మోడీ బాడీ ‘సిక్స్‌ ప్యాక్‌’ కాదా..?

టాపు(లేని) స్టోరీ:

nitish-and-modi-350_050612091144మతిమరపు ఒకటే. నమూనాలు వేరు.

చాలా కాలం క్రితం పత్రికలో ఓ కార్టూన్‌ అచ్చయింది- మతిమరపు మీదే. గురు శిష్యులు క్లాస్‌కు వస్తుంటారు. గురువుగారికి చొక్కా వుండదు. ఆయన వెనకాలే నడుస్తున్న శిష్యుడికి ఫ్యాంటు వుండదు. అలాగని గురువుని మించిన శిష్యుడు-అని నిర్ధారణకు వచ్చేయనవసరం లేదు. ఇద్దరు మరచిపోయింది దుస్తులే కావచ్చు. శరీరాన్ని ఒకరు పైభాగం కప్పటం మరచిపోతే, ఇంకొకరు కింద భాగాన్ని మరచిపోయారు.

వృద్ధిలోకూడా ఎవరి నమూనా వారికి వుంటుంది. వృధ్ధి అంటే పెరగటమే కదా. కొందరు నిలువుగా పెరుగుతారు. అడ్డంగా పెరుగుతారు. మళ్ళీ అడ్డంగా పెరగటంలో కూడా రెండు నమూనాలున్నాయి: బలుపు, వాపు.

కేవలం ఈ నమూనాల గొడవ వల్లనే, ప్రధాన ప్రతిపక్షం అయిన ఎన్డీయే చీలిపోయేలా వుంది. ఎన్డీయేలో పేరు మోసిన ఇద్దరు ముఖ్యమంత్రులున్నారు. ఒకరు: నితిష్‌ కుమార్‌, మరొకరు: నరేంద్ర మోడీ. ఇద్దరూ ముమ్మారు ముఖ్యమంత్రులుగా పదవీ స్వీకారం చేశారు.(నితిష్‌ మాత్రం చేస్తే అయ్యింది ఒక సారీ, గెలిచి అయ్యింది రెండు సార్లూను.)

ఎన్డీయేకి నితిష్‌ పెంపుడు కొడుకయితే, మోడీ సొంత కొడుకు.

కూటమికీ పార్టీకీ పెద్ద తేడా వుండదు. యుపీయే అంటేనే కాంగ్రెస్‌. అలాగే ఎన్డీయే అంటేనే బీజేపీ. ఇటు కాంగ్రెస్‌ కానీ, అటు బీజేపీ కానీ సొంత సంతానం సరిపోదనుకున్నప్పుడు, కొందరు పక్క పార్టీల పెంపుడు పిల్లలు అవసరమవుతుంటారు. అలా జనతా దళ్‌(యూ) నుంచి తెచ్చుకుని పెంచుకున్న కొడుకు నితిష్‌ కుమార్‌.

అయితే ఎన్డీయేకు ఓ ప్రధాని అభ్యర్థి అవసరమయితే, నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీ( ముస్లిం) వ్యతిరేకతనే పెట్టుబడిగా పెట్టి గుజరాత్‌లో గెలిచి,నిలిచిన రాష్ట్ర నేత మోడీ. తర్వాత తర్వాత ‘వృధ్ధీ, అభివృధ్ధీ’ అంటూ గుజరాత్‌ను పచ్చగా చూపించారు. లక్షరూపాయి కారు ‘నానో’ తయారీకి ‘నోనో’ అని పశ్చిమ బెంగాల్‌లో టాటాకు ‘టాటా’కు చెబితే, మోడీ ‘వెల్‌కమ్‌’ బోర్డు పెట్టారు. చెవులో పువ్వులూ, నుదుట బొట్టూ పెట్టుకుని వచ్చి ‘నమో'( నరేంద్ర మోడీ) అని ఏ పారిశ్రామిక వేత్త వచ్చినా గుజరాత్‌ అదరించేసింది.

అయితే ఇది బీజేపీ వారి ‘స్వీయ ప్రకటన’ల ద్వారా లోకానికి తెలిసిన గుజరాత్‌. అయితే ఇది కాకుండా లోకమెరుగని ‘గజ..గజ రాత్‌’ ఒకటి వుంది. అవును. వాళ్ల జీవితాలు ‘గజ గజ వణికే’ రాత్రుళ్ళే. కారణం దరిద్రం. దారిద్య్ర రేఖకు దిగువను వుండేవారు మన మన(ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్రంలో కంటే ఎక్కువ. అక్కడ 31.8 శాతం వుంటే, మనకి 29.9 శాతమే వున్నారు. అక్కడ బతికే సగటు మనుషుల ఆయు:ప్రమాణం తొమ్మిది రాష్టాల కంటే తక్కువ. వేతనాల రేట్లు ఎ్కడో అట్టడుగున వుంటాయి. పిల్లల్లోనూ,మహిళల్లోనూ పౌష్టికాహార లోపం అధికం. అదేమటే ‘మా రాష్ట్ర ప్రజలు స్లిమ్‌ గా వుండాలని, తక్కువ తింటారు తప్ప, లేక కాదు’ అని మోడీయే ఓ సారి చమత్కరించారు. అంటే గుజరాత్‌ వృధ్ధి కొందరికే.

కానీ ఒకప్పుడు వృధ్ధిలో అధ:పాతాళంలో వున్న బీహార్‌ను నితిష్‌ కుమార్‌ పైకి తెచ్చారు. అంతే కాదు, ఆయన, జాతీయ స్థాయి రాజకీయాలను చక్కబెట్టి రాష్ట్రానికి వచ్చిన నేత.

వృధ్ధే ప్రధాన అభివృధ్ధికి ప్రాతి పదిక అయితే, తనరాష్ట్రానిదే నిజమైన వృధ్ధీ అంటాడు నితీష్‌. మోడీది ‘ఏక వర్గ’ వృధ్ధి అయితే, తనది ‘సిక్స్‌ప్యాక్‌’ వృధ్ధీ అంటాడాయన. అంటే తాను సాధించిన వృధ్ధిలో ‘ఆరు’ వర్ణాల వారూ( బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దళిత, మైనారిటీలకు చెందిన వారు) అభివృద్ధి చెందిన వారని అర్థం.

కేరికేచర్‌ వేసి చెప్పాలంటే, పొట్టమాత్రమే వృధ్ధి చేసుకున్న ఒకనాటి సినిమా హీరోకీ, ‘సిక్స్‌ప్యాక్‌’ తో శరీరం మొత్తం గట్టి బరచుకున్న నేటి యువ హీరోకీ వున్న తేడా- అని నితిష్‌ భావం!

అందుకే ‘సింగిల్‌ ప్యాకే’ కావాలో, ‘సిక్స్‌ప్యాకే’ కావాలో తేల్చుకోమంటున్నాడు. అయతే తాను ప్రధాని రేసులో వుండక పోయినా, ‘ఏక వర్గ’ వృధ్ది కాముకులు మాత్రం వద్దని గగ్గోలు పెట్టుకుంటున్నాడు. ఈ మాటను మోడీ అయినా ఒప్పుకోవచ్చేమో కానీ, మోడీ భక్తులు మాత్రం ఒప్పుకోరు. అదే మరి మోడీ శక్తి!!

న్యూస్‌ బ్రేకులు:

వారా ‘ఎస్సీ’లూ…!

ఎస్సీల సంక్షేమం ఎవరి హయాంలో ఎక్కువ జరిగిందో తేల్చుకుందాం. చర్చకు సిధ్ధమేనా?

-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

ఎస్‌.సి లంటే ‘సేమ్‌ కేస్ట్‌ ‘వారనే కదా అర్థం. అయతే ఇటు కాంగ్రెస్‌ హయాంలోనూ, అటు తెలుగుదేశం హయాంలోనూ ‘స్వకులాభివృధ్ధి’ నువ్వా, నేనా- అంటు జరిగింది. దీనికి చర్చేమిటి?

2006 నుంచి 2011 వరకూ రాష్ట్రంలో 76 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి.

-హెచ్‌.ఎస్‌.బ్రహ్మ, ఎన్నికల కమిషనర్‌

ఆ నియోజకవర్గ వోటర్లు అదృష్ట వంతులు. ఒకే పెళ్ళికి రెండు సార్లు కట్నం వచ్చినట్టు, ఒకే వోటుకు రెండు సార్లు పైసలు వచ్చుంటాయి.!

ట్విట్టోరియల్‌

సెకెండ్‌ ‘హ్యాండ్‌’కు కొత్త ‘కారు’!

పాలిటిక్సుకు రియల్‌ ఎస్టేట్‌ రేంజ్‌ వచ్చేసింది. గోతుల్ని చూపించి, సౌధాల్ని అమ్మగలిగే వారే బిల్డర్లు. పునాదుల్లో వుండగానే చిట్టచివరి అంతస్తులో ఫ్లాట్లకు సైతం బుకింగులు చేసేస్తారు. ఏ గాలికీ కూలక పోతే, రాష్ట్ర సర్కారు ఆయుష్షు ఇంచుమించు ఏడాది వుంది. అప్పటికి ‘సెంటిమెంటే’ పనిచేస్తుందో, ‘సానుభూతే’ వర్కవుట్‌ అవుతుందో ఎవరికి మాత్రం ఎరుక! కానీ అప్పుడు ఇవ్వాల్సిన టికెట్లను ఇప్పుడే ఇచ్చేస్తానంటున్నారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ముహూరత్‌ షాట్‌ రోజునే మొదటి అటకు టికెట్లు ఇచ్చినట్టు లేదూ! ఈ ఆఫర్‌ కేవలం కాంగ్రెస్‌లో వున్న ‘సిట్టింగు’లకే. పాత ఫ్రిజ్జు ఇచ్చి కొత్త ఫ్రిజ్జు పట్టుకెళ్ళేటంత గొప్ప పథకం. ఉన్న నియోజక వర్గంలో, ఉన్న శాసన సభ్యత్వాన్ని మరో అయదేళ్ళ పాటు పదిల పరచుకోమని, పరోక్షంగా ఆయన ఎర వేస్తున్నారు. పాపం! అవిశ్వాసం రోజున విప్‌ ధిక్కరించి ఇతర పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస)కు వెళ్ళినవారున్నారు కానీ, టీఆర్‌ఎస్‌లోకి దూకిన వారు లేరు. బాధగా వుండదూ…! పొలిటికల్‌ మ్యానేజ్‌మెంట్‌లో వచ్చిన ఈ కొత్త ట్రెండ్‌ను ఇతర పార్టీల వారు మౌనంగా చూస్తున్నారు. నచ్చక కాదు. ఈ ఐడియా ముందుగా తమకు రాలేదేమిటని?

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

‘పంచ్‌’ తంత్రం!

పలు ట్వీట్స్‌ : రైటర్‌ డైలాగుల్ని, డైరక్టర్‌ కొట్టేయటమా? అన్యాయం!

కౌంటర్‌ ట్వీట్‌: డైరక్టర్‌ గారి వివరణ వినలేదా? డై ‘లాగూలే’ రైటర్‌ వట. ‘పంచె’ లన్నీ తనవే.

ఈ- తవిక

‘అండ’ ‘దండ’లు!

దండ మీద దండ

అంబేద్కర్‌ మెడ

నిండా దండలే.

ఇది కనిపించే దృశ్యం.

అండ మీద అండ

అగ్రవర్ణాల వారి

కన్నీ అండలే.

అది కనిపించని దృశ్యం!

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘మీడియాలో నిజాలు రాయటం లేదంటున్నావ్‌. నీకెలా తెలుసు?’

‘మీడియాలోనే చదివాను’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

ఐ.పి.ఎల్‌ పేరు మార్చాలని డిమాండు? సిక్సర్‌ కొట్టినప్పుడెల్లా చూసేవాళ్ళ రక్త పోటు పెరుగుతోంది. ‘బి.పి’ ఎల్‌ అని మారిస్తే ఎలా వుంటుందీ!?

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 16 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply