‘వంక’ల నాయుడు!

caricature: balaram

caricature: balaram

పేరు : ముప్పవరపు వెంకయ్య నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ప్రత్యేక హోదా’ (నాకు కాదు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి) ఎన్డీయే సర్కారు అధికారంలోకి రానప్పుడు, యూపీయే అధికారంలో వున్నప్పుడు దరఖాస్తు చేశాను. ఇప్పుడు ఎన్డీయే సర్కారు అధికారంలో వుంది. ‘ఇచ్చే హోదా’ లో వున్నాను, కానీ ‘రూల్సు’ అడ్డు వస్తున్నాయి.

వయసు : ‘పెద్ద’ వాణ్ణే. ఎప్పడూ ‘పెద్దల సభ’ నుంచే వచ్చే వాణ్ణి కదా! కానీ అయనా ఏం లాభం? ‘హౌస్‌’ ను ..ఐ మీన్‌ … సభను చక్కదిద్ద లేక పోతున్నాను. పైపెచ్చు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కదా!

ముద్దు పేర్లు : ‘వంక’ల నాయుడు ( నేనేం నిజం చెప్పినా ప్రతిపక్షాల వారికి ‘వంక’ చెబుతున్నట్టుంది. ప్రత్యేక హోదా ఇవ్వటానికి ‘ఆర్డినెన్స్‌’ సరికాదు… అందుకు పార్లమెంటు సమ్మతి కావాలంటే వినరే!)

‘విద్యార్హతలు : ‘లా’ ఒక్కింతయు కలదు. అవును ‘లా’ చేశాను. అందుకే ‘ప్రత్యేక హోదా’ ఎలా ఇవ్వగలరు- అని అప్పట్లో ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ను ప్రశ్నించ లేకపోయాను.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: తెలుగు సినిమాలు బాగా చూసిన వారికి ‘ఎస్వీఆర్‌’ లాగా కనిపిస్తాను. నటనలో ఆయన్ని మించిన వారెవ్వరు చెప్పండి! అలాగని నేను నటిస్తానని భావించకండి.

రెండు: తెలుగు దేశం వారు నేను బీజేపీ వాడిననీ, బీజేపీ వారేమో నేను తెలుగుదేశం వాడినని భ్రమపడుతుంటారు. నేను బీజేపీలో తెలుగు నేతను – అంతే.

సిధ్ధాంతం : నాది ‘సమైక్య వాదమే’ నని అందరూ అనుమానపడతారు. కానీ నేనెప్పుడూ ‘ప్రత్యేక’ వాదినే. ఒకప్పుడు నేను 1972లో ‘ప్రత్యేక ఆంధ్ర’ కోసం పోరాడాను. తర్వాత 2014లో ‘ప్రత్యేక హోదా’ కోసం పోరాడాను. నేను పోరాడినప్పుడు ఏదీ రాదు. తర్వాత వద్దనకున్నప్పుడు ఎవరో ఇచ్చేస్తుంటారు.

వృత్తి : దంచటం… అదే లెండి ఉపన్యాసాలను.

హాబీలు :1.నెల్లూరు కోమల విలాస్‌లో భోజనం చెయ్యటం.

2. కర్ణాటక ‘హౌస్‌’ నుంచి ఎన్నిక కావటం.

(అన్నీ సొంత జిల్లానుంచే పొంద లేం.)

అనుభవం : పదేళ్ళకోసారన్నా కేంద్ర మంత్రి పదవి వరిస్తుంటుంది. ఎందుకంటే, పదేళ్ళ కోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తోంది కదా! ఈ సారి అలాకాకపోవచ్చు లెండి.

మిత్రులు : నేను క్రియాశీలంగా వున్నంత వరకూ ‘తెలుగుదేశం’ పార్టీ ఎప్పుడూ మిత్రపక్షమే.

శత్రువులు : ‘లలిత్‌’, ‘వ్యాపం’ ఈ రెండు పేర్లను ఉఛ్చరించే ప్రతీవాడూ నాకు శత్రువే.

మిత్రశత్రువులు :మిత్రపక్షాలుగా వుంటూ, సీట్ల పంపిణీ దగ్గర పేచీలు పెట్టేవారు.

వేదాంతం : పేరుకు వానాకాల సమావేశం. ఉరుములూ, మెరుపులూ తప్ప, చుక్క కూడా పడనివ్వలేదు ప్రతిపక్షాల వారు.

జీవిత ధ్యేయం : కర్ణాటకలో బీజేపీ బలోపేతం చెయ్యాలి. లేకుంటే నేనెక్కడ నుంచి ఎన్నిక కావాలి?

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక15-22 ఆగస్టు 2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply