మీటింగ్స్‌ తోనే రాహుల్‌కు రేటింగ్సా..?

రాహుల్‌ గాంధీ రేంజ్‌ హఠాత్తుగా మారిపోయిందా? ఆయన రేటింగ్స్‌ ఠపీ మని పెరిగిపోయాయా? యువరాజుకి పార్టీలో రాజయోగం పట్టేసినట్లేనా? అధ్యక్షుడికి ముందు వున్న ‘ఉప’ విశేషణం తొలిగిపోయినట్లేనా?

చూడబోతే, ఇలాంటి వింత ఏదో దేశ రాజకీయాల్లో జరిగేటట్లుగానే వుంది. ఆటలో ఎప్పుడోకానీ గెలవని వాడిని, గెలిపించాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి: ఆట నేర్పించటం రెండు: ఆట రూల్సు మార్చి వెయ్యటం. మొదటి పనికి చాలా కాలం పడుతుంది. రాహుల్‌ విషయంలో దశాబ్దాలు పట్టేశాయి. రెండో పని క్షణాల్లో చెయ్యవచ్చు. ఇప్పుడదే చేశారు. ఇంత కాలం రాహుల్‌ పలుకుబడి, ఎన్నికల సీట్లతో కొలిచారు. ‘రాహుల్‌ ఎన్నికల ప్రచారం చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎన్నిసీట్లొచ్చాయి?’ ఎంత సేపూ ఇదే లెక్క. అలా చూసినప్పుడెల్లా రాహుల్‌ గ్రాఫ్‌ పడిపోతూనే వచ్చింది. ‘నేను కాంగ్రెస్‌ ను గెలిపించానా? లేదా? అన్నది కాదు… నా వల్ల బీజేపీ ఓడిందా? లేదా? చూడండి.’ అంటూ, గత మూడేళ్ళుగా రాహుల్‌ సంకేతాలిస్తూ వచ్చాడు. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ‘సున్నా’ సీట్లొచ్చినా విజయంగానే భావించారు. కారణం: కేంద్రంలో (2014లో) గెలిచిన బీజేపీ మూడు సీట్లతో మట్టి కరిచింది. ఆ తర్వాత జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాహుల్‌కి ఇదే ఆనందం. కానీ ఈ ఏడాది(2017) ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పాచిక పారలేదు. కాంగ్రెస్‌తన ఓటమికి తెగించినా సరే బీజేపీ గెలిచేసింది. సరే పంజాబ్‌లో కాస్త ఊరట. కానీ మణిపూర్‌, గోవాలలో మెజారిటీ సీట్లు తెచ్చుకుని కూడా కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో కూర్చుకుంది. (అది ‘చేతి’కి రానితనమో లేక ‘చేతకాని’తనమో రాహుల్‌కి తెలియాలి.)

పోరుకే రాహుల్.. పేరుకు కాదు…?

అయినా సరే, యువరాజు మీద మచ్చ రానివ్వకూడదు. ఆట రూల్సు మరో సారి మార్చుకోవాలి. ఈ సారి ‘రాహుల్‌జీ రేటింగ్స్‌’కీ ఎన్నికల ఫలితాలకీ అసలు ముడిపెట్టకూడదు. రాహుల్జీ చేత ఉద్యమబాట పట్టించాలి. ఇలా కాంగ్రెస్‌ వ్యూహకర్తలు భావించినట్లున్నారు. అంటే రాహుల్‌ గాంధీయే ఉద్యమాలు చేపడతారని కాదు. ఉద్యమాలు జరిగే చోటకు రాహుల్‌ గాంధీ వెళ్తారు. తద్వారా, ఆయన ఖ్యాతి పెరుగుతుందనుకున్నారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ దూకుడు కారణంగా రెండు క్యాంపస్‌లు భగ్గు మన్నాయి. ఒకటి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ, రెండు: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ. ఒక చోట దళిత విద్యార్థులను ‘వెలి’ వేశారు. మరొక చోట వామపక్ష ముద్ర మున్న విద్యార్థుల మీద ‘రాజద్రోహం’ నేరం మోపారు. రెండు చోట్లా రాహుల్‌ గాంధీ వెళ్ళి హల్‌ చల్‌ చేశారు. విద్యార్థులకు మద్దతు ఇచ్చారు. కానీ ఆ రెండు చోట్లా ఆయనకు ‘ఇమేజ్‌’ అదనంగా పెరగలేదు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల దేశవ్యాపితంగా అణగారిన వర్గాల్లో ‘త్యాగశీలి’గా నిలిచాడు, ఢిల్లీలో జైలుకు వెళ్ళివచ్చిన విద్యార్థి కణ్హేయ కుమార్‌ జాతీయ నాయకుడయ్యాడు.

