యెడ్డి తగవుకు ‘షెట్టర్‌’ వేశారు!

టాపు(లేని) స్టోరీ:

‘కమలం’మీద ‘యెడ్డి’ పడ్డా, ‘యెడ్డి’ మీద కమలం పడ్డా, నలిగేది ‘కమలమే’. కర్ణాటకలో బీజేపీ నలిగి పోయింది. కారణం ‘బిఎస్‌’ యెడ్యూరప్ప.

ఇక్కడ యెడ్యూరప్పకూ, బీజేపీ మధ్య ఒక తగవు నడుస్తోంది. అది ‘చెట్టు ముందా? కాయ ముందా?’ లాంటి తగవు. ఈ తగవు మొదలయి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా తేల లేదు. 2008లో కర్ణాటకలో బీజేపి గెలిచింది. నమ్మడం కష్టం అయింది అందరికీ, బీజేపీ జాతీయ నేతలయితే ఒక సారి తమను తాము గిచ్చుకుని చూసుకున్నారు. నిజమే. కలకాదు. ‘గెలిచాం’ అనుకున్నారు. ఎందుకంటే బీజేపీకి ఉత్తరం తప్ప, దక్షిణం అచ్చిరాదని ‘వాస్తు’ నిపుణులు తేల్చేశారు. మరి దక్షిణాది రాష్ట్రంలో ఏకంగా బీజేపీ గెలిచెయ్యటమేమిటి? సర్కారును స్థాపించెయ్యటేమిటి?

కానీ వారి గెలుపు వారికి ఆనందం మిగిల్చలేదు. వెంటనే తగవు మొదలయింది. బియస్‌ యెడ్యూరప్ప వల్ల బీజేపీ గెలిచిందదా? బీజేపీ వల్ల యెడ్యూరప్ప గెలిచారా?

అచ్చంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకీ, వైయస్‌ జగన్మోన రెడ్డికీ వచ్చిన తగవే. (వైయస్‌ రాజశేఖర రెడ్డి జీవించి లేరు కాబట్టి, ఆ పాత్రను జగన్మోహన రెడ్డి పోషించాల్సి వస్తోంది.) రాష్రంలో వరసగా రెండు సార్లూ వై.యస్‌ వల్ల కాంగ్రెస్‌ గెలిచిందా? కాంగ్రెస్‌ వల్ల వైయస్‌ గెలిచారా?

అక్కడ బీఎస్‌. ఇక్కడ వైయస్‌. వాళ్ళతో తగవులాడుతున్న పార్టీలు రెండూ, రెండు ప్రధాన జాతీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలవటం కొత్త కాదు. కానీ కర్ణాటకలో బీజేపీ గెలవటం మాత్రం కొత్తే.

అయితే బీజేపీకీ తనకూ వచ్చిన తగవులో మొదటి సారి బీజేపీ గెలిచింది. తర్వాత యెడ్డే గెలుస్తూ వస్తున్నారు.

యెడ్డి మీద ఆవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఈ విషయంలో లోకాయుక్త ముఖ్యమంత్రి స్థానంలో వున్న యెడ్డిని తప్పు పటనప్పుడు, బీజేపీకి యెడ్డికి తన స్థానాన్ని తెలియజేసే అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలోనుంచి యెడ్డిని దిగిపొమ్మని ఆదేశించింది. అతి కష్టం మీద పార్టీ మాటకు తలవొగారాయన. కానీ వెనువెంటనే, యెడ్డి తన మాటనే పై చేయిగా వుండేటట్టు చేసుకున్నాడు. ‘ ఆ కుర్చీలోంచి నేను తప్పుకుంటే, మళ్ళీ నా మనిషినే పెట్టుకుంటాను’ అని పదకొండు నెలల క్రితం సదానంద గౌడ ను కూర్చో బెట్టారు. తొలుత సదానంద యెడ్డి చెప్పిన మాటే విన్నాడు. కానీ తర్వాత తను కూర్చున్న కుర్చీ మాట విన్నాడు.

ఈ లోపుగా గనుల కుంభకోణంలో తన మీద పెట్టిన కేసును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చేటప్పటికి, తిరిగే తానే కూర్చునే అవకాశం వచ్చింది కదా అని- యెడ్డి ఉబలాటపడ్డారు. అంతలోనే తిరిగి ఈ కేసు మీద స్టే ఇస్తూ సిబిఐ విచారణకు ఆదేశించి. ఈ వంకను ఉపయోగించుకుని, మళ్ళీ యెడ్డి డిమాండ్‌ను పక్కన పెట్టింది. కానీ అంతలోనే యెడ్డికి మెరుపు లాంటి అలోచన! సదానంద గౌడ్‌ స్థానంలో తనకు నమ్మకస్తుడయిన షెట్టర్‌ను ఉంచమన్నారు. పెట్టక పోతే..? ఏముంది? ఎక్కువ మంది బీజేపీ శాసన సభ్యులు ‘జంప్‌ జిలానీలు’ అవుతారు. అంతే కాదు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో, ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా వోటు వేస్తారు. బీజేపీ పరువు మొత్తం పోతుంది. ఇది తాత్కాలిక భయమే. అయినా ఒప్పుకుంది.

ఇప్పటికీ తగవు తెగలేదనిపిస్తోంది కదూ! కానీ తెగిపోయింది.

సాక్షాత్తూ బీజేపీ అద్యక్షుడు గడ్కారీ యే బీజేపీ కన్నా యెడ్డే గొప్పవాడని నిర్దారించేశాడు. ‘సదానంద గొప్పవాడే. అయినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్చాల్సి వచ్చింది.’ అని అనేశారు. అంటే, యెడ్డి యే 2013 ఎన్నికలలో గెలుపునకు కీలకమని చెప్పకనే చెప్పారు.

అవును యెడ్డి వుంటేనే లింగాయత్‌లనే సామాజిక వర్గం వోట్లు బీజేపీకి పడతాయి. ఆ సామాజిక వర్గంలో యెడ్డికి జనాకర్షణ వుంది.

అంతే కాదు, యెడ్డి మీద వున్న అవినీతి ఆరోపణలు అలా వుంచితే, యెడ్డి ప్రవేశ పెట్టిన జనాకర్షక పథకాలు కూడా ఆయన్ను పెద్ద వాణ్ణి చేశాయి.

కాబట్టి, అన్ని చోట్లా బీజేపీగా వున్న ఇంత పెద్ద పార్టీ కర్ణాటక వచ్చేసరి ‘బీవైపీ’ (భారతీయ యెడ్యూరప్ప పార్టీ) వ్యవహరించాల్సి వస్తోంది.

న్యూస్‌ బ్రేకులు:

వెనకా- ముందూ

కొడాలి నాని తెలుగుదేశం పార్టీ వీడటం వెనుక నేను వున్నానని అనటాన్ని ఖండిస్తున్నాను.

-జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రముఖ సినీ హీరో

వెనుక లేరా? అయతే ముందు వున్నారా? హీరోలు వుంటే ముందుండి నడిపిస్తారు. వెనక ఎందుకుంటారు? మీ వాదనలో పాయింటు వుంది.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత, కాంగ్రెస్‌కు బలహీనవర్గాల మద్దతు బాగా పెరిగింది.

-పురంధేశ్వరి, కేంద్ర మంత్రి

అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఆ రెండు సీట్లూ, చిరంజీవివే నంటారు? అయితే ఆయన వోడిన తిరుపతిలో బలహీన వర్గాలే లేరంటారా?

ట్విట్టోరియల్‌

మన ‘టైమ్‌’ బాగా లేదు!

