రాబందుల ‘లెక్కల’ చప్పుడు!

టాపు(లేని) స్టోరీ:

విపత్తు!

జనానికి శాపం. నేతలకు వరం.

నేతల్లో ఆపక్షమూ, ఈ పక్షమూ అని కాదు, ఏ పక్ష నేతలకయినా సదవకాశమే.

ఒక గుడిసె అంటూ వుంటే, గుడిసెలో ఓ విద్యుత్తు బల్బనో, అందులో గ్యాస్‌ పొయ్యనో, వంటనూననో- ఇలాంటి కోరికలు జనానికి పుడతాయి.

అదే వరదొచ్చి గుడిసే పోయిందనుకోండి. దానితో పాటు మంచం, కంచం, బర్రే, గొర్రే, పగ్గం, మగ్గం- కూడా అన్నీ కొట్టుకు పోయాయనుకోండి.. అడగటానికి ఏముంటుంది?

కడుపు నింపుకోవటానికి ఓ ఆహార పొట్లాం. కప్పుకోవటానికి ఓ పాత దుప్పటీ.

ఇవి పంచిన వాడు దేవుడు.

కాలికి మట్టి అంటకుండా విమానాల్లో, హెలికాప్టర్లలోనో కూర్చుని వరద ప్రాంతాలను చూసి( ఏరియల్‌ సర్వే చేసి) ఎక్స్‌గ్రేషియాలూ, అరకొర నిధులూ విసిరేస్తే చాలు. జనం తమ కోరికల్ని మరచిపోతారు.

విపత్తు ఎప్పుడూ అంతే. మనుషుల్ని మృత్యుముఖం దగ్గరకు తీసుకు పోతుంది. బతికితే చాలనుకుంటారు. బతుకు తెరువుగురించిన ధ్యాస పోతుంది.

ప్రాణ భద్రతే పెద్ద కోరికయినప్పుడు, మిగిలిన వన్నీ చిన్న కోరికలయి పోతాయి.

వెనకటికి ఓ ప్రపంచ ప్రసిధ్ద కథారచయిత తిరునాళ్ళలో తప్పిపోయిన పసివాడి గురించి రాశాడు. అమ్మా, నాన్న పక్కన వున్నప్పుడు, అక్కడ దుకాణాల్లో అమ్మే ప్రతీ బొమ్మా కావాలంటాడు. కానీ తప్పిపోయిన తర్వాత ఏడుస్తుంటే, ఓ యువకుడు ఎత్తుకుని అవే దుకాణాల్లోకి తీసుకువెళ్ళి. అవే బొమ్మల్ని కొనబోతాడు. కానీ ఆ పసివాడు మాత్రం- అడిగేది ‘అమ్మా, నాన్నల్నే.’ వాడికి వాళ్ళే ప్రాణాలు.

ప్రాణాలే పోతున్నప్పుడు, ఇంకేమి అడుగుతారు చెప్పండి? ప్రజలూ అంతే.

ఈ విపత్తులు ప్రతిపక్షాలకూ ఓ అవకాశమే.

సంతర్పణ అన్నాక, తిన్నవారితో పాటు తినని వారూ వుంటారు. నీళ్ళల్లో నానుతున్నవారూ, చలితో వణకుతున్న వారూ, రోగాలతో కునారిల్లుతున్నవారూ వుంటారు. అదీకాక, మన ప్రజాపంపిణీ వ్యవస్థ మామూలు రోజుల్లోనే పనిచేయదు. అందాల్సిన రేషన్‌ కనీసం ఆరు రోజులయినా ఆలస్యంగా వస్తుంది. ఇక వరదలొస్తే, అది అరవయి రోజులయినా పడుతుంది.

అందుకే సహాయం అందని వారి దగ్గరకు ప్రతిపక్షం వారు వెళ్ళి ‘అయ్యో!’ అంటే చాలు. వారే సర్కారుకు ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెడతారు.

నిజానికి విపత్తు వస్తే, పాలక, ప్రతిపక్షాలు ఒక్కతాటి మీదకొచ్చేయాలి. కానీ మన నేతలేమయినా అమెరికాలోని (అధ్యక్ష అభ్యర్థులయిన) ఒబామా, రోమ్నీలా? ఒక వేళ అలా కలిసి పని చేస్తే, పక్క పార్టీల వారు ఊరుకుంటారా? ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అని అపవిత్ర సంబంధాన్ని అంటగట్టెయ్యరూ?

వానలూ, వరదలూ, భూకంపాలూ- ఇవి ప్రకృతి విపత్తులు.

ఇవి కాకుండా, వికృతి విపత్తులు కూడా ఉంటాయి.

