యూపీలో విజ‌యం: మోడీ మంత్రం కాదు; కుల, మతాల తంత్రం!

మినీ భారతంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోమారు తన కాషాయపతాకాన్ని ఎగుర వేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో 80 పార్లమెంటు సీట్లకూ 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, కొంచెం తేడాలో రెండేళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే వేగాన్ని కొనసాగించింది. 403 స్థానాలలో 324 సీట్లను గెలుచుకుని, కలసి పోటీ పడ్డ సమాజ్‌ వాదీ పార్టీ- కాంగ్రెస్‌ పార్టీలనూ, ఒంటరిగా తలపడ్డ బీఎస్సీనీ మట్టి కరిపించింది.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకే మారు వచ్చినా, అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్‌ మీదనే వున్నది. కారణం. బీజేపీకి ఉత్తరప్రదేశే గతంగానూ, వర్తమానంగానూ, భవిష్యత్తుగానూ వుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో మరోమారు దేశాన్ని పాలించ వచ్చన్న ఆ పార్టీ ఆశలను ఈ ఫలితాలు పెంచుతాయి. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ ఇదే విజయ దుందుభి మోగించింది. అక్కడ మొత్తం 70 సీట్లకూ 57 స్థానాలను గెలుచుకుంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు చోట్లా ‘క్లీన్‌ స్వీప్‌’ చేసింది.

పంజాబ్‌లో బోర్లా

కానీ పంజాబ్‌లో బోర్లా పడింది. శిరోమణి అకాలీ దళ్‌ తో కలసి అధికారంలో వున్న ఆ రాష్ట్రంలో ఘోరపరాజయం పాలయ్యింది. అక్కడ కాంగ్రెస్‌ విజయఢంకా మొత్తం 117 సీట్లలో 78 సీట్లను గెలుచుకుని విజయఢంకా మోగిస్తే, శిరోమణి అకాలీ దళ్‌- బీజేపీలు కలసి 17 తో సరిపెట్టుకున్నాయి. బీజేపీ విడిగా కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్న తీరును చూస్తే, అక్కడ నామ రూపాల్లేకుండా పోయినట్లుగా కనిపిస్తుంది.

రాష్ట్రాల స్కోరు 2/5 మాత్ర‌మేనా..?

బీజేపీకి దేశంలో కష్టంగా వుండేవి, తూర్పు, దక్షిణ, ఈశాన్య భారతాలు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఇటీవలి కాలం వరకూ దర్భేద్యం వుండేది. కానీ ఏడాది క్రితం స్థానిక పార్టీల పొత్తుతో అసోంలో పాగా వెయ్యగలిగింది. అదే చొరవతో మణిపూర్‌ మీద కూడా కన్ను వేసింది. కానీ అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఉన్న మొత్తం 57 స్థానాల్లో కాంగ్రెస్‌ 25 పొందగలిగితే బీజేపీ 21 వెళ్లగలిగి గట్టి పోటీ ఇవ్వగలిగింది. అయితే గోవాలో అధికారంలో వుండి కూడా సునాయాసంగా తిరిగి పొందలేక పోయింది. మొత్తం 39 స్థానాల్లో 13 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీకి దూరంగా వున్నా 16 సీట్లతో అతి పెద్దగా అవతరించింది. బీజేపీ తో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేసిన ఎంజీపీ తనకొచ్చిన మూడు సీట్లతో తిరగి మద్దతు ఇచ్చినా బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకోవటం కష్టమే. కానీ ఏడుగురు ఇతరుల్లో ఎవరు ఎటువైపు ఉంటారన్నదానిమీద అక్కడ ప్రభుత్వం ఏర్పాటు వుంటుంది. దాంతో మొత్తం అయుదు రాష్ట్రాలలో రెంటినే సంపూర్ణంగా గెలుచుకున్నట్టయింది.

మోడీలోనే ముఖ్య‌మంత్రిని చూశారా?

అయినప్పటికీ మిగిలిన రాష్ట్రాలన్నీ ఒక యెత్తు; ఉత్తర ప్రదేశ్‌ ఒక్కటీ ఒక యెత్తు. ఇక్కడ 1952 తర్వాత ఇంతవరకూ 15 అసెంబ్లీలు ఏర్పడితే, ఒకే పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించుకున్నది ఏడు సందర్భాల్లోనే. మిగిలినవన్నీ సంకీర్ణాలే. అలా చూసినప్పుడు బీజేపీకి ఇది రెండో పెద్ద ఘనవిజయం. రామ మందిర ఉద్యమం ప్రభావం తీవ్రంగా వున్న నేపథ్యంలో కూడా 1991లో అప్పటి 425 స్థానాలకూ 221 గెలుచుకున్నది. అప్పటి మందిర ఉద్యమానికి కర్త అద్వానీ. అలాంటిది ఇప్పుడు ఇంత మెజారిటీ రావటానికి కారణమేమిటన్నది ఆసక్తి కరమైన ప్రశ్నే కానీ, సమాధానం లేని ప్రశ్న కాదు. అయితే అ పార్టీ చెప్పుకుంటున్నట్టు, మీడియా, కొందరు విశ్లేషకులు భావిస్తున్నట్లు అంతా మోడీ మయమేనా..? మోడీ చరిస్మాకే వైరి పక్షాలు కుప్ప కూలి పోయాయా? ఇలా చెప్పటానికి ఒక ప్రధానమైన కారణం వుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా బీజేపీ, ఈ విజయాన్ని సాధించింది. అంటే కేవలం మోడీని చూసి, ఆయన పథకాలు చూసి మాత్రమే ఆయనకు వోటు వేశారు. అదే నిజమైతే, ఈ కేంద్ర పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు జరుగుతాయి. మరి పంజాబ్‌లో ఎందుకు బీజేపీ అడ్రసు లేకుండా పోయినందుకూ..? 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇలాగే పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీచేసింది. కొన్ని చోట్ల ఈ ఫార్ములా సక్సెస్‌ అయినా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ, బీహార్‌ఎన్నికలప్పుడూ ఎందుకు విజయవంతం కాలేదూ…? (ఢిల్లీ చిట్ట చివర కిరణ్‌ బేడీని ప్రకటించిన ప్రయోజనం చేకూర లేదు.) నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్‌ కూడా ఇలాగే చేసేది, ఇందిరాగాంధీనో, రాజీవ్‌ గాంధీనో లేక సోనియా గాంధీనో.. చూసి మాత్రమే రాష్ట్ర అసెంబ్లీలకు కూడా వోటు వేస్తారని భావించే వారు. బీజేపీ కూడా అదే దారిలో వెళ్తుందా..?

