నవ్వటం మరచిపోయాం. ఇదో ఫిర్యాదు. అక్కడికి ఏడ్వటం పూర్తిగా తెలిసిపోయినట్లు! సుష్టుగా భోజనం చేసినట్లు, తృప్తిగా దు:ఖించి ఎన్నాళ్ళయింది? రెండువందలు తగలేసినా మల్టీప్లెక్స్‌లో మూడు సెకండ్లకు మించి కళ్ళు చెమర్చటం లేదు. ఎంత దగ్గరవాడు పోయినా ఏడుపు వచ్చి చావటం లేదు.
దగ్గర..దగ్గర..అని ఉత్తినే మాట్లాడుకుంటున్నాం కానీ, కొలిచి చూస్తే, కౌగిలిలో వున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య దూరం పదివేల కిలోమీటర్లు. ఎదలు కలిస్తే కదా, ఎడబాటు తెలియటానికి! ముద్దు పెట్టిన ప్రేయసి రైలెక్కి వెళ్ళిపోతున్నా కనురెప్పలు తడవవు. కన్నతండ్రి ముఖం మీద కడపటి పిడక పెట్టాక కూడా కన్నీరు ఉబకటం లేదు. కబేళాల్లో పశువుల్ని వదలి పోయినట్టు, తన్ని తగలేసే స్కూళ్ళల్లో శిశువుల్ని వదలి పోయినప్పుడు కూడా చెక్కిళ్ళు తడవటం లేదు.
వ్యాధి సోకింది. మహమ్మారిలా పాకుతోంది. ఇంకినతనం. నీరింకిన తనం, కన్నీరింకిన తనం. ఇది సోకిన వాళ్ళు ఇక ఎప్పటికీ ఏడ్వలేరు. ఏడ్పును తిరగేస్తేనే కదా నవ్వు! కాబట్టి నవ్వలేరు కూడా. మందు కావాలి.స్ట్రెచర్ మీద రోగి ‘ఆక్సిజన్, ఆక్సిజన్’ అని అరిచినట్లు, నేడు మీరూ, నేనూ, అందరమూ ‘కన్నీళ్ళు, కన్నీళ్ళు’ అని కలవరిస్తున్నాం.
ఎవరన్నా తపస్సు చెయండర్రా! ఏ దేవతయినా వచ్చి కడివెడు కన్నీళ్ళు ప్రసాదించి వెళ్ళిపోతుందేమో! ఇలాంటప్పుడే రోడ్డు మీద తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న ఎవరో ఒకతను ‘ఏడ్చుకుంటూ’ కనిపించాడు. అవును. అతడు అంతటి ఆరోగ్యవంతుడెలాఅయ్యాడు?
రహస్యమేమిటో? అతడు క్రమం తప్పకుండా మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం తాగుతాడు.
అవును కన్నీళ్ళే కవిత్వం. కవిత్వమే కన్నీళ్ళు.
నేడు కవిత్వమొక నిత్యావసరం. అందుకే కవిత్వం మీద పడుతున్నారంతా. కవిత్వాన్ని ఎవ్వరూ రాయలేరు. రాస్తే అది కవిత్వం కాదు. కవిత్వం దానికదే రాయించుకుంటుంది.
కళ్ళు చెమర్చిన వారంతా ఒక్కొక్కరూ ఒక్కో జీవనదిలా ప్రవహిస్తున్నారు. వీరంతా కవిత్వ మహాసాగరంలో కలిసే చోటునే కవిసంగమం అని పిలుస్తారు. ఈ రసక్షేత్రంలో ఒక్కసారి మునిగితే చాలు మొత్తం పొడితనమంతా పోతుంది.
భూమినీ, దేహాన్నీ, దేశాన్నీ, ఊరునీ, ప్రాంతాన్నీ కోల్పోయిన మేఘాలన్నీ ఒక్కసారిగా కరిగితే కలిగిన కుంభవృష్టిలో తడిసిన మహా దు:ఖాను భూతి కావాలంటే, ఈ క్షేత్రాన్ని దర్శించక తప్పదు.
