క్రికెట్లోనే క్రీడాకారులు ‘మ్యాచ్ ఫిక్సింగ్’ల నుంచి ‘స్పాట్ ఫిక్సింగ్’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.
మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ ఎత్తి పొడుస్తుంటుంది. అప్పుడప్పుడు టీఆర్ఎస్ కూడా తెలివిలోకి వచ్చి సీమాంధ్ర పార్టీలన్నింటి మధ్య జరిగింది కూడా ‘మ్యాచ్ ఫిక్సింగే’నని తన అపరాధ పరిశోధనను బయిట పెడుతుంది. మళ్ళీ ఇదే టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో ఈ తరహా ఒప్పందమే చేసుకుందనీ, అది కూడా ఈ తరహా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కిందకే వస్తుందని తెలంగాణలోని ఇతర సంస్థలు తప్పు పడుతుటాయి.
‘మ్యాచ్ పిక్సింగ్’ అంటే ఆట మొత్తాన్ని తగలెయ్యటానికి టీమ్‌లో ముఖ్యులు అమ్ముడు పోవటం. కానీ ‘స్పాట్ ఫిక్సింగ్’ అలా కాదు, ఆటలో ఒకభాగాన్ని ప్రభావం చెయ్యటానికి వేరు వేరుగా ఒక్కొక్క ఆటగాడు వైరిపక్షానికి మేలుచేస్తుంటాడు. ‘వైడ్ బాల్’ దగ్గరో, ‘నోబాల్’ దగ్గరో ఇలాంటి మతలబులు జరగుతాయి.
రాష్ట్రంలో పార్టీలనే తీసుకోండి. ఏ ఒక్క పార్టీ – తన ఉనికిని తాకట్టు పెట్టి పక్క పార్టీ భవిష్యత్తు కోసం కృషి చేయదు. కాబట్టిగా పార్టీలోని నేతలందరూ తమ పార్టీని నష్టపరచుకుని మూకుమ్మడిగా మరొక పార్టీకి ప్రయోజనం చేయటానికి సిధ్దం కారు.
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీయే అభ్యర్థికి వోటు చేశారు. అంతకు ముందు ( ఆయన ఆరెస్టుకు ముందు) ఒక జాతీయ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ- కేంద్రం వరకూ తమ పార్టీ మద్దతు యుపీయేకు వండవచ్చు అని చెప్పారు. ‘మతతత్వ పార్టీ’ ముద్ర వేసుకున్న బీజేపీ ,దాని మిత్ర పక్షాల కూటమి(ఎన్డీయే)కి తాను మద్దతు ఇవ్వనప్పుడు, మరో ప్రత్యామ్నాయం లేనప్పుడు- ఆయన అలా చెప్పి వుంటారు. అయినా సరే- తెలుగుదేశం పార్టీ నేతలు దీనిని ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే అన్నారు.
కిరణ్ కుమార్ ప్రభుత్వం మీద రెండు సార్లు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. రెండు సార్లూ ఈ తీర్మానాలు వీగిపోయాయి. మొదటి సారి తెలుగుదేశం అధినేత చంద్రబాబే పెట్టించారు. కాంగ్రెస్ సర్కారు కూలిపోకుండా వుండటానికి చెరో వైపూ పీఆర్పీపీ, మజ్లిసూ వున్నాయనే భరోసాతో ఆప్పట్లో ఈ పని చేయించారన్నది ఆరోపణ. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా అవిశ్వాసం ప్రకటిస్తే, వోటింగ్నుంచి తప్పుకుని తెలుగుదేశం తీర్మానం వీగిపోయేలా చేసింది. ఇలా రెండు సార్లూ కాంగ్రెస్ సర్కారు కూలిపోకుండా తెలుగుదేశం చూసింది. ఈ వింత చూసినప్పుడు వైరిపక్షాల వారికి ఇది ‘మ్యాచ్ ఫిక్సింగే’మేనన్న అనుమానం వచ్చి తీరుతుంది.
‘తెలంగాణ ఇస్తే, టీఆర్ఎస్ను కాంగ్రెస్ లో కలిపేస్తాం’ అన్న ప్రతిపాదన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి వచ్చినట్లుగా ముందు వార్తలు వచ్చాయి. తర్వాత ఇలాంటి ప్రతిపాదన కాంగ్రెస్‌నుంచే వస్తే అందుకు కూడా సిధ్ధపడ్డామని ఆయన మరో కోణం నుంచి ధృవీకరించారు. ఈ రకమైన పరిణామం కూడా టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగే నన్న అనుమానం కలుగుతోందని, ఇతర పార్టీలు ఆరోపించాయి.
నిజం చూస్తే- ఇవేమీ తమ, తమ పార్టీలకు నష్టం చేసుకునే ‘మ్యాచ్ ఫిక్సింగ్’లు కాకపోవచ్చు. రాష్ట్రంలో తమను అదరిస్తున్న దళిత క్రైస్తవులూ, ముస్లిం మైనారిటీలూ జారిపోకుండా వుండేందుకు వైయస్సార్ కాంగ్రెస్ తాము ‘ఎన్డీయే’కు దూరమని చెప్పివుండవచ్చు. తామింకా శక్తి కూడదీసుకోకుండా మధ్యంతర ఎన్నిలు వచ్చి పడితే ఎలా- అనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ సర్కారును వెంటనే కూలకుండా తెలుగుదేశం కాపాడి వుండవచ్చు. తెలంగాణ సాధన కోసం ఎంతటి త్యాగానికయినా సిధ్ధపడతామన్న సంకేతాలను తెలంగాణ జనంలోకి పంపించటం కోసం కూడా ‘కాంగ్రెస్ లో విలీనానికి’ కూడా సిధ్ధపడ్డామని చెప్పివుండవచ్చు.
ఇవన్నీ మహా అయితే తాత్కాలికంగా తాము నష్టపోకుండా వుండేందుకు, పక్కపార్టీలతో చేసుకున్న ‘స్పాట్ ఫిక్సింగ్’ లు అవుతాయేమో కానీ, ‘మ్యాచ్‌ఫిక్సింగ్’లు మాత్రం కాలేవు. అప్పటికప్పుడు మాటలతో శత్రువ పక్షాలను ఇరుకున పెట్టాలి కాబట్టి అలవాటు ప్రకారంగా ‘మ్యాచ్ ఫిక్సింగు’లని మాటలు వాడుతుంటారు. అంతే.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 25-31 మే సంచికలో ప్రచురితం)