‘రుణ’మో…పణమో!

రైతు పెరిగి పారిశ్రామిక వేత్త కావటం నిన్నటి పరిణామం. కానీ పారిశ్రామిక వేత్త ముదిరి రైతు కావటం రేపటి విపరీతం. అవును. ఇది నిజం. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారం లో ఎవరు వున్నా, ఇలాంటి భవిష్యత్తుకే బాటలు వేస్తున్నారు. కానీ చిత్రమేమిటంటే, రైతును ముంచే ప్రతిచర్యనూ రైతు క్షేమం పేరు మీద చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చికిత్స కోసం వచ్చిన రోగికి ఔషధమని చెప్పి, విషాన్నిస్తే ఎంత గొప్పగా వుంటుందో, ఈ చర్యకూడా అంత గొప్పగానే వుంటుంది. నిజం చెప్పాలంటే, ‘ఎల్‌పీజీ’ (లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) ఆర్థిక విధానం దేశంలోకి వచ్చాక, ఏ పార్టీ సర్కారయినా, ఇదే పనిచేసింది. వ్యవసాయోత్పత్తికి సంబంధించిన పని కల్పించటం పోయి, సోమరిగా కూర్చోబెట్టటానికి పథకాలు చేసి, వాటిని కూలికి మేలు చేసే పథకాలని బుకాయించారు. ఈ ‘పనికి’ మాలిన పథకాల వల్ల ఇటుకూలికీ, అటు రైతకూ నష్టం చేశారు.

Photo By: Yogendra Joshi

దాదాపు ఈ ‘ఎల్‌పీజీ’ ప్రవేశించి రెండున్నర దశాబ్దాలు కావస్తోంది. ఈ ‘ఎల్‌పీజీ’ అభివృధ్ది చెందిన దేశాలకు ఎంతో కొంత మేలు చెయ్యవచ్చు. లేదూ, మనలాంటి పేదదేశాలకు కూడా ఎంతో కొంత సాయపడవచ్చు. కానీ ఎప్పుడూ..? ఈ దేశానికి అనుగుణంగా ఆ విధానాన్ని మలచుకున్నప్పడు. కానీ ఎప్పుడూ అది జరగలేదు. కేంద్రంలో అయితే అటు వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే ఏలుబడిలో కానీ, ఇటు మన్‌మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీయే సర్కారు కానీ ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించలేదు. ఇక్కడ రాష్ట్రం విడిపోకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకానీ, ఈ విధానాలే అమలు జరిగాయి. అందుకే దేశవ్యాపితంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా రెండు దారుణాలు జరిగిపోయాయి. ఒకటి: ఎంతకీ ఆగని రైతుల ఆత్మహత్యలు. రెండు: రైతులు వ్యవసాయన్ని వదలివేయటం. అంటే రైతు భూమిని వదలిపోవటమో, రైతును భూమి వీడిపోవటమో జరిగిపోయింది. ఇప్పటికీ ఇదే తంతు.

విశేషమేమిటంటే దేశాభివృద్ధికి రావలసిన కోట్లు పారిశ్రామిక వేత్తల దగ్గరనుంచీ, రాజకీయాలకు అవసరమైన వోట్లు రైతు, లేదా వ్యవసాయరంగం మీద ఆధారపడ్డ కుటుంబాలనుంచీ రావాలిసి వుంది. ఎన్నికకాక ముందు ‘వోట్ల’తోనూ, ఎన్నికయ్యాక ‘కోట్ల’తోనూ రాజకీయపక్షాలకు పనిపడింది. అందుకే రైతుకు ‘సంక్షేమాన్ని’, పారిశ్రామిక వేత్తకు ‘అభివృద్ధి’ని తాయిలంగా వేస్తూవచ్చాయి. ఈ సంక్షేమం సంక్షేమమూ కాదు; అభివృధ్ది అభివృధ్ధీ కాదు. సంక్షేమమేమో ఔషధం పేరు మీద ఇచ్చే హాలాహలం; అభివృధ్ది ఏమో ప్రోత్సాహకం పేరు మీద ఇచ్చే దానం. అంతిమంగా విషం రైతుకు; దానం పారిశ్రామిక వేత్తకు.

