో ‘ఎదురీత’ పత్రిక స్థాపించారు. సాక్షాత్తూ గుర్రం జాషువా గారి కావ్యం ‘గబ్బిలం’ పేరునే 1995లో బి.ఎస్‌.రాములు తన పత్రికకు స్వీకరించి నడిపారు. ఇంచు మించు ఇదే స్పృహతో జస్టీస్‌ బి.ఎస్‌.ఎ స్వామి 2006లో ‘మన పత్రిక’ అని స్థాపించారు. ఈ మూడు అగ్రవర్ణ పత్రికల ఎజెండాకు ప్రత్యామ్నాయంగా వుండే ఎజెండాను స్వీకరించారు. బీసీల సమస్యలతో పాటు, ఎస్సీల సమస్యలపైనా ఈ పత్రికలు స్పందించాయి.

ఈ పత్రికల వల్ల మాటకు మాట తోడయినట్టుగా భావించారు దళితులు.

xxx                                xxx                                       xxx

మాటే.

లాఠీలను ఎదిరించేదీ, తూటాలను నిలువరించేదీ.

మాట కోసం ఈ యుధ్ధం చేస్తున్న ఈ మూగ సైనికులను ఏ మాటతో పిలవాలి.

ఏ పేరున పిలిచినా భగవంతుడు పలుకుతాడో లేదో తెలియదు కానీ, ఈ దేశంలో ‘అస్పృశ్యుడు’ పలికాడు.

చర్మాలు వలుస్తున్నప్పుడు ‘చండాలుడన్నా’ పలికాడు, ప్రథమ పౌరుడి(రాష్ట్రపతి) పీఠం మీదె కూర్చున్నప్పుడు ‘హిజ్‌ హైనెస్‌’ అన్నా పలికాడు.

‘అందితే జుట్టూ, అందక పోతే కాళ్ళూ’ అనే అనివార్యతలోంచి పిలిచే పిలుపులు చైతన్య చిహ్నాలు కావు.

కానీ బానిసలు తమ సంకెళ్ళను ఒక్కొక్కటిగా తెంచుకుంటున్నప్పుడు, తమ పేర్లకు గౌరవం అంచెలంచెలుగా వచ్చి చేరుతుంది. ‘నీగ్రో’ ‘బ్లాక్‌’ అయింది అలాగే.

నాలుగు వర్ణాల వైదిక మతం వెలుపల వుంచేసిన ఈ ‘అస్పృశ్యుల్ని’ కనీసం అయిదో వర్ణంగా గుర్తించటానికి కూడా మనువు ఒప్పుకోలేదు. అంటే వీరిని ‘పంచములు’గా పిలిస్తే, వర్ణవ్యవస్థ లోపలికి వచ్చేస్తారేమోనని చాలాకాలం భయపడి చచ్చారు. తర్వాత,తర్వాత ఔదార్యం ప్రకటించి ‘పంచములు’గా గుర్తించారు.

అయితే అగ్రవర్ణాల వారే పత్రికలు పెట్టినప్పుడు వీరిని ఎలా పిలిచారన్నది ప్రశ్న.

తొలి తరం పత్రికలు వచ్చేసరికే దేశంలో ఇంగ్లీషు విద్య రావటం, సంస్కరణలకు తెరతీయటమూ జరిగిపోయాయి.

దానితో ఈ ‘అస్పృశ్యుల’ స్థితి మీద ఎంతో కొంత సానుభూతిని చూపించటం అలవరచుకున్నాయి.

తెలుగు నాట సంస్కరణోద్యమ పత్రికలు వచ్చినా కూడా అధిక భాగం స్త్రీల ఉధ్ధరణకే అవి అంకితమయ్యాయి తప్ప, అంటరాని తనం మీద పెద్దగా దృష్టి సారించలేదు.

ఫూలే, పెరియార్‌, అంబేద్కర్‌ లప్రభావాల వల్ల ఈ అంటరానితనం పై అప్పుడప్పుడూ అయినా అగ్రవర్ణులు నడిపే పత్రికల్లో ప్రస్తావించేవారు.

అప్పుడు వీరిని పంచములకు బదులుగా ‘నిమ్నవర్గాల’నో లేక ‘అణగారిన వర్గాలనో’ సంబోధిస్తూ వచ్చారు.