జనమేదో పెరిగిన కరెంటు చార్జీల గురించి తేల్చేసుకోవాలనుకుంటారు. అప్పుడే విపత్తు వచ్చి పడుతుంది. దాని పేరే కరెంటు కోత. ఈ కోతలకీ వానలు పడకపోవటానికీ ముడిపెడతారు కానీ, ఇవ్వాలంటే ఇవ్వొచ్చు. రెండు గ్రిడ్లను కలిపో, మరో చోట కొనో ఇచ్చెయ్య వచ్చు. కానీ పనిగట్టుకుని కొరత సృష్టిస్తే, జనమేమనుకుంటారు? అసలు ‘కరెంటు ఇస్తే చాలు. ఎంతయినా చెల్లించ వచ్చు’ అనే స్థితికి వస్తారు.

వంటగ్యాస్‌ ధర గురించి కూడా సర్కారును జనం కడిగేయలనుకుంటారు. కానీ ఏటా మూడు సిలిండర్లే ఇస్తామన్నదనుకోండి. బయిట దొరికితే చాలు – వెయ్యిరూపాయిలయినా ఇవ్వవచ్చు’ అని జనం అనేసుకుంటారు.

ఇవి వికృతి విపత్తులు. లేదా కృత్రిమ విపత్తులు.

అందుచేత ప్రకృత్తి విపత్తు వచ్చిందా సరే- లేదా మన ‘రాబందులు’ ఈ వికృత్తి విపత్తుల్ని సృష్టిస్తాయి.

న్యూస్‌ బ్రేకులు:

‘గజ ఈత గాడు!

ప్రతిపక్ష నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారు.

-సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

పాపం ఈత రాదనుకుంటాను. రాబర్ట్‌ వద్రా చేత శిక్షణ ఇప్పించాలి.

సామాన్యుడు రేషన్‌ కార్డుకి వెళ్ళితే తరిమేస్తున్నారు.

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ యువ నేత

ఈ డైలాగ్‌ ప్రతిపక్షం వాళ్ళది కదా-రాహుల్జీ!

 ట్విట్టోరియల్‌

అ-అంటే అమెరికాపురం!

అసలు ఎన్నికలు జరిగిపోతుంటే, ఎవరూ ఏమీ పట్టనట్టున్నారు. ఏవి అసలు ఎన్నికలు? ఎంపిటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు కావు. మునిసిపల్‌ ఎన్నికలు అసలే కావు. అసెంబ్లీ ఎన్నికలంటారా? అవీ కావు. పోనీ, పార్లమెంటు ఎన్నికల ప్రస్తావనే లేదు. మరే ఎన్నికలు? మనల్ని ఎవరు పరిపాలిస్తారో వారిని నిజంగా ఎన్నుకునే ఎన్నికలు. ఈ ప్రపంచానికి ఒకే ఒక అగ్రరాజ్యం. అదే అమెరికా. మనచేత నాటు కోడి కూర తినటం మానిపించి ‘కెంటుకీ ఫ్రైడ్‌ చికెన్‌’ తినిపించేదీ, కొబ్బరి బొండాం కన్నా ‘కోకో’ ‘పెప్సీ’ యో గొప్పదనిపించేది, చిల్లర సరుకుల్ని ‘కిరాణాకొట్టు లో’ కాకుండా ‘వాల్‌ మార్ట్‌’లో కొనిపించేదీ ఏ రాజ్యమో, ఆ రాజ్యానికి ఎన్నికలు జరుగుతుంటే పాపం- పట్టనట్టే వున్నారు జనం. కానీ మన నేతలు ఊపిరి బిగబట్టి, ఉత్కంఠతో ఫలితాల కోసం చూశారు. పాపం టెన్షన్‌ తట్టుకోవటానికి వారి చేతిలో ‘అమెరికన్‌ స్వీట్‌ కార్న్‌’ పెట్టారో, లేదో..?

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

సంపూర్ణ ‘వర్ణ’ చిత్రం!

పలు ట్వీట్స్‌: ఈ మధ్య సినిమాల్లో ‘వర్ణాల’ గొడవలు ఎక్కువయి పోయాయి.

కౌంటర్‌ ట్వీట్‌: ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ సినిమాలే బెటరు. ‘వర్ణాలు'(రంగులు) ఉండవు.

ఈ- తవిక

రి’లయన్స్‌’ షేర్‌!

 ‘ఈ భూమి మనది

ఈ నేల మనది

ఈ నీరు మనది!!’

……………….

‘అక్కడితో ఆగిపో.

నీరు కింద గ్యాస్‌ మనది-అనకు

సింహభాగం- అనగా

లయన్స్‌ షేర్‌ వ్యక్తిది- జాతిది కాదు.’

 ‘బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘అపాత్రులకు కూడా వేదాలు వినిపిస్తున్నామే… మమ్మల్ని కించపరుస్తారా?’

‘అన్యకులస్తుల్ని అపాత్రులంటున్నారు- ఇదీ కించపరచటమే నేమో? ‘

కొట్టేశాన్‌( కొటేషన్‌):

స్త్రీని దేవతలాపూజిస్తారు ఎందుకో తెలుసా..? నిమజ్జనం చేయటానికి!!

(సూర్య దినపత్రిక 6నవంబరు 2012 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply