మోడీ, గోద్రా, ఒక తమిళ అమ్మాయి!?

దేహమంటే మట్టి కాదోయ్‌, దేహమంటే కోర్కెలోయ్‌!

ఇలాగని ఎవరంటారు? ‘దేహ’ భక్తులంటారు. దేశ భక్తుల్లాగే దేహభక్తులుండటం విడ్డూరం కాదు. కానీ ‘దేశభక్తుల్లో’ కూడా ‘దేహ’భక్తులుండం ఆశ్చర్యమే.

సర్వసంగ పరిత్యాగులూ, కాషాయాంబర ధారులూ ‘నిత్యానందులయి’ దేహాల కోసం పరితపించటం కొత్త విషయమేమీ కాదు.

ప్రజాసేవ కోసం తమ అణువణువూ అర్పించేస్తామని ఊరేగే రాజకీయనాయకులూ, ప్రజా ప్రతినిథులూ, దేశభక్తులూ, ఇలా ‘దేహాల వేట’లో వుండటం కూడా వింత కాదు కానీ, దొరికి పోవటం వార్త. ఇటీవలి కాలంలో ఇలాంటి ‘శృంగార పురుషుల’ భాగోతాలు ప్రసారం చేసి బుల్లితెర మరింత చిన్నబోతోంది.

ఇన్నాళ్ళూ చట్టసభలకు అవినీతి పరులూ, హంతకులు కూడా వెళ్ళిపోతున్నారేమోనని దిగులు పడే వాళ్ళం. ఇంకా కొన్నాళ్ళ క్రితమయితే, పొట్టచించితే అక్షరం ముక్కరాని వేలి ముద్రగాళ్లు కూడా వెళ్ళి పోతున్నారని బాధ పడేవాళ్ళం. ఇప్పుడా బెంగలేదు. గ్రంథాలు చదివిన వాళ్లూ , రాసిన వాళ్ళూ మాత్రమే కాదు, ‘గ్రంథాలు నడిపిన’ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఒక పక్క చట్ట సభజరుగుతుంటే, తలవంచుకుని కునుకుపాట్లు పడకుండా, మోబైల్‌లో ‘స్త్రీల నగ్నశరీరాల నీలి చిత్రాల’ను చూసే సభ్యులు కూడా వున్నారు. వీరే నిజమైన ‘దేహ’ భక్తులు.

మన రాష్ట్రంలో గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీతివారిని ఇటీవలి కాలం వరకూ సీనియర్‌ దేశభక్తుడిగానే గుర్తుపెట్టుకునే వారు. కానీ ఆయన నడవలేని స్థితిలో కూడా స్త్రీల దేహాల మీద (సీడీల సాక్షిగా) ప్రదర్శించిన భక్తి కి రాష్ట్ర ప్రజలు సొమ్మసిల్లిపోయారు. ఇక ‘సెక్స్‌ రాకెట్‌’ నడిపి పట్టుపడ్డ తారా చౌదరి ఇంకా తన ఆత్మకథ రాయకుండానే రాష్ట్రానికి చెందిన ఒక ఎం.పీ, ఒక ఎమ్మెల్యే పేర్లు మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ‘దేహ భక్తి’ మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా సమృధ్థిగా వుంది. ఉత్తర ప్రదేశ్‌లో అయితే మాజీ మంత్రి అమర్‌మణి త్రిపాఠి ఏకంగా ముధుమతి శుక్లా అనే కవయిత్రి దేహం మీద మోజు పడి, వాంఛలు తీర్చుకున్నాక కాల్చి పారేశారు. ఈ నేరానికి అతనికి జైలు శిక్ష పడింది.

ఇటీవల కాంగ్రెస్‌ అధికార ప్రతినిథిగా వున్న అభిషేక్‌ సింఘ్వీ ‘రాసలీల’ల్ని సిడి రూపంలో విడుదల చేశారు. ఇలాంటి సీడీలు వచ్చినప్పుడెల్లా, అందులో ఇరుకున్న నేతలనుంచి వచ్చే సమాధానం ఒక్కటే. ‘ఇది నిజంగా కాదు. మార్ఫింగ్‌ ద్వారా సృష్టించిన సిడి’.

నిజమే ఇవాళ ఎవరినయినా అపఖ్యాతి పాలుచెయ్యాలనుకున్నప్పుడు- వారి మీద ఇలాంటి సీడీలను విడుదల చేస్తే చాలు! అయితే నిప్పు ఏ మాత్రం లేకుండా పొగ సృష్టించగలరా? సాంకేతికంగా ఎదిగి పోయాక ఏది సాధ్యం కాదు చెప్పండి?

ఎప్పుడయినా ఇలాంటి ‘సీడీ’లు చానెళ్ళలోనూ, ఇంటర్నెట్లలోనూ వచ్చేశాక, ‘అబధ్ధం! మార్ఫింగ్‌!’ అని సదరు నేత తరఫు వారు కేకలు పెడతారు. కానీ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. మోడీ, ఒక తమిళ అమ్మాయి వున్నట్టుగా ఒక సెక్స్‌ సిడిని పనిగట్టుకుని సృష్టించి, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేసి, ఆయన్ను అపఖ్యాతి పాలు చేయనున్నట్టుగా శివసనే అధికార పత్రిక ‘సామ్నా’ వెల్లడించింది. బాంబును ముందుగానే గుర్తించి దానిని నిర్వీర్యం చేసినట్టుగా ఈ పత్రిక ఆ సీడీని పేలకుండా చేసిందన్నమాట. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గోద్రా అనంతర ముస్లింలపై దాడులుకు పాల్పడిన వారు ఎలా మోడీకి ఎలా సన్నిహితులో, వారి సంభాషణల్లోనే వినిపించే ప్రయత్నం తెహల్కా చేసింది. అయినా అప్పట్లో మోడీ గెలిచారనుకోండి. కానీ ఇప్పుడు ‘సెక్స్‌ రాకెట్ల’ సీజన్‌ కాబట్టి, దృష్టి ఇటు మళ్ళిందని అర్థం చేసుకోవాలి.

వీటిల్లో వుండే నిజా,నిజాలను దర్యాప్తు సంస్థలకు వదలి వేస్తే, ఇలా ‘దేహ’ భక్తి విషయంలో ఇతర దేశాల నేతలు కూడా పలుసార్లు పలు సందర్బాల్లో ఇరుక్కున్నారు. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తన కార్యాలయం లో పనిచేసే మోనికా లీయోన్‌స్కీతో శృంగార కలాపాలకు పాల్పడ్డారన్న వార్తలు ప్రపంచాన్ని కుదిపేశాయి. కాలిఫోర్నియా గవర్నగా పనిచేసిన ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌ నెగ్గెర్‌ కారణంగా మిల్డ్రెడ్‌ అనే ఉద్యోగి గర్భవతి అయి బిడ్డనే కన్నది. అయితే ఆయన అది స్వయంగా ఒప్పుకున్నారనుకోండి. ఇలాంటి అభియోగమే, ఎన్డీ తివారీ మీద కూడా నడుస్తోంది. కానీ తివారీ ఇప్పటికీ నిరాకరిస్తూ వుస్తన్నారు. డిఎన్‌ఏ పరీక్షల ఫలితాలు వచ్చాక నిజాలు వెల్లడవుతాయి.

ప్రజా ప్రతినిథులకు నిజంగానే ‘దేహ’ భక్తి వుండటం ఒక అంశమయితే, తమను దెబ్బతీయటానికి ఈ ‘దేహ’ భక్తి పూర్వక నీలి చిత్రాలను వారి మీద చిత్రించి ప్రచారం చేయటం మరొక అంశం.

వీటన్నిటికన్నా బాధాకరమైన అంశాలు మరో రెండు వున్నాయి. ఒకటి: రాజకీయాలలో నేతలు స్త్రీలతో వివాహేతర లేదా శారీరక సంబంధాలు పెట్టుకోవటాన్ని గొప్ప విషయంగా భావిస్తున్నారు. రెండు: రాజకీయాల్లోకి వచ్చే స్త్రీలతో అలాంటి సంబంధాలు పెట్టుకుని, వారిని తమ పావులుగా వాడుకోవాలని చూస్తున్నారు.

తమ నేత నైతికంగా ఉన్నతంగా వుండాలని ప్రజలు భావించేటంత వరకూ, రాజకీయాల్లో ఈ కీచక పర్వం నడుస్తూనే వుంటుంది. కానీ ‘అవినీతి’ పట్ల కూడా రాని ఏవగింపు ఈ ‘దేహ’ భక్తి మీద వస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే.

-సతీష్ చందర్

19-7-22

 

1 comment for “మోడీ, గోద్రా, ఒక తమిళ అమ్మాయి!?

Leave a Reply