రెండు కుటుంబాల పోరు

అధినేత వేరు, నేత వేరు.

ఇద్దరికీ మధ్య చెయ్యి ఊపటానికీ, చేతులు జోడించటానికీ వున్నంత తేడా. అది రోడ్‌ షో కావచ్చు, బహిరంగ సభ కావచ్చు. ఇద్దరూ ఆ తేడాను పాటించాలి.

ఉదాహరణకి సోనియా గాంధీ, కిరణ్‌కుమార్‌ రెడ్డీ ఒకే వేదిక మీదకొచ్చారనుకోండి. వారు మాట్లాడే భాషలే కాదు, దేహ భాషలు కూడా వేరు వేరుగా వుంటాయి. జనం వైపు తిరిగి సోనియా చెయ్యి ఊపితే, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏడుకొండలవాడి ముందు చేతులు జోడించినట్టు అదే జనానికి నమస్కరించాలి.(తప్పేం లేదు. ప్రజలు ఎలాగూ దైవసమానులు అనుకోండి.)

కానీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి వున్నప్పుడు అలా జరగ లేదు. అధినేత్రీ, నేతా ఇద్దరూ ఒకే రీతిలో చేతులు ఊపేవారు. అంతే కాదు. మెల్ల మెల్ల ఎన్నికల ప్రచారానికి వేదికల మీద అధినేత్రి అవసరం తగ్గిపోయింది. కడకు కటౌట్లూ, ఫ్లెక్సీలలో కూడా నేతవే అక్కరకు వచ్చేవి. అధినేత్రి అలంకార ప్రాయంగా మాత్రం వుండేవి. ఈ స్థితి అధినేత స్థానంలో వున్న ఎవరికీ నచ్చదు. అందుకే వైయస్‌ అకాల మృతి తర్వాత, ఈ స్థితిని తెచ్చుకోకూడదనుకున్నారు.

అధిష్ఠానానికి ప్రత్యామ్నాయ అధిష్ఠానంగా మరెవ్వరూ రాష్ట్రంలో మారకూడదనుకున్నారు. ఫలితమే ఆయన తనయుడు వైయస్‌ ను దూరం పెట్టారన్నది ప్రబలంగా వున్న ప్రచారం.

III III III

ఇప్పుడు చూడండి. వైయస్‌ రాజశేఖర రెడ్డి కేవలం ప్రత్యామ్నాయ అధిష్ఠానంగా మాత్రమే మారారు. కానీ జగన్మోహన రెడ్డి అన్నింటా సోనియా గాంధీకి రాష్ట్రలో ప్రత్యామ్నాయాన్ని సృష్టించారు.

ఏకంగా పార్టీకి బదులుగా పార్టీ యే పెట్టారు.

ఇన్నాళ్ళూ దేశంలో అత్యంత జనాకర్షక కుటుంబంగా (కొండొకచో ‘ప్రథమ కుటుంబం’గా) రాజీవ్‌ గాంధీ కుటుంబం వుంటూ వచ్చింది. సీమాంధ్రలో ఇవాళ అంతే ఆకర్షణ వున్న కుటుంబంగా వైయస్‌ కుటుంబం మారింది. (ఒక రకంగా ఈ ఘనత జగన్మోహన రెడ్డిదే.)

రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన కొన్ని ఏళ్ళ తర్వాత కూడా సానుభూతి ఆయన కుటుంబానికి రాజకీయంగా ఎలా వరమయ్యిందో, వైయస్‌ అకాల మృతి వల్ల వచ్చిన సానుభూతి కూడా ఏళ్ళుగడుస్తున్నా ఆయనకుటుంబానికి రాజకీయ లబ్ధి చేకూరుస్తోంది.

సోనియా గాంధీ అక్కడ యుపీయే చైర్‌పర్సన్‌ కావచ్చు. ఇక్కడ విజయమ్మ కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి శాసన సభా పక్ష నాయకురాలయ్యారు.

జగన్‌ శత్రువులూ, మిత్రులూ జగన్‌తో రాహుల్‌ని పోల్చి మాట్లాడుతుంటారు. ‘రాహుల్‌ చూడండి . ప్రధాని కావాలంటే ఎప్పుడో అయ్యేవారు. జగన్‌ కూడా అలా (ముఖ్యమంత్రి పదవికోసం) వేచి చూడాలి’ అని శత్రువులంటూంటారు. అయితే దేశంలో రాహుల్‌కి ఎంత జనాకర్షక శక్తి ఉందో తెలియదు కానీ, జగన్‌ మాత్రం జైలుకు వెళ్ళేంతవరకూ, క్రిక్కిరిసిసన సమూహాల మధ్య మాట్లాడుతూనే వున్నారు.

రాహుల్‌కి సోదరి వున్నట్లే జగన్‌కీ సోదరి వున్నారు. రాహుల్‌ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనలో జనం రాజీవ్‌ పోలికల కోసం పెద్దగా వెతుక్కోరు కానీ, ప్రియాంక ప్రచారం చేస్తున్నప్పుడు ఆమెలో నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలను వెతుక్కుంటూ వుంటారు. ఫలితంగా ప్రియాంక జనంలోకి వెళ్తూంటే వచ్చే ఆదరణ భిన్నంగానూ, హెచ్చుగానూ కూడా వుంటుంది. జగన్‌ సోదరి షర్మిల విషయంలోనూ అంతే. నిజానికి దీర్ఘాలు తీసుకుంటూ జగన్‌ మాట్లాడేతీరు వైయస్‌ ఉపన్యాస శైలినే పోలి వుంటుంది. అయనప్పటికీ, షర్మిల అరచెయ్యి ఆడించే తీరులోనూ, రూపులోనూ వైయస్‌ పోలికల్ని వెతుక్కున్నారు.

(వ్యక్తి పూజ ఆకాశమంత ఎత్తు వున్న దేశంలో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అధిక ప్రాధాన్యం వుంటుంది.)

ఇలా వైయస్‌ కుటుంబం కుటుంబమే. సీమాంధ్రకు చెందినంత వరకూ రాజీవ్‌ కుటుంబానికి నకలుగా మారిపోయింది.

అఫ్‌కోర్స్‌! ‘అవినీతి ఆరోపణల’ విషయంలోనూ రెండు కుటుంబాలకూ పోలిక వుంది. రాజీవ్‌ కుటుంబాన్ని ‘బోఫోర్స్‌ ముడుపులు’ వెంటాడితే, వైయస్‌ కుటుంబాన్ని ‘అక్రమ పెట్టుబడులు’ వెన్నాడుతున్నాయి. కాకుంటే ఆరోపణలను అంకెల్లోకి మార్చుకుంటే ఈ రెండు ఆరోపణలకూ వందలకూ లక్షల మధ్య తేడా వుండవచ్చు.

ఇలా ఏ కోణంలో చూసినా సోనియాకుటుంబానికి, రాష్ట్రంలో విజయమ్మ కుటుంబం వుండటం సోనియాకు అసలు మింగుడు పడక పోవచ్చు.

III III III

విజయమ్మ. షర్మిల లకు ఉప ఎన్నికలలో అంటే జనం వచ్చారుకానీ, తర్వాత వస్తారా?- రాష్ట్రంలో కొందరు భావించారు.

అనుకున్నట్టు గానే ఉప ఎన్నికలు ముగిసిపోయాక కూడా. విజయమ్మ, షర్మిలలు జనంలోనే వుంటున్నారు. మరీ ముఖ్యంగా సమస్యలు వున్న చోటకు వెళ్ళిపోతున్నారు. అంటే సంపూర్ణ పరిష్కారాలతో వారు వెళ్తున్నారని కాదు. ఒక్కొక్క సారి కష్టాల్లో వున్న జనానికి పలకరింపే పరిహారం అయిపోతుంది.

ఉత్తరాంధ్రలో ఇటీవలి వీరి పర్యటన అలాంటి అనుభూతే మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట లో దాడులకు గురయిన దళితులనూ, విశాఖపట్నం జిల్లా తిక్కవాని పాలెంలో ఎన్టీపీసీ కారణంగా నిర్వాసితులవుతున్న మత్స్యకారులనూ ఈ తల్లీ కూతుళ్ళు పలకరించి వచ్చారు.