అయితే గాంధీ జాతీయోద్యమంలోకి అడుగు పెట్టాక, వీరిని ‘హైందవమతం’లో అంతర్భాగంగా గుర్తించే పనికి పూనుకున్నారు. అప్పుడే ‘హరిజనులు’ (దేవుని పిల్లలు) అని పిలవటం మొదలు పెట్టారు. ( ‘మేము ‘దేవుని పిల్లల’ మయితే, మీరు ‘దయ్యం పిల్లలా?’ అన్న ప్రశ్న ఆ వర్గాల నేతలు అప్పుడే వేశారు. అయితే ఈ పదాన్ని తర్వాత, తర్వాత చట్ట సభల్లో సైతం ఉపసంహరించుకున్నారు. అది వేరే విషయం.). గాంధీ ఆయన పత్రిక కే ‘హరిజన్‌’ అని పెట్టటం వల్ల, దేశ వ్యాపితంగా మాధ్యమాలు ఈ పదాన్నే ఉపయోగించటం మొదలు పెట్టాయి. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు ‘ఆంధ్రపత్రిక’లో ఈ పదానికి బహుళ ప్రచారం కల్పించారు. అప్పుడే మంగి పూడి వెంకటశర్మ ‘నిరుధ్ధ భారతం’ పేరు మీద ఈ హరిజనుల కడగండ్లకు కవిత్వ రూపం ఇచ్చారు. ఈ గ్రంథానికి నాగేశ్వరరావు పంతులు ముందు మాట రాశారు. ( ఈ గ్రంథం ఆరోజుల్లోనే మూడు సార్లు నిషేధానికి గురయ్యింది)

తర్వాత అంటరాని కులాలను రాజ్యాంగబధ్ధంగా ఒక షెడ్యూలు లోచేర్చాక, పత్రికలకు ‘అస్పృశ్యుల్ని’ పిలిచే విషయంలో కొంత సౌకర్యం లభించింది. ఏ పేరు పెట్టకుండా ‘షెడ్యూల్డు కులాలు'(ఎస్సీలు) అని సంబోధించటం మొదలు పెట్టారు.

ఆ తర్వాత ‘దున్నేవాడికే భూమి’ పేరు మీద కమ్యూనిస్టులు ‘అస్పృశ్యుల్ని’ సంఘటితం చేసినప్పుడు వారి కుండే ‘కుల హీనత’ను పక్కన పెట్టి శ్రామిక వర్గాలు పిలవటం మొదలు పెట్టారు. వారు నడిపే పత్రికలలో ఈ పదమే తరచు వాడుకలో వుండేది.

అంబేద్కర్‌ తెచ్చిన కులనిర్మూలన స్పృహ, ఈ ‘అస్పశ్యులకు’ చేరిన తర్వాత, తమ మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టటం మొదలు పెట్టాక, తమకు తామే నాయకత్వం వహించుకోవటం నేర్చుకున్నాక తమని తాము ‘దళితులం’ గా ప్రకటించుకున్నారు.

ఈ దళిత చైతన్యాన్ని అగ్రవర్ణ పత్రికల యాజమాన్యాలు వెంటనే గుర్తించకపోయినా, అందులో పనిచేసే ప్రగతి శీల పాత్రికేయులు గుర్తించారు. కాబట్టే కారంచేడులో దాడి జరిగినప్పుడు ‘పులిచంపిన లేడి నెత్తురు’ అన్న వార్త వెలువడింది, ‘కారంచేడు భూస్వాముల కండకావరం’ అనే సంపాదకీయమూ వెలువడింది. ఆ శీర్షిక నిచ్చిన ఉప సంపాదకుడు(కె.శ్రీనివాస్‌), సంపాదకీయం రాసిన సంపాదకుడు (ఎ.బి.కె ప్రసాద్‌) ఈ చైతన్యాన్ని గుర్తించిన వారే.

అంతకు ముందు ఎప్పుడు దళితులపై దాడి జరిగినా, ‘రెండు కులాల మధ్య ఘర్షణ: పది మంది మృతి’ అన్న శీర్షికలే వెలువడేవి. అంటే సమాన బలం వున్న రెండు వర్గాలు కొట్టుకున్నట్టుగానే రాసేవారు, కానీ, భూమీ, డబ్బూ, దస్కం, అంగబలం, ఆయుధబలం వున్నవారు, ఏ దిక్కూలేని నిరాయుధులమీద దాడి జరిపినట్లుగా రాసేవారు కారు. అంటే, ‘ఘర్షణ’ అనే మాటను ‘దాడి’గా ప్రకటించగలిగింది ఈ దళిత చైతన్యమే.

అందుచేత, ‘పంచములు’, ‘హరిజనులు’, ‘శ్రామిక వర్గాలు’ ‘ఆది ఆంధ్రులు’ ‘అనే మాటలు కేవలం పర్యాయపదాలు కావు. తమని తాము ‘దళితుల’మని గౌరవంగా పిలుచుకునే క్రమంలోని కొన్ని మజిలీలు. అంటే ఈ వర్గాలను పిలిచే పిలుపులో అగ్రవర్ణ మాధ్యమాలకు తమ ఎజెండా తమకు వున్నప్పుడు, తమ పేరును తాము స్థిర పరచుకోవటానికి ‘అస్పృశ్యులకు’ వారి మాధ్యమాలకు తమ సొంత ఎజెండా కావలసి వచ్చింది. ఇప్పుడు భగవంతుణ్ణి పిలిచినట్టు ఏ మాట పడితే ఆ మాటకు పలక్కుండా, ‘దళితుడ’నే మాటకే పలుకుతాడు.

xxx                      xxx                           xxx

‘తెలుగు దళిత పత్రికలు’ అనే ఈ పరిశోధనను జి.కె.డి నెత్తిన ఎత్తుకొంటున్నప్పుడు, ముందుగా భయం వేసింది. తేనెతుట్ట కదుపు తున్నాడనిపించింది. అదే సమయంలో ‘మూక్‌ నాయకుని’ అడుగుజాడల్ని భద్రపరుస్తున్నాడనే ఆనందం కలిగింది.