విశేషమేమిటంటే ఈ పారిశ్రామిక వేత్తలు, గతంలోలాగా దేశ జాతీయోత్పత్తిని నేరుగా పెంచటానికి హామీ పడే వాణిజ్యవేత్తలు కారు. వీరు బహుళజాతి సంస్థలుగా విస్తరించిన వారు. వీరు అన్ని వృత్తుల్నీ తామే చేస్తామంటారు. కడకు సైకిళ్ల మీద ఇళ్ళకు తెచ్చి అమ్మే ఆకుకూరల్ని కూడా, పెద్దపెద్ద మాల్స్‌లో తామే అమ్మిపెడతామంటారు. వీరు ఇప్పటికే చిన్నవర్తకులు చేసే కిరణా వ్యాపారాన్ని కబళించారు. గ్రామాలలో అందమైన ఆభరణాలు చేసి ఇచ్చే స్వర్ణకారుల వృత్తిని ‘భారీ జ్యుయిలర్స్‌’ పేరు మీద అంది పుచ్చేసుకున్నారు. వ్యవసాయం కేంద్రంగా చేసే ప్రతీ పనినీ కైంకర్యం చేసేశారు. ఇక మిగిలింది ఈ వృత్తులన్నిటికీ మూల వృత్తి వ్యవసాయం. దాని మీద ఈ సంస్థలు ఎప్పుడో కన్ను వేశాయి. ఇక మిగిలివున్నది కాస్తా నేరుగా వీరే వ్యవసాయం చెయ్యటం. ఈ కార్పోరేట్‌ భూతాలు వ్యవసాయం చెయ్యాల్సి వస్తే, చిన్ని చిన్ని కమతాల్లో చెయ్యవు. ఒక్కొక్క కమతం వేల ఎకరాల్లో వుండాలి. దేశంలో ఈ స్థితి రావాలంటే, రైతులే తమంతట తాము వ్యవసాయాన్ని వదలిపెట్టి పారి పోవాలి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వాల విధానాలు వున్నాయి:

ఒకప్పుడు రైతే విత్తనాలను తయారు చేసుకునే వాడు. కానీ ‘టెర్మినేటర్‌’ విత్తనాల కారణం పండిన గింజలకు ‘పునరుత్పత్తి’ శక్తి వుండదు. మార్కెట్టే విత్తనాలను అమ్మజూపుతుంది. ఈ విత్తనాలను బహుళ జాతి సంస్థలు అమ్ముతాయి. ఎరువులు సైతం బహుళ జాతి సంస్థలు అమ్ముతాయి. అలాగే సాగు కోసం భారీ ప్రాజెక్టులకు బహుళజాతి సంస్థలే ప్రపంచ బ్యాంకునుంచి రుణాలు వచ్చేటట్లు చూస్తాయి. ఈ ప్రాజెక్టులు ఆదివాసులు, పేదలూ నివసించే పల్లెల్ని ముంచుకుంటూ పోతుంటాయి. అంతిమంగా ఈ నీటిని సొమ్ముచెల్లించి వాడుకోవాల్సి వస్తుంది. ఈ స్థితికి వచ్చాక వ్యవసాయం రైతు చేస్తాడా? కార్పోరేటు సంస్థ చేస్తుందా?

ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో కొలువుతీరిన చంద్రబాబు, చంద్రశేఖరరావు ప్రభుత్వాలు ఈ వారసత్వాన్నే కొనసాగిస్తున్నాయి. ఆప్పుల పాలయిన రైతును ‘మాఫీ’ పేరు మీద అరకొరగా ఆదుకున్నట్టు ఫోజు పెట్టి, మొత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్‌ సంస్థల పాలు చెయ్యటానికి చూస్తున్నాయి. కేసీఆర్‌ ఇప్పటికే ‘పెద్దకమతాల’ ప్రస్తావనా, ‘విత్తన కేంద్రం’ ప్రస్తావనా చేశారు. వీటలో బహుళ జాతి సంస్థల ప్రమేయం వుండదని ఆయన హామీ ఇవ్వగలరా? రైతును రుణాల పాలు చేసేదీ ఈ ప్రభుత్వాలే. ఆ రుణాల్లో ఎంతో కొంత ఇచ్చి ఊరట కలిగించినట్టు నటించే ఈ ప్రభుత్వాలే. ఏమైతేనే మొత్తం అందరూ కలిసి అన్నదాత ను బిచ్చగాడిగా మార్చారు. ఈ ఉసురు ఏదో ఒక నాడు ఈ రాజకీయ పక్షాలకు తగలక మానదు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 14-21జూన్ 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “‘రుణ’మో…పణమో!

  1. అక్షరసత్యం. సతీష్ చందర్ గారూ, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

Leave a Reply