పువ్వు గుచ్చుకుంటుందంటే నమ్ముతారా? కానీ నమ్మాలి.
మృదుత్వంలోనే కాఠిన్యం వుంటుంది.
నండూరి రామ్మోహనరావు మెత్తని మనిషి. కఠినమైన సంపాదకుడు.
ఎవరినీ ఏకవచనంలో పిలిచి ఎరుగరు. ఆయన అనుభవంలో నగం వయసుకూడా లేని వారిని సైతం ‘మీరు’ అని పిలుస్తారు.పల్లెత్తు మాట అనటానికి కూడా సందేహిస్తారు. ఇది ఆయన వ్యక్తిగతం.
కానీ, మాట అంటే. ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరూ మార్చలేరు. కొన్ని అంశాల మీదే కాదు, కొందరి పాత్రికేయుల మీద నిశ్చితాభిప్రాయాలుంటాయి. వాటిని మార్చుకోరు. ఇది ఆయన వృత్తిగతం.
పాతికేళ్ళ క్రితం మాట. అప్పుడు వేరే పత్రికనుంచి ఒక పెద్దాయనతో బృందంగా(కొందరి దృష్టిలో ముఠాగా )కొందరు పాత్రికేయులు నండూరి సంపాదకుడిగా వున్న ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. అందులో నేనూ వున్నాను.(రాజమండ్రిలో వుండే జిల్లా విలేకరిని.). మేం కాస్త దూకుడుగా రాస్తామని ఆయన నిశ్చితాభిప్రాయం.
అయినప్పటికీ, సాహిత్యాభిరుచి వుందని, మాలో కొద్ది మందిని దగ్గరకు తీసుకునేవారు. నేను బెజవాడ వెళ్ళినప్పుడెల్లా ఆయన గదిలో కూర్చోబెట్టుకుని గంటలతరబడి మాట్లాడేవారు. పుస్తకాల గురించీ, కవిత్వం గురించీ మాట్లాడుతున్నంత సేపూ, నా యీడు వ్యక్తితో ముచ్చట్లాడుతున్నట్లుగా అనిపించేది.
అంతటి వాత్సల్యపూరిత వాతావరణంలోనూ ఒక చట్టబధ్ధమైన హెచ్చరిక: కోర్టు కేసులకు ఆస్కారమిచ్చే వార్తలు రాయ కూడదు.
అలాగని ఆయనకు కోర్టు కేసులంటే భయం కాదు. కానీ,చికాకు. తర్వాత తర్వాత ఆయనతో బాగా సాన్నిహిత్యం పెరిగాక ఈ విషయంగురించి ఒక సారి అడిగాను.
‘కేసలుంటే నాకు భయం కాదండీ. జైలుకు వెళ్ళటానికయినా సిధ్దమే. కానీ కోర్టుకు వెళ్ళినప్పుడు, కోర్టు బంట్రోతు పిలిచే తీరు నాకు నచ్చదు. నానారకాల ముద్దాయిలను పిలిచాక, అదే నోటితో- నండూరి రామ్మోహనరావ్! నండూరి రామ్మోహనరావ్- అని ఏకవచనంలో పిలుస్తాడు. అదే నాకు నచ్చదు.’ అని మనసులో మాట చెప్పారు.
మర్యాదకు లోపం జరిగే చోట ఆయన క్షణం కూడా వుండలేరు. కారణం? అంతకు మించిన మర్యాద ఆయన ఇతరులకిస్తారు. ఈ విషయాన్ని ఆయన సహపాత్రికేయులూ, యాజమాన్యం ఎప్పుడూ దృష్టిలో వుంచుకునే వారు.
‘రాజ మందిర’ రహస్యాలు!
చదువంటే ఆయనకు ప్రాణం. పుస్తకాలంటే మురిసిపోయేవారు.
అప్పుడప్పుడూ రాజమండ్రినుంచి అద్దేపల్లి అండ్ కో వారు ప్రచురించిన పుస్తకాలను పంపిస్తుండేవాడిని. నా తృప్తిమేరకు ఒక పుస్తకమైనా ఆయనకు బహూకరించాలని భావించేవాడిని. కానీ ఆయన నాకా అవకాశం ఇచ్చేవారు కారు. అణా, పైసలతో పాటు( ఆ పుస్తకాల మీద ధరలు అలాగే వుండేవి లెండి) చెల్లించేసేవారు.
గౌతమీ గ్రంథాలయంలో కానీ, కందుకూరి వీరేశలింగ గ్రంథాలయంలో కానీ, ఏదయినా అరుదయిన పుస్తకం కనిపించినప్పుడు ‘నండూరి వారికిది నచ్చుతుందేమో’ అని అనుమాన పడే వాడిని. అలాగే వారికి నచ్చేది.
ఒక సారి ఇలాగే ‘కౌముది’ అనే పేరుతో లిఖిత పత్రిక సంచిక ఒకటి నా కంట పడింది. అందులో కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రచనతో పాటు, నండూరి రామమోహన రావు వ్యాసం కనిపించింది. వెంటనే ఫోటోకాపీ తీయించి ఆయనకు పంపించాను.
అప్పటి నుంచీ ఆయన రాజమండ్రి( ఆర్ట్స్ కాలేజి)లో చదివిన ఆయన జ్ఞాపకాలను చెబుతూ వుండేవారు. ఫోన్లో నే చాలా సేపు మాట్లాడుతుండేవారు.
రాజమండ్రిలో వున్నప్పుడు, నండూరి రామ్మోహనరావు. కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం (ఆంధ్రప్రభ పూర్వ సంపాదకులు) కలసి ఒకే గది అద్దెకు తీసుకుని కొన్నాళ్ళపాటు వుండేవారు. కొన్నాళ్ళు హాస్టల్‌లో కూడా వున్నారు. ఈ విషయాన్ని కూచిమంచికూడా ఒకటి రెండు సార్లు నాతో ప్రస్తావించారు. ఇద్దరికీ ఒక్కటే బలహీనత. రాజమండ్రి అంటే చాలు, యవ్వనంలోకి వెళ్ళిపోతారు. ఆ అభిమానాన్ని చంపుకోలేకే, ఆంద్రప్రభలో పదవీ విరమణ చేశాక ఆయన రాజమండ్రిలో ‘కోస్తావాణి’ అని దినపత్రికను స్థాపింపచేశారు. అంతే కాదు. ఇద్దరికీ ఆంగ్లంమీద పట్టు, తెలుగు మీద అధికారం సమపాళ్ళలో వుండేవి. కాబట్టే, మార్క్‌ట్వైన్ వంటి మహామహుల రచనలు అలవోకగా నండూరి అనువదించారు. కూచిమంచి కూడా ఇంగ్లీషును ఇంగ్లీషువాడిలాగే రాసే వారు.(ఒకటి రెండు సార్లు ఇంగ్లీషులో నాకు రాసిన ఉత్తరాలు చూసి ముగ్ధుణ్ణయ్యాను)
తనగురించి తాను చెప్పుకోవటం నండూరికి పెద్దగా ఇష్టం వుండదన్నది ఆయన సన్నిహితులందరికీ తెలిసిన విషయమే. అలా ఆయన తనగురించి తాను దాచిపెట్టుకున్న గొప్ప విషయాన్ని నేను బయిటపెట్టాను. కోపపడలేదు. ఆయనకు రంగస్థలానుభవం వుంది. నాటకాల్లో వేషాలు వేసేవారు. ఇంకో రహస్యం: ఆయన స్త్రీ పాత్రను కూడా పోషించారు.అప్పటి పాత పత్రికల్లో అచ్చయిన వివరాలను ఆయనకే పంపాను. ‘ అవును ఆడవేషం నాకు నప్పింది.’ అని ఇష్టంగా నవ్వుకున్నారు. ఈ అనుభవం కూడా ఆయనకు రాజమండ్రిలోనిదే.
‘అప్పటి అద్దం: ఇప్పటి ముఖం’
తత్వశాస్త్రమన్నా, విజ్ఞానశాస్త్రమన్నా ఆయనకు ఎంత ఇష్టమో ఆయన గ్రంథాలే చెబుతాయి. ఆయనకు తత్వమూ, జీవితమూ- రెండూ వేర్వేరు కావు. సంపాదకుడిగా వుండగానే ఒకసారి ఆయన రాజమండ్రి వచ్చి, శిధిలాలలో అప్పటి జ్ఞాపకాలను వెతుక్కుంటున్నారు. తాను అప్పడు నడచిన నేలకు సమస్కరిస్తున్నారు. అదే క్రమంలో తాను నివాసం చేసిన వసతిగృహానికి వచ్చారు. అప్పటికే అందులోకి చిన్న చిన్న వ్యాపార శాలలు వచ్చాయి. అయినప్పటికీ, ఒక గదిని గుర్తు పట్టారు. ‘ఇక్కడ గోడకు అతికించిన అద్దముండాలి’ అన్నారు. వెదికితే నిజంగా కనపడింది. ఆయన దాని ముందుకొచ్చి నిలబడ్డారు. అప్పుడాయన అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండి పోయాయి: ‘అద్దం మారలేదు. నా ముఖమే మారింది’.
కావలసినంత తత్వం వుంది ఈ మాటల్లో.
భారతీయ, పాశ్చాత్య తత్వ శాస్త్రాలను క్షుణ్ణంగా చదువుకున్నారు. కాబట్టే అంత హాయిగా ఆయన తెలుగు పాఠకులకు పరిచయం చేయగలిగారు.
ఆధునిక తత్వవేత్తల్లో ఆయనకిష్టమైన వారెవరంటే, జిడ్డు కృష్ణమూర్తి- అని సంశయించకుండా చెప్పారొకసారి.
ఆయన కళా,సాహిత్య, తాత్విక రంగాలలో ఆధునిక రీతులను, తెలిసిన వెంటనే అనుసరించకుండా, పరిశీలనకు పెట్టుకునే వారు. నిగ్గు తేలాక ఆహ్వానించేవారు. అందుకే ఆయన కొందరికి ‘వెనకటి కాలపు రచయిత’ లాగా అనిపించేవారు. వీరేశలింగమన్నా, గురజాడ – అన్నా ఆయనకు ఎక్కువ ఇష్టం ప్రకటించేవారు. సంఘాన్ని మార్చటానికి వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ సాధనాలుగా మార్చుకోవటం పట్ల ఆయనకు ఆసక్తి వుండేది. ఈ కోణం లోనుంచి చూస్తే, వీరేశలింగానికి ‘గలివర్ ట్రావెల్స్’ రాసిన జోనాతాన్ స్విఫ్ట్ ఎందుకు ఇష్టమయ్యాడో, నండూరికి మార్ట్ ట్వైన్ కూడా అందుకే నచ్చాడు. గంభీరంగా కనిపించే నండూరిమాటల్లో అప్పుడప్పుడూ రవంత వ్యంగ్యం తొంగి చూసేది.
ఒక సారి రాజమండ్రిలో వుండగా ‘వెంటనే బయిల్దేరమంటూ’ ఒక టెలిగ్రాం రామ్మోనరావు పేరు మీద టెలిగ్రామ్ వచ్చింది. ఇచ్చింది నండూరి వారేమోనని ఆయనకు ఫోన్ చేశాను. ఆయన నవ్వి, ‘భయపడ్డారా? అయితే ఇచ్చింది నేను కాదు. డిజిపి రామ్మోహనరావు అయివుంటారు’ (అప్పటి డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పేరు కూడా రామ్మోహనరావే.) ఆయన హాస్యం, వ్యంగ్యం కూడా మర్యాద తప్పనివే.
ఇది జరిగి మూడు, నాలుగేళ్ళకు నేను కూడా బెజవాడ వచ్చేశాను. కాకుంటే ఆయన సంపాదకుడిగా వున్న పత్రికలో లేను. వేరే పత్రికలో వున్నాను. ఒక సాహిత్య సభకు హాజరయి, నా ద్విచక్రవాహనం మీద నేను బయిల్దేర బోతున్నాను. చప్పుడు లేకుండా నా వెనుక కూర్చుని ‘పోనివ్వండి’ అన్నారు నండూరి. ఆయన ఆఫీసు వైపు పోనిచ్చాను. దారిలో అన్నారు. ‘ఉపన్యాసాలు విన్నారు కదా! నీ మీ బండి ఎక్కింది నాకు మరో వాహనం లేక కాదు. దారి గుర్తుకు రాక.'( ఉపన్యాసాల స్థాయికి ఎలాంటి కితాబు ఇచ్చారో గమనించారు కదా!)
‘రాయలేదు, ఈదాను’
సంపాదకత్వం వహించటమూ, సంపాదకీయం రచించటమూ బ్రహ్మవిద్యలనీ, వాటిని తాను తపస్సు ద్వారా పొందాననీ, ఆయన భావించి వుండరు. అలాగని వాటికుండే అర్హతల్ని తక్కువ చేసీ వుండరు.
కాకపోతే తన సంపాదకీయ రచనకు ఎలా శ్రీకారం చుట్టారో మాత్రం చెబుతుండే వారు. ‘చెరువులోకి తోసి ఈత నేర్చుకోమన్నట్లుగా నార్ల వారు నన్ను తోసేసారు. అలా నేర్చుకున్నాను.’ అని అనేవారు. కాకుంటే వడివడిగా మారిపోయే రాజకీయ పరిణామాలను ముందుగా ఊహించే పనిపెట్టుకునే వారు కారు. ఫలితంగానే ‘ ఈ సంపాదకీయం రాసే సమయానికి’ అనే షరతును తన విశ్లేషణకు జోడిస్తుండేవారు.
ఇరవయ్యవ శతాబ్దపు పాశ్చాత్యసమాజంలో వ్యక్తి కి వున్న ప్రాధాన్యాన్ని గుర్తించి స్వీకరించారు. అందుకైన వ్యక్తిగతం- అని తాను గీసుకున్న గిరిలోకి ఎవరు వచ్చినా అంగీకరించేవారు.
వృధ్ధాప్యం మీద పడ్డాక, ఆయన పెద్దగా సందర్శకులను చూడటానికి ఇష్టపడేవారు. ఆయన్ని చూడాలని చాలా సార్లు అనుకుని కూడా వెనక్కి తగ్గాను.
ఇప్పటికీ, ఎప్పటికీ సంపాదకుడిగా వున్న నండూరి యే నా మనస్సులో వుండి పోతారు.
ఆయన దగ్గర పనిచేసినప్పుడు, ఆయనే ఎదురయితే ఎలా నమస్కరించే వాడినో, ఇప్పుడూ అలాగే నమస్కరిస్తున్నాను.
-సతీష్ చందర్
(ఆంధ్రజ్యోతి దినపత్రిక( వివిధ)లో 12 సెప్టెంబరు 2011 సంచికలో ప్రచురితమయింది)
నండూరివారి వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో బొమ్మ కట్టించారు సతీష్ చందర్ గారూ! ధన్యవాదాలు.
‘అద్దం మారలేదు. నా ముఖమే మారింది’… An excellent quote. There is a touch of adoration coupled with love in your article. My congrats to you.