మళ్ళీ భుజాల మీదకు వచ్చిన కాంగ్రెస్ కండువాలు!

ఈ ఫలితాలను కాంగ్రెస్‌ పార్టీ సమీక్షించుకుందో, ఏమో.. ఉద్యమాల్లో రాహల్‌ పాలుపంచుకోగానే సరికాదు, రాహుల్‌ సభలకు భారీ జనసమీకరణ చెయ్యాలని నిర్ణయించుకున్నది. అంటే, ఇక మీదట రాహుల్‌ గాంధీ రేటింగ్స్‌ను ఎన్నికల్లో వచ్చిన వోట్లతోనూ, సీట్లతోనూ కాక. సభలోకొచ్చిన జనాలతో కొలవాలి. ఈ లెక్క నిజంగానే రాహుల్‌ పరపతిని పెంచుతోంది. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన భారీ బహిరంగసభల హోరే నిదర్శనం. జనం పెద్ద యెత్తున వచ్చారు. తెలంగాణ లోని సంగారెడ్డి వద్ద చేసిన ‘ప్రజాగర్జన’ విన్నాక, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వద్ద జరిగ ‘ప్రత్యేక హోదా భరోసా సభ’ చూశాక, కాంగ్రెస్‌ నేతలూ, కార్యకర్తలూ మళ్లీ కండువాలు కప్పుకుని విరివిగా మీడియా మైకుల ముందుకు రావటం మొదలు పెట్టారు. అధికారం కోల్పోయిన మూడేళ్ళ తర్వాత ఈ రెండు చోట్లా, ఈ మాత్రం అలికిడి ఇప్పటికి చేయగలిగింది కాంగ్రెస్‌. ప్రత్యేక రాష్ట్రం ‘ఇచ్చి’ న ఖ్యాతి రాక తెలంగాణలో తెల్లబోయి, రాష్ట్రాన్ని ‘చీల్చి’న అపఖ్యాతితో ఆంధ్రప్రదేశ్‌లో చతికిల పడ్డ సంగతి తెలిసిందే. అందుకే కాంగ్రెస్‌ నేతల్ని వినటానికి ఒక రాష్ట్రంలోనూ, కనీసం చూడటానికి ఇంకో రాష్ట్రంలోనూ ఇన్నాళ్ళూ ఆసక్తి చూపలేదు. కానీ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ‘చంద్రుల’ పుణ్యమా- అని విపక్షపాత్ర ఎవరు పోషించినా జనం కనీ,వినీ తరించాలని ముచ్చట పడుతున్నారు. ఈ ‘ముచ్చట’ కొద్దీ రాహుల్‌ గాంధీ సభలకు వచ్చారేమో.. తెలీదు.

రాష్ట్ర నేత స్థానంలో… ‘రాకుమారుడా’?

ఒక్క కేసీఆర్‌ని చూపించే టీఆర్‌ఎస్‌ అనీ, ఒక్క చంద్రబాబును చూపించే టీడీపీ- అని సర్కారులు నడిపించే చోట్ల, రెండు రాష్ట్రాలనుంచి ఒక్కొక్క నేతను చూపించి… ఇతనే లేదా ఈమే కాంగ్రెస్‌ నేత అని అనవచ్చు. కానీ, చూపటానికి రెండు చోట్లా కాంగ్రెస్‌ కు ఆ స్థాయి నేతలేరీ? ఏరీ..అంటే దొరికేస్తారా? ఒకప్పుడు ఎవరు ఎదిగితే వారిని కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఏరిపారేసిందే..! ఇప్పుడు దొరక మంటే దొరకు తారా? కాబట్టి ఢిల్లీ నుంచి రాహుల్‌ ను దించి.. ఇతనే నేత అన్నారు. కావాలంటే రెండు చోట్లా ‘ద్విపాత్రాభినయం’ చేస్తాడని కూడా భరోసా ఇస్తున్నారు. చేసిన తప్పేదో కొత్త తప్పు చేసినా బాగుండేది; కానీ, కాంగ్రెస్‌ పాత తప్పే సరికొత్తగా చేసింది.

దేశంలో ఎమర్జన్సీ తర్వాత ఫెడరల్‌ చైతన్యం వచ్చి, ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాక, ఢిల్లీ ముఖాలని చూపించి గల్లీల్లో వోట్లు వెయ్యమంటే వెయ్యటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ప్రాంతీయ పార్టీ పెట్టాక, మళ్లీ మళ్ళీ వోటర్లు ఇక్కడి ముఖాలనే అగ్రనేతలుగా చూస్తున్నారు. ఈ వాస్తవాన్ని ఒక దశలో కాంగ్రెస్‌ సైతం గ్రహించక తప్పలేదు. ఆ తర్వాతనే వై.యస్‌. రాజశేఖరరెడ్డి చేత పాదయాత్ర చేయించింది. జనాకర్షక నేతగా ఎదిగిపోయినా, ‘కొంతవరకూ’ సహించింది. ఆయన స్థానంలోకి ఆయన తనయుడు వై.యస్‌ జగన్మోహన రెడ్డి వస్తున్నాడనే సరికి మాత్రం- మళ్లీ పాత జపమే చేసింది. ఢిల్లీనే చూపించింది.

కానీ, తెలంగాణలో ఈ ఖాళీని కాంగ్రెస్‌ వెలుపలి నుంచి ఉద్యమం పేరిట కేసీఆర్‌ సునాయసంగా పూరించగలిగారు. సీమాంధ్రలో అలాంటిదేమీ జరగలేదు. దాంతో జగన్‌, చంద్రబాబుల మధ్య పోటీ ఏర్పడింది. స్వల్ప మెజారిటీతో బాబు బయిట పడ్డారు.

రాహుల్‌ రేటింగ్స్‌ తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే వున్నా, ఇంతకు మించి పెరిగినా పెద్దగా ఒరిగేదేమీ వుండదు- ప్రాంతీయ నేతల్ని ఎదగనిస్తే తప్ప. స్పష్టంగా చెప్పాలంటే రాహుల్‌ ఎదగక పోవటానికి కారణం రాహుల్‌ కాదు, కాంగ్రెస్‌ అధిష్ఠానమే కారణం. రాష్ట్ర నేతల్ని తొక్కి రాహుల్‌ని పైకి తొయ్యాలనుకునే విధానం వల్లనే రాహుల్‌ అక్కడే ఆగిపోయారు. రాష్ట్రనేతలు ఎదిగితేనే రాహుల్‌ కూడా ఎదుగుతారు- అన్న చిన్న లాజిక్‌ ను ..ఎందుకో అధిష్ఠానం మిస్సయ్యింది.

-సతీష్ చందర్

9 జూన్ 2016

1 comment for “మీటింగ్స్‌ తోనే రాహుల్‌కు రేటింగ్సా..?

Leave a Reply