III III III
ఎన్నో ఏళ్ళ ఎడతెగని ఎండ తర్వాత, వీధుల్లో పడుతున్న వానలో అన్నీ కొత్తగానే వుంటాయి. తప్పిపోయిన మిత్రుడు హఠాత్తుగా కనపడి ఆనందంతో డొక్కలో తన్నినట్టు ఒక పక్కకు తోసేసే గాలీ, నిప్పుల మీద సాంబ్రాణి కొచ్చిన పొగలా, నేల మీద వాడి చినుకులు లేపిన ధూళీ, అప్పుడే అలకవీడిన అమ్మాయి ముఖంలా తళుక్కు మన్న మెరుపూ, ఎదుట ఊదే సన్నాయి ఊపుకు రెచ్చిపోయిన డోలు దెబ్బలా, ఉలిక్కి పడ్డ ఉరుమూ..ఓహ్! తనువున్నది ఇలా తడిసిపోవటానికేనేమో!
కవిత్వం తడిపేస్తుంది. కవిత్వం మీద కవిత్వం ముంచేస్తుంది. కవిసంగమం కవులు కవిత్వం మీద కవిత్వం రాశారు. మరోమారు నిర్వచించాలన్న కోరికతోనో, తమకు తెలుసంటూ దబాయించాలన్న వ్యూహంతోనో, రాసింది కవిత్వం అవునో కాదో అన్న అనుమానంతోనో కాదు. ఏహ్! నాకు కవిత్వం దొరికిందోచ్- అన్న సంబరంతో మాత్రమే రాశారు. నీరు మధ్యలో నేల తగిలితేనే కాదు, నేల మధ్యలో నీరు ఉబికినా సంబరమే.
కవిత్వమే. ‘తేనెల చినుకులా/ ప్రభవించి ప్రవహించే ఏరులా/ చైతన్యపు జడిలా’ ఒకరికి దర్శనమిస్తే, ‘ఒక పువ్వు, ఒక పిట్ట కూత, ఒక దు:ఖాశ్రువు’లా ఇంకొకరికి సాక్షాత్కారిస్తుంది.
‘పసిబిడ్డల పకపకల్లో’ ‘తుపాకి మడమల మీద కునికిపాట్ల’లో అడ్డంగా దొరికిపోయిందీ, ‘రాళ్ళని మార్చేసి’ రహస్యంగా మాయమయిందీ కవిత్వమే.
కొత్త తనం, పచ్చతనం, తాజాతనం, తడియారనితనం- తటిల్లతకు గురిచేస్తూంటే, లోతులూ, చెక్కుళ్ళూ, పదబంధాలూ, ప్రతీకలూ ఎవరిక్కావాలి? కొలతలకే అడుగులు; అనుభవాలకు తప్పటడుగులే. ఏ పసివాడూ ఒక్కలా నడవడు. అలా నడిస్తే అది మార్చింగే. దారితప్పితేనే కవిత్వం. దారిన వెళ్ళితే వచనమయిపోదూ!
కవిత్వం ఆవహిస్తే అంతే. దారి తప్పించేస్తుంది. ‘తండ్రి చెప్పుల్లో కొడుకు కాళ్ళు పెడుతున్నప్పుడు’ పసివాడికి పెద్దరికం రాదు. కానీ ఆ సన్నివేశాన్ని మురిపెంగా చూసే తండ్రి మాత్రం ‘బాల్యంలోకి ఇట్టే జారుకుంటాడు’. బిడ్డ తాను అడుగులు వేస్తాడో లేదో తెలియదు కానీ, తండ్రి చేత తప్పటడుగులు వేయస్తాడు- అచ్చంగా కవిలాగే. ఇది మాయే. మంత్రమే. కాదు మరీ. ఎరిగిన ప్రపంచాన్ని ఎరగనట్టుగా, అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా వెళ్ళిపోవటం మాంత్రిక వాస్తవమే.