అమితాస్ర్తాలు: ముస్లింల‌పై ద్వేషం, యాద‌వ్ వ్య‌తిరేక‌త

ఇప్పటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో బీజేపీ విజయానికి మోడీ కూడా ఒక కారణమే కావచ్చు కానీ, మోడీ మాత్రమే కారణం కాదు. ఇందులో బీజేపీ అధ్యక్షని వ్యూహం కూడా వుంది. శత్రుబలహీనతను తనకు అనుకూలంగా వాడుకోవటంలో ఆయన దిట్ట అని మరోసారి రుజువు చేసుకున్నారు.

బీజేపీ పైకి అభివృధ్ధి మంత్రం జపించినా, మతం కార్డు తప్పకుండా వాడుతుంటుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల నుంచీ, మతం కార్డుతో పాటు, కులం కార్డునీ కీలకంగా వాడుతోంది. అప్పుడు ముజఫర్‌ నగర్‌లో బీసీ అమ్మాయిని ముస్లిం కుర్రాడు ప్రేమించిన కారణంగా ఏర్పడ ఘర్షణల నేపథ్యాన్ని బీజేపీకి అనుకూలంగా అమిత్‌ షా మలచ కలిగాడు. ఎప్పుడయితే బీసీలను, బీసీలుగా కాకుండా ‘హిందువులు’గా చూపించ గలిగారు. సాంప్రదాయకంగా బీజేపీకీ వచ్చే అగ్రవర్ణ వోట్లతో పాటు, బీసీల వోటు కూడా తోడయింది. దాంతో అద్భుతమైన మెజారిటీని సాధించారు.

ఇప్పుడు కూడా ముస్లిం వ్యతిరేకతను సంకేతాత్మకంగా బీజేపీ ప్రకటించింది. మొత్తం 403 సీట్లలో ఒక్క సీటు కూడా ముస్లింకు ఇవ్వలేదు. మైనారిటీ వ్యతిరేకత లోంచే మెజారిటీనీ బీజేపీ సాధిస్తుందని తెలిసి కూడా, ఇటు ఎస్పీ-కాంగ్రెస్‌లూ, అటు బీఎస్పీ ఆ ‘ట్రాప్‌’ లో పడ్డాయి. బీఎస్పీ ఏకంగా 100 మంది ముస్లింలకు సీట్లిచ్చింది. ఎస్పీ-కాంగ్రెస్‌లు కూడా అందుకు తగ్గట్టు గా పోటీ పడ్డాయి. ముస్లిం వోట్లను చీల్చుకుని ఒక నష్టం చేసుకుంటే, దీని ద్వారా హిందూ వోటును స్థిరపరచి చేజేతులా బీజేపీకిచ్చాయి.

అది కాకుండా ఎస్పీ మూడు తప్పులు చేసింది. ఒకటి: తనమీద వున్న ప్రభుత్వ వ్యతిరేకతను తొలగించుకోలేక పోయింది. రెండు: అది బీసీల పార్టీగా కాకుండా బీసీల్లోని యాదవులకు మాత్రమే పార్టీగా ముద్ర వేసుకుంది. మూడు: ములాయం- అఖిలేష్‌ ల తగవుతో కుటుంబ పార్టీ గా తన నగ్నరూపాన్ని ప్రదర్శించింది. అలా బీఎస్పీ తప్పులు కూడా లేక పోయింది: ఎస్సీలను కూడా సమైక్యంగా వుంచుకోలేక పోయిది. ఒక వర్గం మీద పట్టుకోల్పోయింది. యాదవేతరులకు యాదవుల మీద వ్యతిరేకతా, ఒక వర్గం ఎస్సీల మీద మరొక వర్గం వ్యతిరేకతా బీజేపీకి అస్త్రాలు గా మారాయి. అలా ముస్లిం వ్యతిరేకతతో పాటు అణగారిన కులాల్లోనే యాదవ కులాన్ని అధిపత్య కులంగా చూపించి, మిగిలిన వారిని రెచ్చగొట్టి మరీ విజయాన్ని బీజేపీ తన బుట్టలో వేసుకుంది.

ఈ ఫార్ములా అన్ని చోట్లా, అన్ని సార్లూ వీలు కాదని బీజేపీ వ్యూహకర్తలు గుర్తుపెట్టుకుంటూ, విజయోత్సవాల్నీ, కాషాయ హోళీలను నిర్వహించుకోవాలి.

-స‌తీష్ చంద‌ర్‌

1 comment for “యూపీలో విజ‌యం: మోడీ మంత్రం కాదు; కుల, మతాల తంత్రం!

  1. Very reasonable analysis by the author of the article.Caste, communal,&religious divide gamble of BJP paid off for big win. Incumbency factor secular vote divide, bickering in ruling SP, Congress u turn on Sheila Dixie candidature, and BSP cut in to minority votes resulted in the defeat of these parties.

Leave a Reply