వీరిద్దరూ అక్కడి సమస్యల మూలాల్లోకి వెళ్ళకపోవచ్చు. వారి సమస్యలకు ఉద్యమ రూపం ఇవ్వటానికి కూడా వెళ్ళక పోవచ్చు. భూములను ప్రాజెక్టుల పేరు మీద ప్రజల వద్దనుంచి తీసుకున్నప్పుడే ఇలాంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయన్న ప్రశ్నలతోకూడా వెళ్ళక పోవచ్చు. అయినప్పటికీ వారిని చూసి జనం తమ గోడు చెప్పుకోవటం మొదలు పెట్టారు.

ఈ సమస్యలతో పాటు రైతుల సమస్యల మీదా, అధిక ధరలకూ వ్యతిరేకంగానూ, మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగానూ ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు, సిపిఐ రాష్ట్ర నేత నారాయణ కూడా, ఎండనక (వాననక – అనటానికి లేదు. వానలే కురవట్లేదు.) తిరుగుతున్నారు. అయినా ఈ మహిళ కొచ్చిన స్పందన వారికి రావటం లేదు.

ప్రాజెక్టుల కోసమూ, ఎస్‌ఇజెడ్‌ల కోసమూ రైతుల భూములను లాక్కోవటంలో అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమూ, తర్వాత వచ్చిన వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమూ- ఎవరూ తక్కువ తినలేదు.

అయినా వాటి వల్ల ఉత్పన్నమైన ప్రజాసమస్యల పై జాగృతం చెయ్యటానికి వారే వెళ్ళటం కాస్త విడ్డూరంగా నే వుంటుంది.

కానీ ఎవరి పలకరింపు, పరిష్కారం కన్నా ఎక్కువ ఊరటనిస్తుందో, వారే జనాకర్షక నేతలుగా ఎదుగుతారు. రైతుల సమస్యలపై అప్పటి ప్రతిపక్ష నేతగా వైయస్‌ పాద యాత్ర చేసినప్పుడు కూడా ఆయన పలకరింపునకే తృప్తి చెందారు.

అయితే ఇటీవలి దేశంలో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తుంటే, సమస్యల వద్ద కు పురుష నేతలు వెళ్లినదానికన్నా మహిళా నేతలు వెళ్ళటం ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతోంది.

ఎన్ని విమర్శలున్నా, మమతా బెనర్జీయే ఇందుకు ఉదాహరణ. నందిగ్రామ్‌, సింగూరు లో భూమి కోల్పోయిన వారి దగ్గరకు ఆమె వెళ్ళటం, వారితో కలిసి ఆందోళనలు చెయ్యటం ఆమె జనాకర్షక శక్తిని పెంచేశాయి. అయితే ఆమె ప్రభుత్వాన్ని స్థాపించాక కూడా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలను ఏమీ ఇవ్వక పోవచ్చు. అది వేరే విషయం.

అంతెందుకు? టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట కోసం దీక్ష చేపడితే ఎక్కువ స్పందనే వచ్చింది. అయితే ఆ పార్టీయే ఒక అగ్రవర్ణానికే కొమ్ముకాస్తుందని ఒక పక్కన దళిత సంఘాల వారు విమర్శలు గుప్పించారు. ఆమెకు మాత్రం రావలసిన ఖ్యాతి వచ్చేసింది.

సమస్య స్త్రీలదే కానవసరం లేదు. స్త్రీనేత వెళితే వచ్చే స్పందన మాత్రం గొప్పగా వుంటుంది. బహుశా విజయమ్మ, షర్మిలలు రహస్యాన్ని గ్రహించే, ఎక్కడ సమస్య వుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే, ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికలతో పాటు, రాబోయే 2014 ఎన్నికలలో కూడా వారి ప్రచారానికి వన్నె తగ్గదని గ్రహించి వుంటారు.

అదే జరిగితే వీరిని ఎదుర్కోవటానికి , ప్రచారసమరంలో కాంగ్రెస్‌ తరఫున సోనియా కుటుంబం ప్రత్యక్షంగా పాల్గొనాల్సి వస్తుంది. సోనియా ఏ నీడను చూసి భయపడ్డారో, ఆ నీడే ఇలా పెరిగి పెద్దదవుతుందని ఊహించి వుండరు.

-సతీష్‌ చందర్‌

 

 

3 comments for “రెండు కుటుంబాల పోరు

Leave a Reply