కవిత్వం పూనితేనే కానీ అడగాల్సినవి అడగం. అంతవరకూ దాహమేసినప్పుడు రొట్టెనూ, ఆకలేసినప్పుడు నీటినీ అడిగే వుంటాం. పెళ్ళి కోరిక పుట్టినప్పుడు ‘తాళికట్టాలి ఓడబ్బు మూట తెచ్చిపెట్టు నాన్నా’ అని మారాం చేసే వుంటాం. తృప్తి ని అడగటం మాని, కీర్తికోసం దోసిలి పట్టే వుంటాం.
చంటాడూ, కవీ అడగాల్సినవే అడుగుతారు. ‘నాకు కొంచెం బాధ కావాలి. గుండెల్ని పిండే నొప్పి కావాలి’ అంటారు. ఏడుస్తారు. మారాం చేస్తారు. గుక్కపడతారు. ‘ఏడిశాడు’ అని అందరి చేత అనిపించుకోవాలని చూస్తారు. అది తిట్టుకాదు. దీవెన. ‘ఇప్పుడే పుట్టాడు’ అన్నంత గొప్ప ఆశీర్వచనం.
ఎవరికి వారు ఏకాకులుగా సుఖపడి చస్తున్న నగరాల్లో, పట్టణాల్లో, పట్టణ వేషం కట్టిన పల్లెల్లో దు:ఖం వరమే. అప్పుడు బాధను మించిన తోడు వుండదు. ఇలాగే బాధ పడాలని నియమం లేదు, ఎలాగోలా బాధపడవచ్చు. చిటికెన వేలు మీద చీమ తో కుట్టించుకుని మరీ బాధపడవచ్చు. ఆ క్షణానికి బతికి పోవచ్చు. బాధే ఉనికి. బాధే అస్తిత్వం.
III III III
నీరే జీవమంటారు. నీరున్న గ్రహాలను నిలువెల్ల తడిమిచూస్తుంటారు. నీటి చారికలుంటే బతికిన జాడలున్నట్లే. బతకటమంటే కదలటమే. కన్నీటి జాడలున్నచోట కవిత్వం తచ్చాడే వుంటుంది.
చలించేవీ, చరించేవీ ఒక్కచోట వుండవు. ఈది ఈది సముద్రగర్భాన్ని తాకి వస్తాయి,ఎగిరి ఎగిరి గగనాన్ని చుంబిస్తి వస్తాయి. నాలుగు పాదాలా నడచి నేలను చదును చేస్తాయి. ముందు కాళ్ళు ఎత్తి జరిగిన పరిణామానికి చిహ్నంగా చప్పట్లు కొడతాయి.
కవిత్వమూ అంతే. వెర్రికేకయి, ఉత్త మాటయి. స్వరమయి, పదమయి, వాక్యమయి, నాలుగు పాదాల పద్యమయి, గేయమయి, వచనమయి, నిర్వచనమయి జరుపుకున్న ఉత్సవమంతా కవిసంగమంలో కనిపిస్తుంది. చేపయి, పిట్టయి, కోతయి, మనిషయి- అన్నట్టుంది కదూ. నిజం కూడా అంతే. యుగానికో చలనం కాదు, చలనానికో యుగం.
కొత్త యుగంలో కూడా పాత చలనశైలి కనిపిస్తుంటుంది. నేల మీద నిద్రపోతూ కూడా, కొమ్మ మీద నుంచి జారిపడ్డట్టు ఉలిక్కిపడి లేస్తాం. అదో మురిపెం.
వచనకవిత్వమేలే అని వెళ్ళిపోతుంటామా? ఎక్కడో ఒక గేయం మధ్యలో తారసపడుతుంది. అంత్య ప్రాస ఆట పట్టిస్తుంది. కవిసంగమం లో ఈ ముచ్చట్లకేం లోటు లేదు.
‘నీ పెదాల మీద వాలాకే/ బహుశా-/ గాలి గమనించి వుంటుంది/పాటా,ప్రాణమూ తానేనని’ పలికే నిర్మల వచనంలాగానే కాదు, ‘ముక్కుపుడకా బెట్టి ముత్తెమోలె నేనుంటే/ పుడకమీదున్నట్టి మెరుపు తానంటాడు’ అంటూ ఊయలూపే గేయంలాగానూ కవిత్వం పలకరిస్తూ వుంటుంది. అక్కడక్కడా అంత్యప్రాసలూ వుంటాయి, అంతర్లయలూ వుంటాయి.
అహో! ఏమీ ఈ మాయాజాలం? అని ఆశ్చర్యపోనవసరంలేదు. ఇది అంతర్జాలం! కాల, స్థల సరిహద్దు రేఖల్ని చెరపకుండా ఒక చోటకు చేరటం అంత సులభం కాదు.
ఎవరెక్కడున్నా,ముఖాముఖిగా, ఎకాఎకిన పలకరించుకుని, గిచ్చుకుని, మెచ్చుకుని, తిట్టుకునే సౌకర్యం ఎప్పుడో, ఏ గ్రామంలోనో, ఏ రచ్చబండ మీదో సాధ్యమయ్యేది. మళ్ళీ ఇన్నాళ్ళకు అంతర్జాలం అదే సౌఖ్యాన్ని అనుగ్రహించింది. ఊళ్లల్లో పొద్దెరగకుండా తిరిగే పోరగాళ్ళను కూడగట్టినట్టు, కవులను ఈ అనుక్షణ మాధ్యమంలోకి పోగేసుకొచ్చాడు యాకూబ్. తాను తప్పుకుంటూ కాయకు చోటిచ్చే పూవులా, యాకూబ్ ఇన్ని ఫలాలను విరగ కాయించాడు. ఎవరి ఈల వారిది, ఎవరి పాట వారిది. అన్నీ విభిన్న ఫలాలే. ఎవరి ప్రత్యేకత వారిది. కాపు కాయటమే కవితోద్యమం అయిపోయింది. కవిసంగమం అయిపోయింది.
III III III
అందరి అస్తిత్వాలు ఒక చోట కొలువు తీరటం ఉత్సవమే. వెన్నెముక వంచకుండా, తల దించకుండా వుండే మనుషుల్ని ఒకే చోట చూసినట్టుంది. స్త్రీ,దళిత,బహుజన,మైనారిటీ,ప్రాంతీయ వాదాల ప్రతినిథులు శిఖరాగ్ర సమావేశం పెట్టుకున్నట్టుంది. ఈ వాదాలను హెచ్చవేయగా హెచ్చవేయగా వచ్చిన మానవానుబంధమే ‘మనిషి టు ది పవర్ మనిషి’. నిజం చెప్పొద్దూ. వీటన్నింటినీ ఒక చోట పెట్టుకుని చూస్తుంటే, నాకు నేను దగ్గరయినట్టుంది; నా శత్రువెవరో నాకు తెలిసిపోయినట్టుంది; నేను చేయాల్సిన యుధ్ధం సిధ్ధమైనట్టుంది.
కవి సంగమం కవే అన్నట్లు, ‘ఒక్క వాక్యం కోసమే పేజీల కొద్దీ రాస్తుంటాం.’
వాదాలన్నీ చేసేది కూడా ఒక్క వాక్యం చెప్పటం కోసమే: ‘మనిషి మనిషేరా!’
మనిషి పక్కనే మనిషి వుండాలి, మనిషి కింద మనిషి కాదు.
పదం పక్కన పదం వుంటేనే ప్రతీ పదానికీ అస్తిత్వం, వెరసి అపురూపమైన కవిత్వం. అందుకే కిందకు జారిన ప్రతీ మనిషికీ క్రమం తప్పకుండా కవిత్వం పట్టిద్దాం!!
-సతీష్ చందర్
9 ఏప్రిల్ 2013
(కవిసంగమం 2012 కవిత్వ సంకలనం కోసం రాసిన ముందు మాట)
ముందు మాట చాలా బాగుంది,సార్,..కవిసంగమం నాలాంటి వారికి గొప్ప తోడ్పాటు,..దీనికై కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు,..ప్రింట్ లో నా మొదటి కవిత కూడా దీనిలోనే చూసుకున్నాను,.
jayaho
what a wonderful foreword. Kavi Yakub has become kavikula guruvu now. He deserves all the praise and honor.
చాలా చక్కని ముందుమాట రాసారు మాస్టారు ! మీ ప్రోత్సాహం మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది . కాశిరాజు కవిసంగమం .