దళితుల మాధ్యమ ప్రవేశం కూడా, దళితుల దేవాలయ ప్రవేశం లాగే పక్కదోవ పట్టేసిందా?

హైందవ దేవాలయాల్లో ప్రవేశంలేని వీరిని ఇంగ్లీషు వాళ్లు చర్చిలు నిర్మించి వాటిల్లోకి ప్రవేశం కల్పించారు. నిజంగానే దళితులకు ఇవి ప్రత్యామ్నాయ దేవాలయాలుగా మారాయి.

ఇప్పటికీ దళిత పాస్టర్లను చూడగలం కానీ, దళిత పూజార్లనూ, దళిత అర్చకులనూ చూడలేం.

పత్రికల్లోనూ అంతే. తమకు తాముగా నిర్మించుకున్న ప్రత్యామ్నాయ పత్రికల్లో తప్ప, ‘ప్రధాన స్రవంతి’గా ప్రకటించుకున్న అగ్రవర్ణ పత్రికల్లో ప్రవేశం ఇంకా దుర్లభంగానే వుంది.

పాత్రికేయుల మీద కాన్షీరాం దురుసుగా ప్రవర్తించారని అగ్రవర్ణమాధ్యమాలు చిందులు తొక్కుతున్నప్పుడు, కేంద్రం విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

అప్పుడు(1996లో) దేశరాజధానిలో బి.ఎన్‌. ఉనియాల్‌ ఒక సర్వేను నిర్వహించారు. జాతీయ మాధ్యమాల్లో దళిత పాత్రికేయుల ప్రాతినిథ్యం ఎంత వుందో తెలుసుకోవటమే ఈ సర్వే ఉద్దేశ్యం. ప్రభుత్వం గుర్తించిన (అక్రిడిటేడెడ్‌) 686 మంది పాత్రికేయులను ఆయన ప్రశ్నించారు. వారిలో 454 మంది అగ్రవర్ణులు. 232 మంది కులాల పేర్లను వెల్లడించలేదు. అయితే వీరిలో దళితులెవ్వరూ లేరు.

ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు.

‘మా దళిత పాత్రికేయులు ఎందుకు లేరు?’ అన్న ప్రశ్న చాలా మందిని వేధించినట్లే, జి.కె.డి ప్రసాద్‌నూ వేధించింది. విశాఖపట్నంలో జరిగిన పాత్రికేయుల శిబిరంలో ఒక కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేసి, అగ్రవర్ణ సీనియర్‌ పాత్రికేయుల చేత సంజాయిషీ చెప్పించారు.

మూగ సమూహాల మూడవేల యేళ్ళ వేదనకు కారణాలను అన్వేషించాలనుకున్నాడు.

నేను కలిసినప్పుడెల్లా ఇదే ‘మాట’

‘ప్రసాద్‌! నన్ను చొక్కా విప్పమని అడక్కు. ‘అవయవాల దొంతర కాదు, అవమానాల పరంపర’ చూడాల్సి వస్తుందని’ చెప్పి తప్పించుకునే వాణ్ణి.

అయినా తనంతట తాను కారణాలు వెతికాడు. చరిత్రను నిర్మించాడు.

భావి పరిశోధనలకు దారి వేశాడు. స్వతహాగా కవి. ఆత్మాభిమానమున్న మనిషి. స్వంత వాడు దారి తప్పినా వెక్కిరించగల సాహసి.

వచనంలో ఉద్వేగమూ, ఆలోచనా సమపాళ్ళలో వుంటాయి.

అతడి మాట నాకిష్టం.

మాటకోసం చేస్తున్న యుధ్ధం అంతకన్నా ఇష్టం.

అస్పృశ్యుడడితే మాటలో పాగా వేయించటమే అంబేద్కర్‌ ‘మూక్‌ నాయకుని’ లక్ష్యం.

ఆ లక్ష్యసాధనలో ఈ పరిశోధన ఒక మైలు రాయి.

-సతీష్‌ చందర్‌

1 మార్చి 2012

(డా.జి.కె.డి ప్రసాద్ పరిశోధక గ్రంథం ‘దళిత జర్నలిజం‘ కు రాసిన ముందు మాట)

Leave a Reply