మన ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌కు ‘టైమ్‌’ బాగా లేదు. అంత పెద్ద నేతను పట్టుకుని ‘పుసుక్కున’ నేత కాదనేసింది ‘టైమ్‌’ పత్రిక. నేత కాకుంటే ఆయన మరేమవుతారు? ‘నీడ’ అవుతారు. నీడలు సొంతంగా మాట్లాడలేవు. కదల్లేవు. పనులు చెయ్యలేవు. అంతే కాదు. ‘మెట్ల మీద నుంచి రూపాయి ఖంగు ఖంగు మంటూ దొర్లుకుంటూ వస్తుందనుకోండి. నీడ చేతులు పెట్టి ఆప లేద’ని కూడా ‘టైమ్‌’ తేల్చేసింది. ‘నీడ’ కు ముఖమే వుండదు. మరి ‘ముఖవిలువ’ (ఫేస్‌ వాల్యూ) లేని ముఖాన్ని, ఏ ముఖం పెట్టుకుని ‘టైమ్‌’ ముఖ చిత్రంగా వేసుకుందో? అక్కడే అంత పెద్ద ‘టైమూ’ తప్పులో కాలేసింది. ఈ దేశంలో ఒక నీడ ప్రధాని కుర్చీలో కూర్చుందనటం నిజం కాదు. ప్రధాని కుర్చీలో ఎవర్ని కూర్చోబెట్టిన ఇప్పుడు నీడయి పోతారు. ఒకప్పుడు రాష్ట్ర పతి కుర్చీలో కూర్చున్న వారిని ‘నీడ’నో, ‘రబ్బర్‌ స్టాంప’నో పిలిచే వారు. కానీ ఇప్పుడు ఆ స్థితి ప్రధాని కుర్చీ కొచ్చింది. ఎందుకంటే ఆ కుర్చీని మింగేసే పెద్ద కుర్చీ ఒకటి 2004లో రాజ్యాంగానికి ‘కన్నుకప్పి ‘వేసేశారు. అదే యుపీయే చైర్‌పర్సన్‌ కుర్చీ. ఆ కుర్చీలో సోనియా కూర్చున్నాక, పధ్రాని కుర్చీలో ఎవరు కూర్చున్నా నీడయి పోతారు. అలాంటప్పుడు – ఏకంగా ఒక ‘రోబో’నే కూర్చోబెట్టారనుకోండి. ‘నీడ’ గా మారకుండా వుంటుందా?

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

‘పోటు’గాళ్ళు

ఒక ట్వీట్‌ సదానంద గౌడ యెడ్యూరప్పను పొడిచారు, యెడ్యూరప్ప గడ్కారీని పొడిచారు. గడ్కారీ అద్వానీని పొడిచారు. అద్వానీ మోడీని పొడిచారు. మోడీ సంజయ్‌ జోషిని పొడిచారు. బిజేపీ ‘వెన్నుపోట్ల’ పార్టీలా వుందే!

కౌంటర్‌ ట్వీట్‌: చిన్న సవరణ. ‘పొడిచారు’ అనకూడదు. ‘కూల్చారు’ అనాలి. వారికి ప్రాచీన కట్టడాల్ని కూల్చటంలో విశేషానుభవం వుంది. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఒకరినొకరు కూల్చుకుంటున్నారు.

ఈ- తవిక

‘చిల్లర’ వాన

వానలు పడలాని

పూజలే పూజలు.

వోట్లు పడాలని

చేశారా పూజలు?

పైసలు లేకుండా

మంత్రాలు కూడా రాలవు.

మరింకేం?

మధించండి మేఘాల్ని.

 

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘గాడ్స్‌ పార్టికిల్‌ గుట్టు విప్పేశారు.’

‘వామ్మో! అయితే దేవుడు ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి?’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

ఇల్లలకుతూ అలుకుతూ..ఈగ తన పేరును మరచిపోయింది. ఎంతకీ జ్ఞాపకం రాకపోతే దర్శకుడు రాజమౌళి వచ్చి గుర్తు చేశారు.

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 10-7-12 వ తేదీ సంచికలో ప్రచురితమయింది.)

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *